Murali's Telugu Blog

All | General | Status | Java | Music | Politics
20061205 Tuesday December 05, 2006

బెర్కిలీలో తెలుగు బోధన

క్రిందటి నెలలో అనుకుంటా, దినపత్రికలలో ఒక వార్త వచ్చింది. ఈ మధ్యకాలంలో అమెరికా యూనివర్సిటీలలో దక్షిణ ఆసియా భాషలపై మక్కువ పెరిగిందని, చాలా మంది నేర్చేసుకుంటున్నారనీను. నిజానికి భారతీయభాషలలో కేవలం హిందీ, ఉర్దూ, కొండకచో బెంగాలీ,తమిళం నేర్పబడతాయి.

మరి తెలుగు ఎందుకు చెప్పరు?

ఒక అమెరికా యూనివర్సిటీలో విదేశీభాష నేర్పేందుకు ఏర్పాటు చేయాలంటే ఆ భాష మీద గవర్నమెంటుకు దయ ఉండాలి. అప్పుడే ఉపాధ్యాయులకు వేతనం, కోర్సుకు తగిన ఆర్ధిక సహాయం అందుతాయి.

అలా వీలుకాని పక్షంలో ఔత్సాహికులు పూనుకొని ఆర్ధిక వనరులు సమకూరుస్తారు. ఈ వనరులు తక్కువ మొత్తమేమీ కాదు. సుమారు 1 మిలియన్(10 లక్షలు) డాలర్లు యూనివర్సిటీకి ముందుగా అందజేయాలి.

సాహితీ.ఆర్గ్ పై లభ్యమయ్యే ఆంగ్ల-తెలుగు నిఘంటువులలో ఒకటి వ్రాసిన శ్రీ. వేమూరి వేంకటేశ్వరరావు గారు మరికొందరి సహాయంతో, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బెర్కిలీ లో ఈ బృహత్కార్యానికి నడుంకట్టారు. మొదటి విడతలో భాగంగా 2006 చివరికల్లా $200,000 డాలర్లు (2 లక్షలు) సమకూర్చాలని నిర్ణయించుకొన్నారు. ప్రస్తుతానికి $120,000 డాలర్లు జమ చేయగలిగారు. ఇంకా $80,000 కావలసి ఉంది.

తలా కొంచెం బరువు మోస్తే ఇది పెద్ద మొత్తమేమీ కాదు. మీరు తోటి బ్లాగరైతే తప్పక ఈ విషయాని మీ బ్లాగులో ప్రచురించి నలుగురికి ఈ అవసరం గురించి తెలియజేయగలరు. తృణమో పణమో ఈ సత్కార్యానికి తోచిన సాయం చేయగలరు. దీనిని సాయం అనకూడదేమోను. అలా పాలుపంచుకోవటం ప్రతిఒక్కరి ధర్మం.

Posted by Murali ( Dec 05 2006, 01:07:11 PM EST ) Permalink Comments [1]

20061204 Monday December 04, 2006

Windows XP + MS Office 2003 లో తెలుగు ఎలా?

ఇంటర్నెట్లో చాలా చోట్ల కంప్యూటర్లలో తెలుగు ఎలా వాడాలి అని ఉన్నా కూడా, ఇది కేవలం Windows XP జతలో ఎలా వాడాలి అని తెలియజెప్పే ప్రయత్నం.

నిన్న మా తెలుగు book-club సమావేశంలో మిత్రులు కోరికపై వ్రాయప్రయత్నం. ఈ సూచనలు అందరికీ వర్తించక పోవచ్చును.

చదవటం:
1) Control Panel > Regional and Language Options > Languages (tab) నకు వెళ్లాలి.
2) "Install files for Complex script and right-to-left languages (including Thai)" అనే option ఎంచుకోవాలి. OK చేయాలి.
3) కంప్యూటరు re-boot చేయాలి. ఇంతవరకూ చేస్తే తెలుగు చదవడానికి మీ కంప్యూటరు సిద్ధం.

వ్రాయటం:
4) మరలా Control Panel > Regional and Language Options > Languages (tab) నకు వెళ్లాలి.
5) "Text services and input languages" అన్న విభాగంలో "Details" ను క్లిక్ చేయాలి.
6) "Settings(tab)" > "Installed Services" విభాగంలో "Add.." ను క్లిక్ చేసి, "Add Input Language"లో "Telugu" ను ఎంచుకోండి. OK చేయాలి.
7) "Advanced(tab)" > "Compatibility Configuration" విభాగంలో "Extend support of advanced text services to all programs" ను ఎంచుకోవాలి. OK చేయాలి.
8) ఇంక వీలైనన్ని సార్లు OK చేసేయాలి. మరో సారి కంప్యూటరు re-boot చేయవలసి రావచ్చు.
9) కంప్యూటరు తెరచి taskbar దగ్గర, క్రొత్త icon, language-bar కనిపిస్తుంది. దానిలో "EN" ఎంచుకుంటే ఇంగ్లీషు, "TE" ఎంచుకుంటే తెలుగులోనూ టైపు చేయొచ్చు. ఇంతవరకూ చేస్తే తెలుగు వ్రాయడానికి మీ కంప్యూటరు సిద్ధం.

కంప్యూటరు సిద్ధమయింది సరే, ఎలా టైపు చేయాలి అనేది ఇంకెప్పుడైనా...

Posted by Murali ( Dec 04 2006, 11:57:19 AM EST ) Permalink Comments [1]

20060501 Monday May 01, 2006

నూజివీడులో ఇరవైమంది దుర్మరణం "మాది నూజివీడు..విజయవాడ దగ్గర..50కి.మీ. దూరం" అంటూ ఎవరికైనా పరిచయం చేసుకోగానే, "ఆఁ..విన్న పేరే..నూజివీడు రసాలు..మామిడికాయలకు ప్రసిద్ధి కదూ!" అంటూంటారు.

