Friday March 09, 2012 కులపురాణాల్ని ఎలా చూడాలి? -డా||దార్లవెంకటేశ్వరరావు, అసిస్టెంటు ప్రొఫెసరు, తెలుగు శాఖ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు (సెంట్రల్‌యూనివర్సిటి), గచ్చిబౌలి, హైదరాబాదు-46, ఫోను: 9989628049 మన జీవినవిధానాన్నే సంస్కృతి అంటారు. ఈ సంస్కృతిని ప్రభావితం చేసే అంశాల్లో పురాణేతిహాసాల పాత్ర ఎంతగానో ఉంటుంది.ఇంచు మించు ప్రతిదేశంలోను ఈ పురాణేతిహాస సంప్రదాయం కొనసాగుతూనే ఉంటుంది.గ్రీకులో వెలువడిన ''ఇలియడ్'', ''ఒడిస్సీ'' లనుపాశ్చాత్య వాఙ్మయంలో అత్యంత ప్రాచీన పురాణేతిహాసాలుగా చెప్తారు. వీటిని హోమర్ రాశాడని ప్రసిద్ధి. 'హోమర్' అనేది నిజమైన పేరు కాదనీ, అది కవి, గాయకుల వంశపారంపర్య నామంగా కూడా సాహితీవేత్తలు భావిస్తున్నారు. ' హోమర్' అనేది గ్రీకుపదమే అయినా అనేకమంది (మార్టిన్‌వెస్ట్) దానిని వంశపారంపర్య నామంగా అభివర్ణించారు. ... హోమర్ వారసులు వంశపారంపర్య గాయకుల కూటిమిగా( బార్డిక్ గిల్డ్) ఉండేవారని వారు రాజసభల్లో, ఉత్సవాల్లో, దైవపూజల్లో సంచార గాయకులుగా( వండరింగ్ మినిస్ట్రెల్) వ్యవహరించేవారని తెలుస్తున్నది.''(డా|| లంకా శివరామ ప్రసాద్, . హోమర్ విరచిత ఇలియాడ్, తెలుగు స్వేచ్చానువాదం, సృజనలోకం, రైటర్స్‌కార్నర్ ప్రచురణ, వరంగల్లు, 2011.,పుట:శIII, ) పురాణేతిహాసాలని సాధారణార్ధంలో పిలుస్తున్నా, వాటిని కావ్యాలనో లేదా మహాకావ్యాలనో అనడమే సమంజసం. అలాగే భారతదేశంలో వేదాలు అపౌరుషేయాలనీ, వాటిని వ్యాసుడు అందులోని వివిధాంశాలను విభజిండం వల్ల వేదవ్యాసుడైయ్యాడనీ, ఆయనే అష్టాదశపురాణాల్నీ , భారత, భాగతాది కావ్యాలు కూడా రాశాడనీ ప్రసిద్ధి వచ్చింది. గ్రీకులో హోమర్ ఒక కవిపేరుకాదనే వాదన ఉన్నట్లే, వ్యాసుడు అనేది కూడా ఒక్క వ్యక్తిపేరు కాదనీ, అది ''ఒక బృందం'' అనే వాదనా ఉంది. దీన్నిబట్టి ''ఇలియడ్'', ''ఒడిస్సీ''లను గానీ, వేదాలు, అష్టాదశపురాణాల్ని గానీ ఒకరెవరో రాసినవో, సాక్షాత్తూ భగవంతుని వరప్రసాదాలో కాదనీ స్పష్టమవుతుంది. ఈ దృష్టితో చూసినప్పుడు అష్టాదశపురాణాలకున్న స్థానమే మిగతా అన్ని పురాణాలకూ ఉండాలి. కానీ, ఆచరణలో అలా జరగడం లేదు. మాదిగల పుట్టుపూర్వోత్తరాల్ని ప్రస్తావించే జాంబపురాణం, జాంబవపురాణం, డక్కలి పురాణం మొదలైన పేర్లతో పిలిచే జాంబవపురాణమే దీనికి నిదర్శనం! అష్టాదశపురాణాల్లాంటిదే జాంబవపురాణం కూడా! కాకపోతే అవి సంస్కృతంలో వెలువడ్డాయి. సాధారణంగా పూర్వం ఎప్పుడో జరిగిందనీ, అందులోనే తమ వంశమూలాలు ఉన్నాయని భావిస్తూ, అప్పుడెప్పుడో మౌఖికంగా చెప్పిందాన్ని, లేదా జరిందని భావిస్తూ రాసిన దాన్నే నేటికీ కొత్తగా చెప్పడాన్నే పురాణమని పిలుస్తారు. సాధారణంగా సృష్టి ఆవిర్భావాన్నీ (సర్గం), ఆ సృష్టి ప్రళయం వల్ల నాశనమైయ్యే లయనీ (ప్రతి సర్గం), తర్వాత మానవవంశం ఎలా క్రమపరిణామం పొందిందీ ( వంశం), ఆ వంశం యుగయుగాలుగా సాధించిన మాహాత్కార్యాల్నీ (మన్వంతరం) , ఆ వంశాల్లో అవతారపురుషులైన (వంశాలచరిత్ర) వారినీ వర్ణిస్తూ, నిత్యనూతనంగా చెప్పేదే పురాణం.దీని మౌలిక లక్షణాలు 'అమరకోశం' లో కనిపిస్తాయి.దీన్నే ఇంచుమించు పౌరాణి పండితులంతా అంగీకరిస్తున్నారు.అంటే, సృష్టిపూర్వం నుండీ ప్రారంభించి, జరుగుతున్న, జరగబోయే విషయాలతో సహా ఊహించడం పురాణాల్లో జరుగుతుంది. యుగానికొక అవతారపురుషుడెవరొకరు వస్తుంటారనీ, ఆ అవతారపురుషుడ్ని నమ్ముకొని మనవిధిని మనం నిర్వర్తిస్తూ మోక్షాన్ని సాధించుకోవడానికి భగవంతుణ్ణి ఆశ్రయించాలనేదే పురాణాల్లోని ప్రధానోద్దేశం.సాధారణంగా ఆ మోక్షాన్ని పొందడానికి భక్తులెలా ప్రవర్తించాలనేది పురాణాల్లో ఉంటుంది. పురాణాల్లో యుగపురుషుడుగా ఉండే అవతారపురుషుడు మానవుడుగా ఏదొక వంశంలో జన్మిస్తాడనీ,అతణ్ణే నాయుకుడుగా చేసుకొని వర్ణనలకు ప్రాధాన్యాన్నిచ్చేది ఇతిహాసం. రెండింటిలోను చారిత్రకాంశాల్ని వెతికేవాళ్ళూ ఉన్నారు. అవి కేవలం ఊహకు సంబంధించినవని భావించేవాళ్ళూ ఉన్నారు. కావ్యేతిహాసంలో అయితే, నాయికా, నాయకలు, ఇతర పాత్రలు కొన్ని వాస్తవంగా జరిగిన చారిత్రక ఇతివృత్తాలకు సంబంధించినవి కూడా కావచ్చు. అయినా, పురాణేతిహాసాలు చరిత్ర వంటివి కాదు. అయితే, వక్రీకరణకు గురౌతున్న చరిత్రకు సంబంధించిన ఆనవాళ్ళు కావ్యేతిహాసాల్లోను పెట్టచ్చు. అవి నియంతృత్వ పాలకుల విధానాల వల్ల వాస్తవాన్ని కళాత్మకంగా చెప్పేప్రయత్నంలో వెలువడతాయి.అలాగే, సృజనసాహిత్యంలోనూ వక్రీకరణ జరగొచ్చు. ఆ యా సమాజాల్లో రాజకీయంగా, ఆర్ధికంగా, విద్యాపరంగా ఉన్నతస్థానంలో ఉన్నవాళ్ళ చరిత్రల్నీ, కావ్యాల్నీ తమకి కావలసినట్లుగా రూపొందించుకొని, వాటినే విశిష్టమెనవిగా ప్రచారం చేయించుకొనే అవకాశమూ ఉంది.ఇలాంటప్పుడు కొన్ని పాత్రల్ని, సన్నివేశాల్ని అనివార్యంగా చిత్రించాల్సివస్తుంది. శిష్ట, దుష్టపాత్రలుగా వాటిని చిత్రించి, అధర్మం నుండి, ధర్మాన్ని రక్షించడానికి ఉపయోగపడేసన్నివేశాలుగా అవి మారిపోతాయి. ఉదాహరణకి ప్రపంచాధిపత్యాన్ని ఎదుర్కొవడానికి ప్రయత్నించిన వాళ్ళెంతోమందిని ప్రజాస్యామ్యపంథాలోనే ''ఒక దుర్మార్గ'' ముద్రవేసి బహిరంగంగా వాళ్ళని తరిమి తరిమి చంపించిన సన్నివేశాలు చరిత్రలోను, కావ్యాల్లోను ఎలా మారిపోతున్నామో చూస్తూనే ఉన్నాం. దీనికి కారణం, సహజంగానే ఆధిపత్యం, అవకాశాలు ఉన్న వాళ్ళు తమ ఆలోచనల్నే సరైనవిగా ప్రచారం చేసుకోవడంలో కృతకృత్యులౌతారు. విదేశీదురాక్రమణదారులతో నిజంగా యుద్ధంలో పాల్గన్న దళితయువతి ఝల్‌కారీబాయి అయితే, దాన్ని ఝాన్సీలక్ష్మీబాయిగా ప్రచారం చేసుకొని, భారతీయస్వాతంత్య్రసంగ్రామంలో వీరనారి అంటేనే 'ఝాన్సీలక్ష్మీబాయి' అనుకునేటట్లుగా చరిత్రీకరించారని ఈ మధ్య వస్తున్న పరిశోధన ఫలితాలు చెప్తున్నాయి. చమురుబావులకోసం గోరంతని కొండంతగా చూపి ప్రపంచాధిపత్యాన్ని చెలాయిస్తున్న అమెరికా, సద్దాం హుస్సేన్‌ని నియంతముద్రవేసి ఉరితీసి, ప్రజలచేతనే దాన్ని సరైనచర్యగా ప్రచారం చేయగలిగింది. తర్వాత అమెరికా చర్యని సమర్ధించేటట్లు రూపొందిన సాహిత్యమే విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. అతడ్ని చంపడం ఒక ప్రపంచవిజయంగా ఉత్సవాలు చేయడం మొదలైంది. ఇటువంటివే అష్టాదశపురాణాల్లోను, ఇతిహాసాల్లోను వివిధ అట్టడుగు సామాజికవర్గాలు, వర్ణాలవారిని చిత్రించినప్పుడూ జరిగిఉండొచ్చు. నేడు హిందూపండగల్ని జాగ్రత్తగా పరిశీలిస్తే అవి ఏదొకరూపంలో కిందిసామాజిక వర్గానికి చెందినవారిపై వాళ్ళు సాధించిన విజయాలకు చిహ్నాలే! కొన్ని ఆధిపత్య, అగ్రవర్ణాల ప్రయోజనాల్ని కాపాడేచర్యల్ని సాధారణీకరించి వాటిని అందరి ప్రయోజనాలుగా ప్రచారంచేసి, వారి విజయాల్నే పండగలుగా చేసుకోవడం జరుగతోంది. ఈ క్రమంలోనే అష్టాదశపురాణేతర పురాణాలకు, వాటిల్లో ఉండే వారి అభిమతాలకు తగినస్థానం లభించకుండా చేయగలిగారు. ప్రస్తుతం ఇక్కడ సమాజంలో నేడు అత్యంత అంటరానికులంగా ఉన్న మాదిగలకు సంబంధించిన ''జాంబవపురాణం'' గురించే విశ్లేషించుకున్నా, దళితులు, బహుజనులు తమ పురాణాల్ని పరిశీలించేవారికి కొన్ని కొత్తఆలోచనలు కలుగుతాయనిభావిస్తున్నాను. సుమారు 60 పాఠాంతరాల్లో 'జాంబవపురాణం' ఉందని, నేటికీ ఆరుకులాల వారు ఈ పురాణాన్ని వివిధరీతుల్లో ప్రదర్శిస్తూ, మాదిగలను ఆశ్రయించి జీవిస్తున్నా, వాళ్ళంతా ఒకప్పుడు గౌరవనీయమైన ఆశ్రిత కులస్థులుగా జీవించగలిగారని ఈ పురాణంపై పరిశోధన చేసిన ఆచార్య పులికొండసుబ్బాచారి వ్యాఖ్యానించారు. (కొలనుపాక, నులకచంద్రయ్యల 'ఆది జాంబవ మహాపురాణము, 2008:10,13) దీన్ని బట్టే మాదిగలకున్న సాంస్కృతిపునాదులెంతగట్టివో తెలుస్తాయి. మాదిగలకు మొదటినుండీ ఒక ప్రత్యేకమైనజీవనవిధానం ఉంది. అది మాయ మాటలతోకూడిందికాదు. వాస్తవాలపై, అనుభవాలపై ఆధారపడేది. తమకే కాకుండా, తమతో ఉండేవాళ్ళనీ ఆరించగలిగేది. ఆనందింపజేసేది. అది పనిచేసి బతికే శ్రమసంస్కృతి. నైపుణ్యాన్ని ప్రదర్శించే సంస్కృతి.