Wednesday March 14, 2007 నాలుగు రోజుల క్రితం 2007 క్రికెట్ వరల్డ్ కప్ మొదలయింది.
భారత్ మొదటి రౌండు ఆటలు:
మార్చి 17 : బంగ్లాదేశ్, ట్రినిడాడ్
మార్చి 19 : బెర్ముడా, ట్రినిడాడ్
మార్చి 23 : శ్రీలంకా, ట్రినిడాడ్
అనుభవము, ఆత్మవిశ్వాసము, ఉత్సాహమూ సమపాళ్లలో ఉన్న భారత్ కప్పు గెలిచే అవకాశాలు ఉన్నాయని నా భావన. గెలవాలని నా ఆశ ! :)
వరల్డ్ కప్ సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన క్రికెట్ వీడియోలు.
1)గవాస్కర్ తాను ఔటయ్యి, తన తోటి ఆటగాడిని కూడా వెనక్కు వచ్చేయమనటం. (1981)
http://www.youtube.com/watch?v=jrp53wKHgb0
2)న్యూజిలాండు గెలవకుండా నిలువరించడానికి ఆఖరు బంతిని నేలబారుగా వేసిన అప్పటి ఆస్ట్రేలియా!
http://www.youtube.com/watch?v=K65_spUU05s
3)కొన్ని రన్నౌట్లు:
చంద్రపాల్ : http://www.youtube.com/watch?v=36SLpqAymTE
మురళీధరన్ : http://www.youtube.com/watch?v=6zgvjC9WUCs
సెహ్వాగ్ : http://www.youtube.com/watch?v=he9p5ynLdwU
ఊతప్ప : http://www.youtube.com/watch?v=rntUtH8Dt8U
ఇంజమామ్ : http://www.youtube.com/watch?v=tMHpZpwvPdM
4)సరదా సరదా!
శ్రీశాంత్ : http://www.youtube.com/watch?v=FNW0WTWlKSA&NR
ఇంటర్మీడియట్లో తెలుగా? సంస్క్రతమా?
వారాంతంలో అమ్మతో ఫోన్లో మాటాడుతుంటే, ఇంటర్మీడియట్ చదువుతున్న మా బాబాయి కూతురు ప్రస్తావన వచ్చింది. తరువాత తనకి ఫోను చేసి, "మొదటి పరీక్ష ఏమిటని?" అడిగాను. "సంస్కృతం" అని జవాబు.
దాంతో, ఇప్పటికే ఎన్నోసార్లు, ఎందరో మేధావులు చితక్కొట్టి, ఉతికి ఆరేసిన ఆలోచన మెదిలింది. అదే, "ఇంటర్మీడియట్లో తెలుగు తీసుకోవాలా, సంస్కృతం తీసుకోవాలా" అని. నేను నూజివీడులో ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో సంస్క్రతం చెప్పే మేష్టారు లేకపోవటం చేత, ఏది తీసుకోవాలి అనే సందిగ్ధం లేకపోయింది. కానీ, హిందీ తీసుకుంటే ఇంకో నాలుగు మార్కులు ఎక్కువ వచ్చే అవకాశం ఉందని, ఇంట్లో "హిందీ తీసుకుంటా" అని ప్రస్తావన పెట్టాను. "ఠాఠ్! హిందీ కోర్సు ఈ సంవత్సరమే పెట్టారు. ఆ చెప్పే మేష్టారు ఎలా చెప్తారో తెలియదు. తెలుగు తీసుకో!" అని నాన్న హుకుంతో ఆ సందిగ్ధం కూడా లేకపోయింది.
నూటికి 90% పైన మార్కులు రావాలంటే సంస్క్రతం తీసుకోవడం తప్పనిసరి మరి. నేను సంస్కృతం, హిందీ, తెలుగు - వీటిలో దేనికీ వ్యతిరేకిని కాను. ఈ మూడూ కాకుండా ఫ్రెంచి లాంటివి తీసుకున్నవాళ్లు కూడా నాకు తెలుసు. కానీ మార్కుల విషయంలో సమతుల్యత ఉండాలన్నది నా వాదన. అప్పుడు మార్కుల బట్టీ భాషను ఎన్నుకునే సందిగ్ధం ఉండదు.
అందుకని, first-language మటుకూ percentage కాకుండా percentile గా మార్చాలని నా ప్రతిపాదన. అప్పుడు తెలుగులో నూటికి 85 మార్కులు వచ్చిన వ్యక్తి 99 percentile కావొచ్చు. సంస్కృతంలో 98 మార్కులు వచ్చిన వ్యక్తి ఆ భాషలో 99 percentile కావొచ్చు. హిందీలో 90 మర్కులకే 99 percentile ఉండొచ్చు. ఈ percentileనే percentage గా లెక్క వేస్తే పెద్ద నష్టం ఉండదని నా అభిప్రాయం.
ఇలాంటి ప్రతిపాదన ఇంతకు ముందే ఎవరైనా చేసారేమో, నాకు తెలియదు.
