Tuesday October 11, 2005
యూనీకోడ్ లో మహాభారతము ఇప్పుడిప్పుడే తెలుగును యూనీకోడ్ లో వ్రాయటానికి సాధనాలు వస్తున్నాయి. కాని, తెలుగు
యూనీకోడ్ content మాత్రం చాలా తక్కువ. ఇప్పుడిప్పుడే బ్లాగుల రూపేణా కాస్త content
వస్తోంది.
కొంతమంది ఔత్సాహికులు, తెలుగులో రచించబడిన మొదటి ఇతిహాస కావ్యం
మహాభారతాన్ని
యూనీకోడ్ రూపంలో ఇంటర్నెట్లో పెట్టాలని సంకల్పించుకోవడం హర్షదాయకం.
9వ తరగతిలో అనుకుంటా, "ప్రాయోపవేశము" అనే పాఠం ఉండేది. అరణ్యవాసం చేస్తున్న
పాండవులు, గంధర్వుల నుండి, దుర్యోధనుణ్ణి రక్షిస్తారు. అది అవమానంగా భావించి రారాజు
ప్రాయోపవేశం చేయడానికి నిర్ణయించుకుంటాడు. ఆ సందర్భంలో ఈ పద్యం చూడండి:
ఉ. అక్కట యమ్మహారణమునందు వియచ్ఛరకోటితోడఁ బే
రుక్కునఁ బోరియేను మృతి నొందఁగ నేరన యట్టులైన నీ
తక్కువపాటు లేక ప్రమదంబున దేవపదంబు నొందుదున్
మిక్కిలియైన కీర్తియును మేదినియందు వెలుంగు నిత్యమై.
(అర్థం: (కర్ణా!)ఆ యుద్ధంలో చనిపోతే, ఈ తక్కువపాటు లేకుండా, స్వర్గప్రాప్తి, కీర్తి లభించేవి కదా!)
ఈ పద్యం అరణ్యపర్వంలోని ఆరవ ఆశ్వాసంలోనిది. పువ్వుగుర్తు పద్యమని వేరే చెప్పనక్కరలేదు కదా.
కేవలం ఈ పద్యాన్ని యూనీకోడ్ లో వ్రాయాలనే కుతూహలంతో నేను కూడా మహాభారతాన్ని యూనీకోడీకరించే
గ్రూపులో చేరాను.
నేను చేరే నాటికి మొదటిది, ఆదిపర్వం పూర్తికావస్తోంది. రెండవది, సభాపర్వం మొదలు పెడుతున్నారు.
దాని పీఠిక చూస్తే గుర్తుకొచ్చింది. ఇంటర్మీడియట్లో, "ద్రౌపదీ పరాభవం(?)" పాఠం ఉండేది. సరే, వేరే
చెప్పాలా? ఆ 30 పద్యాలూ నేను యూనీక్రోడికరిస్తానని volunteer చేసాను. కానీ, నేను అడిగిన
30 పద్యాలలో మొదటి 10పద్యాలు ఎవరో ఎంచుకున్నారని ప్రాజెక్టు సంధానకర్త చెప్పారు. అందుకని,
తరువాతి 30పద్యాలు నాకిచ్చారు.
ఆ సందర్భంలో ద్రౌపది తనను తీసుకొని వెళ్లటానికొచ్చిన ప్రాతికామి అడిగిన ధర్మ సందేహం:
తే. మున్ను దన్నోటువడి మఱినన్నునోటు, వడియెనో నన్ను మున్నోటువడి విభుండు
గ్రన్నఁ దన్నోటువడియెనో యన్న! నాకు, నెఱుఁగఁజెప్పుము దీని నీ వెఱుఁగు దేని.
(ఇది నేను క్రోడీకరించకపోయినా, ఇక్కడ వ్రాయటం కొరకు టైపుచేసాను).
ఈ ప్రాజెక్టులో ఇంకా 16పర్వాలు యూనీకోడీకరించాలి. ఔత్సాహికులు ఈ గ్రూపులో చేరండి.
http://groups.google.com/group/andhramahabharatam
Keywords: telugu, maha bharatamu, maha bhaaratamu, unicode
Posted by Murali
( Oct 11 2005, 11:36:16 PM EDT )
Permalink
Comments [4]
తిరుతిరుతిరుతి... ఆగస్టులో ఇండియా ట్రిప్పు నుంచి నాతో అమెరికాకు వచ్చిన నాలుగు పుస్తకాలలో 1975లో
జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ప్రచురించబడిన "తెలుగు-దాక్షిణాత్యసాహిత్యాలు".
సుమారు 60పుటల ఈ పుస్తకం రచయిత డా. చల్లా రాధాకృష్ణ శర్మగారు.
తమిళం, కన్నడం, మళయాళం భాషలు తెలుగు మీద ఎటువంటి ప్రభావం చూపాయో
సోదాహరణంగా వివరించారు.
