Saturday February 11, 2006
మథురానగరిలో కార్ణాటక సంగీతంలో వర్ణం, పదం, కృతి, జావళి, తత్వం, థిల్లానా వంటి పెక్కు ప్రక్రియలు ఉన్నాయి.
జావళీలలో సాథారణంగా శృంగార రసం ప్రథానంగా కనిపిస్తుంది. భక్తి రసం కూడా పక్కనే ఉంటుంది.
ఈ మధ్యన "మథురానగరిలో" అంటూ మొదలయ్యే జావళి ఇంటర్నెట్లో చూసాను. అర్థం కావాలంటూ
ఎవరో తమిళులు ఒక ఫోరంలో పోస్టు చేసారు. దాంట్లో ఉన్న సరళమైన తెలుగు నా దృష్టిని ఆకర్షించింది.
ఇప్పటివరకు "మథురానగరిలో" అంటే ఏదో సినిమా పేరు లాగానే తెలుసు. పాతతరం వారికి బాగాపరిచయం
ఉన్న జావళి అనుకుంటాను. లేకపోతే సినిమాకు పెట్టరుకదా. ఇలాంటి జావళి గురించి మనకు ఇన్నాళ్లూ పరిచయం
కలగలేదే అనిపించింది.
ఇదీ పూర్తి జావళి:
పల్లవి: మధురానగరిలో చల్లనమ్మపోదు దారివిడుము కృష్ణా! కృష్ణా!
అనుపల్లవి: మాపటివేళకు తప్పక వచ్చెద, పట్టకు కొంగు గట్టిగాను కృష్ణా! కృష్ణా!
చరణం 1: అత్తచూసిన నన్ను ఆగడి చేయును ఆగడమేలరా అందగాడా కృష్ణా!
చరణం 2: కొసరి కొసరి నాతో సరసములాడకు, రాజమార్గము విడుము కృష్ణా! కృష్ణా!
విరజవనితలు నను చేరాబోదురిక, విడువిడు నా చేయి కృష్ణా! కృష్ణా!
రచన: చిత్తూరు సుబ్రహ్మణ్య పిళ్లై
రాగం: ఆనందభైరవి
తరువాత ఇంట్లో నా దగ్గర ఉన్న పాటల్లో వెతికాను. అదృష్టం కొద్దీ కీ.శే. మహారజపురం సంతానం
గానం చేసినది ఉన్నది. విన్నాను. గత వారంలో ఒక పది సార్లయినా వినుంటాను. ఇంతకాలం ఈ
అనుభూతి మిస్సయ్యాననిపించింది.
నా దగ్గర ఉన్న దాంట్లో మొదటి చరణం పాడలేదు. వీలయితే ఎక్కడైనా దొరకబుచ్చుకొని తప్పకుండా వినండి.
బహుశా ఏదైనా సినిమాలో ఉన్నదేమో కూడాను. నాకు తెలియదు మరి.
Posted by Murali
( Feb 11 2006, 12:21:32 AM EST )
Permalink
విలోమ కావ్యం క్రిందటి వారం ఆంధ్రమహాభారతం గూగుల్ గ్రూప్
లో మొదటిసారిగా మిత్రులు పోస్టుచేయగా చూసాను. బాగుందనుకున్నాను.
వారంతంలో మరో స్నేహితుడు ఈమెయిల్ ద్వారా forward చేసాడు. ఆదివారంకల్లా రచ్చబండ యాహూగ్రూపులో కూడా ప్రత్యక్ష్యమయ్యింది.
ఇక లాభంలేదు బ్లాగులోకి ఎక్కించవలసిందే అని నిర్ణయించుకున్నాను.
ఏమిటయ్యా కథ అంటే (కథ కాదు లెండి..పద్యం):
తాం భూసుతా ముక్తి ముదారహాసం, వందేయతో లవ్య భవం దయాశ్రీ
అర్థం: దరహాసం(ముదారహాసం) చిందించే లవుని ప్రేమించే దయగల లక్ష్మియైన (దయాశ్రీ) ఆ సీతను(భూసుతా) నమస్కరించుచున్నాను(వందేయ).
దీనినే అటునిటుగా తిరగేసి వ్రాస్తే:
శ్రీయాదవం భవ్యలతోయ దేవం, సంహారదా ముక్తి ముతా సుభూతాం
అర్థం: మంగళప్రదమైన ఆకర్షణగలవాడైన కృష్ణుని(శ్రీయాదవం) గీతబోధ చెడును సంహరిస్తూ(సంహారదా) ప్రాణప్రదమైనది(సుభూతాం).
మొదటి నుంచి చివరకు రామాయణంలాగ చదివించి, వెనకకు చదివితే కృష్ణుని భారతంలా అర్థమిచ్చే రామకృష్ణవిలోమ కావ్యం లోనిది. మొత్తం
నలభై పద్యాలూ అలాగే ఉంటాయి.
Posted by Murali
( Feb 06 2006, 02:06:04 PM EST )
Permalink
గ్రామీణ/రైతు సూచనా కేంద్రము భారతదేశం పల్లెల్లో 50వేల ఇంటర్నెట్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రకటించింది.
దృష్టి, జై కిసాన్, n-Logue
ప్రభుత్వేతర సంస్థలతో కలసి ఈ బృహత్కార్యానికి నడుంకట్టినట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది.
50,000 ఇంటర్నెట్ సెంటర్లు ఏర్పాటుకు పెట్టుబడి చేయాలన్నా, ఒక లాభసాటిగా మారే వరకూ వేచిఉండే సహనం
కావలన్నా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అగ్రగామి సంస్థ మైక్రోసాఫ్ట్-కే సాథ్యం.
రాజకీయ నాయకులలాగా కేవలం పత్రికా ప్రకటనలు, పునాదిరాళ్లు, గాల్లో మేడలు కాకుండా ప్రగతి కూడా కనబడుతోంది.
జైకిసాన్ వారు ఔత్సాహికులకు రుణ సౌకర్యం
కలిగిస్తోంది. n-Logue వారు ఈ సెంటర్లకు అవసరమైన corDECT టెక్నాలజీని అందజేస్తున్నారు.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో వచ్చిన మార్పులు చిన్నచిన్న ఊర్లలో ఉన్నవారికి సైతం ఉపయోగపడుతూండడం
ఎంతయినా ఆనందం కలిగించే విషయం. ఈ ప్రయోగం ఫలించాలని, లాభసాటిగా ఉండాలని తద్వారా
ఎంతో మందికి ఉపాధి దొరకాలని ఆశిద్దాం.