Posted by Murali ( Mar 05 2007, 03:16:13 PM EST ) Permalink Comments [3]ఉత్తమ తెలుగుబ్లాగర్ల ఎన్నిక - 2006 - ఫలితాలు
indibloggies వారు నిర్వహించిన బ్లాగర్ల పోటీల ఫలితాలు ప్రకటించారు .
విస్మయపరచిన తెలుగుబ్లాగరు ఎన్నిక-2005 కంటే ఈ ఏడాది ఎన్నిక బావుంది. ముందుగా తెలుగు విభాగంలో, మొదటి మూడు స్థానాల్లో వచ్చిన శోధన(29 ఓట్లు), హృదయం(28 ఓట్లు), కృష్ణదేవరాయలు(26 ఓట్లు), లకు అభినందనలు.
క్రిందటేడాది ఫలితాలతో చూస్తే, గత సంవత్సరం 9, 8, 7 ఓట్లకే మొదటి మూడు స్థానాలు లభించగా, ఈ ఏడాది 29, 28, 26 ఓట్లు వచ్చాయి. ఇది శుభసూచికం. ఉత్సాహంగా బ్లాగులు వ్రాసేవారితో పాటు చదివేవారు పెరిగారని, తద్వారా యూనికోడు వాడకం పెరుగుతోందనీ అర్థమవుతోంది.
కానీ హిందీ బ్లాగులలో మొదటి స్థానాలలో వచ్చిన వారికి 128, 40, 37 ఓట్లు వచ్చాయి. అలాగే ఇంగ్లీషులో వ్రాసేవారికి 381, 223, 91 వచ్చాయి. దీని బట్టీ మన తెలుగువారిలో బ్లాగులపై మరింత చైతన్యవంతులను చేయవలసిన అవసరం ఉన్నదని తెలుస్తోంది.
వేరువేరు సైట్లకు వెళ్లి బ్లాగులు చదవనక్కరలేకుండా అన్నింటినీ ఒకే చోట కూడగట్టే మంచి ప్రయత్నం కూడలి, తేనెగూడు సైట్లు చేస్తున్నాయి.
Posted by Murali ( Feb 23 2007, 01:40:32 PM EST ) Permalinkనేటి సినిమా పేర్లు చూస్తుంటే నవ్వాలో, ఏడవాలో తెలియని పరిస్థితి.
కాస్తోకూస్తో "చెడు" లక్షణాలు సినిమా పేర్లలో కనిపించటం ఎప్పటి నుంచో ఉంది. ఉదాహరణకి దొంగరాముడు, కిలాడి, మోసగాళ్లకు మోసగాడు, గూండా, రౌడీ వగైరా. ఎక్కడో చదివిన గుర్తు. "మంచి" అనేది తెలుపు రంగులాంటిది. నిర్మలంగా ఉంటుంది. కాని "చెడు" అనేది రకరకాల రంగులలో ఉంటుంది. అందుకే, మనం చెడ్డవాటికి ఆకర్షితులైనంతగా మంచి వాటికి కాలేము. మనవాళ్లు ఈ సూత్రాని ఎప్పుడో పట్టేసారు. ఒక్క "దొంగ" అనే విషయం తీసుకొని దొంగరాముడు, దొంగ, అడవిదొంగ, కొండవీటి దొంగ, టక్కరి దొంగ, అమ్మ దొంగ, దొంగాదొంగ, దొంగా దొంగది, దొంగ రాముడు అండ్ పార్టీ వగైరా వగైరా సినిమాలు తీసారంటే అర్థం చేసుకోవచ్చు. ఒక మూల పదం తీసుకొని దాన్ని అట్నుంచి ఇట్నుంచి చితక్కొట్టి కొత్త పేర్లు సృష్టించడం మన ఆనవాయితీ!
ఈ మధ్య "చెడు" కాకుండా "అసహ్యం" వేసే పదాలను సినిమా పేర్లగా పెట్టటం పరిపాటి అయ్యింది. పోకిరి, దేశముదురు వగైరా. ఈ సినిమాలు సూపర్ హిట్టని వేరే చెప్పక్కరలేదు కదా. ఎంత అసహ్యమైన పేరు పెడితే అంత హిట్టవుతుంది అనే భావన కనిపిస్తోంది. భవిష్యత్తులో ముదురు పోకిరి, ముదుర్లకు ముదురు వంటివి వచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదు.
నేనుకూడా కొన్ని సూపర్ హిట్టు సినిమా పేర్లు ఆలోచించాను. నా మూల పదం బేవార్స్. ఈ క్రింది పేరు పెట్టి ఏ సినిమా తీసినా సూపరు డూపరు హిట్టే!