అది చర్మకారవృత్తిని ఆధారంగా చేసుకున్నది. జంతువులు చనిపోతే మానవులు దానిదరిదాపులకే వెళ్ళడానికి భయపడే సమయంలో వాటిని తీసి, ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి, ఆ జంతువుల్ని పూడ్చిపెట్టడమో, దహనం చేయడమో, అవసరమైతే వాటిని భుజించడమో చేశారు దాన్నొక పవిత్రమెన కార్యంగా భావించారు. దాన్నుండే తమదైన ఒక సాంస్కృతికవారసత్వాన్ని నిర్మించుకోగలిగారు. దానిలోని అనేకఅంశాల్ని మౌఖికసంప్రదాయరూపంలో భద్రపరిచిన కళారూపమే ''జాంబవపురాణం''. అందుకే'దీన్నొక వ్యక్తి సృజనగా కాకుండా, ఒక సామాజిక వర్గం మొత్తానికి చెందిన సాహితీ సంపదగానూ, సంప్రదాయిక సామాజిక సిద్ధాంతం రూపంగాను భావించాల'ని పరిశోధకుల అభిప్రాయం. (పులికొండసుబ్బాచారి, కొలనుపాక,నులకచంద్రయ్యల 'ఆది జాంబవ మహాపురాణము, 2008:10) జాంబవంతుని పుట్టుకను తెలిపే జాంబవపురాణాల్లో ఇంచుమించు అన్ని పాఠాంతరాల్లోను సృష్టిలో మొదటిగా పుట్టినవాడని చెప్తున్నాయి. పురాణాల్లోని సృష్టి క్రమం వివరించడంలో భాగంగా ఏమీలేని శూన్యంలో ఒక వెలుగురూపంలో జ్యోతిర్మహేశ్వరుడు ప్రభవించి, ఆయన చేసని ప్రణవ మంత్రం నుండి జలం, దాని నుండి తామరపుష్పం, ఆ పుష్పం నుండి ఆదిజాంబవంతుడు జన్మించినట్లుంది. జాంబవంతుడు స్వయంభువుగా జన్మించినట్లు మరికొన్ని జాంబవపురాణ ప్రతుల్లోనూ ఉంది. మరికొన్నింటిలో భూమికంటే ఆరునెలల ముందే జాంబవంతుడు పుట్టినట్లుంది. ఈ కథనాన్ని బట్టి చూస్తే, మాదిగలు అత్యంతప్రాచీనజాతివాళ్ళని చెప్పడంలో భాగంగానే దీన్ని గుర్తించాలనిపిస్తుంది. ఇలా అత్యంతప్రాచీన జాతివాళ్ళైన మాదిగలు భారతదేశమంతా రకరకాల పేర్లతో విస్తరించి ఉన్నా, వీళ్ళు ప్రధానంగా ద్రావిడజాతికి చెందినవాళ్ళు. ఆర్యుల దాడితో అంతవరకూ ఒక వెలుగు వెలిగిన మాదిగల ప్రభ క్రమేపీ ఆరిపోవడమే కాకుండా, గెలిచిన ఆర్యులు, ఓడిన వాళ్ళను దాసులుగా చేసుకున్నారు. ఇది రామాయణంతో సంబంధం ఉన్న వాలీ-సుగ్రీవుల కథను గమనిస్తే, విభజించి పాలించే విధానాన్ని ప్రయోగించి విజయం సాధించగలిగారని తెలుస్తుంది. తర్వాత యుగంలో జరిగిన కథగా చెప్పే శ్యమంతకమణి జాంబవంతుడికి దొరకడం, దాన్ని వశపరుచుకోవడానికి కృష్ణుడు యుద్ధం చేయడం, అతడ్ని గతయుగంలో శ్రీరాముడిగా భావించి యుద్ధాన్ని విరమించి, ఆ మణితో పాటు అతని కూతురు జాంబవతినిచ్చి వివాహం చేసినట్లు సంప్రదాయపురాణేతిహాసాల్లో కూడా ఉంది. ఎలుగుబంటిలాంటి వాడుగా జాంబవంతుణ్ణి చెప్తూనే, ఆయన కూతర్ని వివాహం చేసుకున్నాడని అనడంలోని ఆంతర్యాన్ని పరిశీలించాలి. ఆర్యుల దాడితో పరాజయం పాలైన మాదిగజాతి కొండకోనల్లో నివశించి ఉండొచ్చు. వాళ్ళుని ఆర్యులు తమతో సమానంగా చూడలేకపోయినా, వాళ్ళ శక్తిసామర్థ్యాల్ని గుర్తించి, వాళ్ళని సహాయకులుగా ఉపయోగించుకోవడానికి రకరకాల ప్రలోభాలకు గురిచేసి ఉండొచ్చు. జాంబవపురాణంలో మాదిగల సాంస్కృతిక మూలాల్ని ఇలా రకరకాల ఆధారాలతో విశ్లేషించే అవకాశం ఉంది. మాదిగల సంస్కృతిని పురాణేతిహాసాల నుండీ, చారిత్రక సత్యాల నుండీ వెలికితీసేప్రయత్నంలో భాగంగానైనా దీన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. దీని వల్ల మాదిగల సామాజిక, సాంస్కృతిక అంశాలు ప్రతిఫలించవచ్చు. మాదిగేతరులు సంప్రదాయసాహిత్యంలో వర్ణించిన తీరుతెన్నుల్ని గుర్తిస్తూనే, వాస్తవంగా మాదిగల సంస్కృతి ఏమై ఉంటుందనే విషయాల్ని శోధించి సాధించడమే సాహిత్యంలో మాదిగల సామాజిక, సాంస్కృతిక ప్రతిఫలనమవుతుంది. చాతుర్వర్ణ వ్యవస్థ ప్రకారం ఆ యా వర్ణాల వాళ్ళు, వాళ్ళకు నిర్దేశించిన విధుల్ని నిర్వర్తించాల్సి ఉంటుంది. అలా నిర్వర్తించడంలో అన్ని వృత్తుల వారికీ సమానగౌరవాదరాలు ఉండాలి. కానీ, కొన్ని వృత్తులు గౌరవప్రదంగాను, మరికొన్ని అగౌరవప్రదంగానూ మారిపోయాయో ఈ అధ్యయనం వల్ల తెలిసే వీలుకలుగుతుంది. వేదాలు, అష్టాదశపురాణాల్లోను కనిపించే రాముడు, కృష్ణుడు, ఇంద్రుడు, యమధర్మరాజు, ధర్మరాజు, సీత, సత్యభామ, రుక్మిణి, జాంబవతీ, నారదుడు మొదలైనపాత్రలే తర్వాత కాలంలో భారతీయకావ్యేతిహాసాల్లోనూ కనిపిస్తాయి. మరికొంత కాలం తర్వాత వీళ్ళలో చాలామందిని చారిత్రక వ్యక్తులుగా కీర్తించడం, దేవాలయాలు కట్టించడం, విగ్రహాలు పెట్టించడం, వాటినే చివరికి పాఠ్యాంశాలుగా అధ్యయనం చేయించడంతో క్రమేపీ అదే మన సంస్కృతిగా గాఢమైనముద్రవేయడం సహజంగానే జరిగిపోతుంది. అదే మన నరనరాల్లో ఇంకిపోతుంది. అదే మన ఆలోచననీ, మన ప్రతి చర్యనీ ప్రభావితం చేస్తుంది. అదే నేడు జరుగుతోంది. ఆ ఆలోచనతోనే వాళ్ళందించిన ఆధిపత్యభావజాలంతోనే వేదాలు, రామాయణ, భారతేతిహాసాలు, అష్టాదశపురాణాలు మొదట్లోనే కాకపోయినా, జాంబవపురాణం కంటే ముందుగానే అవి లిఖితరూపంలోకి రావడం, అదీ ''సంస్కారాన్ని'' సంతరించుకొని రావడంతో వాటికొచ్చినంత లేదా వాటికిచ్చినంత ప్రామాణ్యాన్ని దళిత, బహుజనులు కూడా వారి వంశమూలాలున్న పురాణాలకు ఇవ్వలేకపోతున్నారు. తమ వంశమూలాల్ని భావవాదదృష్టితో చెప్పడానికి ఇష్టంలేకపోతే, ఆ పాత్రల ''సృష్టి''లోని ఆంతర్యాన్ని విశ్లేషించి, ప్రజల్ని చైతన్యపరచాల్సిన బాధ్యత దళిత, బహుజన మేధావులకు ఎంతైనా ఉంది. దళిత, బహుజనులు అష్టాదశపురాణాల్ని కూడా ''కల్పనలు'' గానే భావిస్తున్నారు తప్ప, వాటికేదో విలువనిస్తున్నారని భ్రమించనవసరంలేదనుకుంటే ప్రత్యామ్నాయ సంస్కృతిని వ్యాపింపజేసేప్రయత్నం చేయాలి. Posted by vrdarla ( Mar 09 2012, 01:36:24 PM SCT ) Permalink Comments [0]
సమకాలీన ఉద్యమాన్ని విశ్లేషించిన దళిత ఉద్యమం –వెలుగు నీడలు డా// పి.కేశవకుమార్ రచించిన దళిత ఉద్యమం –వెలుగు నీడలు పుస్తకాన్ని హైదరాబాదు ప్రెస్ క్లబ్ లో మార్చి ౩ వ తేదీ సాయంత్రం ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా ఆంద్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ కమీషనర్ ఎ.విద్యాసాగర్ ఐ.ఎ.ఎస్., పాల్గొన్నారు. పుస్తకాన్ని ప్రముఖ న్యాయవాది బొజ్జ తారకం ఆవిష్కరించారు.తెలంగాణ రచయితల వేదిక ప్రధాన కార్యదర్శి జూలూరి గౌరీ శంకర్ అధ్యక్షతన జరిగిన ఈ పస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రపదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ కమీషనర్ ఎ.విద్యాసాగర్ ఐ.ఎ.ఎస్., పాల్గొన్నారు పుస్తకాన్ని దళిత ఉద్యమ నాయకులు, ప్రముఖ న్యాయవాది బొజ్జాతారకం ఆవిష్కరించారు. ఈ సభలో ముఖ్య వక్తలుగా ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటి అసోసియేట్ ప్రొఫెసర్ డా//కె. సత్యనారాయణ, ప్రముఖ దళిత కవి, విమర్శకులు కలేకూరి ప్రసాద్, హైదరాబాదు విశ్వవిద్యాలయం, తెలుగు అసిస్టెంటు ప్రొఫెసర్ డా// దార్ల వెంకటేశ్వరరావు, బహుజన కెరటాలు ప్రధాన సంపాదకురాలు, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, బుద్దిస్ట్ స్టడీస్ సెంటర్ లో అసోసియేట్ ప్రొఫెసర్ డా// చల్లపల్లి స్వరూపరాణి, ప్రముఖ విప్లవ కవి వరవరరావు, బహుజన కెరటాలు వ్యవస్థాపకుడు పల్నాటి శ్రీరాములు, ప్రముఖ కవయిత్రి మహెజబీన్ లు సభలో మాట్లాడారు దళిత ఉద్యమం –వెలుగు నీడలు గ్రంథావిష్కరణ దృశ్యం. చిత్రంలో వరుసగా కలేకూరి ప్రసాద్, డా//దార్ల వెంకటేశ్వరరావు,విద్యాసాగర్ ఐ.ఎ.ఎస్., జూలూరి గౌరీశంకర్, బొజ్జా తారకం, డా// సత్యనారాయణ తదితరులు ఉన్నారు. సెంట్రల్ యూనివర్సిటి రీసెర్చ్ స్కాలర్ ధనరాజు స్వాగతం తో ప్రారంభమైన ఈ సభ భీమ్ కుమార్ వందన సమర్పణతో ముగిసింది . సభలో ఒక్కో వక్తా పుస్తకంలోని విషయాలను లోతుగానే చర్చించారు. వాటిలో ముఖ్యాంశాలను వారి మాటల్లోనే వినండి. సభాధ్యక్షత వహించిన జూలూరి గౌరీశంకర్ మాట్లాడుతూ “డా. కేశవకుమార్ బహుజనకెరటాలు, వివిధ పత్రికల్లో రాసిన వ్యాసాలను ఒక పుస్తకంగా తీసుకురావలసిన అవసరం ఉందని భావించాను. రచయితను సంప్రదించి పుస్తకంగా తీసుకొస్తానని అడిగినప్పుడు అంగీకరించారు. దీనిలో బహుజన తాత్త్వికత ఉన్న వ్యాసాలు ఉన్నాయి. చిన్న చిన్న పత్రికల్లో కంటే ప్రధానమైన పెద్ద పత్రికల్లో రావలసి ఉంది. నేను తెలంగాణా కోణం నుండే చూస్తాను. దీనిలో తెలంగాణ దళితకోణం ఉన్నా, కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు సంబంధించిన కోణం లేదు. దీన్ని చూడవలసిన అవసరం ఉంది. కారంచేడు, చుండూరు సంఘటనలపై రాసిన వ్యాసాలు ఆ సంఘటనలను అర్థం చేసుకోవడానికి ఒక డాక్యుమెంటరీలు గా ఉపయోగపడతాయి. కారంచేడు సంఘటనలో పేద కమ్మవాళ్ళు కూడా కులం ఆధారంగానే దళితులపై దాడి చేశారు. అప్పుడు వర్గం ఏమైంది. వర్గమూ, కులమూ కలిసినప్పుడు లేదా ముందుగా మనుష్యులుగా మారమని మానవీయతను నింపుకోమని దళిత ఉద్యమం తెలుపుతుంది. వాటిని తాత్త్వికంగా, డాక్యుమెంటరీలుగా భద్రపరిచే విధంగా ఈ వ్యాసాల పుస్తకం ఉంది.’” అని వివిధ వక్తల ప్రసంగాలను సమన్వయిస్తూ చెప్పారు. సభలో అధ్యక్షుడి తొలి పలుకుల అనంతరం ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటి అసోసియేట్ ప్రొఫెసర్ డా// కె.