నా అంచనా ప్రకారం, గూగుల్ వంటి కంపెనీలు కూడా మరో ఒకటి-రెండేళ్లలో దేశీయభాషల టెక్నాలజీతో భారతదేశంలోకి
చొచ్చుకొని రావొచ్చు. మైక్రోసాఫ్ట్ ఎత్తులు పోటీదారులు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.
Posted by Murali
( Feb 02 2006, 11:41:02 AM EST )
Permalink
Comments [1]
హీరో చిరంజీవికి పద్మభూషణ్ నిన్న రాత్రి సుమారు 9:30 ప్రాంతంలో మా బాబాయి కూతురు ఫోను చేసింది, "చిరూకి పద్మభూషణ్ ప్రకటించార"నుకుంటూ.
చిరంజీవికి ఉన్న అభిమానుల్లో నేనూ ఒకణ్ణి.
చిన్నప్పుడు చిరంజీవి సినిమా వస్తే చాలు, ఇంట్లో ఎలా ఒప్పించాలా అని ఉండేది. మూడు/నాలుగో క్లాసు నుంచే నేను, మా అన్నయ్య
మా బావ కలిసి చిరంజీవి సినిమా తప్పకుండా చూసేవాళ్లం. ఆరో క్లాసు నుంచి చుట్టుపక్కనున్న పిల్లగ్యాంగుతో వెళ్లేవాళ్లం.
సినిమా విడుదలైన రెండుమూడు నెలలకు కానీ నూజివీడు వచ్చేవి కాదు. స్వయం కృషి, పసివాడి ప్రాణం ఒకేసారి పక్కపక్క థియేటర్లు "ద్వారకా",
"సత్యన్నారాయణ"లో వచ్చాయి. పసివాడి ప్రాణం సినిమాలో ఫైట్లూ, స్టెప్సూ ఉన్నాయని ఫ్రెండ్స్ ద్వారా రిపోర్టు వచ్చింది. పసివాడిప్రాణం చూడాలని కోరిక.
మా మామ్మ, పక్కింటి బామ్మగారూ కలిసి స్వయంకృషి సినిమాకు వెళ్తున్నారు. తోడుకోసం నన్ను కూడా తీసుకొని
వెళ్లారు. పక్కథియేటర్లో పసివాడిప్రాణం పోస్టరు కనపడుతూంటే స్వయంకృషి సినిమాకు వెళ్లటానికి ఎంత గిలగిల్లాడానో నాకు మాత్రమే తెలుసు. :)
సినిమాహాల్లో రెండో వరసలో కూర్చొని "మహానగరంలో మాయగాడు(1984)"
చూసినా, సెలవలకు బాబాయి వాళ్లింటికి వెళ్లి "రుస్తుం(1984)"
సినిమా చూడాలని పట్టుబట్టినా, విజయవాడలో విపరీతమైన రద్దీలో "యముడికి
మొగుడు(1988)" టికెట్టు సంపాదించినా, ఒక్కొక్క సినిమా ఒక్కో ఙ్ఞాపకం. చిత్రలహరిలో చిరంజీవి పాట వేస్తే ఎంత ఆనందమో. అసలు చిరంజీవి
లాగా ఫాస్టుగా స్టెప్సు వేయగలిగింది హీరోయిన్ "రాధ" మాత్రమే అని ఎన్నిసార్లు స్కూల్లో సీరియస్ చర్చో చెప్పలేం. కొన్ని విషయాలు గుర్తొస్తే ఇంత
పెంకిగా,అల్లరిగా ప్రవర్తించేవాళ్లమా అనిపిస్తుంది. మళ్లీ "ఆ..చిన్నతనం కదా" అని సరిపెట్టేసుకుంటాం.
అంతెందుకు, మొన్నటికిమొన్న "జై చిరంజీవ" సినిమా వచ్చిందంటే టింగుటింగు మనుకుంటూ పోయి చూసివచ్చాను. సినిమా ఎలా ఉన్నదో
అన్నయ్యతోనూ, బాబాయి కూతురుతోనూ ఫోనులో డిస్కషను. ఏమిటో ఈ సినిమా పిచ్చి అనిపించినా, "ఆ..చిరంజీవి సినిమా కదా" అని
సరిపెట్టేసుకుంటాను.
అసలు గత రెండేళ్లుగా చిరంజీవిని, అభిమానులను పద్మ అవార్డు ఊరిస్తున్నది. చిరుకి అవార్డు వస్తే అభిమానులకు వచ్చినట్టే కదా.
కంగ్రాట్యులేషన్స్ చిరూ!
Posted by Murali
( Jan 26 2006, 09:37:31 AM EST )
Permalink
విస్మయపరచిన తెలుగుబ్లాగర్ల ఎన్నిక డిసెంబరులో మొదలైన దేశీయ బ్లాగర్ల పోటీ సంగతి విదితమే.
ఈ వారంలో ఫలితాలు వచ్చాయి. దేశీయబ్లాగర్ల కేటగిరీలో indiauncut.blogspot.com బ్లాగు అత్యుత్తమ
బ్లాగుగా ఎన్నుకోబడినది. పూర్తి వివరాలకు ఇక్కడ http://indibloggies.org/results-2005 చూడండి.
తెలుగుబ్లాగర్ల కేటగిరీలో amazingtelugus.blogspot.comకు
అత్యుత్తమ బ్లాగుగా ఎన్నుకున్నారు. నాకు మటుకూ హృదయపూర్వకంగా "అభినందనలు" తెలియజేయలేకపోతున్నాను. క్షమించాలి.
ఎప్పుడో ఒకటి రెండు సార్లు ఆ బ్లాగు చూసిన గుర్తు. వివిధ రంగాలలో పేరు ప్రఖ్యాతులు గడించిన 15-20మంది తెలుగువారి గురించి వ్రాసారు. మంచి ప్రయత్నం. ఏదో పుస్తకంలో చూచి వ్రాసినట్టున్నారు. కానీ తెలుగు నుడికారంలేదు. అంతా ఇంగ్లీషులో వ్రాసారు.