1) బేవార్స్ (టాగ్ లైన్ - ఎంత బేవార్సో వీడికే తెలీదు)
2) నువ్వు బేవార్స్ - నేను బేవార్స్
3) బేవార్సులకి బేవార్స్
4) నేనే బేవార్స్
5) మా ఆవిడ మీదొట్టు మీ ఆవిడ బేవార్స్ (గొప్ప మహిళా చిత్రం)
6) ఒకే బేవార్స్ (అనువాద చిత్రం)
7) బేవార్సులౌదాం రా! (ప్రేమ కథా చిత్రం)
8) బేవార్స్ రాముడు (టాగ్ లైన్ - గొప్ప బేవార్సని వీడి ఫీలింగ్)
శెలవ్, ఇట్లు మీ బేవార్స్
Posted by Murali ( Feb 14 2007, 01:22:05 PM EST ) Permalink Comments [2]క్రిందటి నెలలో అనుకుంటా, దినపత్రికలలో ఒక వార్త వచ్చింది. ఈ మధ్యకాలంలో అమెరికా యూనివర్సిటీలలో దక్షిణ ఆసియా భాషలపై మక్కువ పెరిగిందని, చాలా మంది నేర్చేసుకుంటున్నారనీను. నిజానికి భారతీయభాషలలో కేవలం హిందీ, ఉర్దూ, కొండకచో బెంగాలీ,తమిళం నేర్పబడతాయి.
మరి తెలుగు ఎందుకు చెప్పరు?
ఒక అమెరికా యూనివర్సిటీలో విదేశీభాష నేర్పేందుకు ఏర్పాటు చేయాలంటే ఆ భాష మీద గవర్నమెంటుకు దయ ఉండాలి. అప్పుడే ఉపాధ్యాయులకు వేతనం, కోర్సుకు తగిన ఆర్ధిక సహాయం అందుతాయి.
అలా వీలుకాని పక్షంలో ఔత్సాహికులు పూనుకొని ఆర్ధిక వనరులు సమకూరుస్తారు. ఈ వనరులు తక్కువ మొత్తమేమీ కాదు. సుమారు 1 మిలియన్(10 లక్షలు) డాలర్లు యూనివర్సిటీకి ముందుగా అందజేయాలి.
సాహితీ.ఆర్గ్ పై లభ్యమయ్యే ఆంగ్ల-తెలుగు నిఘంటువులలో ఒకటి వ్రాసిన శ్రీ. వేమూరి వేంకటేశ్వరరావు గారు మరికొందరి సహాయంతో, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బెర్కిలీ లో ఈ బృహత్కార్యానికి నడుంకట్టారు. మొదటి విడతలో భాగంగా 2006 చివరికల్లా $200,000 డాలర్లు (2 లక్షలు) సమకూర్చాలని నిర్ణయించుకొన్నారు. ప్రస్తుతానికి $120,000 డాలర్లు జమ చేయగలిగారు. ఇంకా $80,000 కావలసి ఉంది.
తలా కొంచెం బరువు మోస్తే ఇది పెద్ద మొత్తమేమీ కాదు. మీరు తోటి బ్లాగరైతే తప్పక ఈ విషయాని మీ బ్లాగులో ప్రచురించి నలుగురికి ఈ అవసరం గురించి తెలియజేయగలరు. తృణమో పణమో ఈ సత్కార్యానికి తోచిన సాయం చేయగలరు. దీనిని సాయం అనకూడదేమోను. అలా పాలుపంచుకోవటం ప్రతిఒక్కరి ధర్మం.
Posted by Murali ( Dec 05 2006, 01:07:11 PM EST ) Permalink Comments [1]Windows XP + MS Office 2003 లో తెలుగు ఎలా?
ఇంటర్నెట్లో చాలా చోట్ల కంప్యూటర్లలో తెలుగు ఎలా వాడాలి అని ఉన్నా కూడా, ఇది కేవలం Windows XP జతలో ఎలా వాడాలి అని తెలియజెప్పే ప్రయత్నం.
నిన్న మా తెలుగు book-club సమావేశంలో మిత్రులు కోరికపై వ్రాయప్రయత్నం. ఈ సూచనలు అందరికీ వర్తించక పోవచ్చును.
చదవటం:
1) Control Panel > Regional and Language Options > Languages (tab) నకు వెళ్లాలి.
2) "Install files for Complex script and right-to-left languages (including Thai)" అనే option ఎంచుకోవాలి. OK చేయాలి.
3) కంప్యూటరు re-boot చేయాలి. ఇంతవరకూ చేస్తే తెలుగు చదవడానికి మీ కంప్యూటరు సిద్ధం.
వ్రాయటం:
4) మరలా Control Panel > Regional and Language Options > Languages (tab) నకు వెళ్లాలి.
5) "Text services and input languages" అన్న విభాగంలో "Details" ను క్లిక్ చేయాలి.
6) "Settings(tab)" > "Installed Services" విభాగంలో "Add.." ను క్లిక్ చేసి, "Add Input Language"లో "Telugu" ను ఎంచుకోండి. OK చేయాలి.
7) "Advanced(tab)" > "Compatibility Configuration" విభాగంలో "Extend support of advanced text services to all programs" ను ఎంచుకోవాలి. OK చేయాలి.
8) ఇంక వీలైనన్ని సార్లు OK చేసేయాలి. మరో సారి కంప్యూటరు re-boot చేయవలసి రావచ్చు.