సత్యనారాయణ మాట్లాడుతూ…” కేశవకుమార్ సెంట్రల్ యూనివర్సిటిలో చదువుతున్నప్పటి నుండీ తెలుసు. ఆ యూనివర్సిటీలో జరిగిన అనేక సంఘటనల విషయంలో కలిసి పోరాడాం. చేతిరాతలు పత్రికలో స్లోపోయిజన్ కవిత రాయడం వెనుక ఒక దళిత విద్యార్థి ల్యాబ్ లో ఆత్మహత్య చేసుకున్న నేపథ్యం ఉంది. సునీత ఆత్మహత్య కు స్పందించి సునీత పొద్దున్నేపోస్టరై పలకరించింది ' పేరుతో ఒక పుస్తకం తీసుకొచ్చారు. ఇద్దరం కలిసి దళిత మ్యానిఫెస్టో కవితా సంకలనం తీసుకొచ్చాం. కేశవకుమార్ గురించి మాట్లాడటమంటే దళిత ఉద్యమం గురించి మాట్లాడటమే. కారంచేడు సంఘటన గురించి రాసిన వ్యాసం ఐక్యంగా దళితులు పోరాడితే కలిగే చైతన్యాన్ని విపులీకరించింది. బి.సి.ల గురించే కాకుండా, ముస్లిముల గురించీ రాశాడు. అయితే, ఈ పుస్తకంలో ఉన్న వ్యాసాల్లోని కొన్ని విషయాల పట్ల ఏకీభవించనివి కూడా ఉన్నాయి. వర్గీకరణ విషయంలో కాళ్ళుపట్టుకొనే పరిస్థితి ఏమిటి? సాయుధ పోరాట చైతన్యాన్ని అలవర్చుకోవాలి “ అని అన్నారు. సభలో మాట్లాడుతున్న డా// దార్ల వెంకటేశ్వరరావు సెంట్రల్ యూనివర్సిటి అసిస్టెంటు ప్రొఫెసర్ డా// దార్ల వెంకటేశ్వరరావు పుస్తకం గురించి మాట్లాడుతూ…” ఈ క్లిష్టమైన సమయంలో దళిత ఉద్యమం గురించి పుస్తకం తీసుకొని రావడం ఒక సాహసం. అలాంటి సాహసాన్ని చేసిన రచయితను అభినందిస్తున్నాను. నన్ను మాట్లాడమని చెప్పినా, దేని గురించి మాట్లాడాలో చెప్పలేదు. అంటే నాకు మాట్లాడే స్వేచ్చను ఇచ్చినట్లయ్యింది. నన్నుఈ సభలో మాట్లాడమనడం అంటే అది వ్యక్తిగతమైన సంబంధం వల్ల కాదు. ఒక మాదిగగా మాట్లాడమన్నారను కుంటున్నాను. ఒక మాదిగ విద్యావేత్తగా మాట్లాడమన్నారనుకుంటున్నాను. ఒక మాదిగ ఉద్యమ కారుణ్ణి మాట్లాడమన్నారను కుంటున్నాను. సర్వసాధారణంగా ప్రతి సమస్యను ఆ యా వ్యక్తులు తమ తమ కోణం నుండే చూస్తుంటారు. అభ్యుదయవాదులు దళిత ఉద్యమాన్ని, సాహిత్యాన్ని వేరు వేరుగా చూశారు. తెలంగాణా వాదులు దళితుల్లోని వర్గీకరణ సమస్యకు కూడా ప్రత్యేక రాష్ట్రమే పరిష్కారాన్ని చూపిస్తుందన్నారు. మార్క్సిస్టులు కులాన్ని కూడా వర్గం లో భాగంగానే చూస్తున్నారు. మాదిగలు అన్ని సమస్యల్ని వర్గీకరణ నేపథ్యంగానే చూస్తున్నారు. మాదిగ విద్యావేత్త గా ఈ పుస్తకాన్ని నేనూ అలాగే చదివాను. పుస్తకాన్ని ఒకసారి దళిత దృక్పథంతోనూ, మరొకసారి మాదిగ దృక్పథంతోనూ చదివాను. రెండు సార్లూ నిజమైన దళిత సమైక్యవాదమే కనిపించింది. దళితఉద్యమంలో నీడలు పరుచుకోవడానికి వర్గీకరణ సమస్య ఒక ప్రధాన కారణమని, దాన్ని నిజాయితీ గల నాయకత్వం లో పరిష్కరించుకొని ఉద్యమం ముందుకి వెళ్ళవలసిన అవసరం ఉందని చాటిన వ్యాసం ఈ పుస్తకంలో ఉంది. అందుకు అన్నా నిన్ను నేను అభినందిస్తున్నాను. దళితుల్లోని మాల, మాదిగల సంఘర్షణలను కాళీపట్నం రామారావు రాసిన కథ యజ్ణంలో దళితుని నిస్సహాయతతోనూ, నిత్య జీవితంలో పీడనకు గురవుతున్న పురుషుడు తన భార్యను కొట్టడం, వేధించడం వెనుక గల నిస్సహాయత వంటిదేనని అర్థం చేసుకోవాలని ఎంతో చక్కగా విశ్లేషించాడు రచయిత. ఈ మాల, మాదిగల నిస్సహాయత ఏదొక నాడు కచ్చితంగా ఇలాంటి అసమానతలకు కారణమవుతున్న అసలైన వారిపై ఒక బాంబులా బ్లాస్ట్ అయ్యే రోజు వస్తుందని అనడం మాదిగల పోరాటాన్ని పోజిటివ్ గా అర్థంచేసుకోవడమే అవుతుంది. డా// కేశవకుమార్ రాసిన వ్యాసాలు మెయిన్ పత్రికల్లో రావడం లేదని అనుకోవడం కంటే, ఈనాడు వివిధ విశ్వవిద్యాలయాల్లో, వివిధ సంస్థల్లో ఉన్న దళితులు డా//బాబా సాహెబ్ అంబేద్కర్ బిక్ష వల్ల లేదా ఆయన సాధించిన హక్కుల వల్ల నాలుగు అక్షరాలను రాయగలిగే రచయితలు, తమ రాతలను ముందుగా తమ దళిత పత్రికల్లోనే రావాలనే ఆకాంక్షతో ఉంటున్నారు. అదొక చైతన్యం. అది డా// కేశవకుమార్ లో ఉందనుకుంటున్నాను. అందుకే ఆ వ్యాసాల్ని మెయిన్ పత్రికల్లో ప్రచురించుకోగలిగే సత్త ఉన్నా ముందుగా బహుజన కెరటాలు, తమ దళిత భావజాలాన్ని సమర్థించే పత్రికల్లోనే ప్రచురించాలని ఆశించి ఉంటాడు. నేడు ఉన్న దళిత పత్రికల్లో నిజమైన వ్యవస్థీకృత చైతన్యంతో నడుస్తున్న పత్రిక బహుజన కెరటాలు. దీన్ని సంపాదకులు, వ్యవస్థాపకులు చాలా ముందుచూపుతో దళిత మేధావుల్ని, రచయితల్ని ఒకే వేదిక పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. భవిష్యత్తు పట్ల మా దళితులకు గొప్ప ఆశను కలిగిస్తున్న పత్రిక అది. అది ఈ మధ్య వర్గీకరణను సమర్థస్తూ ఒక ప్రత్యేక సంచికను ప్రచురంచింది. అది నిజమైన బహుజన చైతన్యాన్ని నింపే ప్రక్రియ. నిజమైన దళిత ప్రజాస్వామ్యీకరణ. దళితులకు మీడియా ఇస్తున్న ప్రాధాన్యత ఎలాంటిదో మనందరికో తెలుసు. ఒక కారం శివాజీ, ఒక జూపూడి ప్రభాకరరావు, లేదా ఒక మంద కృష్ణ మాదిగ వాళ్ళ ఇరువురూ ఒకరినొకరు తిట్టుకోవడమో, పరస్పరం ఎమోషన్స్ కి గురిచేసుకోవడమో చేస్తుంటే ఎంతో ప్రాధన్యతనిస్తుంది మీడియా. అదే మీడియా వాళ్ళలో ఎవరైనా రాజ్యధికారం కోసమో, దళితుల్ని సమైక్యంగా చైతన్యం చేయడానికో ప్రయత్నిస్తే సహకరిస్తుందా? అప్పుడు కదా మీడియా నిజ స్వరూపం తెలిసేది. అందుకే బహుజన కెరటాలు వంటి పత్రికలు రావలసిన అవసరం, అలాంటి పత్రికలకు దళిత రచయితలు ఒక బాధ్యతగా రాయవలసిన అవసరం ఉందని నిరూపించి, వాటిని ఇంత మంచి పుస్తకంగా తీసుకొచ్చినందుకూ, ఆ పుస్తకంపై నన్ను కూడా మాట్లాడించినందుకు కృతజ్ణతలు తెలియజేస్తున్నాను. మాదిగల సమస్యను ఇలా నిజమైన ప్రజాస్వామిక దృక్పథం తో చర్చకు అవకాశం కల్పించినట్లైతే అప్పుడు నిజంగా దళిత సమైక్య ఉద్యమం బలపడుతుంది. ఈ పుస్తకంలో దళిత ఉద్యమం, ఉమ్మడి దళిత ఉద్యమం వంటి పారిభాషిక పదాలను ప్రయోగించాడు. అది పరోక్షంగా దళిత ఉద్యమంలో వర్గీకరణ ఉద్యమాన్ని గుర్తించడంగానే భావిస్తున్నాను’ అని విశ్లేషించారు. బుద్దిస్ట్ స్టడీస్ సెంటర్ లో అసోసియేట్ ప్రొఫెసర్ డా// చల్లపల్లి స్వరూపరాణి మాట్లాడుతూ " కేశవకుమార్ అలోచనా దృక్పథంలో పరిణామం కనిపిస్తుంది. మొదట్లో వర్గ దృక్పథంతో రాసే వాడు. ఇప్పుడు అంబేద్కర్ అలోచనా దృక్పథంతో రాయడం సంతోషించదగిన విషయం. దళితుల ప్రత్యామ్నాయ చారిత్రక దృక్పథం తో చరిత్రను అధ్యయనం చేసిన తీరు బాగుంది. మహిళా రిజర్వేషన్ గురించి కూడా రాశాడు. అది కవిత్వమైనా, వ్యాసమైనా దళిత మాండలికంలో రాస్తాడు. దాని వల్ల గ్రామీణ ప్రాంతంలోని దళితులు కూడా పత్రికను తమ పత్రికగా ఫీలవుతూ చదువుకుంటున్నారు. బహుజన కెరటాలు పత్రిక దండోరా ఆశిస్తున్న వర్గీకరణను సమర్థిస్తూ ఒక ప్రత్యేక సంచికను వేశాం. అది చాలా బాగుందని వ్యక్తిగతంగా మెచ్చుకున్నా, దాన్ని బయట చెప్పకపోవడం విచారకరం. అలాంటి ప్రజాస్వామిక చర్చను ఆహ్వానించినప్పుడు నిజంగా స్పందించవలసిన అవసరం ఉంది. అప్పుడే నిజమైన నిజాయితీ కనిపిస్తుంది’’ అని అన్నారు. సభలో మాట్లాడుతున్న కలేకూరి ప్రసాద్ ప్రముఖ దళిత కవి, విమర్శకులు కలేకూరి ప్రసాద్ మాట్లాడుతూ " సింహాలు మాట్లాడనంత కాలం పిట్టకథలే చరిత్రలవుతాయి. కనుక దళితులు చరిత్రలను రాసుకోవాలి. అనేక సందర్భాల్లో రాసినప్పటికీ ఒక అంతస్సూత్రంతో దళిత చైతన్యం కనిపిస్తుంది. చరిత్రను ఏ దృక్పథంతో రాయాలో ఆ దృక్పథంతో రాశాడు. అభినందనీయుడు " అని అన్నారు. సభలో కూర్చున్న ప్రసిద్ద రచయిత్రి మహేజబీన్ ని మాట్లాడమని వేదిక పైకి పిలిచారు. సభలో మహేజబీన్ మాట్లాడుతూ "ఇక్కడికి రాకపోతే దళిత సాలిడారిటీ లేదంటారేమోనని వచ్చాను. మా ముస్లిములను కూడా దళితులుగా కలుపుకుంటే బాగుంటుంది. నన్ను నేను వేదిక పై నుండి దళితగానే ప్రకటించుకుంటున్నాను” అని అన్నారు. బహుజన కెరటాలు వ్యవస్థాపకుడు పల్నాటి శ్రీరాములు మాట్లాడుతూ ‘" మాదిగ దండోరా, తుడుం దెబ్బ, ఎలుక కుర్రు మొదలైన అస్తిత్త్వ కుల ఉద్యమాల నుండి ప్రేరణతో బహుజనకెరటాలు మాసపత్రిక స్థాపించాను. కామ్రేడ్ వీరయ్య భావజాలంతో పత్రిక పెట్టాలనే ఆలోచన వచ్చింది. ఆయన ప్రోత్సాహం ఎంతో ఉంది. బొజ్జా తారకం వంటి వాళ్ళు నడిపిన పత్రికలను క్రమం తప్పకుండా చదివే వాడిని. వాటినుండి కూడా అనేక విషయాలను నేర్చుకోగలిగాను. రిజిస్త్రేషన్ లేకుండా ప్రారంభమైన పత్రిక ప్రకటనలు లేక నడపడం అసాధ్యమైన పరిస్థితిలో శ్రీపతి రాముడు ఢిల్లీ నుండి రిజిస్త్రేషన్ పంపించాడు. కలేకూరి ప్రసాద్ ఎన్నో ప్రధాన మైన మెయిన్ స్టీమ్ పత్రికల్లో చేయగలిగే, రాయగలిగే