నా ఉద్దేశంలో ఏదైనా ఒక విషయంపై హృదయంలోంచి వచ్చే ప్రతిస్పందనకు అక్షర రూపమే ఒక మంచి బ్లాగు! ఆ ప్రతిస్పందన ఒక నిష్టూరం కావొచ్చు, వ్యంగ్యం, హాస్యం, కోపం, ఆక్రోశం, పాఠం, సరదా, సలహా వగైరా ఏదైనా కావొచ్చు. ప్రతిస్పందన కాకపోయె కనీసం ఒక ప్రతిబింబమయినా కావొచ్చు. రూపం ఏదైనా, అలాటి బ్లాగులు తెలుగులో చాలా లేక పోయినా పదో ఇరవయ్యో ఉన్నాయి. వాటినన్నిటినీ త్రోసిరాజని కేవలం పుస్తకం లో చూచి నాలుగు ముక్కలు వ్రాసిన వారిని ఎన్నుకోవటం సబబా అని ఆలోచించాల్సిన విషయం.
కనీసం వచ్చే ఏడాది, తెలుగు కేటగిరీలో తెలుగు బ్లాగును ఎన్నుకుంటారని ఆశిస్తున్నాను.
Posted by Murali
( Jan 18 2006, 11:08:21 AM EST )
Permalink
Comments [1]
సంక్రాంతి "విష్యూ హ్యాపీ పొంగల్, మాయ్యా!!", "సంక్రాంతి శుభాకాంక్షలు!" వగైరా వగైరా అంటూ స్నేహితులనుంచీ,
చుట్టాల నుంచీ ఈ-మెయిల్సు. ఇంకే ముంది, మీ అభిమాన హీరో, ఫలానా బొంబాయి హీరోయిన్
నటించిన సినిమా సంక్రాంతికి సిద్ధం అంటూ ఇంటర్నెట్లో సినిమా సైట్ల హోరు! ప్రతి తెలుగు సైట్లోనూ ఏదో
ఒక మూల చిన్నదో-పెద్దదో ఒక చుక్కల ముగ్గు! ఆహా ఎంత ఆనంద సమయం అనిపిస్తుంది.
నాకు మటుకూ సంక్రాంతి అంటే కష్టాలే గుర్తొస్తాయి. "సంక్రాంతి కష్టాలా? పండగ కదా, క్రొత్త బట్టలూ,
చుట్టాలు, పక్కాలూ అంతా సంతోషమే కదా!" అనుకుంటారేమో. చెప్తాను. ఈ కష్టాలన్నీ మగపిల్లలకు
మాత్రమే వర్తిస్తాయి. ముఖ్యంగా ఇంట్లో ఆడపిల్లలు ఉంటే మరీ వర్తిస్తాయి.
కష్టం నెం 1: చలి కాలం. ఎంచక్కా ముసుగు తన్ని పడుకుందాం అనిపిస్తుంది. "ఒరేయ్, లే." అంటూ
సుప్రభాతం పిలుపు. "వెళ్లి ఆ ముగ్గమ్మాయిని పిల్చుకురా" అంటూ ఆర్డరు. ఇంటి ముందుకొచ్చి "ముగ్గమ్మా! ముగ్గూ"
అని అరచినప్పుడు తీసుకోవచ్చు కదా. తీసుకోరు. ఆ ముగ్గమ్మాయి రెండు వీధులు దాటి వెళ్ళిపోయిన తరువాత
ఇంట్లో ముగ్గులేదని గుర్తొస్తుంది. స్కూలు నుంచి రాగానే ఆడుకోవటాని వెళ్లనీకుండా, "ఒరేయ్, ఆ ముగ్గు తెల్లగా లేదురా.
మరకు వెళ్లి ఈ బియ్యం పట్టించుకురా. దాంట్లో కలపాలి" అంటారు. పని మీద పని ఈజీక్వల్టూ కష్టం మీద కష్టం.
ఇంతా కష్టపడతామా, "ఏమిటీ ఇంత బరగ్గా ఉంది" లేదా "మరీ ఇంత మెత్తగా" ఉందనో కామెంటు. మనకు 2మ్మచ్
చిరాకేస్తుంది.
కష్టం నెం 2: గొబ్బెమ్మలు. స్వాతిముత్యం సినిమాలోలాగా పక్కింటి వాళ్ల గొబ్బెమ్మలు మనం తీసేసుకోకూడదు కదా.
తీసేసుకున్నా వాళ్లు ఊరుకోరు. "ఎలాగూ లేచావు కదా, వెళ్లి ఆ పాలమ్మాయి ఇంటికి వెళ్లి ఆవుపేడ తీసుకురా. ఆ పాత
పెయింటు డబ్బా పట్టుకెళ్లు" అంటూ మరో పని. ఆ నింగి విరిగి మీద పడితే ఎంత హాయి ఉండునో అనిపిస్తుంది.
సరేలే, గబగబా సైకిలు మీద వెళ్లి ఆ పేడ తెచ్చేద్దామంటే "చిన్నపిల్లాళ్లు సైకిలేమిటి? నడిచి వెళ్లిరా. దగ్గరే కదా" అంటారు.
మనం ఆ చిల్లుపడ్డ పెయింటు డబ్బానో ఏదో పట్టుకొని వెళ్లుంటే వీథిలో అందరికీ ఫలనా వారి అబ్బాయి పేడ కోసం
వెళ్లున్నాడని తెలిసిపోతుంది. ముగ్గులు పెట్టే మిషతో మనల్ను చూట్టనికే అందరూ వీథిలో చేరారా అనిపిస్తుంది.
ఇంట్లో దించిన తల మళ్లీ ఇంటికి వచ్చేక కానీ ఎత్తకూడదు. ఎత్తామా, మన ఫ్రెండుగాడెవడో కనపడతాడు, "అరే, వీడు
పొద్దున పేడకోసం వెళ్తూ కనపడ్డాడురా" అంటూ మిగతావాళ్లకు చెప్తాడేమోనని మనకు వారం రోజులపాటు గుబులు.
ఇంతా ధైర్యం చేసి వెళ్లామా, "మా ఆవు ఇంకా పేడ వేయలేదమ్మా. మళ్లీ రా!" అంటారు. అప్పుడు భూమి చీలిపోయి భూదేవి
సీతమ్మ వారిని తనతో పాటూ తీసుకువెళ్లిపోయే, లవకుశ సినిమా క్లైమాక్సు గుర్తొస్తుంది.
కష్టం నెం 3: బొమ్మలకొలువు. బొమ్మలు పెట్టుకొని పేరంటాలు చేసుకొనేది ఇంట్లో ఆడపిల్లలే. అయినా, అటక మీద నుంచి,
ఆ బూజు పట్టిన స్టోరేజీ నుంచి బొమ్మల పెట్టెలు బయటకు తీసి, వాటిని శుభ్రం చేసే కష్టం మగపిల్లలదే. కొన్ని బొమ్మలేమో
సుద్దలతో చేయబడి మరీ నాజూగ్గా ఉంటాయి. అవి కానీ అటోఇటో అయితే మనకు మళ్లీ తిట్లు. పని ప్లస్ తిట్లు ఈజీక్వల్టూ కష్టం మీద కష్టం.