9) కంప్యూటరు తెరచి taskbar దగ్గర, క్రొత్త icon, language-bar కనిపిస్తుంది. దానిలో "EN" ఎంచుకుంటే ఇంగ్లీషు, "TE" ఎంచుకుంటే తెలుగులోనూ టైపు చేయొచ్చు. ఇంతవరకూ చేస్తే తెలుగు వ్రాయడానికి మీ కంప్యూటరు సిద్ధం.
కంప్యూటరు సిద్ధమయింది సరే, ఎలా టైపు చేయాలి అనేది ఇంకెప్పుడైనా...
Posted by Murali ( Dec 04 2006, 11:57:19 AM EST ) Permalink Comments [1]
నూజివీడులో ఇరవైమంది దుర్మరణం "మాది నూజివీడు..విజయవాడ దగ్గర..50కి.మీ. దూరం" అంటూ ఎవరికైనా పరిచయం చేసుకోగానే,
"ఆఁ..విన్న పేరే..నూజివీడు రసాలు..మామిడికాయలకు ప్రసిద్ధి కదూ!" అంటూంటారు.
ఏ వార్తాపత్రిక చూసినా ఏమున్నాయి వార్తలు? దుర్మరణాలు, ప్రకృతి వైపరిత్యాలు, ఫ్యాక్షన్లు, హత్యలు,
మోసాలు వగైరా. సాథ్యమైనంత వరకూ నా బ్లాగులో ఆ విషయాలు ప్రస్తుతించకూడదనుకున్నాను. కానీ,
సొంత ఊళ్లో జరిగిన విషయం కదా, పంచుకోకుండా ఉండలేక పోయాను:
http://news.bbc.co.uk/1/hi/world/south_asia/4963172.stm
వేసవికాలం వచ్చిందంటే చాలు ఊరంతా సందడి సందడిగా ఉంటుంది. పెద్దపెద్ద గుట్టలు పోసి కాయలెక్క పెడుతూ
కమీషను కొట్లు, బుట్టలకొద్దీ మామిడి పళ్లు, వ్యాపారం/రవాణా హడావిడి, ఎంతో బాగుటుంది. అట్లాంటి సమయంలో
కాయతీసుకెళ్తున్న లారీకి ప్రమాదం జరిగి ఇరవైమంది వరకూ చనిపోవటం నిజంగా బాధాకరం.
Posted by Murali
( May 01 2006, 02:51:38 PM EDT )
Permalink
త్యాగరాజ ఆరాధన - 2006 నిన్ననో మొన్ననో 2005లో జరిగిన త్యాగరాజ ఆరాధన ఉత్సవాల గురించి వ్రాసినట్టుగా ఉంది. అప్పుడే గుడ్-ఫ్రైడే వారాంతం వచ్చేసింది. మళ్లీ వార్షిక క్లీవ్లాండ్ ఆరాధనోత్సవాలకు ప్రయాణానికి సన్నధం ఆయ్యాను.
సుభాన్ ఖాసిం బృందం నాదస్వర కచ్చేరి ఇంతకు ముందు ఎప్పుడూ చూసి ఎరుగను. మరొకటి ఎం.ఎస్.షీలా గాత్రకచ్చేరీ కూడా ఎప్పుడూ ప్రత్యక్ష్యంగా వినలేదు. ఈ రెండూ నాకు ఈ సంవత్సరం ప్రత్యేకం. సుధారఘునాథన్, రంజని-గాయత్రి, TM కృష్ణ, సంతానగోపాలన్ కచ్చేరీలు ఇంతకు ముందు ఒకటి రెండుసార్లు ప్రత్యక్ష్యంగా విన్నా, మళ్లా వినొచ్చు.
వీలయితే ఉత్సవాలు పూర్తయిన పిమ్మట వివరాలు, అభిప్రాయాలు వ్రాస్తాను.
Posted by Murali
( Apr 11 2006, 03:27:06 PM EDT )
Permalink
Comments [1]
హైదరాబాదుకు నాసిరకం ఫ్లైట్లు నిన్ననే హైదరాబాదు నుండి, రెండు వారాల ట్రిప్పు తరువాత, తిరిగివచ్చాను.
NW/KLM వారి ఫ్లైట్లులో వెళ్లాను. డిట్రాయిట్ - ఆంస్టర్డామ్ - హైదరాబాదు, ఇదీ ప్రయాణపు ప్లాను. ఇదివరకు బొంబాయి, మద్రాసు, ఢిల్లీ వగైరా "ప్రధాన" నగరాలలో దిగి తరువాత హైదరాబాదు వెళ్లవలసి వచ్చేది. ఇప్పుడు, ఎంచక్కా హైదరాబాదు వరకు వెళ్లిపోవచ్చు.