అవకాశం ఉన్నా, తన కాలాన్ని ఎంతటినో పత్రిక కోసం త్యాగం చేశాడు. మద్దూరి నగేశ్ బాబు పై ప్రత్యేక సంచిక వేసిన తర్వాత పత్రిక నిజమైన దళితుల దగ్గరకు చేరుకోగలిగింది. సర్క్యులేషన్ కూడా మూడువేలు దాటింది. చాలా మంది రాస్తున్నా, ఇంకా దళిత రచయితలే ఈ పత్రికకు రాయకపోవడం కొరతగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో డా// చల్లపల్లి స్వరూపరాణి ని సంపాదక బాధ్యతలు వహించమని కోరాను. డా//కేశవ కుమార్ రెగ్యులర్ గా మాట్లాడుతూ ఈ పత్రికకే వ్యాసాలు రాస్తున్నాడు. అలా వచ్చినవే కారంచేడు, చుండూరుపై రాసిన వ్యాసాలు. అవి పత్రికకు ఎంతో పేరు తెచ్చాయి. సురేష్ మాదిగ లాంటి వాళ్ళు ఆత్మ హత్య చేసుకోవడానికి గల కారణాలను అర్థం చేసుకొని వర్గీకరణ సమస్యను సామరస్య పూరకంగా పరిష్కరించుకోవలసిన అవసరం ఉంది. ఇలాంటి సమస్యలకు ఉమ్మడి వేదికలు ద్వారా పరిష్కారాలు వేగవంతంగా జరుగుతాయి. వర్గీకరణను సమర్థిస్తూ బహుజన కెరటాలు ఒక ప్రత్యేకసంచికను కూడా ప్రచురించింది” అని అన్నారు. ప్రముఖ విప్లవ కవి వరవరరావు మాట్లాడుతూ “కేశవకుమార్ నాకు చాలా ఆత్మీయుడు. అతడు నాకు చాలా కాలం నుండీ తెలుసు. నాకు అతని ఉద్యమ స్పూర్తి తెలుసు. చిక్కనవుతున్న పాట కంటే ముందుగానే దళిత మ్యానిఫెస్టో ప్రచురించాడు. కారంచేడు ఉద్యమం విప్లవోద్యమాలను ఆలోచింపజేసింది. ఆ సంఘటనలో ప్రధాన కారణమైన వాళ్ళలో చెంచురామయ్యను విప్లవోద్యమమే శిక్షించింది. కారంచేడు ఉద్యమంలో విప్లవోద్యమ కార్యకర్తలు అక్కడ అనేక రోజుల పాటు క్యాంపు వేసి ప్రజలతో ఉన్నారు. చుండూరు సమస్యను భూమితో ముడిపడిన సమస్యగా విప్లవోద్యమం చూసింది. దానితో పనిచేసింది. మేము దళితులతో ఐడెంటిఫై అవుతుంటే అది కుట్ర అవుతుందా? మార్క్సిస్టులు కుల ఉద్యమాలను అధ్యయనం చేస్తున్నారు. రిజర్వేషన్స్ పట్ల , ముఖ్యంగా జనాభా ప్రాతిపదిక పై అది కొనసాగితే బాగుంటుంది. వర్గీకరణను సమర్థిస్తూ చెప్పడమే కాకుండా బయట ఉద్యమాలతో కూడా మమేకమై ముందుకు నడవాలని ఆశిస్తున్నాను. కారంచేడు, చుండూరు సంఘటనలపై రాసిన వ్యాసాలు చాలా ఆలోచనాత్మకంగా ఉన్నాయి. ఈ పుస్తకంలో గురజాడ రాసిన కన్యాశుల్కంపై కొన్ని వ్యాఖ్యలు ఉన్నాయి. నిజానికి మధురవాణిలో గురజాడ ఉన్నాడు. దాన్ని రచయిత గుర్తించాలి’’ అని అన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రపదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ కమీషనర్ విద్యాసాగర్ ఐ.ఎ.ఎస్, మాట్లాడుతూ " మనం ఇక్కడ మాట్లాడుకొనే విషయాలు చాలా విలువైనవి. ఇక్కడ మాట్లాడే విషయాలు అనేక మందికి వ్యాపిస్తాయి. అంబేద్కర్ ఆలోచనలను ఆలోచిస్తున్న వాళ్ళు ఎలా ఉన్నారో ఈ పుస్తకంలో పట్టుకోగలిగారు. నిజంగా దళిత ఉద్యమం వెనుకబడే ఉందా? దళిత సాహిత్యం కొంతమందికే చెందిందా? అనే ప్రశ్నలను, దానికి అనేక సమాధానలను ఈ పుస్తకం అందిస్తుంది. నిజంగా సమానత్వం, ఆధిపత్యం కోసం మాట్లాడేవాళ్ళు చేస్తున్నదేమిటని ఆలోచింపజేస్తుంది. ఏ ఉద్యమానికైనా వెలుగు నీడలు, ఉత్థాన పతనాలు ఉండటం సహజం. అలాంటివి జీవితంలోనూ చాలా సహజం. అయితే అవి కొత్త కొత్త రూపాల్ని సంతరించుకొని ముందుకొస్తాయి. చాలా మంది అంబేద్కర్ ని లిబరల్ బూర్జువాగా గుర్తించడంలోని ఆంతర్యాన్ని రచయిత పట్టుకోగలిగారు. ఈ పుస్తకం మొదటి వ్యాసంలోనే పుస్తకం తత్త్వాన్ని అంతటినీ పట్టుకోగలిగారు. చదివినదీ, చెప్పేదీ ఫిలాసపీ కావడంతోనేమో, అంబేద్కర్, దళిత ఫిలాసఫీని పట్టుకోగలిగారు. చరిత్ర దృక్పథాన్ని, ఆధునికతను వివరించడంలో అవి స్ప్తష్టంగా కనిపిస్తాయి. నేనీ మధ్య పంచమం నవల చదివాను. దానిలో ప్రభుత్వం ఆధ్వర్యంలో సీలింగ్ ద్వారా వచ్చిన భూమిని పంచడానికి అధికారులు సిద్దమవుతుంటారు. అప్పటికే అక్కడ బీ,సీ, లు మిగతా కులాల వాళ్ళు ఉన్నా, ఆలస్యంగా వచ్చిన మాదిగలకే ముందుగా పేర్లు రాస్తారు. అప్పుడు బి.సి.లు కోపపడినా, వాళ్ళలో వాళ్ళే మరలా మాట్లాడుకుంటూ, మనకి సమాజంలో గౌరవం ఉంది. అది మాదిగలకి ఎక్కడ వస్తుంది అనే ఆత్మ గౌరవాన్ని ప్రకటిస్తారు. ఇక్కడ గమనించవలసింది ఒకటి ఉంది. మనం ఔననుకున్నా, కాదనుకున్నా కులం పోవాలనుకుంటూనే, ఆకులం వల్ల వచ్చే అవకాశాలను వదులుకోలేని స్థితిలో ఉండటం ఒక విచిత్ర సన్నివేశం. కులం వల్ల మన సమాజంలో కొన్ని ఔనన్నా, కాదన్నా జరిగిపోతుంటాయి. ఆధిపత్యం ఒక వైపు, మరొక వైపు సమానత్వం కోసం పోరాటం నిరంతరం జరుగుతూనే ఉంటుంది. కులం వల్ల అవకాశాలు తాత్కాలికంగా వస్తున్నా, కింది కులాల వాళ్ళు తమ కులం కొనసాగాలని కోరుకోరు. కానీ, ఆ కులంలో ఉంటూనే ఆ కులాన్ని పోగొట్టుకోవాలని పోరాడుతుంటారు. అది ఆధిపత్యం, సమానత్వం ల మధ్య జరుగుతున్న పోరాటం. అలా కులంతోనే పోరాడుతూ సమానత్వం కోసం ముందుకొస్తున్న వాళ్ళు కోరుకొనేదేమిటో ఆధిపత్య కులాలు, వర్గాలు అర్థం చేసుకోవాలి. కులాన్ని, వర్గాన్ని అర్థం చేసుకోవడానికి కారంచేడు, చుండూరు పై ఈ పుస్తకంలోని వ్యాసాలను కే స్ స్టడీస్ గా చెప్పుకోవచ్చు. మనం ఆధినికతను కూడా ఒకేలా ఆలోచించలేం. అది మనకి తెలియకుండానే పాత అసమానతల్ని కొత్త మాటలతో కొనసాగించే తాత్త్వకతను కలిగి వస్తుంటుంది. దాన్ని లోతుగా అర్థం చేసుకోక పోతే, అధునికత కొనసాగే తీరు అర్థం కాదు. ముందుకొచ్చిన వాళ్ళు ఆధిపత్యాన్ని , అవకాశాలను పొందిన వాళ్ళు వాటిని మరిచి పోయి, అదే ఆధిపత్యాన్ని కొనసాగిస్తుండటం వల్ల సమానత్వం కోసం మాట్లాడేవాళ్ళు ఐక్యతను కూడా ఒక తాత్త్వక భావనగా విశ్లేషిస్తుంటారు. ఆధునికతలో అంతర్భాగంగా చూపిస్తుంటారు. ఈ క్లిష్టత అర్థం కావాలంటే, సమానత్వం కోసం పోరాడేవాళ్ళ వేదనను అర్థం చేసుకోవాలి. చదువుకున్న వాళ్ళు ఒక వర్గంగా తయారై తమ మాలాలను మరిచిపోతున్నారు. వాళ్ళు మరో వర్గంగా తయారవుతున్నారు. ఇది గుర్తించి ముందుకెళ్ళాలి. బహుజనకెరటాలు వంటి పత్రికలు దళిత ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించడం అభినందనీయం ” అని సమకాలీన సమాజంలోని అనేక అసమానతలను, ఆధిపత్యాలను విశ్లేషించి, నిజమైన మేధావులు పీడితుల పక్షాన్ని నిలవ వలసిన అవసరాన్ని వివరించారు. దళిత ఉద్యమ నాయకులు, ప్రముఖ న్యాయవాది గ్రంథావిష్కర్త బొజ్జాతారకం మాట్లాడుతూ " దళిత ఉద్యమాన్ని చాలా తేలికగా చూడకూడదు. అది చాలా గంబీరమైన సమస్య. ఈ పుస్తకం వ్యాసాల రూపంలో కాకుండా, సైద్ధాంతిక నేపథ్యంతో ఒక పుస్తకంగా రాయవలసింది. రాసేటప్పుడు కొంత చరిత్రను, పరిశీలించవలసిన అవసరం ఉంది. కులం, మతం వంటివి బలమైన సామాజిక సమస్యలు.వీటికి పరిష్కారాన్ని సూచించే గ్రంథాన్ని ఒక్కటి చెప్పగలరా? అంబేద్కర్ కులనిర్మూలన తర్వాత గానీ, ముందుగానీ అలాంటి గ్రంథం వచ్చిందా? మరెందుకు అలా జరిగింది? ఆలోచించవలసిన అవసరం లేదా? కారంచేడు, చుండూరు సంఘటనలనే దళిత ఉద్యమాలుగా చూపే ప్రయత్నం కనిపిస్తుంది. అవే దళిత ఉద్యమాలు కాదు. అంతకుముందు కర్రలతో, సాములతో ఆత్మగౌరవపోరాటాలు జరిగాయి. అంతకుముందు జరిగిన పోరాటాల నేపథ్యమే కారంచేడు, చుండూరు సంఘటనలను పోరాటాలుగా మార్చాయి. కారంచేడుకు ముందూ, కారంచేడుతోనూ, కారంచేడు తర్వాతా నేను ఉద్యమం లో ఉన్నాను. కానీ, నన్ను విస్మరించడం, లేదా మా ప్రస్తావన లేకుండానే కారంచేడు ఉద్యమమే ప్రధానం అన్నట్లు మాట్లాడుతున్నారు. నేను మీతో కలిసి పనిచేయకూడదా? అని వరవరరావు గారు మాట్లాడుతున్నారు. ఆయన అలా మాట్లాడటం వెనుక కారంచేడు ప్రేరణ ఉంది. అది వరవరరావు మాట్లాడిన మాట కాదది. అగ్ర్తకుల సంస్కృతి అడగటం గా గుర్తించాలి. ఇప్పుడు అగ్రకులం వాళ్ళు అడగడం గా గుర్తించాలి. ఇప్పుడు వరవరరావు లాంటి వాళ్ళు తాను మాల, మాదిగ అనడంలో కులనిర్మూలన చైతన్యం ఉంది. మా గురించి రాయొద్దంటే, తమ గురించి వాస్తవం రాయలేదు కాబట్టి, అది గమనించి దళితులు రాయొద్దన్నారు. ఉద్యమం అనేక రూపాల్లో ఉంటుంది. దానిలో భాగంగానే అప్పుడు రాయొద్దన్నారు. రాయొద్దు అనడం వెనుక, మాగొంతుతో రాస్తే వద్దనడం కాదు. అయినా, మా గొంతు మాకుండగా ముందు మేమే మాట్లాడతామని చెప్పడంగా గుర్తించాలి. మా గురించి రాయండి. కానీ, మా గొంతుల్ని నొక్కేస్తూ మాట్లాడమనలేం, మా గొంతుల్తోనూ మాట్లాడండి, మా గొంతులుగా మాట్లాడండి. మా గొంతుతో కలిపి పాడు, మాగొంతుతో కలిపి మాట్లాడు, కానీ..