ఆ బొమ్మలు కొలువున్నన్నాళ్లూ ఇంట్లో హంసనడకలు ప్రాక్టీసు చేయాలి. పరిగెట్టి బొమ్మల మీద పడితే మళ్లీ కష్టం కదా!
కష్టం నెం 4: వేణ్ణీళ్లు. చలి కాలం కదా. స్నానానికి వేణ్ణీళ్లు తప్పనిసరి. గ్యాసు ఖరీదు కదా. వేణ్నీళ్లకు వాడకూడదు.
దొడ్లోనేమో బోలెడు మొక్కలు, చెట్లు. చలికాలంలో అవి పొయ్యిలోకి ఇంధనంగా మారిపోతాయి. "పేడక్కడ పెట్టి,
ఈ పొయ్యి చూడు" అంటూ మరో కష్టం. అమెరికాలో అయితే పిల్లలను, గంటకు కనీసం రెండొందల సార్లు "థాంక్యూ హనీ!",
"గ్రేట్ జాబ్", "ఐయాం ప్రౌడాఫ్యూ", "యూ ఆర్ మై సన్-షైన్" అంటారు. మన దేశంలో మాత్రం కష్టం మీద కష్టం. "ఉఫ్..ఉఫ్"
అనుకుంటూ గొట్టంలోకు ఊదుతూ కాగు నిండా నీళ్లు కాయాలి. చుట్టాలొస్తే నాలుగైదు కాగులు కాయాలి. మన ఇంధనం
పచ్చిగా ఉందా, మనం చచ్చామే. అది మండి చావదు కానీ మన కళ్లకు పొగ పరమై కన్నీళ్లు ఆదేశమవుతయి.
కష్టం నెం 5: తల స్నానం. పండగ రోజున వంటి నిండా నూనె రాసుకొని నలుగు పెట్టుకోవాలి. అదో కష్టం. వేణ్ణీళ్ల కష్టం ముందే చెప్పాను కదా.
కుంకుడుకాయలు కొట్టుకోవాలి. అది ఇంకో కష్టం. వీటితో తలస్నానం. అది కష్టం టు ద పవర్ ఆఫ్ కష్టం. ఎంత గట్టిగా కళ్లు
మూసుకున్నా ఆ చేదు రసం నోట్లోకీ, కళ్లల్లోకీ పోవటం ఖాయం. తరువాత ఆ మంట పోవటానికి నోట్లో ఉప్పు రాయి, మరో కష్టం.
కష్టం నెం 6: భోగి పళ్లు. ఊహ తెలియనంత కాలం ఫర్వాలేదు కానీ కాస్త ఊహ తెలిసిన తరువాత, పెద్దవాళ్లను ఎలా ఎదిరించాలో
తెలిసే లోపల ఒక మూడు-నాలుగేళ్లు మహా ఇబ్బందిగా, కష్టంగా ఉంటూంది. ఇంట్లో ఉన్న ముగ్గురు పిల్లలనూ కూర్చోపెట్టి
చుట్టు పక్కల ఉన్న పిల్లల్నీ, వాళ్ల తల్లుల్నీ పోగేసి మన తలమీద బంతి రెక్కలూ, రేగి పళ్లూ, చిల్లరా కలిపి పోస్తే ఎవరికి మటుకూ
కష్టంగా ఉండదూ? పెద్దవాళ్లు మాత్రం మహా సంబర పడిపోతారు. పెద్దలకు సంబరం ఈజీక్వల్టూ మగపిల్లలకు కష్టం మీద కష్టం.
ఇందు మూలంగా "పెద్ద పండగ"గా చెలామణీ అయ్యే ఈ సంక్రాంతి కష్టాల పుట్ట అని నా అభిప్రాయం. అయినా మీ పొంగు
చల్లార్చే పాపం నాకెందుకు. మీకు కూడా "విష్యూ హ్యాపీ సంక్రాంతి!". పాలు పొంగినట్టుగా మీ జీవితాలలో సుఖ సంతోషాలు
వెల్లి విరియాలని కోరుకుంటున్నాను. ఈ బ్లాగు చదివినా, ఇతరులు చదవగా మీరు విన్నా బోలెడు పుణ్యం దక్కు గాక! పది మందితో
పంచుకుంటే పది జన్మల పుణ్యం దక్కుగాక! :)
Posted by Murali
( Jan 12 2006, 01:59:41 PM EST )
Permalink
మరల తెలుపనా.. ప్రవాసంలో ఉంటూ తెలుగు పుస్తకాలు, పత్రికలూ భారతదేశం నుంచి తెప్పించుకోవాలనే కోరిక, ఆసక్తి
ఉన్నవారికి లాభాపేక్షలేకుండా సేవ చేస్తున్న సైటు తెలుపు.కాం
తెలుగు-పుస్తకాలు నుంచి "తెలుపు" గా
పుట్టిన సైటు 1998 నుంచి ఆన్-లైన్లో ఉన్నది. కానీ చాలా మందికి ఈ సైటు గురించి తెలియదేమో
కూడా. అందుకే ఈ "మరలా తెలుపనా.." అంటూ పరిచయం.
ఎటువంటి హంగులూ లేకుండా, కావలసిన సమాచారాన్ని అందుబాటులో ఉంచుతున్నారు. చందమామ, బుజ్జాయి
వంటి పిల్లల పుస్తకాలు, స్వాతి వగైరా మాస పత్రికలూ
వార్షికచందా కట్టి తెప్పించుకోవచ్చు. చందాలు పెద్ద ఎక్కువేం కాదు. కొన్నింటి వార్షికచందా ఇద్దరు మనుషులు కలసి ఒక చెత్త తెలుగు సినిమా,
ధియేటర్లో చూసిన దానికన్నా చవకే! :)
ఇది వరకూ ఈ సైటు తెలుగును ఇంగ్లీషు script, తిక్కన ఫాంటు లో ఉండేది. ఈ మధ్యనే యూనీకోడ్లో మారుస్తున్నాట్లుగా ఉన్నారు.