ఏ వార్తాపత్రిక చూసినా ఏమున్నాయి వార్తలు? దుర్మరణాలు, ప్రకృతి వైపరిత్యాలు, ఫ్యాక్షన్లు, హత్యలు, మోసాలు వగైరా. సాథ్యమైనంత వరకూ నా బ్లాగులో ఆ విషయాలు ప్రస్తుతించకూడదనుకున్నాను. కానీ, సొంత ఊళ్లో జరిగిన విషయం కదా, పంచుకోకుండా ఉండలేక పోయాను: http://news.bbc.co.uk/1/hi/world/south_asia/4963172.stm

వేసవికాలం వచ్చిందంటే చాలు ఊరంతా సందడి సందడిగా ఉంటుంది. పెద్దపెద్ద గుట్టలు పోసి కాయలెక్క పెడుతూ కమీషను కొట్లు, బుట్టలకొద్దీ మామిడి పళ్లు, వ్యాపారం/రవాణా హడావిడి, ఎంతో బాగుటుంది. అట్లాంటి సమయంలో కాయతీసుకెళ్తున్న లారీకి ప్రమాదం జరిగి ఇరవైమంది వరకూ చనిపోవటం నిజంగా బాధాకరం.

Posted by Murali ( May 01 2006, 02:51:38 PM EDT ) Permalink

20060411 Tuesday April 11, 2006

త్యాగరాజ ఆరాధన - 2006 నిన్ననో మొన్ననో 2005లో జరిగిన త్యాగరాజ ఆరాధన ఉత్సవాల గురించి వ్రాసినట్టుగా ఉంది. అప్పుడే గుడ్-ఫ్రైడే వారాంతం వచ్చేసింది. మళ్లీ వార్షిక క్లీవ్లాండ్ ఆరాధనోత్సవాలకు ప్రయాణానికి సన్నధం ఆయ్యాను.

సుభాన్ ఖాసిం బృందం నాదస్వర కచ్చేరి ఇంతకు ముందు ఎప్పుడూ చూసి ఎరుగను. మరొకటి ఎం.ఎస్.షీలా గాత్రకచ్చేరీ కూడా ఎప్పుడూ ప్రత్యక్ష్యంగా వినలేదు. ఈ రెండూ నాకు ఈ సంవత్సరం ప్రత్యేకం. సుధారఘునాథన్, రంజని-గాయత్రి, TM కృష్ణ, సంతానగోపాలన్ కచ్చేరీలు ఇంతకు ముందు ఒకటి రెండుసార్లు ప్రత్యక్ష్యంగా విన్నా, మళ్లా వినొచ్చు.

వీలయితే ఉత్సవాలు పూర్తయిన పిమ్మట వివరాలు, అభిప్రాయాలు వ్రాస్తాను.

Posted by Murali ( Apr 11 2006, 03:27:06 PM EDT ) Permalink Comments [1]

20060405 Wednesday April 05, 2006

హైదరాబాదుకు నాసిరకం ఫ్లైట్లు నిన్ననే హైదరాబాదు నుండి, రెండు వారాల ట్రిప్పు తరువాత, తిరిగివచ్చాను.

NW/KLM వారి ఫ్లైట్లులో వెళ్లాను. డిట్రాయిట్ - ఆంస్టర్డామ్ - హైదరాబాదు, ఇదీ ప్రయాణపు ప్లాను. ఇదివరకు బొంబాయి, మద్రాసు, ఢిల్లీ వగైరా "ప్రధాన" నగరాలలో దిగి తరువాత హైదరాబాదు వెళ్లవలసి వచ్చేది. ఇప్పుడు, ఎంచక్కా హైదరాబాదు వరకు వెళ్లిపోవచ్చు.

డిట్రాయిట్ - ఆంస్టర్డామ్ విమానం 2మ్మచ్ గా ఉంటుంది. ప్రతి సీటుకు సొంత టీవీ, క్రొత్త సీట్లు వగైరా సకల సౌకర్యాలతో ఉంటుంది. ఆంస్టర్డామ్ - హైదరాబాదు మధ్య నడిచే విమానం ఎంత ఘోరంగా ఉన్నదో చెప్పలేం. నిన్ననో మొన్ననో decommission చేసిన విమానాన్ని తిరిగి సర్వీసులో పెట్టినట్టుగా ఉంది. అక్కడక్కడా లీక్ అయ్యే ఏసీ, బయట ఇంజను హోరు, కంపుకొట్టే టాయిలెట్లు, విరిగిపోయిన సీట్లు వగైరా వగైరా.

వెళ్లేటప్పుడు ఫర్వాలేదు. తిరుగు ప్రయాణంలోనే వచ్చిపడ్డాయి నాకు చిక్కులు, చిరాకులు. హైదరాబాదు - ఆంస్టర్డామ్ విమానం తెల్లవారిజాము మూడు గంటలకు. నిద్రలేకుండా అర్థరాత్రి విమానాశ్రయానికి వెళ్తే, కుయ్యోమొర్రో అనుకుంటూ తె. 3:40కి బయలుదేరింది. నాకు కూర్చున్న 10ని.లకే నిద్రపట్టేసింది. మెళకువ వచ్చేసరికి అనౌన్సుమెంటు వినపడుతోంది. ఇంకొద్ది క్షణాల్లో దుబాయ్ లో దిగబోతున్నాము అనుకుంటూ. "ఇదేంట్రా బాబూ గొడవ! హైజాకింగు కాదు కదా!" అనుకున్నా. "We are dumping the fuel and starting the descent" అంటూ మళ్లీ పైలెట్ ప్రకటించాడు. పక్కనున్న అతన్ని అడిగా, "ఏంటి గురూ విషయం?" అని.

