మామ్మూలు మనిషి

All | General | Status | Java | Music | Politics
20110529 Sunday May 29, 2011

పెళ్ళాం మేనేజ్ మెంట్


 మా పెద్దన్నయ్య అంత కిలాడీ ని నేనెక్కడా చూడలేదు. బిజినెస్ మేనేజ్ మెంట్, హోటెల్ మేనేజ్ మెంట్ లాగా, మా అన్నయ్య పెళ్ళాం మేనేజ్ మెంట్ లో గోల్డ్ మెడలిస్ట్.

మా వదిన్ని ఓ ఆటాడాడించేవాడు. మా వదిన మరీ అమాయకురాలేం కాదు. జమునకున్నంత రోషం, ప్రేమ్ నగర్ లో వాణిశ్రీ కున్నంత ఆత్మాభిమానం, ఇప్పటి హీరోయిన్ ల కున్నంత గడుసు తనం. ఏం లాభం మా అన్నయ్య నక్కజిత్తుల ముందు చిత్తయ్యేది.

మా అన్నయ్య అంటే నాకు తోడ బుట్టిన అన్నయ్య కాదు. మా పెదనాన్న కొడుకు. మా పెదనాన్న స్కూల్లో హెడ్ మాస్టారు , మా వూరికి పోస్ట్ మాస్టారు. మా ఇంటి వరండా లో పెద్ద అరుగుండేది. మా ఆటలు, పోస్ట్ కి సంబంధిచిన పనులు, మా పెద్దమ్మ ఆవకాయ ముక్కలు కోసుకోవటం అన్నీ, ఆ అరుగు మీదే.

ఒక రోజు, మా వదిన “సాయంత్రం తొందరగా రండి, సినిమాకెళ్దామని” ముందే చెప్పి పంపించీంది.

“అట్లాగేలేవే, నువ్వు చెప్పటం, నేను కాదనటమా “ఆదర్శ భర్త లాగా అని ,మోపెడ్ మీద వెళ్ళాడు.

సాయంత్రం తొందరగా వంట చేసి, మంచి చీర కట్టుకుని, ఎదురు చూస్తూ వుంది.

అత్తగారు ఏమన్నా వాదనకి దిగకుండా, పిల్లలు ఏదడిగినా వాళ్ళ వీపులు మోగించకుండా వాళ్ళడిగింది చిరునవ్వుతో ఇస్తూ మూడ్ చెడకొట్టుకోకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంది.

ఆరయ్యింది, ఏడయ్యింది, మా వదిన శాంతం ఆవిరయ్యింది. అన్నయ్య అయిపు లేడు. నాగు పాములా బుసలు కొడుతూ, గొడవ చేస్తుంటే పిల్లల్ని కూడ కొడతానంది.

‘ఇవ్వాళ అయిపోయాడ్రా అన్నయ్య ‘అనుకుంటూ.
మేమందరం చాలా ఉత్సాహంగా మా అన్నయ్య వస్తే జరగబోయే లైవ్ డ్రామా చూద్దామని అరుగు మీద ఆటలు మాని ఎదురుచూస్తున్నాం.

ఎనిమిదవుతుండగా వొచ్చాడు మా అన్నయ్య. వొస్తూనే మూలుగుతూ బయట వేసి ఉన్న మంచం మీద పడి పోయాడు. మా వదిన ఈ మూలుగులకి అర్థం ఏంటబ్బా ,ఎలా రియాక్ట్ అవ్వాలా అని చూస్తూ వుంది.

మా వదిన కి ఎక్కువ ఆలోచించే గాప్ ఇవ్వకుండా

“ ఏంటలా చూస్తావ్, వెళ్ళి దేవుడికి దణ్ణం పెట్టుకో, నీ మొగుడ్ని పోలీసులు జైల్లో పెట్టకుండా వదిలేసినందుకు.“

“ఏమయ్యిందండి” అని కంగారుగా మా వదిన దగ్గరికి రాబోతుంటే ఆపేసి
“ముందు దేవుడికి దీపారాధన చేసి, దణ్ణం పెట్టమన్నానా “ అంటూ, అరిచి, అరుపవగానే మళ్ళీ మూలుగులు మొదలెట్టాడు.

అయోమయంగా మా వదిన లోపలకెళ్ళి, ఏదో మొక్కుబడిగా నమస్కారం చేసి మళ్ళీ బయటకొచ్చింది.

“ఏమయ్యిందండి “ సగం ఏడుపు గొంతుతో.