ఎంచక్కా తెలుగులో చూడముచ్చటగా ఉంది. నమూనాగా పెట్టిన వేమన పద్యాలు, పిల్లల కధలూ బావున్నాయి.
keywords: chandamama, bommarillu, swathi, weekly, magazine, subscription, telupu, telugu, books, buy
Posted by Murali
( Jan 06 2006, 11:43:18 AM EST )
Permalink
Comments [2]
దేశీయ బ్లాగర్లకు పోటీ! భారత బ్లాగర్లను ఉత్సాహపరిచే సదుద్దేశంతో, సత్సంకల్పంతో http://www.indibloggies.org వారు పోటీ నిర్వహిస్తున్నారు. బ్లాగుర్లు ఎవరికి వారే నమోదు చేసుకోవాలి.
పోటీకి రకరకాల కేటగిరీలు ఉన్నాయి. కావాలనుకుంటే ప్రతీ కేటగిరీలోనూ పోటీ చేయొచ్చు.
పోటీలో నమోదు చేసుకొనే విధానం, ముక్కు ఎక్కడరా అంటే తిప్పి చూపించినట్టుంటుంది. ఈ విధంగా చేయాలి:
1) http://del.icio.us/ కు వెళ్లి అకౌంటు తెరవండి.
2) "post" మీద క్లిక్ చేసి మీ బ్లాగు అడ్రస్సు వ్రాసి "save" చేయండి.
3) కానీ వెబ్సైటు "save" చేయకుండా మరిన్ని వివరాలు "Description", "notes", "tags" అడుగుతుంది.
"notes" ఖాళీగా ఉంచినా ఫర్వాలేదు. "tags" అన్నచోట "for:indibloggies ib05Indic ib05Telugu"
అని టైపు చేసి "save" చేయండి.
4) అంతే, ఆటోమేటిగ్గా మీ బ్లాగు పోటీ కోసం నమోదు చేయబడుతుంది.
నేను కూడా పోటీకి నమోదు చేసాను. నెట్ మిత్రుడు చావాకిరణ్ ఉత్తమ తెలుగుబ్లాగరుకు రూ. 1000 (వెయ్యి రూపాయలు)
బహుమతిగా ప్రకటించారు. ప్రస్తుతం తెలుగు బ్లాగర్లు ఎక్కువమంది లేని కారణంగా, నాలాంటి ఉత్తుత్తి బ్లాగరుకు బహుమతి వచ్చినా
ఆశ్చర్యంలేదు. కానీ ఈ పోటీ బహుమతుల కోసం కాదు, తోటి బ్లాగర్లను ఒక చోట చేర్చే భగీరథ ప్రయత్నం.
ఆంతర్యం:
పోటీ నిర్వహించేది indibloggies.org వారయితే,
ఇంకెక్కడికో పోయి http://del.icio.us/లో నమోదు చేసుకోమంటారేమిటి?
తలతిక్క వ్యవహారంలా ఉందే అనిపించింది.
http://del.icio.us/ సైటు, నిజానికి, ఒక సామూహిక "bookmarks" సైటు.
మన "bookmarks"ను స్నేహితులతోనూ, ఇతరులతోనూ పంచుకోవచ్చన్న మాట. పోటీ నిర్వహించేవారు "indibloggies" పేరుతో
del.icio.usపై నమోదు అయినారు. అందుకని "for:indibloggies ib05Indic ib05Telugu" అని "tags" వ్రాసినందువలన, మన సైటును "indibloggies" అనే వారితో "ib05Indic ib05Telugu" కేటగిరీలలో పంచుకొన్నట్లు లెక్క.
Posted by Murali
( Dec 22 2005, 09:53:12 AM EST )
Permalink
TeluguToolbar1.2 క్రిందటి వారం అనుకుంటా మిత్రులు రవి ఫోను చేసారు, ఫైర్-ఫాక్స్ వె1.5 లో telugutoolbar పని చేయటంలేదంటూ. దాన్ని సరిచేసి అప్లోడ్ చేయాలంటే mozdev.org వారి CVS సర్వరు డౌన్ అయి ఉంది. మొత్తనికి నిన్న కుదిరింది.
FireFox 1.5 బ్రౌజర్లో తెలుగు-టూల్బార్ ప్లగిన్ వెర్షను 1.2 సిద్ధం.
ఈ టూల్-బార్ గొడవ ఏమిటో తెలియకపోతే ఇక్కడ చూడండి.
Posted by Murali
( Dec 21 2005, 10:25:33 AM EST )
Permalink
Comments [1]
హెచ్.ఐ.వీ - ఎయిడ్స్ వారం - 2005 గత కొంత కాలంగా, ప్రతీ ఏడాది డిసెంబరు మొదటి తారీఖు వాచ్చే వారాన్ని "
హెచ్.ఐ.వీ - ఎయిడ్స్ వారం"గా పాటిస్తున్నారు.
సాధారణంగా ఈ వారమంతా ప్రతీ వార్తాపత్రికలలోనూ ఎయిడ్స్ గురించి వార్తలూ, విశ్లేషణలూ వగైర ఎక్కువగా
వస్తూంటాయి. అమెరికా పబ్లిక్ టీవీలో కూడా ఎయిడ్స్ మీద ప్రత్యేక ప్రోగ్రాములు ప్రసారం చేస్తుంటారు.
రెండురోజుల క్రితం డా.వినీతా గుప్తా అనే ఆవిడ ఆన్ఆర్బరు వచ్చారు. వినీతాగారిని ఇంతకు ముందు రెండుమూడుసార్లు
వివిధ సందర్భాలలో కలిసాను. ఈవిడ, మరొక ఇద్దరితో ఒక చర్చా వేదిక ఏర్పాటు చేసారు. ఒకటో రెండో క్రొత్త విషయాలు తెలిసాయి.
డా.వీనీతా గారు వృత్తి రిత్యా వైద్యులయినా, అది మానివేసి, అమెరికాలో మానవహక్కుల మీద లా డిగ్రీ పుచ్చుకున్నారు.
ప్రస్తుతం అమెరికాలోని ప్రవాసభారతీయులను ఎయిడ్స్ తదితర విషయాలమీద అవగాన పెంపొందించేకు, భారత ప్రభుత్వం
ఎయిడ్స్ పాలసీని మార్పు చేయాలని కృషి చేస్తున్నారు.
అసలు భారత ప్రభుత్వానికి ఎయిడ్స్ సంబంధించిన పాలసీ ఏమిటి? దానిలో లోపాలు ఏమిటి అని చర్చించారు.