"కొన్ని సాంకేతిక కారణాల వలన విమానం కావలసిన అంత ఎత్తుకు ఎగురలేకపోయింది. అందుకునే ఆంస్టర్డామ్(8గం. ప్రయాణం) బదులు దుబాయకే(3గం. ప్రయాణం) లో దింపేస్తారట" అని శెలవిచ్చాడు. అసలు ఆకాశంలో ఎగిరి తాహతులేని విమానాలు హైదరాబాదుకు వేస్తున్నారంటే ఎంత నాసి రకంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. రేప్పొద్దున ఏదో పీకలమీదకొచ్చే విషయం వస్తే కానీ ఈ ఎయిర్లైస్సు వారు మంచి విమానాలు వేయరు కాబోలు.

సరే, దుబాయ్ లో దింపేసిన తరువాత ఈ 300-350 మందిని ఇతర విమానాల్లో సర్దే సరికి 7-8గం. పట్టింది. ప్రొద్దున 6:30గం. దుబాయ్ లో దిగినవాళ్లం సా. 2:45గం. లకు హోటలుకు వెళ్లాం. నేనూ, మరో డజను మంది కలసి హోటలు దగ్గరే తచ్చట్లాడుతున్న ఒక మళయాళీ టూర్ ఆపరేటరును పట్టుకొని సా.6-9 వరకు దుబాయ్ టూర్ చేసాము. మరలా ప్రయాణం మర్నాడు ప్రొద్దున 8:00గం. వెరసి, నాసిరకం విమానాల పుణ్యమా అని దుబాయిలో ఒక రోజు గడిపాను.

దుబాయినుంచి అమెరికాకు ఎమిరేట్స్ వారి విమానంలో వచ్చాను. టాయిలెట్లో ఎంచక్కా "టాయిలెట్ శుభ్రంగా ఉంచుటకు ఈ బటను నొక్కండి" అని హింది, బెంగాలీ, ఉర్దూ వగైరా మరో 6-7భాషలతో సహా, తెలుగులో కూడా వ్రాసుంది. అది నాకు నచ్చింది :)

ఎలాగోలా నేనయితే ఆన్ ఆర్బరు వచ్చి పడ్డాను కానీ నా సామాను ఇంకా ప్రపంచ విహారంలోనే ఉంది. ఎప్పుడొస్తుందో ఏమో?

Posted by Murali ( Apr 05 2006, 05:13:07 PM EDT ) Permalink Comments [2]

20060313 Monday March 13, 2006

సౌత్ అఫ్రికా మరపురాని గెలుపు! రెండురోజుల క్రిందట జోహాన్నస్-బర్గ్ లో సౌత్-ఆఫ్రికా(438) క్రికెట్ జట్టు, ఆస్ట్రేలియా(434) జట్టు పై మరపురాని గెలుపు సాధించింది.

2003 ప్రపంచకప్పు ఫైనల్లో భారతజట్టును మట్టికరిపించినప్పటి నుంచి ఆస్ట్రేలియా అంటే ఏదో కసి! క్రికెట్ రణరంగంలో ఎదురులేని సింహాలను మట్టికరిపించిన సౌత్ఆఫ్రికా జట్టు అంటే ప్రస్తుతం ఏదో తెలియని ఆదరాభిమానం. ఈ మ్యాచ్ కూడా జోహాన్నస్-బర్గ్ లోనే జరగడం గమనించాల్సిన విషయం.

భారతజట్టు ఆడినవి తప్పించి తక్కిన జట్ల ఆటలు పెద్దగా పట్టించుకోను. ఏదో యథాలాపంగా మొన్న భారత్-ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ స్కోరు కోసం చూస్తుండగా ఆస్ట్రేలియా 434 పరుగులు చేసిందని వార్త. నేను చూసేప్పటికి సౌత్ఆఫ్రికా 30ఓవర్లలో సుమారు 280/2 స్కోరు ఉన్నది. కాని వెనువెంటనే మరో రెండు వికెట్లు పడేసరికి "అయ్యో! ఈ ఆస్ట్రేలియాకు ఎదురులేదా?" అనిపించింది.

కానీ సాయంకాలం ఇంటర్నెట్లో చూసాను కదా, సౌత్ఆఫ్రికా విజయం. ఆశ్చర్యం! ఆనందం! ఇంకా ఏదో తెలియని భావం. సింహలను ఎదిరించే మత్తేభాలను పరికించిన తృప్తి కావొచ్చు.:)

Posted by Murali ( Mar 13 2006, 01:38:00 PM EST ) Permalink Comments [1]

20060211 Saturday February 11, 2006

మథురానగరిలో కార్ణాటక సంగీతంలో వర్ణం, పదం, కృతి, జావళి, తత్వం, థిల్లానా వంటి పెక్కు ప్రక్రియలు ఉన్నాయి. జావళీలలో సాథారణంగా శృంగార రసం ప్రథానంగా కనిపిస్తుంది. భక్తి రసం కూడా పక్కనే ఉంటుంది.

ఈ మధ్యన "మథురానగరిలో" అంటూ మొదలయ్యే జావళి ఇంటర్నెట్లో చూసాను. అర్థం కావాలంటూ ఎవరో తమిళులు ఒక ఫోరంలో పోస్టు చేసారు. దాంట్లో ఉన్న సరళమైన తెలుగు నా దృష్టిని ఆకర్షించింది. ఇప్పటివరకు "మథురానగరిలో" అంటే ఏదో సినిమా పేరు లాగానే తెలుసు. పాతతరం వారికి బాగాపరిచయం ఉన్న జావళి అనుకుంటాను. లేకపోతే సినిమాకు పెట్టరుకదా. ఇలాంటి జావళి గురించి మనకు ఇన్నాళ్లూ పరిచయం కలగలేదే అనిపించింది.