తెలుగుపై తమిళభాషా ప్రభావం గురించి వివరిస్తూ ఇలా వ్రాసారు:
"... ఇక వైష్ణవుల పరిభాషను గురించి చెప్పనవసరం లేదు. శ్రీకి సమానార్థకమైన తిరుశబ్దం
తమిళులకు పరమ పవిత్రమయింది. తిరు తమిళ శబ్దం. తిరువడి, తిరుమాళిగ, తిరుమన్ను,
తిరువుళ్లం, తిరువిళకు, తిరుమంజనం మొదలైనవి వైష్ణవుల దైనందిన వ్యవహారంలోనేకాక మన
కావ్యాలలోనూ చోటు చేసుకున్నవి. శ్రీదాసు శ్రీరాములుగారు పేర్కొన్నట్లు వైష్ణవ పరిభాష తిరు
చుట్టూ పరిభ్రమిస్తూ వుంటుంది. ఆయన చెప్పిన యీ కింది పద్యం పరిశీలించదగింది (తెలుగునాడు, 1899). "
తిరుమణి తిరుచూర్ణ తిరునాళ్ళ తిరుమంత్ర తిరుమాళిగయు తిరుక్కరియ మధులు తిరువీధి, తిరుగలు తిరునామములు తిరు వారాధనము తిరువాయిమొడియు తిరువధ్యయనమును తిరుమంగయాళ్వారు తిరువెళికయు మఱి తిరువడిఘళు తిరుపతి తిరుమల తిరువీసములు తిరు వణ్ణేరములు తిరుప్పావు మఱియు తిరువళిక్కేణి తిరువటూర్ తిరువనంత పురము తిరువళ్లూరుమ తిరుతులసియు తిరు తిరు తిరుత్తిరుత్తిరు తిరు తిరు తిరు దిరుగు వైష్ణవ పరిభాష తెఱవు మరుగుఅర్థం వివరించే శక్తి లేదు కానీ, చదవాడినికే సరదాగా ఉన్నది. నలుగురితో పంచుకోవాలని ఆసక్తి.
విరసం నిషేదం : నిరసన
http://www.deccanherald.com/deccanherald/aug222005/index2012202005821.asp
సరే, క్రిందటి నెలలో నక్షలైట్లు, వి.ర.సం.(విప్లవ రచయితల సంఘం)పై ఒకేసారి నిషేధం విధించారు. ఆ సమయంలో
నేను హైదరాబాదులోనే ఉన్నాను. వి.ర.సం నేతలను అరెస్టు చేసి మూడునాలుగు రోజులలో విడుదల చేసారు.
మా DTLC గ్రూపు వాళ్లు వి.ర.సం నిషేధంపై నిరసన
ప్రకటించాలని ప్రతిపాదన చేసారు. మొదట నాకు పెద్ద ఇష్టంలేక పోయింది. సమాజాన్ని హింసతో సాధిస్తున్న నక్సలైట్లకు వెన్నుదన్నుగా
వి.ర.సం ఉన్నదని నా ఉద్దేశ్యం. సమాజంలో అసమానతలు తొలగాలని నక్సలైట్ల సిద్ధాంతం కావొచ్చు. కాని వారు ఎంచుకొన్న హింసామార్గం
మూలాన, ఎంతో ప్రజాధనం అధిక పోలీసు బలగాల రూపంలో వృధా అయిపోతోందని, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోబడ్డ నేతల హత్యలు,
సమాజంలో ఒకరకమైన భయభ్రాంతులు నెలకొన్నాయని నా భావన. మరి అలాంటి వారిని ప్రోత్సహిస్తున్న వి.ర.సంపై నిషేధం సమజసమేనని తోచింది.
కానీ, ప్రతి ఆరు వారలకొకసారి జరిగే మా DTLC సమావేశం తరువాత, ఆ నిరసన పత్రంపై నా పేరు చేర్చడానికి ఒప్పుకున్నాను.
ఒక రచయితల సంఘంగా ఉన్నదానిని నిషేధించడం సబబు కాదని సర్ధిచెప్పుకున్నాను. కలం పట్టిన వారు మనకు నచ్చనివి వ్రాస్తున్నారని
అరెస్టు చేయకూడదు కదా. మరొక విషయం, వి.ర.సం వారు ఎంతో చక్కని సాహిత్యం, పుస్తకాలు అచ్చు వేస్తుంటారు. మరి
అలాంటి సాహిత్యం అందించే సంఘమే మనకు దూరమయిపోతే ఎలా?
http://www.rediff.com/news/2005/aug/22naxal.htm
వి.ర.సం. నేతలు అరస్టు నిరసనగా తోటి రచయితలు స్టేట్మెంట్లు ఇవ్వాలి తప్పించి, నక్సలైట్లు కాదు.
అసలు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా హింసాత్మకమైన చర్యలు చేపట్టే వారికి, ప్రభుత్వం ప్రజాస్వామ్యంగా
ప్రవర్తించలేదని, గొంతు చించుకొనే హక్కులేదు. అలా చేయడం వలన విరసానికి నష్టమే తప్పించి వీసమెత్తయినా
లాభం ఉండదు.