ప్రపంచంతటిలోనూ ఎయిడ్స్ బారిన పడని దేశం లేదు. కానీ, మన దేశంలో ప్రస్తుతానికి ఎక్కువగా వేశ్యలు, విటులు, ట్రక్ డ్రవర్లు
వంటి వారిలో ఎక్కువా ప్రబలింది. ఆఫ్రికాలో అయితే హైస్కూలు పిల్లల దగ్గరనుంచి కూడా ఎయిడ్స్ ఉంటోంది. దానికి
చిన్న వయస్సులోనే విచ్చలవిడితనం ఉండటం ఒక కారణం కావచ్చు.
ఆ మధ్య పబ్లిక్ టీవీలో చూపించారు. ఆఫ్రికాలో (యుగాండా?) " ABC (Abstinence,Be Faithful,Condom)
పేరున ఒక ఉద్యమం మొదలు పెట్టారు. దానికోసం పెద్దపెద్ద బిల్-బోర్డులు వగైరా పెట్టారు.
కానీ మనదేశంలో ఎయిడ్స్ ఉన్నవారు చాలా మంది నిరక్షరాస్యులే. వారికి పెద్ద బిల్-బోర్డులు పెడితే ఉపయోగం లేదు. వారి మధ్యలోకి
వెళ్లి కష్టనష్టాలను చెప్పే కార్యకర్తలను తయారు చేయాలి.
అమెరికా వంటి ధనిక దేశాలు ఎయిడ్స్ నిరోధించడానికి ఇతర దేశాలకు ఆర్ధిక సహాయం చేస్తుంటాయి. ఈ మధ్యనే ఒక 30మిలియన్
డాలర్లు సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ వాటిని "Abstinence, Be Faithful" మాత్రమే ఉపయోగించాలని
షరతు పెట్టారు. అది తలాతోకా లేని షరతని చాలా మంది అభిప్రాయం కూడా. నా అభిప్రాయం కూడా అదే.
ఏ దేశానికాదేశం సామాజిక, ఆర్ధిక నిబంధనల ప్రకారం వారివారి కార్యక్రమాలు రూపొందించుకుంటారు. ఆకలితో ఉన్నవాడికి
రూపాయిచ్చి మంచినీళ్లు మాత్రమే కొనుక్కోవాలి, రొట్టె కొనకూడదన్నట్టుగా ఉంటుంది.
Posted by Murali
( Dec 02 2005, 11:38:31 AM EST )
Permalink
Comments [2]
ఎవరి తప్పు? విజయవాడలో బడిపిల్లలకు ఘోరప్రమాదం?
సరదాగా వారాంతంలో వ్యాహ్యాళికి వెళ్లిన నాలుగువందల మంది పిల్లలల పదిహేను మంది మున్నేరు వాగులో మునిగిపోయి
మృత్యువాత పడిన వార్త తెలిసిందే. ఆదివారం రాత్రి విజయవాడలోని మా బాబాయికి ఫోను చేస్తే తెలిసింది. మా బాబాయి
కూతురు కూడా ఆ స్కూలులోనే చదువుతోంది. ఇంకా చిన్నపిల్ల కావడం చేత ఆ వ్యాహ్యాళికి వెళ్లలేదు.
ఆ స్కూలు మీద రాళ్లురువ్వి, యాజమాన్యాన్ని అటకాయించి మూడు రోజుల పాటు పట్టణమంతా సంతాపం ప్రకటించారట.
ఇంతకీ పిల్లలను సరదాగా వ్యాహ్యాళికి తీసుకువెళ్లిన టీచర్లదా తప్పు? పిల్లలు ఎక్కడకు వెళ్తున్నారో కనిపెట్టుకొని చూడాల్సిన
బాధ్యత తప్పకుండా ఉపాధ్యాయులదే. కాదని ఎవరూ అనరు.
మా పిన్ని చెప్పారు, పిల్లలను తీసుకొని వెళ్లిన చోట మున్నేరువాగు లోతు సాధారణంగా కేవలం రెండు అడుగులేనట!
మరి 6-10 తరగతుల మధ్యవారు అలా రెండు అడుగుల లోతు నీటిలో ఎలా మునిగిపోతారు అని మనం ఆలోచించాలి.
దానికి సమాధానం కూడా మాటల్లో మా పిన్ని చెప్పారు.
ఈ మధ్యన అభివృద్ధి పేరుతో ఎడాపెడా పెరుగున్న కట్టడాలకు ఇసకకోసం విజయవాడ చుట్టు ప్రక్కల వాగులూ, వంకలూ,
నదులూ త్రవ్వి పెడుతున్నారట. మిన్నేరు వాగు లోతు రెండడుగులు ఉండాల్సిన చోట తొమ్మిది అడుగులుందట! చిన్న
పిల్లలకు ఏమి తెలుసు? వారితో ఉన్న ఉపాధ్యాయులకు ఏమి తెలుసు?
ఇసక వ్యాపారం చేసే ప్రతి ఒక్కరికీ ఈ ప్రమాదంలో భాగముందని నా అభిప్రాయం. ఆ ఇసక కొన్న ప్రతి పౌరునికీ దీనిలో
భాగముంది. కేవలం యాజమాన్యం పైన నిందవేసి స్కూలు recoginition రద్దు చేస్తాం అనటం కేవలం కన్నీటి తుడుపు
చర్య మాత్రమే. పిల్లలకు జరిగిన హాని వలన యాజమాన్యానికి మాత్రం బాధ ఉండదూ?
నిజానికి ఎక్కడనుంచి ఇసుక ఎంత త్రవ్వాలి అని చట్టాలు ఉన్నాయి. అది పర్యవేక్షించడానికి అధికారులుంటారు. కృష్ణా నదిలో
నుంచి అక్రమంగా త్రవ్వకుండా చాలా కట్టుదిట్టం చేసారట. కొన్ని నిర్దిష్ట ప్రదేశాలలో మాత్రమే ఇసుక త్రవ్వవచ్చు. కానీ దానికి
పన్ను కట్టాలి. ఖరీదు ఎక్కువ. అందుకని అర్ధరాత్రిళ్లు ఇసుక వ్యాపారులు చుట్టుప్రక్కల వాగులు వంకల
లోనుంచి ఇసుక చేరవేస్తుంటారు. ఇసుక ఇలా తీసివేయటం మూలన వర్షాలు పడినప్పుడు నీటి ప్రవాహానికి అడ్డుండదు. జోరు పెరిగి
కట్టలు తెగి ఊళ్లు, పొలాలు నాశనం అవుతాయి. అపార ప్రాణ,ధన నష్టాలకు హేతవవుతాయి.