ఇదీ పూర్తి జావళి:

పల్లవి: మధురానగరిలో చల్లనమ్మపోదు దారివిడుము కృష్ణా! కృష్ణా!
అనుపల్లవి: మాపటివేళకు తప్పక వచ్చెద, పట్టకు కొంగు గట్టిగాను కృష్ణా! కృష్ణా!
చరణం 1: అత్తచూసిన నన్ను ఆగడి చేయును ఆగడమేలరా అందగాడా కృష్ణా!
చరణం 2: కొసరి కొసరి నాతో సరసములాడకు, రాజమార్గము విడుము కృష్ణా! కృష్ణా!
విరజవనితలు నను చేరాబోదురిక, విడువిడు నా చేయి కృష్ణా! కృష్ణా!

రచన: చిత్తూరు సుబ్రహ్మణ్య పిళ్లై
రాగం: ఆనందభైరవి

తరువాత ఇంట్లో నా దగ్గర ఉన్న పాటల్లో వెతికాను. అదృష్టం కొద్దీ కీ.శే. మహారజపురం సంతానం గానం చేసినది ఉన్నది. విన్నాను. గత వారంలో ఒక పది సార్లయినా వినుంటాను. ఇంతకాలం ఈ అనుభూతి మిస్సయ్యాననిపించింది.

నా దగ్గర ఉన్న దాంట్లో మొదటి చరణం పాడలేదు. వీలయితే ఎక్కడైనా దొరకబుచ్చుకొని తప్పకుండా వినండి. బహుశా ఏదైనా సినిమాలో ఉన్నదేమో కూడాను. నాకు తెలియదు మరి.
Posted by Murali ( Feb 11 2006, 12:21:32 AM EST ) Permalink

20060206 Monday February 06, 2006

విలోమ కావ్యం క్రిందటి వారం ఆంధ్రమహాభారతం గూగుల్ గ్రూప్ లో మొదటిసారిగా మిత్రులు పోస్టుచేయగా చూసాను. బాగుందనుకున్నాను.

వారంతంలో మరో స్నేహితుడు ఈమెయిల్ ద్వారా forward చేసాడు. ఆదివారంకల్లా రచ్చబండ యాహూగ్రూపులో కూడా ప్రత్యక్ష్యమయ్యింది. ఇక లాభంలేదు బ్లాగులోకి ఎక్కించవలసిందే అని నిర్ణయించుకున్నాను.

ఏమిటయ్యా కథ అంటే (కథ కాదు లెండి..పద్యం):

తాం భూసుతా ముక్తి ముదారహాసం, వందేయతో లవ్య భవం దయాశ్రీ
అర్థం: దరహాసం(ముదారహాసం) చిందించే లవుని ప్రేమించే దయగల లక్ష్మియైన (దయాశ్రీ) ఆ సీతను(భూసుతా) నమస్కరించుచున్నాను(వందేయ).

దీనినే అటునిటుగా తిరగేసి వ్రాస్తే:
శ్రీయాదవం భవ్యలతోయ దేవం, సంహారదా ముక్తి ముతా సుభూతాం
అర్థం: మంగళప్రదమైన ఆకర్షణగలవాడైన కృష్ణుని(శ్రీయాదవం) గీతబోధ చెడును సంహరిస్తూ(సంహారదా) ప్రాణప్రదమైనది(సుభూతాం).

మొదటి నుంచి చివరకు రామాయణంలాగ చదివించి, వెనకకు చదివితే కృష్ణుని భారతంలా అర్థమిచ్చే రామకృష్ణవిలోమ కావ్యం లోనిది. మొత్తం నలభై పద్యాలూ అలాగే ఉంటాయి. Posted by Murali ( Feb 06 2006, 02:06:04 PM EST ) Permalink

20060202 Thursday February 02, 2006

గ్రామీణ/రైతు సూచనా కేంద్రము భారతదేశం పల్లెల్లో 50వేల ఇంటర్నెట్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రకటించింది.

దృష్టి, జై కిసాన్, n-Logue ప్రభుత్వేతర సంస్థలతో కలసి ఈ బృహత్కార్యానికి నడుంకట్టినట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది.

50,000 ఇంటర్నెట్ సెంటర్లు ఏర్పాటుకు పెట్టుబడి చేయాలన్నా, ఒక లాభసాటిగా మారే వరకూ వేచిఉండే సహనం కావలన్నా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అగ్రగామి సంస్థ మైక్రోసాఫ్ట్-కే సాథ్యం.

రాజకీయ నాయకులలాగా కేవలం పత్రికా ప్రకటనలు, పునాదిరాళ్లు, గాల్లో మేడలు కాకుండా ప్రగతి కూడా కనబడుతోంది. జైకిసాన్ వారు ఔత్సాహికులకు రుణ సౌకర్యం కలిగిస్తోంది. n-Logue వారు ఈ సెంటర్లకు అవసరమైన corDECT టెక్నాలజీని అందజేస్తున్నారు.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో వచ్చిన మార్పులు చిన్నచిన్న ఊర్లలో ఉన్నవారికి సైతం ఉపయోగపడుతూండడం ఎంతయినా ఆనందం కలిగించే విషయం. ఈ ప్రయోగం ఫలించాలని, లాభసాటిగా ఉండాలని తద్వారా ఎంతో మందికి ఉపాధి దొరకాలని ఆశిద్దాం.

నా అంచనా ప్రకారం, గూగుల్ వంటి కంపెనీలు కూడా మరో ఒకటి-రెండేళ్లలో దేశీయభాషల టెక్నాలజీతో భారతదేశంలోకి చొచ్చుకొని రావొచ్చు. మైక్రోసాఫ్ట్ ఎత్తులు పోటీదారులు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

Posted by Murali ( Feb 02 2006, 11:41:02 AM EST ) Permalink Comments [1]

20060126 Thursday January 26, 2006

హీరో చిరంజీవికి పద్మభూషణ్ నిన్న రాత్రి సుమారు 9:30 ప్రాంతంలో మా బాబాయి కూతురు ఫోను చేసింది, "చిరూకి పద్మభూషణ్ ప్రకటించార"నుకుంటూ.