“ ఏమవటమేంటే, నిన్ను ఎట్లాగైనా సినిమాకు తీసుకెళ్దామని మోపెడ్ మీద బయల్దేరానా, తొందర్లో రాంగ్ రూట్లో వొస్తుంటే పోలీసు అడ్డం పడ్డాడే, వాణ్ణి తప్పించుకోవటానికి స్పీడు పెంచి వొస్తుంటే, అపేసి కాళ్ళ మీద కొట్టాడు. పోలీస్ స్టేషన్ కి తీస్కెళ్ళి కేసు కూడా పెట్టబొతే, మన రామం వాళ్ళన్నయ్య అక్కడే వుండి బయట పడేశాడు.“

తన సినిమావల్లే మొగుడు కష్టాల పాలయ్యడన్న గిల్టీ ఫీలింగ్ బలంగా కలగజేసి,
మెల్లగా అనేవాడు
“ ఏమనుకోవద్దే, నిన్ను సినిమాకు తీస్కెళ్ళలేకపోయాను. ఛీ, పెళ్ళాం కోరిక తీర్చలేని దౌర్భ్యాగుణ్ణి“ అంటూ మా వదిన గిల్టీ ఫీలింగ్ ని ఇంకా పదింతలు చేశాడు.

” ఫర్వాలేదులేండి, క్షేమంగా ఇంటికొచ్చారు, అంతేచాలు. “ఏదీ దెబ్బ చూణ్ణివ్వండి” అంటూ కాలు పరీక్షించింది, ఆ పోలీసునెవరినో తిట్టి పోస్తూ.
కాలు మీద ఏ దెబ్బా కనపడలేదు.

ఎక్కడా దెబ్బ?
“పోలీసు దెబ్బలే! ఆనవాళ్ళు కనపడేలా కొడతారా .”

*******

మళ్ళా ఒక రోజు హడావుడిగా వొచ్చి బయల్దేరు, బయల్దేరు, మనం గుడికెళ్ళాలి అంటూ తొందర చేశాడు.

చేతిలో పని వొదిలించి, గుడి కి తీసుకెళ్ళాడు. ఎందుకండీ ఇప్పుడు గుడికి అంటే,

“అదేంటే పిచ్చి దానా, వచ్చే సోమ వారానికి, మన పెళ్ళయి పదేళ్ళవుతుందా, గుడికి వొస్తానని మొక్కుకున్నాను. ఆనాటికి నాకు ఆఫీసులో పై వాళ్ళూ వొస్తున్నారు. వెళ్ళటానికి అవుతుందో అవదో. ఇవ్వాళే వెళ్ళాలి. అన్నట్టు ఎర్ర చీర కట్టుకోవే.”

“మళ్ళీ అదేంటి, ఏం చీర కట్టుకుంటే ఏంటి?”

“కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఎరుపు ఇష్టమే, ఏమీ తెలియని వెర్రి బాగుల్దానివి, ఎట్టా బతుకుతావో ఏంటో?” అని జాలి కురిపించాడు.

తర్వాతి రోజు వొస్తూనే, “ఏమేవ్ ఇవ్వాళ ఓ విచిత్రం జరిగింది. మా ఆఫీసులో పని చేసే శకుంతల నిన్న నిన్నూ, నన్నూ గుడి దగ్గర చూసినట్టుంది. ఏమయ్యా సుబ్బా రావ్, ఎవర్నో పడుచు పిల్లని వెంటేసుకుని తిరుగుతున్నావ్. మీ ఆవిడతో చెప్పనా అని అడిగిందే.”

పడుచు పిల్ల అని పొగడ్త లభించిన సంతోషం లో మా వదిన, భూమికి ఒక అడుగు పైన నడుస్తూ,
“ఊరుకోండీ, నేను పడుచు పిల్లలా ఉండటమేంటి?” అడిగింది ఇంకొంచం పొగడ్తలు వినాలన్న ఆశ తో.

“ఆంజనేయుడి బలం ఆయనకే తెలీదంట. అట్లాగే, నీ అందం సంగతి నీకు తెలీదే, కళ్ళున్న వాడెవడైనా సరే, నీకు పెళ్ళయింది, ముగ్గురు పిల్లల తల్లివంటే నమ్ముతాడంటే. ఏదో ఈ సంసారాన్ని మోస్తూ జ్యోతిలా కరిగి పోతున్నావు గాని, సరిగా పోషణ చేసుకుంటే, నీ ముందు సినిమా హీరోయిన్లు బలాదూరు కాదంటే.”

“చాల్లెండి. మీరూ మీ అబధ్ధాలు. “

“ఏమనుకోకపోతే, ఒకటి చెప్తానే. నిజాలు మాట్టాడటం నా బలహీనత.”

మా అన్నయ్య చెప్పేవి నిజాలు కావని సాక్షాత్తూ, కన్యకా పరమేశ్వరి ,ఆమె గుడి పక్కనే ఉన్న వీనస్ టాకీస్ లో అన్నయ్య తో పాటు సినిమా చూసిన ఎర్ర చీర పడుచు పిల్ల, కలిసి వొచ్చి చెప్పినా నమ్మదు.

మా అన్నయ్య చేసిన ఆ కోర్స్ మీక్కూడా చెయ్యాలనుందా!

ఏంటీ, మీరు అంతకన్నా గొప్పగా మేనేజ్ చేస్తున్నారా. అయితే సరే.

Posted by rampee ( May 29 2011, 02:25:45 PM PDT ) Permalink Comments [0]

Calendar

RSS Feeds

Search

Links

Navigation

Referers