నాలుగు రోజులలో మళ్లీ ఈ ప్రమాదం పాతదయిపోతుంది. మన ఙ్ఞాపకాలలో కూడా మిగలదు. కానీ చిన్నారులను పోగొట్టుకున్న
తల్లిదండులు, వారి కుటుంబాలకు మాత్రం ఊరడింపు ఉండదు.
అడ్డుఅదుపూ లేని "అభివృద్ధి", మరొక ప్రక్క ఎంతటి చేటు చేస్తుందో ఆలోచించాల్సిన విషయం.
Posted by Murali
( Nov 29 2005, 10:32:10 AM EST )
Permalink
Comments [2]
పాడ్-కాస్టింగ్ ఈ మధ్యన ఇంటర్నెట్లో మొదలైన క్రొత్త తరంగం "పాడ్-కాస్టింగ్"( Podcasting).
బ్లాగు రూపంలో వ్యాసాలు,సమీక్షలు,వ్యక్తిగత అభిప్రాయాలు పంచుకొన్నట్లే దృశ్యశ్రవణ (audio/video) రూపంలో ఇంటర్నెట్లో సమాచారాన్ని నలుగురితో
పంచుకోవటమే ఈ "పాడ్-కాస్టింగ్".
ఈ పాడ్-కాస్టింగ్ దృశ్యశ్రవణ రూపంలో ఉండటం చేత కేవలం బ్రౌజరు(Firefox, IE మొ.) ఉంటే సరిపోదు. pod-catcher సాఫ్ట్వేరు ఉండాలి.
కంప్యూటరు ద్వారా పాటలు వినడానికి వినియోగించే సాఫ్ట్వేర్లలో ఈ pod-catching ఫీచరు ఉంటోంది. మీరు ఉపయోగించే సాఫ్ట్వేర్లో ఇది లేకపోతే
క్రొత్త వెర్షను డౌన్లోడు చేసుకోండి. బహుశా దాంట్లో ఉండే ఉంటుంది. నేను Apple వారి iTunes సాఫ్ట్వేర్ వాడతాను. నాకు అమితంగా నచ్చే సాఫ్ట్వేర్లలో ఇది ఒకటి.
ఇంటర్నెట్లో లభించే రకరకాల పాడ్-కాస్టులను కొన్ని సైట్లు సిండికేట్ చేసి ఉంచుతాయి. వాటిలో కొన్ని:
బ్రాకలీ రెండేళ్ల క్రితం మా అమ్మ అమెరికా వచ్చినప్పుడు ఒకసారి కూరల కోసం వెళ్లాము. బ్రాకలీని చూసి
"ఇదేమిట్రా, కాలీఫ్లవర్ లాగా ఉంది" అంటే, "దాన్ని బ్రాకలీ అంటారు, ఇండియాలో
దొరకదులే. నీకు తెలియదు. కాలీఫ్లవర్లా ఉండటేమిటి? అది తెల్లగా ఉంటుంది ఇది పచ్చగా ఉంది.
మరీ ఊరికే ఇప్పుడే నూజివీడు నుంచి వచ్చినట్టుగా మాట్లాడతావేమిటి? రెండేళ్ల నుంచి హైదరాబాదులో
ఉంటున్నావు కదా." అంటూ సరదాగా ఆటపట్టించాను.
భారతదేశంలో మనకు దొరకని కూరగాయలలో బ్రాకలీ ఒకటి.
ఇది క్యాబేజీ, కలీఫ్లవర్ జాతికి చెందినది. దీన్లో విటమిన్ ఏ, విటమిన్ సీ, పీచు పదార్థాలు సమృద్ధిగా లభిస్తాయి. పూర్తి వివరాలకు http://www.nutritiondata.com చూడండి. కానీ,
దాన్ని ఎలా వండాలో తెలియక ఎప్పుడూ కొనలేదు.
చిన్నప్పటినుంచి మా ఇంట్లో "అది తినను, ఇది తినను" అంటూ మారం చేసే అవకాశంలేదు. గప్ చుప్ గా
అన్నీ తినటమే. అమెరికాలో చాలా మందికి బ్రాకలీ అంటే ఇష్టం ఉండదంటారు. టీవీ యాడ్స్ కూడా చిన్నపిల్లలు
బ్రాకలీ అంటే ఇష్టపడనట్టు చూపిస్తారు.
పచ్చి బ్రాకలీని సలాడ్లలో తింటారు. ఆవిరిపై ఉడకపెట్టిన బ్రాకలీని సైడ్ డిష్ గా తినొచ్చు. అన్నింటిలోనూ "బ్రాకలీ చీజ్ సూప్"
రుచికరంగా ఉంటుంది. మా ఆఫీసులో అప్పుడప్పుడూ కాఫిటేరియాలో చేస్తుంటారు. కానీ, దాంట్లో cheddar-cheese చాలా
ఎక్కువగా వేస్తారు. "మా తాతలు నేతులు తాగారు" అన్నట్టుగా ఉంటుంది. రెండు వారాల క్రితం ఒక అమెరికన్ స్నేహితుని
ఇంటికి వెళ్తే, బ్రాకలీ సూప్ చేసాడు. అంత చీజ్ లేదు కానీ కాస్త రుచి తగ్గింది.
ఈ మధ్యన కూరల కోసం వెళ్లినప్పుడు రెండు కట్టలు బ్రాకలీ పట్టుకొచ్చాను. ఇంటర్నెట్లో చూసి, కాస్త మార్పు చేసి
మన కరివేపాకు, ఆవాలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు వేసి, చెద్దార్-చీజ్ కాస్త తక్కువ మోతాదులో వేసి, ప్రయోగం చేసాను.
మరి చెప్పాలా, 2మ్మచ్ గా వచ్చింది :) మరో కట్టతో మొన్న శుక్రవారం మరో నలుగురు స్నేహితులు వస్తే మళ్లీ చేసాను.
ఒక చుక్క సూప్ మిగిలితే ఒట్టు.
అప్పుడు అమ్మను ఆటపట్టించినా, కూరలు కొనడానికి వెళ్లినప్పుడల్లా, బ్రాకలీ చూస్తే అనవసరంగా మన తెలివి ప్రదర్శించకూడదని
అనిపిస్తూంటుంది.
Posted by Murali
( Nov 06 2005, 02:43:19 PM EST )
Permalink
Comments [2]
యూనీకోడ్ లో మహాభారతము ఇప్పుడిప్పుడే తెలుగును యూనీకోడ్ లో వ్రాయటానికి సాధనాలు వస్తున్నాయి. కాని, తెలుగు
యూనీకోడ్ content మాత్రం చాలా తక్కువ. ఇప్పుడిప్పుడే బ్లాగుల రూపేణా కాస్త content
వస్తోంది.