మా గొంతు మాకుందని గుర్తించని చెప్తున్నాం, నేనీ పుస్తకం చదవలేదు. దీనిలోని విషయాల గురించి మాట్లాడడం లేదు. నన్ను మన్నించాలి. దళిత ఉద్యమం ఒక ప్రవాహం. దానికి ఆటుపోటులు ఉండవచ్చు. సమాన హోదా, సమానత్వం కలిగినప్పుడు ఉద్యమం అవసరం ఉండదు. అది లేదని భావించే వాళ్ళు పోరాడుతూనే ఉంటారు. దాని గమ్యం చేరేవరకూ అది ముందుకి వెళ్తూనే ఉంటుంది. ఆ ఉద్యమం మరింత ముందుకి తీసుకెళ్ళడానికి ఈ పుస్తకం తోడ్పడుతుందని భావిస్తున్నాను" అని మాట్లాడారు.పుస్తక రచయిత పుస్తక రచయిత డా//కేశవకుమార్ మాట్లాడుతూ " ఈ సభకు వచ్చిన వాళ్ళంతా నాకున్న వ్యక్తిగత సంబంధాల వల్ల వచ్చిన వాళ్ళు కాదు. అలా నేను అనుకోవడం లేదు. నా భావజాలం తెలిసి వచ్చారనుకుంటున్నాను. ఇప్పుడు ఏవో కొన్ని లేబుల్స్ కి మాత్రమే పరిమితమై ఉండే పరిస్థితి సరైంది కాదు. ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు చాలా స్పష్టంగానే మాల, మాదిగలు తమ తమ సమస్యల గురించి ఎవరి వాదాన్ని వాళ్ళు మాట్లాడుకొనే స్థితే ఉంది. నిజానికిప్పుడు దళిత కవిత్వంలో మాల వాళ్ళు మాదిగల గురించి మాదిగ వాళ్ళు మాలల గురించి క్రిటిసైజ్ చేయలేని పరిస్థితి కనిపిస్తుంది. చాలా మంది దబాయింపునే కవిత్వంగా తీసుకొస్తున్నారు. ప్రస్తుతం బార్గెయినింగ్ కెపాసిటీ స్థితిలోకి దళిత ఉద్యమాలను తీసుకొస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో, ఎవరూ మాట్లాడని స్థితిలో, పబ్లిక్ గా ఒకటి, ప్రైవేట్ గా మరొకటి మాట్లాడుకొనే పరిస్థితి కనిపిస్తుంది. నేనిప్పుడేదో దళిత్స్ యునైట్స్ గా ఉండాలని, దానికోసమే దీన్నంతటినీ చేస్తున్నాననే భ్రమలేమీ నాకు లేవు. కానీ, దళిత మేధావులు ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో ఏ పక్షంలో ఉంటున్నారనేది చాలా ముఖ్యం. ఇరుపక్షాల లోనూ మేధావులు మీడియేటర్స్ గా వ్యవహరించడం చాలా విచారకరం. దళిత ఉద్యమం సంక్షోభం లోకి నెట్టబడుతున్నప్పుడే దళిత రచయితలు ఎక్కువగా రాయాలి, కానీ, దళిత రచయితలు దాన్ని విస్మరిస్తున్నారు. మేధావులు క్రియాత్మకంగా వ్యవహరించకపోవడం సరైంది కాదు. యూనివర్సిటీల నుండి వచ్చేవాళ్ళు రాయగలిగే అవకాశం ఉండీ రాయకపోవడం సరైంది కాదు. నేను యూనివర్సిటీలో ఉండడం వల్ల కాస్త చదువుకోగలిగే అవకాశం కలుగుతుంది. దాన్ని రాయగలిగే అవకాశమూ ఉంది. కళ్యాణ రావు గారి అంటరాని వసంతం నవల నన్ను ఎంతగానో ప్రేరేపించింది. ఆ ప్రేరణతో , నాకున్న సమయం వల్లనే నేను రాయగలుగుతున్నాను. బహుజన కెరటాలు పత్రికకు కావాలనే రాస్తున్నాను. నిజానికి దళిత పత్రికలను ప్రచురించడంలో అనేక ఇబ్బందులు ఉన్నాయి, వాటిని అధిగమించి ముందుకు రావాలంటే ముందుగా మనలాంటి వాళ్ళు రచనా పరంగా సహకరించగలగాలి. అవసరమైతే రకరకాలుగా సహకరించాలి. దానిలో భాగంగానే నేను ఈ పత్రికకు రెగ్యులర్ గా రాస్తున్నాను, ఇప్పుడు వచ్చిన వ్యాసాలు అత్యధిక శాతం దానిలో వచ్చినవే, దళిత మ్యానిఫెస్టో నేను ప్రచురించాను. నిజమే, దాన్ని అనుసరించో, లేదో మరో దాన్ని అనుసరించో వ్యక్తులకు కొన్ని లేబుల్స్ వేసే ముందు వారి రచనా పరిణామాన్ని, భావజాలంలో వచ్చిన వికాసాన్ని అవగాహన చేసుకోవాలి. ఆ స్థితి గతులు గమనించకుండా, అవేమీ తెలియకుండా లేబుల్స్ వేయడం మంచిది కాదు. ఈ వ్యాసాలు ఇలా పుస్తకరూపంలోకి రావడానికి కారణమైన వారందరికీ నా కృతజ్ణతలు తెలుపుతున్నాను. అలాగే ఈ పుస్తకంలోని విషయాలను నిర్మొహమాటం గా చర్చించినందుకు కూడా సంతోషంగా ఉంది. మీ అందరికీ కృతజ్ణతలు" అని తన స్పందనను తెలిపారు. సభ భీమ్ కుమార్ వందన సమర్పణతో ముగిసింది. Posted by vrdarla ( Mar 07 2009, 01:27:22 PM SCT ) Permalink
సమకాలీన ఉద్యమాన్ని విశ్లేషించిన దళిత ఉద్యమం –వెలుగు నీడలు డా// పి.కేశవకుమార్ రచించిన దళిత ఉద్యమం –వెలుగు నీడలు పుస్తకాన్ని హైదరాబాదు ప్రెస్ క్లబ్ లో మార్చి ౩ వ తేదీ సాయంత్రం ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా ఆంద్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ కమీషనర్ ఎ.విద్యాసాగర్ ఐ.ఎ.ఎస్., పాల్గొన్నారు. పుస్తకాన్ని ప్రముఖ న్యాయవాది బొజ్జ తారకం ఆవిష్కరించారు.తెలంగాణ రచయితల వేదిక ప్రధాన కార్యదర్శి జూలూరి గౌరీ శంకర్ అధ్యక్షతన జరిగిన ఈ పస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రపదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ కమీషనర్ ఎ.విద్యాసాగర్ ఐ.ఎ.ఎస్., పాల్గొన్నారు పుస్తకాన్ని దళిత ఉద్యమ నాయకులు, ప్రముఖ న్యాయవాది బొజ్జాతారకం ఆవిష్కరించారు. ఈ సభలో ముఖ్య వక్తలుగా ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటి అసోసియేట్ ప్రొఫెసర్ డా//కె. సత్యనారాయణ, ప్రముఖ దళిత కవి, విమర్శకులు కలేకూరి ప్రసాద్, హైదరాబాదు విశ్వవిద్యాలయం, తెలుగు అసిస్టెంటు ప్రొఫెసర్ డా// దార్ల వెంకటేశ్వరరావు, బహుజన కెరటాలు ప్రధాన సంపాదకురాలు, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, బుద్దిస్ట్ స్టడీస్ సెంటర్ లో అసోసియేట్ ప్రొఫెసర్ డా// చల్లపల్లి స్వరూపరాణి, ప్రముఖ విప్లవ కవి వరవరరావు, బహుజన కెరటాలు వ్యవస్థాపకుడు పల్నాటి శ్రీరాములు, ప్రముఖ కవయిత్రి మహెజబీన్ లు సభలో మాట్లాడారు దళిత ఉద్యమం –వెలుగు నీడలు గ్రంథావిష్కరణ దృశ్యం. చిత్రంలో వరుసగా కలేకూరి ప్రసాద్, డా//దార్ల వెంకటేశ్వరరావు,విద్యాసాగర్ ఐ.ఎ.ఎస్., జూలూరి గౌరీశంకర్, బొజ్జా తారకం, డా// సత్యనారాయణ తదితరులు ఉన్నారు. సెంట్రల్ యూనివర్సిటి రీసెర్చ్ స్కాలర్ ధనరాజు స్వాగతం తో ప్రారంభమైన ఈ సభ భీమ్ కుమార్ వందన సమర్పణతో ముగిసింది . సభలో ఒక్కో వక్తా పుస్తకంలోని విషయాలను లోతుగానే చర్చించారు. వాటిలో ముఖ్యాంశాలను వారి మాటల్లోనే వినండి. సభాధ్యక్షత వహించిన జూలూరి గౌరీశంకర్ మాట్లాడుతూ “డా. కేశవకుమార్ బహుజనకెరటాలు, వివిధ పత్రికల్లో రాసిన వ్యాసాలను ఒక పుస్తకంగా తీసుకురావలసిన అవసరం ఉందని భావించాను. రచయితను సంప్రదించి పుస్తకంగా తీసుకొస్తానని అడిగినప్పుడు అంగీకరించారు. దీనిలో బహుజన తాత్త్వికత ఉన్న వ్యాసాలు ఉన్నాయి. చిన్న చిన్న పత్రికల్లో కంటే ప్రధానమైన పెద్ద పత్రికల్లో రావలసి ఉంది. నేను తెలంగాణా కోణం నుండే చూస్తాను. దీనిలో తెలంగాణ దళితకోణం ఉన్నా, కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు సంబంధించిన కోణం లేదు. దీన్ని చూడవలసిన అవసరం ఉంది. కారంచేడు, చుండూరు సంఘటనలపై రాసిన వ్యాసాలు ఆ సంఘటనలను అర్థం చేసుకోవడానికి ఒక డాక్యుమెంటరీలు గా ఉపయోగపడతాయి. కారంచేడు సంఘటనలో పేద కమ్మవాళ్ళు కూడా కులం ఆధారంగానే దళితులపై దాడి చేశారు. అప్పుడు వర్గం ఏమైంది. వర్గమూ, కులమూ కలిసినప్పుడు లేదా ముందుగా మనుష్యులుగా మారమని మానవీయతను నింపుకోమని దళిత ఉద్యమం తెలుపుతుంది. వాటిని తాత్త్వికంగా, డాక్యుమెంటరీలుగా భద్రపరిచే విధంగా ఈ వ్యాసాల పుస్తకం ఉంది.’” అని వివిధ వక్తల ప్రసంగాలను సమన్వయిస్తూ చెప్పారు. సభలో అధ్యక్షుడి తొలి పలుకుల అనంతరం ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటి అసోసియేట్ ప్రొఫెసర్ డా// కె.సత్యనారాయణ మాట్లాడుతూ…” కేశవకుమార్ సెంట్రల్ యూనివర్సిటిలో చదువుతున్నప్పటి నుండీ తెలుసు. ఆ యూనివర్సిటీలో జరిగిన అనేక సంఘటనల విషయంలో కలిసి పోరాడాం. చేతిరాతలు పత్రికలో స్లోపోయిజన్ కవిత రాయడం వెనుక ఒక దళిత విద్యార్థి ల్యాబ్ లో ఆత్మహత్య చేసుకున్న నేపథ్యం ఉంది. సునీత ఆత్మహత్య కు స్పందించి సునీత పొద్దున్నేపోస్టరై పలకరించింది ' పేరుతో ఒక పుస్తకం తీసుకొచ్చారు. ఇద్దరం కలిసి దళిత మ్యానిఫెస్టో కవితా సంకలనం తీసుకొచ్చాం. కేశవకుమార్ గురించి మాట్లాడటమంటే దళిత ఉద్యమం గురించి మాట్లాడటమే. కారంచేడు సంఘటన గురించి రాసిన వ్యాసం ఐక్యంగా దళితులు పోరాడితే కలిగే చైతన్యాన్ని విపులీకరించింది. బి.సి.