చిరంజీవికి ఉన్న అభిమానుల్లో నేనూ ఒకణ్ణి. చిన్నప్పుడు చిరంజీవి సినిమా వస్తే చాలు, ఇంట్లో ఎలా ఒప్పించాలా అని ఉండేది. మూడు/నాలుగో క్లాసు నుంచే నేను, మా అన్నయ్య మా బావ కలిసి చిరంజీవి సినిమా తప్పకుండా చూసేవాళ్లం. ఆరో క్లాసు నుంచి చుట్టుపక్కనున్న పిల్లగ్యాంగుతో వెళ్లేవాళ్లం.

సినిమా విడుదలైన రెండుమూడు నెలలకు కానీ నూజివీడు వచ్చేవి కాదు. స్వయం కృషి, పసివాడి ప్రాణం ఒకేసారి పక్కపక్క థియేటర్లు "ద్వారకా", "సత్యన్నారాయణ"లో వచ్చాయి. పసివాడి ప్రాణం సినిమాలో ఫైట్లూ, స్టెప్సూ ఉన్నాయని ఫ్రెండ్స్ ద్వారా రిపోర్టు వచ్చింది. పసివాడిప్రాణం చూడాలని కోరిక. మా మామ్మ, పక్కింటి బామ్మగారూ కలిసి స్వయంకృషి సినిమాకు వెళ్తున్నారు. తోడుకోసం నన్ను కూడా తీసుకొని వెళ్లారు. పక్కథియేటర్లో పసివాడిప్రాణం పోస్టరు కనపడుతూంటే స్వయంకృషి సినిమాకు వెళ్లటానికి ఎంత గిలగిల్లాడానో నాకు మాత్రమే తెలుసు. :)

సినిమాహాల్లో రెండో వరసలో కూర్చొని "మహానగరంలో మాయగాడు(1984)" చూసినా, సెలవలకు బాబాయి వాళ్లింటికి వెళ్లి "రుస్తుం(1984)" సినిమా చూడాలని పట్టుబట్టినా, విజయవాడలో విపరీతమైన రద్దీలో "యముడికి మొగుడు(1988)" టికెట్టు సంపాదించినా, ఒక్కొక్క సినిమా ఒక్కో ఙ్ఞాపకం. చిత్రలహరిలో చిరంజీవి పాట వేస్తే ఎంత ఆనందమో. అసలు చిరంజీవి లాగా ఫాస్టుగా స్టెప్సు వేయగలిగింది హీరోయిన్ "రాధ" మాత్రమే అని ఎన్నిసార్లు స్కూల్లో సీరియస్ చర్చో చెప్పలేం. కొన్ని విషయాలు గుర్తొస్తే ఇంత పెంకిగా,అల్లరిగా ప్రవర్తించేవాళ్లమా అనిపిస్తుంది. మళ్లీ "ఆ..చిన్నతనం కదా" అని సరిపెట్టేసుకుంటాం.

అంతెందుకు, మొన్నటికిమొన్న "జై చిరంజీవ" సినిమా వచ్చిందంటే టింగుటింగు మనుకుంటూ పోయి చూసివచ్చాను. సినిమా ఎలా ఉన్నదో అన్నయ్యతోనూ, బాబాయి కూతురుతోనూ ఫోనులో డిస్కషను. ఏమిటో ఈ సినిమా పిచ్చి అనిపించినా, "ఆ..చిరంజీవి సినిమా కదా" అని సరిపెట్టేసుకుంటాను.

అసలు గత రెండేళ్లుగా చిరంజీవిని, అభిమానులను పద్మ అవార్డు ఊరిస్తున్నది. చిరుకి అవార్డు వస్తే అభిమానులకు వచ్చినట్టే కదా.

కంగ్రాట్యులేషన్స్ చిరూ!

Posted by Murali ( Jan 26 2006, 09:37:31 AM EST ) Permalink

20060118 Wednesday January 18, 2006

విస్మయపరచిన తెలుగుబ్లాగర్ల ఎన్నిక డిసెంబరులో మొదలైన దేశీయ బ్లాగర్ల పోటీ సంగతి విదితమే.

ఈ వారంలో ఫలితాలు వచ్చాయి. దేశీయబ్లాగర్ల కేటగిరీలో indiauncut.blogspot.com బ్లాగు అత్యుత్తమ బ్లాగుగా ఎన్నుకోబడినది. పూర్తి వివరాలకు ఇక్కడ http://indibloggies.org/results-2005 చూడండి.

తెలుగుబ్లాగర్ల కేటగిరీలో amazingtelugus.blogspot.comకు అత్యుత్తమ బ్లాగుగా ఎన్నుకున్నారు. నాకు మటుకూ హృదయపూర్వకంగా "అభినందనలు" తెలియజేయలేకపోతున్నాను. క్షమించాలి.

ఎప్పుడో ఒకటి రెండు సార్లు ఆ బ్లాగు చూసిన గుర్తు. వివిధ రంగాలలో పేరు ప్రఖ్యాతులు గడించిన 15-20మంది తెలుగువారి గురించి వ్రాసారు. మంచి ప్రయత్నం. ఏదో పుస్తకంలో చూచి వ్రాసినట్టున్నారు. కానీ తెలుగు నుడికారంలేదు. అంతా ఇంగ్లీషులో వ్రాసారు.