కొంతమంది ఔత్సాహికులు, తెలుగులో రచించబడిన మొదటి ఇతిహాస కావ్యం
మహాభారతాన్ని
యూనీకోడ్ రూపంలో ఇంటర్నెట్లో పెట్టాలని సంకల్పించుకోవడం హర్షదాయకం.
9వ తరగతిలో అనుకుంటా, "ప్రాయోపవేశము" అనే పాఠం ఉండేది. అరణ్యవాసం చేస్తున్న
పాండవులు, గంధర్వుల నుండి, దుర్యోధనుణ్ణి రక్షిస్తారు. అది అవమానంగా భావించి రారాజు
ప్రాయోపవేశం చేయడానికి నిర్ణయించుకుంటాడు. ఆ సందర్భంలో ఈ పద్యం చూడండి:
ఉ. అక్కట యమ్మహారణమునందు వియచ్ఛరకోటితోడఁ బే
రుక్కునఁ బోరియేను మృతి నొందఁగ నేరన యట్టులైన నీ
తక్కువపాటు లేక ప్రమదంబున దేవపదంబు నొందుదున్
మిక్కిలియైన కీర్తియును మేదినియందు వెలుంగు నిత్యమై.
(అర్థం: (కర్ణా!)ఆ యుద్ధంలో చనిపోతే, ఈ తక్కువపాటు లేకుండా, స్వర్గప్రాప్తి, కీర్తి లభించేవి కదా!)
ఈ పద్యం అరణ్యపర్వంలోని ఆరవ ఆశ్వాసంలోనిది. పువ్వుగుర్తు పద్యమని వేరే చెప్పనక్కరలేదు కదా.
కేవలం ఈ పద్యాన్ని యూనీకోడ్ లో వ్రాయాలనే కుతూహలంతో నేను కూడా మహాభారతాన్ని యూనీకోడీకరించే
గ్రూపులో చేరాను.
నేను చేరే నాటికి మొదటిది, ఆదిపర్వం పూర్తికావస్తోంది. రెండవది, సభాపర్వం మొదలు పెడుతున్నారు.
దాని పీఠిక చూస్తే గుర్తుకొచ్చింది. ఇంటర్మీడియట్లో, "ద్రౌపదీ పరాభవం(?)" పాఠం ఉండేది. సరే, వేరే
చెప్పాలా? ఆ 30 పద్యాలూ నేను యూనీక్రోడికరిస్తానని volunteer చేసాను. కానీ, నేను అడిగిన
30 పద్యాలలో మొదటి 10పద్యాలు ఎవరో ఎంచుకున్నారని ప్రాజెక్టు సంధానకర్త చెప్పారు. అందుకని,
తరువాతి 30పద్యాలు నాకిచ్చారు.
ఆ సందర్భంలో ద్రౌపది తనను తీసుకొని వెళ్లటానికొచ్చిన ప్రాతికామి అడిగిన ధర్మ సందేహం:
తే. మున్ను దన్నోటువడి మఱినన్నునోటు, వడియెనో నన్ను మున్నోటువడి విభుండు
గ్రన్నఁ దన్నోటువడియెనో యన్న! నాకు, నెఱుఁగఁజెప్పుము దీని నీ వెఱుఁగు దేని.
(ఇది నేను క్రోడీకరించకపోయినా, ఇక్కడ వ్రాయటం కొరకు టైపుచేసాను).
ఈ ప్రాజెక్టులో ఇంకా 16పర్వాలు యూనీకోడీకరించాలి. ఔత్సాహికులు ఈ గ్రూపులో చేరండి.
http://groups.google.com/group/andhramahabharatam
Keywords: telugu, maha bharatamu, maha bhaaratamu, unicode
Posted by Murali
( Oct 11 2005, 11:36:16 PM EDT )
Permalink
Comments [4]
తిరుతిరుతిరుతి... ఆగస్టులో ఇండియా ట్రిప్పు నుంచి నాతో అమెరికాకు వచ్చిన నాలుగు పుస్తకాలలో 1975లో
జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ప్రచురించబడిన "తెలుగు-దాక్షిణాత్యసాహిత్యాలు".
సుమారు 60పుటల ఈ పుస్తకం రచయిత డా. చల్లా రాధాకృష్ణ శర్మగారు.
తమిళం, కన్నడం, మళయాళం భాషలు తెలుగు మీద ఎటువంటి ప్రభావం చూపాయో
సోదాహరణంగా వివరించారు.
తెలుగుపై తమిళభాషా ప్రభావం గురించి వివరిస్తూ ఇలా వ్రాసారు:
"... ఇక వైష్ణవుల పరిభాషను గురించి చెప్పనవసరం లేదు. శ్రీకి సమానార్థకమైన తిరుశబ్దం
తమిళులకు పరమ పవిత్రమయింది. తిరు తమిళ శబ్దం. తిరువడి, తిరుమాళిగ, తిరుమన్ను,
తిరువుళ్లం, తిరువిళకు, తిరుమంజనం మొదలైనవి వైష్ణవుల దైనందిన వ్యవహారంలోనేకాక మన
కావ్యాలలోనూ చోటు చేసుకున్నవి. శ్రీదాసు శ్రీరాములుగారు పేర్కొన్నట్లు వైష్ణవ పరిభాష తిరు
చుట్టూ పరిభ్రమిస్తూ వుంటుంది. ఆయన చెప్పిన యీ కింది పద్యం పరిశీలించదగింది (తెలుగునాడు, 1899). "
తిరుమణి తిరుచూర్ణ తిరునాళ్ళ తిరుమంత్ర తిరుమాళిగయు తిరుక్కరియ మధులు తిరువీధి, తిరుగలు తిరునామములు తిరు వారాధనము తిరువాయిమొడియు తిరువధ్యయనమును తిరుమంగయాళ్వారు తిరువెళికయు మఱి తిరువడిఘళు తిరుపతి తిరుమల తిరువీసములు తిరు వణ్ణేరములు తిరుప్పావు మఱియు తిరువళిక్కేణి తిరువటూర్ తిరువనంత పురము తిరువళ్లూరుమ తిరుతులసియు తిరు తిరు తిరుత్తిరుత్తిరు తిరు తిరు తిరు దిరుగు వైష్ణవ పరిభాష తెఱవు మరుగుఅర్థం వివరించే శక్తి లేదు కానీ, చదవాడినికే సరదాగా ఉన్నది. నలుగురితో పంచుకోవాలని ఆసక్తి.