ల గురించే కాకుండా, ముస్లిముల గురించీ రాశాడు. అయితే, ఈ పుస్తకంలో ఉన్న వ్యాసాల్లోని కొన్ని విషయాల పట్ల ఏకీభవించనివి కూడా ఉన్నాయి. వర్గీకరణ విషయంలో కాళ్ళుపట్టుకొనే పరిస్థితి ఏమిటి? సాయుధ పోరాట చైతన్యాన్ని అలవర్చుకోవాలి “ అని అన్నారు. సభలో మాట్లాడుతున్న డా// దార్ల వెంకటేశ్వరరావు సెంట్రల్ యూనివర్సిటి అసిస్టెంటు ప్రొఫెసర్ డా// దార్ల వెంకటేశ్వరరావు పుస్తకం గురించి మాట్లాడుతూ…” ఈ క్లిష్టమైన సమయంలో దళిత ఉద్యమం గురించి పుస్తకం తీసుకొని రావడం ఒక సాహసం. అలాంటి సాహసాన్ని చేసిన రచయితను అభినందిస్తున్నాను. నన్ను మాట్లాడమని చెప్పినా, దేని గురించి మాట్లాడాలో చెప్పలేదు. అంటే నాకు మాట్లాడే స్వేచ్చను ఇచ్చినట్లయ్యింది. నన్నుఈ సభలో మాట్లాడమనడం అంటే అది వ్యక్తిగతమైన సంబంధం వల్ల కాదు. ఒక మాదిగగా మాట్లాడమన్నారను కుంటున్నాను. ఒక మాదిగ విద్యావేత్తగా మాట్లాడమన్నారనుకుంటున్నాను. ఒక మాదిగ ఉద్యమ కారుణ్ణి మాట్లాడమన్నారను కుంటున్నాను. సర్వసాధారణంగా ప్రతి సమస్యను ఆ యా వ్యక్తులు తమ తమ కోణం నుండే చూస్తుంటారు. అభ్యుదయవాదులు దళిత ఉద్యమాన్ని, సాహిత్యాన్ని వేరు వేరుగా చూశారు. తెలంగాణా వాదులు దళితుల్లోని వర్గీకరణ సమస్యకు కూడా ప్రత్యేక రాష్ట్రమే పరిష్కారాన్ని చూపిస్తుందన్నారు. మార్క్సిస్టులు కులాన్ని కూడా వర్గం లో భాగంగానే చూస్తున్నారు. మాదిగలు అన్ని సమస్యల్ని వర్గీకరణ నేపథ్యంగానే చూస్తున్నారు. మాదిగ విద్యావేత్త గా ఈ పుస్తకాన్ని నేనూ అలాగే చదివాను. పుస్తకాన్ని ఒకసారి దళిత దృక్పథంతోనూ, మరొకసారి మాదిగ దృక్పథంతోనూ చదివాను. రెండు సార్లూ నిజమైన దళిత సమైక్యవాదమే కనిపించింది. దళితఉద్యమంలో నీడలు పరుచుకోవడానికి వర్గీకరణ సమస్య ఒక ప్రధాన కారణమని, దాన్ని నిజాయితీ గల నాయకత్వం లో పరిష్కరించుకొని ఉద్యమం ముందుకి వెళ్ళవలసిన అవసరం ఉందని చాటిన వ్యాసం ఈ పుస్తకంలో ఉంది. అందుకు అన్నా నిన్ను నేను అభినందిస్తున్నాను. దళితుల్లోని మాల, మాదిగల సంఘర్షణలను కాళీపట్నం రామారావు రాసిన కథ యజ్ణంలో దళితుని నిస్సహాయతతోనూ, నిత్య జీవితంలో పీడనకు గురవుతున్న పురుషుడు తన భార్యను కొట్టడం, వేధించడం వెనుక గల నిస్సహాయత వంటిదేనని అర్థం చేసుకోవాలని ఎంతో చక్కగా విశ్లేషించాడు రచయిత. ఈ మాల, మాదిగల నిస్సహాయత ఏదొక నాడు కచ్చితంగా ఇలాంటి అసమానతలకు కారణమవుతున్న అసలైన వారిపై ఒక బాంబులా బ్లాస్ట్ అయ్యే రోజు వస్తుందని అనడం మాదిగల పోరాటాన్ని పోజిటివ్ గా అర్థంచేసుకోవడమే అవుతుంది. డా// కేశవకుమార్ రాసిన వ్యాసాలు మెయిన్ పత్రికల్లో రావడం లేదని అనుకోవడం కంటే, ఈనాడు వివిధ విశ్వవిద్యాలయాల్లో, వివిధ సంస్థల్లో ఉన్న దళితులు డా//బాబా సాహెబ్ అంబేద్కర్ బిక్ష వల్ల లేదా ఆయన సాధించిన హక్కుల వల్ల నాలుగు అక్షరాలను రాయగలిగే రచయితలు, తమ రాతలను ముందుగా తమ దళిత పత్రికల్లోనే రావాలనే ఆకాంక్షతో ఉంటున్నారు. అదొక చైతన్యం. అది డా// కేశవకుమార్ లో ఉందనుకుంటున్నాను. అందుకే ఆ వ్యాసాల్ని మెయిన్ పత్రికల్లో ప్రచురించుకోగలిగే సత్త ఉన్నా ముందుగా బహుజన కెరటాలు, తమ దళిత భావజాలాన్ని సమర్థించే పత్రికల్లోనే ప్రచురించాలని ఆశించి ఉంటాడు. నేడు ఉన్న దళిత పత్రికల్లో నిజమైన వ్యవస్థీకృత చైతన్యంతో నడుస్తున్న పత్రిక బహుజన కెరటాలు. దీన్ని సంపాదకులు, వ్యవస్థాపకులు చాలా ముందుచూపుతో దళిత మేధావుల్ని, రచయితల్ని ఒకే వేదిక పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. భవిష్యత్తు పట్ల మా దళితులకు గొప్ప ఆశను కలిగిస్తున్న పత్రిక అది. అది ఈ మధ్య వర్గీకరణను సమర్థస్తూ ఒక ప్రత్యేక సంచికను ప్రచురంచింది. అది నిజమైన బహుజన చైతన్యాన్ని నింపే ప్రక్రియ. నిజమైన దళిత ప్రజాస్వామ్యీకరణ. దళితులకు మీడియా ఇస్తున్న ప్రాధాన్యత ఎలాంటిదో మనందరికో తెలుసు. ఒక కారం శివాజీ, ఒక జూపూడి ప్రభాకరరావు, లేదా ఒక మంద కృష్ణ మాదిగ వాళ్ళ ఇరువురూ ఒకరినొకరు తిట్టుకోవడమో, పరస్పరం ఎమోషన్స్ కి గురిచేసుకోవడమో చేస్తుంటే ఎంతో ప్రాధన్యతనిస్తుంది మీడియా. అదే మీడియా వాళ్ళలో ఎవరైనా రాజ్యధికారం కోసమో, దళితుల్ని సమైక్యంగా చైతన్యం చేయడానికో ప్రయత్నిస్తే సహకరిస్తుందా? అప్పుడు కదా మీడియా నిజ స్వరూపం తెలిసేది. అందుకే బహుజన కెరటాలు వంటి పత్రికలు రావలసిన అవసరం, అలాంటి పత్రికలకు దళిత రచయితలు ఒక బాధ్యతగా రాయవలసిన అవసరం ఉందని నిరూపించి, వాటిని ఇంత మంచి పుస్తకంగా తీసుకొచ్చినందుకూ, ఆ పుస్తకంపై నన్ను కూడా మాట్లాడించినందుకు కృతజ్ణతలు తెలియజేస్తున్నాను. మాదిగల సమస్యను ఇలా నిజమైన ప్రజాస్వామిక దృక్పథం తో చర్చకు అవకాశం కల్పించినట్లైతే అప్పుడు నిజంగా దళిత సమైక్య ఉద్యమం బలపడుతుంది. ఈ పుస్తకంలో దళిత ఉద్యమం, ఉమ్మడి దళిత ఉద్యమం వంటి పారిభాషిక పదాలను ప్రయోగించాడు. అది పరోక్షంగా దళిత ఉద్యమంలో వర్గీకరణ ఉద్యమాన్ని గుర్తించడంగానే భావిస్తున్నాను’ అని విశ్లేషించారు. బుద్దిస్ట్ స్టడీస్ సెంటర్ లో అసోసియేట్ ప్రొఫెసర్ డా// చల్లపల్లి స్వరూపరాణి మాట్లాడుతూ " కేశవకుమార్ అలోచనా దృక్పథంలో పరిణామం కనిపిస్తుంది. మొదట్లో వర్గ దృక్పథంతో రాసే వాడు. ఇప్పుడు అంబేద్కర్ అలోచనా దృక్పథంతో రాయడం సంతోషించదగిన విషయం. దళితుల ప్రత్యామ్నాయ చారిత్రక దృక్పథం తో చరిత్రను అధ్యయనం చేసిన తీరు బాగుంది. మహిళా రిజర్వేషన్ గురించి కూడా రాశాడు. అది కవిత్వమైనా, వ్యాసమైనా దళిత మాండలికంలో రాస్తాడు. దాని వల్ల గ్రామీణ ప్రాంతంలోని దళితులు కూడా పత్రికను తమ పత్రికగా ఫీలవుతూ చదువుకుంటున్నారు. బహుజన కెరటాలు పత్రిక దండోరా ఆశిస్తున్న వర్గీకరణను సమర్థిస్తూ ఒక ప్రత్యేక సంచికను వేశాం. అది చాలా బాగుందని వ్యక్తిగతంగా మెచ్చుకున్నా, దాన్ని బయట చెప్పకపోవడం విచారకరం. అలాంటి ప్రజాస్వామిక చర్చను ఆహ్వానించినప్పుడు నిజంగా స్పందించవలసిన అవసరం ఉంది. అప్పుడే నిజమైన నిజాయితీ కనిపిస్తుంది’’ అని అన్నారు. సభలో మాట్లాడుతున్న కలేకూరి ప్రసాద్ ప్రముఖ దళిత కవి, విమర్శకులు కలేకూరి ప్రసాద్ మాట్లాడుతూ " సింహాలు మాట్లాడనంత కాలం పిట్టకథలే చరిత్రలవుతాయి. కనుక దళితులు చరిత్రలను రాసుకోవాలి. అనేక సందర్భాల్లో రాసినప్పటికీ ఒక అంతస్సూత్రంతో దళిత చైతన్యం కనిపిస్తుంది. చరిత్రను ఏ దృక్పథంతో రాయాలో ఆ దృక్పథంతో రాశాడు. అభినందనీయుడు " అని అన్నారు. సభలో కూర్చున్న ప్రసిద్ద రచయిత్రి మహేజబీన్ ని మాట్లాడమని వేదిక పైకి పిలిచారు. సభలో మహేజబీన్ మాట్లాడుతూ "ఇక్కడికి రాకపోతే దళిత సాలిడారిటీ లేదంటారేమోనని వచ్చాను. మా ముస్లిములను కూడా దళితులుగా కలుపుకుంటే బాగుంటుంది. నన్ను నేను వేదిక పై నుండి దళితగానే ప్రకటించుకుంటున్నాను” అని అన్నారు. బహుజన కెరటాలు వ్యవస్థాపకుడు పల్నాటి శ్రీరాములు మాట్లాడుతూ ‘" మాదిగ దండోరా, తుడుం దెబ్బ, ఎలుక కుర్రు మొదలైన అస్తిత్త్వ కుల ఉద్యమాల నుండి ప్రేరణతో బహుజనకెరటాలు మాసపత్రిక స్థాపించాను. కామ్రేడ్ వీరయ్య భావజాలంతో పత్రిక పెట్టాలనే ఆలోచన వచ్చింది. ఆయన ప్రోత్సాహం ఎంతో ఉంది. బొజ్జా తారకం వంటి వాళ్ళు నడిపిన పత్రికలను క్రమం తప్పకుండా చదివే వాడిని. వాటినుండి కూడా అనేక విషయాలను నేర్చుకోగలిగాను. రిజిస్త్రేషన్ లేకుండా ప్రారంభమైన పత్రిక ప్రకటనలు లేక నడపడం అసాధ్యమైన పరిస్థితిలో శ్రీపతి రాముడు ఢిల్లీ నుండి రిజిస్త్రేషన్ పంపించాడు. కలేకూరి ప్రసాద్ ఎన్నో ప్రధాన మైన మెయిన్ స్టీమ్ పత్రికల్లో చేయగలిగే, రాయగలిగే అవకాశం ఉన్నా, తన కాలాన్ని ఎంతటినో పత్రిక కోసం త్యాగం చేశాడు. మద్దూరి నగేశ్ బాబు పై ప్రత్యేక సంచిక వేసిన తర్వాత పత్రిక నిజమైన దళితుల దగ్గరకు చేరుకోగలిగింది. సర్క్యులేషన్ కూడా మూడువేలు దాటింది. చాలా మంది రాస్తున్నా, ఇంకా దళిత రచయితలే ఈ పత్రికకు రాయకపోవడం కొరతగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో డా// చల్లపల్లి స్వరూపరాణి ని సంపాదక బాధ్యతలు వహించమని కోరాను. డా//కేశవ కుమార్ రెగ్యులర్ గా మాట్లాడుతూ ఈ పత్రికకే వ్యాసాలు రాస్తున్నాడు. అలా వచ్చినవే కారంచేడు, చుండూరుపై రాసిన వ్యాసాలు. అవి పత్రికకు ఎంతో పేరు తెచ్చాయి. సురేష్ మాదిగ లాంటి వాళ్ళు ఆత్మ హత్య చేసుకోవడానికి గల కారణాలను అర్థం చేసుకొని వర్గీకరణ సమస్యను సామరస్య పూరకంగా పరిష్కరించుకోవలసిన అవసరం ఉంది. ఇలాంటి సమస్యలకు ఉమ్మడి వేదికలు ద్వారా పరిష్కారాలు వేగవంతంగా జరుగుతాయి. వర్గీకరణను సమర్థిస్తూ బహుజన కెరటాలు ఒక ప్రత్యేకసంచికను కూడా ప్రచురించింది” అని అన్నారు. ప్రముఖ విప్లవ కవి వరవరరావు మాట్లాడుతూ “కేశవకుమార్ నాకు చాలా ఆత్మీయుడు. అతడు నాకు చాలా కాలం నుండీ తెలుసు. నాకు అతని ఉద్యమ స్పూర్తి తెలుసు. చిక్కనవుతున్న పాట కంటే ముందుగానే దళిత మ్యానిఫెస్టో ప్రచురించాడు. కారంచేడు ఉద్యమం విప్లవోద్యమాలను ఆలోచింపజేసింది. ఆ సంఘటనలో ప్రధాన కారణమైన వాళ్ళలో చెంచురామయ్యను విప్లవోద్యమమే శిక్షించింది. కారంచేడు ఉద్యమంలో విప్లవోద్యమ కార్యకర్తలు అక్కడ అనేక రోజుల పాటు క్యాంపు వేసి ప్రజలతో ఉన్నారు. చుండూరు సమస్యను భూమితో ముడిపడిన సమస్యగా విప్లవోద్యమం చూసింది. దానితో పనిచేసింది. మేము దళితులతో ఐడెంటిఫై అవుతుంటే అది కుట్ర అవుతుందా? మార్క్సిస్టులు కుల ఉద్యమాలను అధ్యయనం చేస్తున్నారు. రిజర్వేషన్స్ పట్ల , ముఖ్యంగా జనాభా ప్రాతిపదిక పై అది కొనసాగితే బాగుంటుంది. వర్గీకరణను సమర్థిస్తూ చెప్పడమే కాకుండా బయట ఉద్యమాలతో కూడా మమేకమై ముందుకు నడవాలని ఆశిస్తున్నాను. కారంచేడు, చుండూరు సంఘటనలపై రాసిన వ్యాసాలు చాలా ఆలోచనాత్మకంగా ఉన్నాయి. ఈ పుస్తకంలో గురజాడ రాసిన కన్యాశుల్కంపై కొన్ని వ్యాఖ్యలు ఉన్నాయి. నిజానికి మధురవాణిలో గురజాడ ఉన్నాడు. దాన్ని రచయిత గుర్తించాలి’’ అని అన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రపదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ కమీషనర్ విద్యాసాగర్ ఐ.