నా ఉద్దేశంలో ఏదైనా ఒక విషయంపై హృదయంలోంచి వచ్చే ప్రతిస్పందనకు అక్షర రూపమే ఒక మంచి బ్లాగు! ఆ ప్రతిస్పందన ఒక నిష్టూరం కావొచ్చు, వ్యంగ్యం, హాస్యం, కోపం, ఆక్రోశం, పాఠం, సరదా, సలహా వగైరా ఏదైనా కావొచ్చు. ప్రతిస్పందన కాకపోయె కనీసం ఒక ప్రతిబింబమయినా కావొచ్చు. రూపం ఏదైనా, అలాటి బ్లాగులు తెలుగులో చాలా లేక పోయినా పదో ఇరవయ్యో ఉన్నాయి. వాటినన్నిటినీ త్రోసిరాజని కేవలం పుస్తకం లో చూచి నాలుగు ముక్కలు వ్రాసిన వారిని ఎన్నుకోవటం సబబా అని ఆలోచించాల్సిన విషయం.

కనీసం వచ్చే ఏడాది, తెలుగు కేటగిరీలో తెలుగు బ్లాగును ఎన్నుకుంటారని ఆశిస్తున్నాను.

Posted by Murali ( Jan 18 2006, 11:08:21 AM EST ) Permalink Comments [1]

20060112 Thursday January 12, 2006

సంక్రాంతి "విష్యూ హ్యాపీ పొంగల్, మాయ్యా!!", "సంక్రాంతి శుభాకాంక్షలు!" వగైరా వగైరా అంటూ స్నేహితులనుంచీ, చుట్టాల నుంచీ ఈ-మెయిల్సు. ఇంకే ముంది, మీ అభిమాన హీరో, ఫలానా బొంబాయి హీరోయిన్ నటించిన సినిమా సంక్రాంతికి సిద్ధం అంటూ ఇంటర్నెట్లో సినిమా సైట్ల హోరు! ప్రతి తెలుగు సైట్లోనూ ఏదో ఒక మూల చిన్నదో-పెద్దదో ఒక చుక్కల ముగ్గు! ఆహా ఎంత ఆనంద సమయం అనిపిస్తుంది.

నాకు మటుకూ సంక్రాంతి అంటే కష్టాలే గుర్తొస్తాయి. "సంక్రాంతి కష్టాలా? పండగ కదా, క్రొత్త బట్టలూ, చుట్టాలు, పక్కాలూ అంతా సంతోషమే కదా!" అనుకుంటారేమో. చెప్తాను. ఈ కష్టాలన్నీ మగపిల్లలకు మాత్రమే వర్తిస్తాయి. ముఖ్యంగా ఇంట్లో ఆడపిల్లలు ఉంటే మరీ వర్తిస్తాయి.

కష్టం నెం 1: చలి కాలం. ఎంచక్కా ముసుగు తన్ని పడుకుందాం అనిపిస్తుంది. "ఒరేయ్, లే." అంటూ సుప్రభాతం పిలుపు. "వెళ్లి ఆ ముగ్గమ్మాయిని పిల్చుకురా" అంటూ ఆర్డరు. ఇంటి ముందుకొచ్చి "ముగ్గమ్మా! ముగ్గూ" అని అరచినప్పుడు తీసుకోవచ్చు కదా. తీసుకోరు. ఆ ముగ్గమ్మాయి రెండు వీధులు దాటి వెళ్ళిపోయిన తరువాత ఇంట్లో ముగ్గులేదని గుర్తొస్తుంది. స్కూలు నుంచి రాగానే ఆడుకోవటాని వెళ్లనీకుండా, "ఒరేయ్, ఆ ముగ్గు తెల్లగా లేదురా. మరకు వెళ్లి ఈ బియ్యం పట్టించుకురా. దాంట్లో కలపాలి" అంటారు. పని మీద పని ఈజీక్వల్టూ కష్టం మీద కష్టం. ఇంతా కష్టపడతామా, "ఏమిటీ ఇంత బరగ్గా ఉంది" లేదా "మరీ ఇంత మెత్తగా" ఉందనో కామెంటు. మనకు 2మ్మచ్ చిరాకేస్తుంది.

కష్టం నెం 2: గొబ్బెమ్మలు. స్వాతిముత్యం సినిమాలోలాగా పక్కింటి వాళ్ల గొబ్బెమ్మలు మనం తీసేసుకోకూడదు కదా. తీసేసుకున్నా వాళ్లు ఊరుకోరు. "ఎలాగూ లేచావు కదా, వెళ్లి ఆ పాలమ్మాయి ఇంటికి వెళ్లి ఆవుపేడ తీసుకురా. ఆ పాత పెయింటు డబ్బా పట్టుకెళ్లు" అంటూ మరో పని. ఆ నింగి విరిగి మీద పడితే ఎంత హాయి ఉండునో అనిపిస్తుంది. సరేలే, గబగబా సైకిలు మీద వెళ్లి ఆ పేడ తెచ్చేద్దామంటే "చిన్నపిల్లాళ్లు సైకిలేమిటి? నడిచి వెళ్లిరా. దగ్గరే కదా" అంటారు. మనం ఆ చిల్లుపడ్డ పెయింటు డబ్బానో ఏదో పట్టుకొని వెళ్లుంటే వీథిలో అందరికీ ఫలనా వారి అబ్బాయి పేడ కోసం వెళ్లున్నాడని తెలిసిపోతుంది. ముగ్గులు పెట్టే మిషతో మనల్ను చూట్టనికే అందరూ వీథిలో చేరారా అనిపిస్తుంది. ఇంట్లో దించిన తల మళ్లీ ఇంటికి వచ్చేక కానీ ఎత్తకూడదు. ఎత్తామా, మన ఫ్రెండుగాడెవడో కనపడతాడు, "అరే, వీడు పొద్దున పేడకోసం వెళ్తూ కనపడ్డాడురా" అంటూ మిగతావాళ్లకు చెప్తాడేమోనని మనకు వారం రోజులపాటు గుబులు. ఇంతా ధైర్యం చేసి వెళ్లామా, "మా ఆవు ఇంకా పేడ వేయలేదమ్మా. మళ్లీ రా!" అంటారు. అప్పుడు భూమి చీలిపోయి భూదేవి సీతమ్మ వారిని తనతో పాటూ తీసుకువెళ్లిపోయే, లవకుశ సినిమా క్లైమాక్సు గుర్తొస్తుంది.