డిట్రాయిట్ - ఆంస్టర్డామ్ విమానం 2మ్మచ్ గా ఉంటుంది. ప్రతి సీటుకు సొంత టీవీ, క్రొత్త సీట్లు వగైరా సకల సౌకర్యాలతో ఉంటుంది. ఆంస్టర్డామ్ - హైదరాబాదు మధ్య నడిచే విమానం ఎంత ఘోరంగా ఉన్నదో చెప్పలేం. నిన్ననో మొన్ననో decommission చేసిన విమానాన్ని తిరిగి సర్వీసులో పెట్టినట్టుగా ఉంది. అక్కడక్కడా లీక్ అయ్యే ఏసీ, బయట ఇంజను హోరు, కంపుకొట్టే టాయిలెట్లు, విరిగిపోయిన సీట్లు వగైరా వగైరా.
వెళ్లేటప్పుడు ఫర్వాలేదు. తిరుగు ప్రయాణంలోనే వచ్చిపడ్డాయి నాకు చిక్కులు, చిరాకులు. హైదరాబాదు - ఆంస్టర్డామ్ విమానం తెల్లవారిజాము మూడు గంటలకు. నిద్రలేకుండా అర్థరాత్రి విమానాశ్రయానికి వెళ్తే, కుయ్యోమొర్రో అనుకుంటూ తె. 3:40కి బయలుదేరింది. నాకు కూర్చున్న 10ని.లకే నిద్రపట్టేసింది. మెళకువ వచ్చేసరికి అనౌన్సుమెంటు వినపడుతోంది. ఇంకొద్ది క్షణాల్లో దుబాయ్ లో దిగబోతున్నాము అనుకుంటూ. "ఇదేంట్రా బాబూ గొడవ! హైజాకింగు కాదు కదా!" అనుకున్నా. "We are dumping the fuel and starting the descent" అంటూ మళ్లీ పైలెట్ ప్రకటించాడు. పక్కనున్న అతన్ని అడిగా, "ఏంటి గురూ విషయం?" అని.
"కొన్ని సాంకేతిక కారణాల వలన విమానం కావలసిన అంత ఎత్తుకు ఎగురలేకపోయింది. అందుకునే ఆంస్టర్డామ్(8గం. ప్రయాణం) బదులు దుబాయకే(3గం. ప్రయాణం) లో దింపేస్తారట" అని శెలవిచ్చాడు. అసలు ఆకాశంలో ఎగిరి తాహతులేని విమానాలు హైదరాబాదుకు వేస్తున్నారంటే ఎంత నాసి రకంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. రేప్పొద్దున ఏదో పీకలమీదకొచ్చే విషయం వస్తే కానీ ఈ ఎయిర్లైస్సు వారు మంచి విమానాలు వేయరు కాబోలు.
సరే, దుబాయ్ లో దింపేసిన తరువాత ఈ 300-350 మందిని ఇతర విమానాల్లో సర్దే సరికి 7-8గం. పట్టింది. ప్రొద్దున 6:30గం. దుబాయ్ లో దిగినవాళ్లం సా. 2:45గం. లకు హోటలుకు వెళ్లాం. నేనూ, మరో డజను మంది కలసి హోటలు దగ్గరే తచ్చట్లాడుతున్న ఒక మళయాళీ టూర్ ఆపరేటరును పట్టుకొని సా.6-9 వరకు దుబాయ్ టూర్ చేసాము. మరలా ప్రయాణం మర్నాడు ప్రొద్దున 8:00గం. వెరసి, నాసిరకం విమానాల పుణ్యమా అని దుబాయిలో ఒక రోజు గడిపాను.
దుబాయినుంచి అమెరికాకు ఎమిరేట్స్ వారి విమానంలో వచ్చాను. టాయిలెట్లో ఎంచక్కా "టాయిలెట్ శుభ్రంగా ఉంచుటకు ఈ బటను నొక్కండి" అని హింది, బెంగాలీ, ఉర్దూ వగైరా మరో 6-7భాషలతో సహా, తెలుగులో కూడా వ్రాసుంది. అది నాకు నచ్చింది :)
ఎలాగోలా నేనయితే ఆన్ ఆర్బరు వచ్చి పడ్డాను కానీ నా సామాను ఇంకా ప్రపంచ విహారంలోనే ఉంది. ఎప్పుడొస్తుందో ఏమో?
Posted by Murali
( Apr 05 2006, 05:13:07 PM EDT )
Permalink
Comments [2]
సౌత్ అఫ్రికా మరపురాని గెలుపు! రెండురోజుల క్రిందట జోహాన్నస్-బర్గ్ లో సౌత్-ఆఫ్రికా(438) క్రికెట్ జట్టు, ఆస్ట్రేలియా(434) జట్టు పై మరపురాని
గెలుపు సాధించింది.
2003 ప్రపంచకప్పు ఫైనల్లో భారతజట్టును మట్టికరిపించినప్పటి నుంచి ఆస్ట్రేలియా అంటే ఏదో కసి!
క్రికెట్ రణరంగంలో ఎదురులేని సింహాలను మట్టికరిపించిన సౌత్ఆఫ్రికా జట్టు అంటే ప్రస్తుతం ఏదో
తెలియని ఆదరాభిమానం. ఈ మ్యాచ్ కూడా జోహాన్నస్-బర్గ్ లోనే జరగడం గమనించాల్సిన విషయం.