ఎ.ఎస్, మాట్లాడుతూ " మనం ఇక్కడ మాట్లాడుకొనే విషయాలు చాలా విలువైనవి. ఇక్కడ మాట్లాడే విషయాలు అనేక మందికి వ్యాపిస్తాయి. అంబేద్కర్ ఆలోచనలను ఆలోచిస్తున్న వాళ్ళు ఎలా ఉన్నారో ఈ పుస్తకంలో పట్టుకోగలిగారు. నిజంగా దళిత ఉద్యమం వెనుకబడే ఉందా? దళిత సాహిత్యం కొంతమందికే చెందిందా? అనే ప్రశ్నలను, దానికి అనేక సమాధానలను ఈ పుస్తకం అందిస్తుంది. నిజంగా సమానత్వం, ఆధిపత్యం కోసం మాట్లాడేవాళ్ళు చేస్తున్నదేమిటని ఆలోచింపజేస్తుంది. ఏ ఉద్యమానికైనా వెలుగు నీడలు, ఉత్థాన పతనాలు ఉండటం సహజం. అలాంటివి జీవితంలోనూ చాలా సహజం. అయితే అవి కొత్త కొత్త రూపాల్ని సంతరించుకొని ముందుకొస్తాయి. చాలా మంది అంబేద్కర్ ని లిబరల్ బూర్జువాగా గుర్తించడంలోని ఆంతర్యాన్ని రచయిత పట్టుకోగలిగారు. ఈ పుస్తకం మొదటి వ్యాసంలోనే పుస్తకం తత్త్వాన్ని అంతటినీ పట్టుకోగలిగారు. చదివినదీ, చెప్పేదీ ఫిలాసపీ కావడంతోనేమో, అంబేద్కర్, దళిత ఫిలాసఫీని పట్టుకోగలిగారు. చరిత్ర దృక్పథాన్ని, ఆధునికతను వివరించడంలో అవి స్ప్తష్టంగా కనిపిస్తాయి. నేనీ మధ్య పంచమం నవల చదివాను. దానిలో ప్రభుత్వం ఆధ్వర్యంలో సీలింగ్ ద్వారా వచ్చిన భూమిని పంచడానికి అధికారులు సిద్దమవుతుంటారు. అప్పటికే అక్కడ బీ,సీ, లు మిగతా కులాల వాళ్ళు ఉన్నా, ఆలస్యంగా వచ్చిన మాదిగలకే ముందుగా పేర్లు రాస్తారు. అప్పుడు బి.సి.లు కోపపడినా, వాళ్ళలో వాళ్ళే మరలా మాట్లాడుకుంటూ, మనకి సమాజంలో గౌరవం ఉంది. అది మాదిగలకి ఎక్కడ వస్తుంది అనే ఆత్మ గౌరవాన్ని ప్రకటిస్తారు. ఇక్కడ గమనించవలసింది ఒకటి ఉంది. మనం ఔననుకున్నా, కాదనుకున్నా కులం పోవాలనుకుంటూనే, ఆకులం వల్ల వచ్చే అవకాశాలను వదులుకోలేని స్థితిలో ఉండటం ఒక విచిత్ర సన్నివేశం. కులం వల్ల మన సమాజంలో కొన్ని ఔనన్నా, కాదన్నా జరిగిపోతుంటాయి. ఆధిపత్యం ఒక వైపు, మరొక వైపు సమానత్వం కోసం పోరాటం నిరంతరం జరుగుతూనే ఉంటుంది. కులం వల్ల అవకాశాలు తాత్కాలికంగా వస్తున్నా, కింది కులాల వాళ్ళు తమ కులం కొనసాగాలని కోరుకోరు. కానీ, ఆ కులంలో ఉంటూనే ఆ కులాన్ని పోగొట్టుకోవాలని పోరాడుతుంటారు. అది ఆధిపత్యం, సమానత్వం ల మధ్య జరుగుతున్న పోరాటం. అలా కులంతోనే పోరాడుతూ సమానత్వం కోసం ముందుకొస్తున్న వాళ్ళు కోరుకొనేదేమిటో ఆధిపత్య కులాలు, వర్గాలు అర్థం చేసుకోవాలి. కులాన్ని, వర్గాన్ని అర్థం చేసుకోవడానికి కారంచేడు, చుండూరు పై ఈ పుస్తకంలోని వ్యాసాలను కే స్ స్టడీస్ గా చెప్పుకోవచ్చు. మనం ఆధినికతను కూడా ఒకేలా ఆలోచించలేం. అది మనకి తెలియకుండానే పాత అసమానతల్ని కొత్త మాటలతో కొనసాగించే తాత్త్వకతను కలిగి వస్తుంటుంది. దాన్ని లోతుగా అర్థం చేసుకోక పోతే, అధునికత కొనసాగే తీరు అర్థం కాదు. ముందుకొచ్చిన వాళ్ళు ఆధిపత్యాన్ని , అవకాశాలను పొందిన వాళ్ళు వాటిని మరిచి పోయి, అదే ఆధిపత్యాన్ని కొనసాగిస్తుండటం వల్ల సమానత్వం కోసం మాట్లాడేవాళ్ళు ఐక్యతను కూడా ఒక తాత్త్వక భావనగా విశ్లేషిస్తుంటారు. ఆధునికతలో అంతర్భాగంగా చూపిస్తుంటారు. ఈ క్లిష్టత అర్థం కావాలంటే, సమానత్వం కోసం పోరాడేవాళ్ళ వేదనను అర్థం చేసుకోవాలి. చదువుకున్న వాళ్ళు ఒక వర్గంగా తయారై తమ మాలాలను మరిచిపోతున్నారు. వాళ్ళు మరో వర్గంగా తయారవుతున్నారు. ఇది గుర్తించి ముందుకెళ్ళాలి. బహుజనకెరటాలు వంటి పత్రికలు దళిత ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించడం అభినందనీయం ” అని సమకాలీన సమాజంలోని అనేక అసమానతలను, ఆధిపత్యాలను విశ్లేషించి, నిజమైన మేధావులు పీడితుల పక్షాన్ని నిలవ వలసిన అవసరాన్ని వివరించారు. దళిత ఉద్యమ నాయకులు, ప్రముఖ న్యాయవాది గ్రంథావిష్కర్త బొజ్జాతారకం మాట్లాడుతూ " దళిత ఉద్యమాన్ని చాలా తేలికగా చూడకూడదు. అది చాలా గంబీరమైన సమస్య. ఈ పుస్తకం వ్యాసాల రూపంలో కాకుండా, సైద్ధాంతిక నేపథ్యంతో ఒక పుస్తకంగా రాయవలసింది. రాసేటప్పుడు కొంత చరిత్రను, పరిశీలించవలసిన అవసరం ఉంది. కులం, మతం వంటివి బలమైన సామాజిక సమస్యలు.వీటికి పరిష్కారాన్ని సూచించే గ్రంథాన్ని ఒక్కటి చెప్పగలరా? అంబేద్కర్ కులనిర్మూలన తర్వాత గానీ, ముందుగానీ అలాంటి గ్రంథం వచ్చిందా? మరెందుకు అలా జరిగింది? ఆలోచించవలసిన అవసరం లేదా? కారంచేడు, చుండూరు సంఘటనలనే దళిత ఉద్యమాలుగా చూపే ప్రయత్నం కనిపిస్తుంది. అవే దళిత ఉద్యమాలు కాదు. అంతకుముందు కర్రలతో, సాములతో ఆత్మగౌరవపోరాటాలు జరిగాయి. అంతకుముందు జరిగిన పోరాటాల నేపథ్యమే కారంచేడు, చుండూరు సంఘటనలను పోరాటాలుగా మార్చాయి. కారంచేడుకు ముందూ, కారంచేడుతోనూ, కారంచేడు తర్వాతా నేను ఉద్యమం లో ఉన్నాను. కానీ, నన్ను విస్మరించడం, లేదా మా ప్రస్తావన లేకుండానే కారంచేడు ఉద్యమమే ప్రధానం అన్నట్లు మాట్లాడుతున్నారు. నేను మీతో కలిసి పనిచేయకూడదా? అని వరవరరావు గారు మాట్లాడుతున్నారు. ఆయన అలా మాట్లాడటం వెనుక కారంచేడు ప్రేరణ ఉంది. అది వరవరరావు మాట్లాడిన మాట కాదది. అగ్ర్తకుల సంస్కృతి అడగటం గా గుర్తించాలి. ఇప్పుడు అగ్రకులం వాళ్ళు అడగడం గా గుర్తించాలి. ఇప్పుడు వరవరరావు లాంటి వాళ్ళు తాను మాల, మాదిగ అనడంలో కులనిర్మూలన చైతన్యం ఉంది. మా గురించి రాయొద్దంటే, తమ గురించి వాస్తవం రాయలేదు కాబట్టి, అది గమనించి దళితులు రాయొద్దన్నారు. ఉద్యమం అనేక రూపాల్లో ఉంటుంది. దానిలో భాగంగానే అప్పుడు రాయొద్దన్నారు. రాయొద్దు అనడం వెనుక, మాగొంతుతో రాస్తే వద్దనడం కాదు. అయినా, మా గొంతు మాకుండగా ముందు మేమే మాట్లాడతామని చెప్పడంగా గుర్తించాలి. మా గురించి రాయండి. కానీ, మా గొంతుల్ని నొక్కేస్తూ మాట్లాడమనలేం, మా గొంతుల్తోనూ మాట్లాడండి, మా గొంతులుగా మాట్లాడండి. మా గొంతుతో కలిపి పాడు, మాగొంతుతో కలిపి మాట్లాడు, కానీ..మా గొంతు మాకుందని గుర్తించని చెప్తున్నాం, నేనీ పుస్తకం చదవలేదు. దీనిలోని విషయాల గురించి మాట్లాడడం లేదు. నన్ను మన్నించాలి. దళిత ఉద్యమం ఒక ప్రవాహం. దానికి ఆటుపోటులు ఉండవచ్చు. సమాన హోదా, సమానత్వం కలిగినప్పుడు ఉద్యమం అవసరం ఉండదు. అది లేదని భావించే వాళ్ళు పోరాడుతూనే ఉంటారు. దాని గమ్యం చేరేవరకూ అది ముందుకి వెళ్తూనే ఉంటుంది. ఆ ఉద్యమం మరింత ముందుకి తీసుకెళ్ళడానికి ఈ పుస్తకం తోడ్పడుతుందని భావిస్తున్నాను" అని మాట్లాడారు.పుస్తక రచయిత పుస్తక రచయిత డా//కేశవకుమార్ మాట్లాడుతూ " ఈ సభకు వచ్చిన వాళ్ళంతా నాకున్న వ్యక్తిగత సంబంధాల వల్ల వచ్చిన వాళ్ళు కాదు. అలా నేను అనుకోవడం లేదు. నా భావజాలం తెలిసి వచ్చారనుకుంటున్నాను. ఇప్పుడు ఏవో కొన్ని లేబుల్స్ కి మాత్రమే పరిమితమై ఉండే పరిస్థితి సరైంది కాదు. ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు చాలా స్పష్టంగానే మాల, మాదిగలు తమ తమ సమస్యల గురించి ఎవరి వాదాన్ని వాళ్ళు మాట్లాడుకొనే స్థితే ఉంది. నిజానికిప్పుడు దళిత కవిత్వంలో మాల వాళ్ళు మాదిగల గురించి మాదిగ వాళ్ళు మాలల గురించి క్రిటిసైజ్ చేయలేని పరిస్థితి కనిపిస్తుంది. చాలా మంది దబాయింపునే కవిత్వంగా తీసుకొస్తున్నారు. ప్రస్తుతం బార్గెయినింగ్ కెపాసిటీ స్థితిలోకి దళిత ఉద్యమాలను తీసుకొస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో, ఎవరూ మాట్లాడని స్థితిలో, పబ్లిక్ గా ఒకటి, ప్రైవేట్ గా మరొకటి మాట్లాడుకొనే పరిస్థితి కనిపిస్తుంది. నేనిప్పుడేదో దళిత్స్ యునైట్స్ గా ఉండాలని, దానికోసమే దీన్నంతటినీ చేస్తున్నాననే భ్రమలేమీ నాకు లేవు. కానీ, దళిత మేధావులు ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో ఏ పక్షంలో ఉంటున్నారనేది చాలా ముఖ్యం. ఇరుపక్షాల లోనూ మేధావులు మీడియేటర్స్ గా వ్యవహరించడం చాలా విచారకరం. దళిత ఉద్యమం సంక్షోభం లోకి నెట్టబడుతున్నప్పుడే దళిత రచయితలు ఎక్కువగా రాయాలి, కానీ, దళిత రచయితలు దాన్ని విస్మరిస్తున్నారు. మేధావులు క్రియాత్మకంగా వ్యవహరించకపోవడం సరైంది కాదు. యూనివర్సిటీల నుండి వచ్చేవాళ్ళు రాయగలిగే అవకాశం ఉండీ రాయకపోవడం సరైంది కాదు. నేను యూనివర్సిటీలో ఉండడం వల్ల కాస్త చదువుకోగలిగే అవకాశం కలుగుతుంది. దాన్ని రాయగలిగే అవకాశమూ ఉంది. కళ్యాణ రావు గారి అంటరాని వసంతం నవల నన్ను ఎంతగానో ప్రేరేపించింది. ఆ ప్రేరణతో , నాకున్న సమయం వల్లనే నేను రాయగలుగుతున్నాను. బహుజన కెరటాలు పత్రికకు కావాలనే రాస్తున్నాను. నిజానికి దళిత పత్రికలను ప్రచురించడంలో అనేక ఇబ్బందులు ఉన్నాయి, వాటిని అధిగమించి ముందుకు రావాలంటే ముందుగా మనలాంటి వాళ్ళు రచనా పరంగా సహకరించగలగాలి. అవసరమైతే రకరకాలుగా సహకరించాలి. దానిలో భాగంగానే నేను ఈ పత్రికకు రెగ్యులర్ గా రాస్తున్నాను, ఇప్పుడు వచ్చిన వ్యాసాలు అత్యధిక శాతం దానిలో వచ్చినవే, దళిత మ్యానిఫెస్టో నేను ప్రచురించాను. నిజమే, దాన్ని అనుసరించో, లేదో మరో దాన్ని అనుసరించో వ్యక్తులకు కొన్ని లేబుల్స్ వేసే ముందు వారి రచనా పరిణామాన్ని, భావజాలంలో వచ్చిన వికాసాన్ని అవగాహన చేసుకోవాలి. ఆ స్థితి గతులు గమనించకుండా, అవేమీ తెలియకుండా లేబుల్స్ వేయడం మంచిది కాదు. ఈ వ్యాసాలు ఇలా పుస్తకరూపంలోకి రావడానికి కారణమైన వారందరికీ నా కృతజ్ణతలు తెలుపుతున్నాను. అలాగే ఈ పుస్తకంలోని విషయాలను నిర్మొహమాటం గా చర్చించినందుకు కూడా సంతోషంగా ఉంది. మీ అందరికీ కృతజ్ణతలు" అని తన స్పందనను తెలిపారు. సభ భీమ్ కుమార్ వందన సమర్పణతో ముగిసింది. Posted by vrdarla ( Mar 07 2009, 01:27:13 PM SCT ) Permalink
dalit Posted by vrdarla ( Nov 14 2006, 01:34:04 PM SCT ) Permalink
dalitakavitayugam! ప్రముఖ దళిత ఉద్యమ నాయకుడు, తత్వవేత్త,అంబేడ్కరిస్టు, కవి, భాషావేత్త కత్తి పద్మారావు గారి ఆధ్వర్యంలో దళిత '' కవితాయుగం '' పేరుతో ఒక బృహత్తర కవితా సంకలనం వెలువడుతున్నది. దీనికి సంబంధించిన సమాచారం పక్క జె.పి.జి. ఫైల్ లో ఉంది.మీరచనలను "దళిత కవితాయుగం '',ప్రధాన సంపాధకులు,కత్తిపద్మారావు,లుంబినీవనం,అంబేడ్కర్ కాలనీ,పొన్నూరు522124, గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ Posted by vrdarla ( Nov 14 2006, 11:12:24 AM SCT ) Permalink
ఎల్లమ్మ కథకు బహుమతి- శుభాకాంక్షలు! ప్రముఖ కథారచయిత కాసుల ప్రతాప రెడ్డి గారికి మానేరు రచయితల సంఘం(కరీంనగర్)వారు ఈ ఏడాది(2006) సురమౌళి స్మారక కథా పురస్కారాన్ని ప్రకటించారు.ఆయన రాసిన "ఎల్లమ్మ ఇతరకథలు" కథా సంపుటికి గాను ఈ పురస్కారాన్ని ఎంపిక చేశారు. ఈకథా సంపుటిలో ఒక సామాజిక ఉద్యమ కార్యకర్తగా, ఉత్తమ సాహితీ వేత్తగా రచయిత కనిపిస్తారు.ఇంతకుముందు శిలువకు తొడిగిన మొగ్గ అనే కథా సంపుటిని ప్రచురించారు.అలాగే గుక్క పేరుతో ఒక కవితా సంపుటిని కూడా ప్రచురించారు.వీరికి ఈ సందర్భంగా నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను! వీరి "వెంటాడే అవమానం" కథను గురించి నేను కేంద్ర సాహిత్య అకాడమీ,ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వారు సంయుక్తంగా నిర్వహించిన తెలుగు - మలయాళీ కథల జాతీయ సదస్సులో మాట్లాడను. వీరు రాసిన గుక్క కవితా సంపుటి పై నేను రాసిన వ్యాసం కింది లింక్ లో చదువుకోవచ్చు.http://thatstelugu.oneindia.in/sahiti/kitabu/gukka.htmlఅలాగే వీరు రాసిన ఎల్లమ్మ కథ ను కూడా ఆసక్తి ఉన్నవాళ్ళు లో చదువుకోవచ్చు. Posted by vrdarla ( Oct 25 2006, 02:29:41 PM SCT ) Permalink
Darla poem (Award for the City!) Award for the City! --Dr.Darla Venkateswara Rao I thought the city would embrace me Ignoring whether it was day, night Hunger, thirsty Weakness, sleepless But my life was absorbed in the city construction! Whoever may be the labour in establishing Taj Mahal It become foundation for love Hard work reflects and overtakes in moonlight’s cool breeze The great poet exists through his poetry With delight I become on to road to see the construction of city No luring rhythm in my ‘walk’ on the Centre The city made my legs broken and made me a handicapped! The city has become a flower A lock has been put on my nose The city has become a Lord Indra’s Bungalow A sin has made my existence ash! I thought the city would embrace me I thought the city was mine I thought the city was my family I thought the city was my soul mate I was city, the city was I In the construction of city, I become a dot The city rejected me The city that has rejected me gets selected for an award! The city swallowed my labour juice Did not leave out even the cane for burning as the nature of human opportunism! --- Translated by Dr.Murali Manohar Posted by vrdarla ( Oct 19 2006, 09:27:35 AM SCT ) Permalink
దార్ల కవిత హాస్టల్లో అమ్మ! మా యూనివర్శిటీ హాస్టల్లో మిగిలిన అన్నం పట్టికెళ్ళడానికి తెల్లవారగట్ల వచ్చే తల్లి దీన వదనంలో మా అమ్మ రూపం అందంగా కనిపిస్తుంది. నన్ను పెంచిన తీరు ఆ తల్లి లో ప్రతిబింబిస్తుంటే నా కళ్ళ ఎడారిని ఓ జాలి నిట్టూర్పు ఆర్ద్రమై తడుపుతంది దయతో! మా ఊరి పెళ్ళి పందిళ్ళలో అమ్మ చేతుల్లో ఆకలి పాత్రనై ఒదిగినప్పుడు చెత్త కుప్పల్లోనైనా పడేసి రంకేసే కర్కశ కేకలకు తల్లడిల్లిన నా తల్లి హృఇదయాన్ని అప్పుడప్పుడూ చూస్తుంటాను నిస్సహాయంగా! చీకటి గదిలో ఒంటరినై నాలో నేను కొట్టుకు పోతుంటాను కన్నీటి కెరటాల్లో! ఎక్కడ్నుండో అమ్మ అమృత హృదయమై లాలిస్తుంది జోలపాడుతుంది ఆకలీ అవమాన ప్రపంచాల్ని జయించమంటూ మేలుకొలుపు గీతాల్ని వినిపిస్తుంది! ( ఈ కవిత రంజని వాళ్ళు ప్రచురించిన "అమ్మ" కవితా సంకలనంలో కూడా ఉంది) Posted by vrdarla ( Oct 12 2006, 10:59:06 AM SCT ) Permalink
ఈమాట ద్వారా తెలుగు! ఈమాట ద్వారా తెలుగు భాషను విశ్వవ్యాప్తం చేస్తున్నారు. ఈమధ్య కంప్యూటర్ లో తెలుగు భాష గురించి ఒక సదస్సు నిర్వహిస్తున్నట్లు చదివాను. ఇది తెలుగు భాషాభివృద్ధికి ఎంతగానో సహకరిస్తుంది. విశ్వవిద్యాలయాలు చేయవలసిన కృషిని మీరు చేస్తున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. డా.దార్ల వెంకటేశ్వరరావు. తెలుగు అధ్యాపకుడు, సెంట్రల్ యూనివర్సిటి, హైదరాబాదు. Posted by vrdarla ( Oct 12 2006, 09:10:32 AM SCT ) Permalink
నాకవిత్వం! నేను దళితతాత్వికుడు పేరుతో ఒక కవితా సంపుటిని ప్రచురించాను.దానిలోని ఒక కవిత లింక్ ఇస్తున్నాను. చూడండి. దార్ల Posted by vrdarla ( Oct 10 2006, 11:27:16 AM SCT ) Permalink
తెలుగు రచనల వెబ్ సైట్! ప్రియమైన సాహితీ మిత్రులారా, నేను కొన్ని పుస్తకాలను పరిచయం చేసాను.ఆసక్తి ఉంటే వాటిని కింది చిరునామాలో చూడవచ్చు. http://thatstelugu.oneindia.in/sahiti/kitabu/andhra.html Posted by vrdarla ( Oct 05 2006, 09:41:22 AM SCT ) Permalink
తెలంగాణా ఉద్యమ ప్రభావం ప్రియమైన తెలుగు మిత్రులారా! ఈ మధ్యకాలంలో తెలంగాణా ఉద్యమ ప్రభావం వల్ల ఒక శుభ పరిణామం కనిపిస్తుంది. తెలంగాణలో కవులు బాగా కవిత్వం రాశారు. వ్యాసాలు కూడా బాగానే రాశారు.అన్నింటికీ మించి కథలు రాశారు.ఈ విధంగా తెలుగు సాహిత్యం అభివృధ్ధి చెందింది. అంతే కాకుండా ఆదికవిగా నన్నయ్యను అంగీకరించాలా వద్ధా అనే ఆలోచన చేస్తున్నారు.దీనిపై మీ అభిప్రాయాన్ని తెలపండి! మీ డా. దార్ల వేంకటేశ్వర రావు. Posted by vrdarla ( Oct 04 2006, 03:44:33 PM SCT ) Permalink
తెలుగు వాల్లందరికీ దసరా శుభాకంక్ష్షలు! దార్ల Posted by vrdarla ( Sep 26 2006, 09:32:19 AM SCT ) Permalink