కష్టం నెం 3: బొమ్మలకొలువు. బొమ్మలు పెట్టుకొని పేరంటాలు చేసుకొనేది ఇంట్లో ఆడపిల్లలే. అయినా, అటక మీద నుంచి, ఆ బూజు పట్టిన స్టోరేజీ నుంచి బొమ్మల పెట్టెలు బయటకు తీసి, వాటిని శుభ్రం చేసే కష్టం మగపిల్లలదే. కొన్ని బొమ్మలేమో సుద్దలతో చేయబడి మరీ నాజూగ్గా ఉంటాయి. అవి కానీ అటోఇటో అయితే మనకు మళ్లీ తిట్లు. పని ప్లస్ తిట్లు ఈజీక్వల్టూ కష్టం మీద కష్టం. ఆ బొమ్మలు కొలువున్నన్నాళ్లూ ఇంట్లో హంసనడకలు ప్రాక్టీసు చేయాలి. పరిగెట్టి బొమ్మల మీద పడితే మళ్లీ కష్టం కదా!

కష్టం నెం 4: వేణ్ణీళ్లు. చలి కాలం కదా. స్నానానికి వేణ్ణీళ్లు తప్పనిసరి. గ్యాసు ఖరీదు కదా. వేణ్నీళ్లకు వాడకూడదు. దొడ్లోనేమో బోలెడు మొక్కలు, చెట్లు. చలికాలంలో అవి పొయ్యిలోకి ఇంధనంగా మారిపోతాయి. "పేడక్కడ పెట్టి, ఈ పొయ్యి చూడు" అంటూ మరో కష్టం. అమెరికాలో అయితే పిల్లలను, గంటకు కనీసం రెండొందల సార్లు "థాంక్యూ హనీ!", "గ్రేట్ జాబ్", "ఐయాం ప్రౌడాఫ్యూ", "యూ ఆర్ మై సన్-షైన్" అంటారు. మన దేశంలో మాత్రం కష్టం మీద కష్టం. "ఉఫ్..ఉఫ్" అనుకుంటూ గొట్టంలోకు ఊదుతూ కాగు నిండా నీళ్లు కాయాలి. చుట్టాలొస్తే నాలుగైదు కాగులు కాయాలి. మన ఇంధనం పచ్చిగా ఉందా, మనం చచ్చామే. అది మండి చావదు కానీ మన కళ్లకు పొగ పరమై కన్నీళ్లు ఆదేశమవుతయి.

కష్టం నెం 5: తల స్నానం. పండగ రోజున వంటి నిండా నూనె రాసుకొని నలుగు పెట్టుకోవాలి. అదో కష్టం. వేణ్ణీళ్ల కష్టం ముందే చెప్పాను కదా. కుంకుడుకాయలు కొట్టుకోవాలి. అది ఇంకో కష్టం. వీటితో తలస్నానం. అది కష్టం టు ద పవర్ ఆఫ్ కష్టం. ఎంత గట్టిగా కళ్లు మూసుకున్నా ఆ చేదు రసం నోట్లోకీ, కళ్లల్లోకీ పోవటం ఖాయం. తరువాత ఆ మంట పోవటానికి నోట్లో ఉప్పు రాయి, మరో కష్టం.

కష్టం నెం 6: భోగి పళ్లు. ఊహ తెలియనంత కాలం ఫర్వాలేదు కానీ కాస్త ఊహ తెలిసిన తరువాత, పెద్దవాళ్లను ఎలా ఎదిరించాలో తెలిసే లోపల ఒక మూడు-నాలుగేళ్లు మహా ఇబ్బందిగా, కష్టంగా ఉంటూంది. ఇంట్లో ఉన్న ముగ్గురు పిల్లలనూ కూర్చోపెట్టి చుట్టు పక్కల ఉన్న పిల్లల్నీ, వాళ్ల తల్లుల్నీ పోగేసి మన తలమీద బంతి రెక్కలూ, రేగి పళ్లూ, చిల్లరా కలిపి పోస్తే ఎవరికి మటుకూ కష్టంగా ఉండదూ? పెద్దవాళ్లు మాత్రం మహా సంబర పడిపోతారు. పెద్దలకు సంబరం ఈజీక్వల్టూ మగపిల్లలకు కష్టం మీద కష్టం.

ఇందు మూలంగా "పెద్ద పండగ"గా చెలామణీ అయ్యే ఈ సంక్రాంతి కష్టాల పుట్ట అని నా అభిప్రాయం. అయినా మీ పొంగు చల్లార్చే పాపం నాకెందుకు. మీకు కూడా "విష్యూ హ్యాపీ సంక్రాంతి!". పాలు పొంగినట్టుగా మీ జీవితాలలో సుఖ సంతోషాలు వెల్లి విరియాలని కోరుకుంటున్నాను. ఈ బ్లాగు చదివినా, ఇతరులు చదవగా మీరు విన్నా బోలెడు పుణ్యం దక్కు గాక! పది మందితో పంచుకుంటే పది జన్మల పుణ్యం దక్కుగాక! :)

Posted by Murali ( Jan 12 2006, 01:59:41 PM EST ) Permalink

20060106 Friday January 06, 2006

మరల తెలుపనా.. ప్రవాసంలో ఉంటూ తెలుగు పుస్తకాలు, పత్రికలూ భారతదేశం నుంచి తెప్పించుకోవాలనే కోరిక, ఆసక్తి ఉన్నవారికి లాభాపేక్షలేకుండా సేవ చేస్తున్న సైటు తెలుపు.కాం

తెలుగు-పుస్తకాలు నుంచి "తెలుపు" గా పుట్టిన సైటు 1998 నుంచి ఆన్-లైన్లో ఉన్నది. కానీ చాలా మందికి ఈ సైటు గురించి తెలియదేమో కూడా. అందుకే ఈ "మరలా తెలుపనా.." అంటూ పరిచయం.