భారతజట్టు ఆడినవి తప్పించి తక్కిన జట్ల ఆటలు పెద్దగా పట్టించుకోను. ఏదో యథాలాపంగా
మొన్న భారత్-ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ స్కోరు కోసం చూస్తుండగా ఆస్ట్రేలియా 434 పరుగులు
చేసిందని వార్త. నేను చూసేప్పటికి సౌత్ఆఫ్రికా 30ఓవర్లలో సుమారు 280/2 స్కోరు ఉన్నది.
కాని వెనువెంటనే మరో రెండు వికెట్లు పడేసరికి "అయ్యో! ఈ ఆస్ట్రేలియాకు ఎదురులేదా?"
అనిపించింది.
కానీ సాయంకాలం ఇంటర్నెట్లో చూసాను కదా, సౌత్ఆఫ్రికా విజయం. ఆశ్చర్యం! ఆనందం! ఇంకా ఏదో తెలియని భావం.
సింహలను ఎదిరించే మత్తేభాలను పరికించిన తృప్తి కావొచ్చు.:)
Posted by Murali
( Mar 13 2006, 01:38:00 PM EST )
Permalink
Comments [1]
మథురానగరిలో కార్ణాటక సంగీతంలో వర్ణం, పదం, కృతి, జావళి, తత్వం, థిల్లానా వంటి పెక్కు ప్రక్రియలు ఉన్నాయి.
జావళీలలో సాథారణంగా శృంగార రసం ప్రథానంగా కనిపిస్తుంది. భక్తి రసం కూడా పక్కనే ఉంటుంది.
ఈ మధ్యన "మథురానగరిలో" అంటూ మొదలయ్యే జావళి ఇంటర్నెట్లో చూసాను. అర్థం కావాలంటూ
ఎవరో తమిళులు ఒక ఫోరంలో పోస్టు చేసారు. దాంట్లో ఉన్న సరళమైన తెలుగు నా దృష్టిని ఆకర్షించింది.
ఇప్పటివరకు "మథురానగరిలో" అంటే ఏదో సినిమా పేరు లాగానే తెలుసు. పాతతరం వారికి బాగాపరిచయం
ఉన్న జావళి అనుకుంటాను. లేకపోతే సినిమాకు పెట్టరుకదా. ఇలాంటి జావళి గురించి మనకు ఇన్నాళ్లూ పరిచయం
కలగలేదే అనిపించింది.
ఇదీ పూర్తి జావళి:
పల్లవి: మధురానగరిలో చల్లనమ్మపోదు దారివిడుము కృష్ణా! కృష్ణా!
అనుపల్లవి: మాపటివేళకు తప్పక వచ్చెద, పట్టకు కొంగు గట్టిగాను కృష్ణా! కృష్ణా!
చరణం 1: అత్తచూసిన నన్ను ఆగడి చేయును ఆగడమేలరా అందగాడా కృష్ణా!
చరణం 2: కొసరి కొసరి నాతో సరసములాడకు, రాజమార్గము విడుము కృష్ణా! కృష్ణా!
విరజవనితలు నను చేరాబోదురిక, విడువిడు నా చేయి కృష్ణా! కృష్ణా!
రచన: చిత్తూరు సుబ్రహ్మణ్య పిళ్లై
రాగం: ఆనందభైరవి
తరువాత ఇంట్లో నా దగ్గర ఉన్న పాటల్లో వెతికాను. అదృష్టం కొద్దీ కీ.శే. మహారజపురం సంతానం
గానం చేసినది ఉన్నది. విన్నాను. గత వారంలో ఒక పది సార్లయినా వినుంటాను. ఇంతకాలం ఈ
అనుభూతి మిస్సయ్యాననిపించింది.
నా దగ్గర ఉన్న దాంట్లో మొదటి చరణం పాడలేదు. వీలయితే ఎక్కడైనా దొరకబుచ్చుకొని తప్పకుండా వినండి.
బహుశా ఏదైనా సినిమాలో ఉన్నదేమో కూడాను. నాకు తెలియదు మరి.
Posted by Murali
( Feb 11 2006, 12:21:32 AM EST )
Permalink
విలోమ కావ్యం క్రిందటి వారం ఆంధ్రమహాభారతం గూగుల్ గ్రూప్
లో మొదటిసారిగా మిత్రులు పోస్టుచేయగా చూసాను. బాగుందనుకున్నాను.
వారంతంలో మరో స్నేహితుడు ఈమెయిల్ ద్వారా forward చేసాడు. ఆదివారంకల్లా రచ్చబండ యాహూగ్రూపులో కూడా ప్రత్యక్ష్యమయ్యింది.
ఇక లాభంలేదు బ్లాగులోకి ఎక్కించవలసిందే అని నిర్ణయించుకున్నాను.
ఏమిటయ్యా కథ అంటే (కథ కాదు లెండి..పద్యం):
తాం భూసుతా ముక్తి ముదారహాసం, వందేయతో లవ్య భవం దయాశ్రీ
అర్థం: దరహాసం(ముదారహాసం) చిందించే లవుని ప్రేమించే దయగల లక్ష్మియైన (దయాశ్రీ) ఆ సీతను(భూసుతా) నమస్కరించుచున్నాను(వందేయ).
దీనినే అటునిటుగా తిరగేసి వ్రాస్తే:
శ్రీయాదవం భవ్యలతోయ దేవం, సంహారదా ముక్తి ముతా సుభూతాం
అర్థం: మంగళప్రదమైన ఆకర్షణగలవాడైన కృష్ణుని(శ్రీయాదవం) గీతబోధ చెడును సంహరిస్తూ(సంహారదా) ప్రాణప్రదమైనది(సుభూతాం).
మొదటి నుంచి చివరకు రామాయణంలాగ చదివించి, వెనకకు చదివితే కృష్ణుని భారతంలా అర్థమిచ్చే రామకృష్ణవిలోమ కావ్యం లోనిది. మొత్తం
నలభై పద్యాలూ అలాగే ఉంటాయి.
Posted by Murali
( Feb 06 2006, 02:06:04 PM EST )
Permalink
గ్రామీణ/రైతు సూచనా కేంద్రము భారతదేశం పల్లెల్లో 50వేల ఇంటర్నెట్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రకటించింది.
దృష్టి, జై కిసాన్, n-Logue
ప్రభుత్వేతర సంస్థలతో కలసి ఈ బృహత్కార్యానికి నడుంకట్టినట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది.
50,000 ఇంటర్నెట్ సెంటర్లు ఏర్పాటుకు పెట్టుబడి చేయాలన్నా, ఒక లాభసాటిగా మారే వరకూ వేచిఉండే సహనం
కావలన్నా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అగ్రగామి సంస్థ మైక్రోసాఫ్ట్-కే సాథ్యం.
రాజకీయ నాయకులలాగా కేవలం పత్రికా ప్రకటనలు, పునాదిరాళ్లు, గాల్లో మేడలు కాకుండా ప్రగతి కూడా కనబడుతోంది.
జైకిసాన్ వారు ఔత్సాహికులకు రుణ సౌకర్యం
కలిగిస్తోంది. n-Logue వారు ఈ సెంటర్లకు అవసరమైన corDECT టెక్నాలజీని అందజేస్తున్నారు.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో వచ్చిన మార్పులు చిన్నచిన్న ఊర్లలో ఉన్నవారికి సైతం ఉపయోగపడుతూండడం
ఎంతయినా ఆనందం కలిగించే విషయం. ఈ ప్రయోగం ఫలించాలని, లాభసాటిగా ఉండాలని తద్వారా
ఎంతో మందికి ఉపాధి దొరకాలని ఆశిద్దాం.
నా అంచనా ప్రకారం, గూగుల్ వంటి కంపెనీలు కూడా మరో ఒకటి-రెండేళ్లలో దేశీయభాషల టెక్నాలజీతో భారతదేశంలోకి
చొచ్చుకొని రావొచ్చు. మైక్రోసాఫ్ట్ ఎత్తులు పోటీదారులు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.
Posted by Murali
( Feb 02 2006, 11:41:02 AM EST )
Permalink
Comments [1]
హీరో చిరంజీవికి పద్మభూషణ్ నిన్న రాత్రి సుమారు 9:30 ప్రాంతంలో మా బాబాయి కూతురు ఫోను చేసింది, "చిరూకి పద్మభూషణ్ ప్రకటించార"నుకుంటూ.
చిరంజీవికి ఉన్న అభిమానుల్లో నేనూ ఒకణ్ణి.
చిన్నప్పుడు చిరంజీవి సినిమా వస్తే చాలు, ఇంట్లో ఎలా ఒప్పించాలా అని ఉండేది. మూడు/నాలుగో క్లాసు నుంచే నేను, మా అన్నయ్య
మా బావ కలిసి చిరంజీవి సినిమా తప్పకుండా చూసేవాళ్లం. ఆరో క్లాసు నుంచి చుట్టుపక్కనున్న పిల్లగ్యాంగుతో వెళ్లేవాళ్లం.
సినిమా విడుదలైన రెండుమూడు నెలలకు కానీ నూజివీడు వచ్చేవి కాదు. స్వయం కృషి, పసివాడి ప్రాణం ఒకేసారి పక్కపక్క థియేటర్లు "ద్వారకా",
"సత్యన్నారాయణ"లో వచ్చాయి. పసివాడి ప్రాణం సినిమాలో ఫైట్లూ, స్టెప్సూ ఉన్నాయని ఫ్రెండ్స్ ద్వారా రిపోర్టు వచ్చింది. పసివాడిప్రాణం చూడాలని కోరిక.