ఎటువంటి హంగులూ లేకుండా, కావలసిన సమాచారాన్ని అందుబాటులో ఉంచుతున్నారు. చందమామ, బుజ్జాయి వంటి పిల్లల పుస్తకాలు, స్వాతి వగైరా మాస పత్రికలూ వార్షికచందా కట్టి తెప్పించుకోవచ్చు. చందాలు పెద్ద ఎక్కువేం కాదు. కొన్నింటి వార్షికచందా ఇద్దరు మనుషులు కలసి ఒక చెత్త తెలుగు సినిమా, ధియేటర్లో చూసిన దానికన్నా చవకే! :)

ఇది వరకూ ఈ సైటు తెలుగును ఇంగ్లీషు script, తిక్కన ఫాంటు లో ఉండేది. ఈ మధ్యనే యూనీకోడ్లో మారుస్తున్నాట్లుగా ఉన్నారు. ఎంచక్కా తెలుగులో చూడముచ్చటగా ఉంది. నమూనాగా పెట్టిన వేమన పద్యాలు, పిల్లల కధలూ బావున్నాయి.

keywords: chandamama, bommarillu, swathi, weekly, magazine, subscription, telupu, telugu, books, buy

Posted by Murali ( Jan 06 2006, 11:43:18 AM EST ) Permalink Comments [2]

20051222 Thursday December 22, 2005

దేశీయ బ్లాగర్లకు పోటీ! భారత బ్లాగర్లను ఉత్సాహపరిచే సదుద్దేశంతో, సత్సంకల్పంతో http://www.indibloggies.org వారు పోటీ నిర్వహిస్తున్నారు. బ్లాగుర్లు ఎవరికి వారే నమోదు చేసుకోవాలి. పోటీకి రకరకాల కేటగిరీలు ఉన్నాయి. కావాలనుకుంటే ప్రతీ కేటగిరీలోనూ పోటీ చేయొచ్చు.

పోటీలో నమోదు చేసుకొనే విధానం, ముక్కు ఎక్కడరా అంటే తిప్పి చూపించినట్టుంటుంది. ఈ విధంగా చేయాలి:
1) http://del.icio.us/ కు వెళ్లి అకౌంటు తెరవండి.
2) "post" మీద క్లిక్ చేసి మీ బ్లాగు అడ్రస్సు వ్రాసి "save" చేయండి.
3) కానీ వెబ్సైటు "save" చేయకుండా మరిన్ని వివరాలు "Description", "notes", "tags" అడుగుతుంది. "notes" ఖాళీగా ఉంచినా ఫర్వాలేదు. "tags" అన్నచోట "for:indibloggies ib05Indic ib05Telugu" అని టైపు చేసి "save" చేయండి.
4) అంతే, ఆటోమేటిగ్గా మీ బ్లాగు పోటీ కోసం నమోదు చేయబడుతుంది.

నేను కూడా పోటీకి నమోదు చేసాను. నెట్ మిత్రుడు చావాకిరణ్ ఉత్తమ తెలుగుబ్లాగరుకు రూ. 1000 (వెయ్యి రూపాయలు) బహుమతిగా ప్రకటించారు. ప్రస్తుతం తెలుగు బ్లాగర్లు ఎక్కువమంది లేని కారణంగా, నాలాంటి ఉత్తుత్తి బ్లాగరుకు బహుమతి వచ్చినా ఆశ్చర్యంలేదు. కానీ ఈ పోటీ బహుమతుల కోసం కాదు, తోటి బ్లాగర్లను ఒక చోట చేర్చే భగీరథ ప్రయత్నం.

ఆంతర్యం:
పోటీ నిర్వహించేది indibloggies.org వారయితే, ఇంకెక్కడికో పోయి http://del.icio.us/లో నమోదు చేసుకోమంటారేమిటి? తలతిక్క వ్యవహారంలా ఉందే అనిపించింది.

http://del.icio.us/ సైటు, నిజానికి, ఒక సామూహిక "bookmarks" సైటు. మన "bookmarks"ను స్నేహితులతోనూ, ఇతరులతోనూ పంచుకోవచ్చన్న మాట. పోటీ నిర్వహించేవారు "indibloggies" పేరుతో del.icio.usపై నమోదు అయినారు. అందుకని "for:indibloggies ib05Indic ib05Telugu" అని "tags" వ్రాసినందువలన, మన సైటును "indibloggies" అనే వారితో "ib05Indic ib05Telugu" కేటగిరీలలో పంచుకొన్నట్లు లెక్క. Posted by Murali ( Dec 22 2005, 09:53:12 AM EST ) Permalink

20051221 Wednesday December 21, 2005

TeluguToolbar1.2 క్రిందటి వారం అనుకుంటా మిత్రులు రవి ఫోను చేసారు, ఫైర్-ఫాక్స్ వె1.5 లో telugutoolbar పని చేయటంలేదంటూ. దాన్ని సరిచేసి అప్లోడ్ చేయాలంటే mozdev.org వారి CVS సర్వరు డౌన్ అయి ఉంది. మొత్తనికి నిన్న కుదిరింది.

FireFox 1.5 బ్రౌజర్లో తెలుగు-టూల్బార్ ప్లగిన్ వెర్షను 1.2 సిద్ధం.

ఈ టూల్-బార్ గొడవ ఏమిటో తెలియకపోతే ఇక్కడ చూడండి. Posted by Murali ( Dec 21 2005, 10:25:33 AM EST ) Permalink Comments [1]

Calendar

RSS Feeds

Search

Links

Navigation

Referers