మా మామ్మ, పక్కింటి బామ్మగారూ కలిసి స్వయంకృషి సినిమాకు వెళ్తున్నారు. తోడుకోసం నన్ను కూడా తీసుకొని
వెళ్లారు. పక్కథియేటర్లో పసివాడిప్రాణం పోస్టరు కనపడుతూంటే స్వయంకృషి సినిమాకు వెళ్లటానికి ఎంత గిలగిల్లాడానో నాకు మాత్రమే తెలుసు. :)
సినిమాహాల్లో రెండో వరసలో కూర్చొని "మహానగరంలో మాయగాడు(1984)"
చూసినా, సెలవలకు బాబాయి వాళ్లింటికి వెళ్లి "రుస్తుం(1984)"
సినిమా చూడాలని పట్టుబట్టినా, విజయవాడలో విపరీతమైన రద్దీలో "యముడికి
మొగుడు(1988)" టికెట్టు సంపాదించినా, ఒక్కొక్క సినిమా ఒక్కో ఙ్ఞాపకం. చిత్రలహరిలో చిరంజీవి పాట వేస్తే ఎంత ఆనందమో. అసలు చిరంజీవి
లాగా ఫాస్టుగా స్టెప్సు వేయగలిగింది హీరోయిన్ "రాధ" మాత్రమే అని ఎన్నిసార్లు స్కూల్లో సీరియస్ చర్చో చెప్పలేం. కొన్ని విషయాలు గుర్తొస్తే ఇంత
పెంకిగా,అల్లరిగా ప్రవర్తించేవాళ్లమా అనిపిస్తుంది. మళ్లీ "ఆ..చిన్నతనం కదా" అని సరిపెట్టేసుకుంటాం.
అంతెందుకు, మొన్నటికిమొన్న "జై చిరంజీవ" సినిమా వచ్చిందంటే టింగుటింగు మనుకుంటూ పోయి చూసివచ్చాను. సినిమా ఎలా ఉన్నదో
అన్నయ్యతోనూ, బాబాయి కూతురుతోనూ ఫోనులో డిస్కషను. ఏమిటో ఈ సినిమా పిచ్చి అనిపించినా, "ఆ..చిరంజీవి సినిమా కదా" అని
సరిపెట్టేసుకుంటాను.
అసలు గత రెండేళ్లుగా చిరంజీవిని, అభిమానులను పద్మ అవార్డు ఊరిస్తున్నది. చిరుకి అవార్డు వస్తే అభిమానులకు వచ్చినట్టే కదా.
కంగ్రాట్యులేషన్స్ చిరూ!
Posted by Murali
( Jan 26 2006, 09:37:31 AM EST )
Permalink
విస్మయపరచిన తెలుగుబ్లాగర్ల ఎన్నిక డిసెంబరులో మొదలైన దేశీయ బ్లాగర్ల పోటీ సంగతి విదితమే.
ఈ వారంలో ఫలితాలు వచ్చాయి. దేశీయబ్లాగర్ల కేటగిరీలో indiauncut.blogspot.com బ్లాగు అత్యుత్తమ
బ్లాగుగా ఎన్నుకోబడినది. పూర్తి వివరాలకు ఇక్కడ http://indibloggies.org/results-2005 చూడండి.
తెలుగుబ్లాగర్ల కేటగిరీలో amazingtelugus.blogspot.comకు
అత్యుత్తమ బ్లాగుగా ఎన్నుకున్నారు. నాకు మటుకూ హృదయపూర్వకంగా "అభినందనలు" తెలియజేయలేకపోతున్నాను. క్షమించాలి.
ఎప్పుడో ఒకటి రెండు సార్లు ఆ బ్లాగు చూసిన గుర్తు. వివిధ రంగాలలో పేరు ప్రఖ్యాతులు గడించిన 15-20మంది తెలుగువారి గురించి వ్రాసారు. మంచి ప్రయత్నం. ఏదో పుస్తకంలో చూచి వ్రాసినట్టున్నారు. కానీ తెలుగు నుడికారంలేదు. అంతా ఇంగ్లీషులో వ్రాసారు.
నా ఉద్దేశంలో ఏదైనా ఒక విషయంపై హృదయంలోంచి వచ్చే ప్రతిస్పందనకు అక్షర రూపమే ఒక మంచి బ్లాగు! ఆ ప్రతిస్పందన ఒక నిష్టూరం కావొచ్చు, వ్యంగ్యం, హాస్యం, కోపం, ఆక్రోశం, పాఠం, సరదా, సలహా వగైరా ఏదైనా కావొచ్చు. ప్రతిస్పందన కాకపోయె కనీసం ఒక ప్రతిబింబమయినా కావొచ్చు. రూపం ఏదైనా, అలాటి బ్లాగులు తెలుగులో చాలా లేక పోయినా పదో ఇరవయ్యో ఉన్నాయి. వాటినన్నిటినీ త్రోసిరాజని కేవలం పుస్తకం లో చూచి నాలుగు ముక్కలు వ్రాసిన వారిని ఎన్నుకోవటం సబబా అని ఆలోచించాల్సిన విషయం.
కనీసం వచ్చే ఏడాది, తెలుగు కేటగిరీలో తెలుగు బ్లాగును ఎన్నుకుంటారని ఆశిస్తున్నాను.
Posted by Murali
( Jan 18 2006, 11:08:21 AM EST )
Permalink
Comments [1]