సమాజంలో మార్పు రావలని, అసమానతలు పోవాలని కాస్తోకూస్తో అందరం కోరుకుంటాం. ప్రజల ఆలోచనా
ధోరణి మారాలని రచనలు చేస్తారు. చేయాలి కూడా. కానీ దానికి కాస్త సమయం పడుతుంది. కేవలం తుపాకీ
గురిపెట్టి, రక్తం చిందించి రాత్రికిరాత్రి మార్చేద్దామనుకోవడం సబబు కాదు. సమర్ధించను కూడా.
Posted by Murali
( Sep 24 2005, 11:55:29 PM EDT )
Permalink
తెలుగునాడి సంచిక క్రిందటి వారం, నాకు మొదటిసారి తెలుగునాడి సంచిక వచ్చింది.
ఆ మధ్యన జులైలో జరిగిన తానా-2005లో తెలుగునాడి
స్టాల్లో రెండేళ్లకు చందా కట్టాను. ఎప్పటి నుంచో "కడదాం..కడదాం.." అనుకుంటూనే వాయిదా వేస్తూ వచ్చాను.
నాకు అందిన సెప్టెంబరు-2005 సంచిక చూసిన తరువాత "కాస్త ముందుగానే, చందా కట్టి ఉండాల్సింది.." అనిపించేంత
చక్కగా ఉంది.
మంచి సాహిత్యపు విలువలతో, మిత్రులు జంపాలవారి ఆధ్వర్యంలో క్రితం ఏడాది నుంచి వెలువడుతోంది.
బాపు, ముళ్లపూడి, సిరివెన్నెల వగైరా పెద్దలు సలహాదార్లుగా ఉన్నారంటే, లోపల ఉన్న సరుకు
ఎలా ఉంటుందో ఊహించవచ్చు. 2 ఏళ్ల చందా కేవలం $44 మాత్రమే!(24 సంచికలు). Online చందా కట్టే
అవకాశం కూడా ఉన్నది.
కేవలం తెలుగు అక్షరమే కనపడని అమెరికా తెలుగువాళ్ల ఇళ్లలో, ఒక తెలుగు మాస పత్రిక ఉండవలసిన అవసరం ఉంది.
ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్నఇళ్లలో, అందమైన తెలుగు అక్షరాలతో సుందరాంగమైన పత్రిక ఉంటే, పిల్లలకు తెలుగు
నేర్చుకోవాలనే ఉత్సుకత వస్తుంది.
Posted by Murali
( Sep 18 2005, 10:49:54 PM EDT )
Permalink
Comments [4]
గూటికి ఇండియా యాత్ర పూర్తిచేసుకొని గూటికి చేరి నాలుగు రోజులయింది. రైల్లో తోటి ప్రయాణీకుని
వద్ద అంటించుకొన్న దగ్గు ఇప్పుడే తగ్గు ముఖం పడుతోంది.
ఒక పూట నూజివీడు వెళ్లి వచ్చాను. మా ఇంట్లో అద్దెకున్న వాళ్లు "బావిలో నీరు మోటారుకు అందటంలేదు, బోరు
వేయించండి బాబోయ్" అంటూ మొత్తుకున్నారు. పది/పదిహేనేళ్ల క్రితం వానాకాలంలో, మా బావిలో నీళ్లు, చేద
సాయంలేకుండా లోటాతో ముంచుకునేట్లు ఉండేవి. ఇప్పుడు చూస్తిని కదా, ఉన్న నలభై వరలూ కనపడుతున్నాయి.
నీరు ఎక్కడో పాతాళంలో ఉన్నాయి.
అద్దెకున్న వారితో మాటల్లో తెలిసింది, ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ బోర్లు వెలిసాయట. ఇదివరకు 100 అడుగుల బోరు
వేసేవారు, ఇప్పుడు 300 అడుగులు వరకూ వేయవలసి వస్తోంది.
నిజానికి, కేవలం నూజివీడులోనే కాదు యావత్ప్రపంచంలో నీటి ఎద్దడి పెరుగుతోంది. ఒక్క అంగుళం కూడా ఖాళీ లేకుండా
ఇళ్లు కట్టుకోవడం, చుట్టూ గచ్చు చేయించి, ఒక మూల బోరువేయడం పరిపాటి. ఇలాగు చేయడం వలన
వాననీరు భూమిలోకి ఇంకి భూగర్భజలాలను నింపే అవకాశమే లేదు.
ఇది వరకట్లా బావులుంటే, వర్షం పడినప్పుడల్లా బావులు నిండి కాస్తోకూస్తో భూగర్భ జలాలు నిండేవి.
అందుకని, బోరు వేసిన ప్రతి ఇంట్లోనూ, తప్పకుండా ఒక బావి కానీ, ఇంకుడు గుంత కానీ తప్పని సరిగా
ఉండాలి అని ప్రభుత్వం పాలసీ చేయాలి. లేకపోతే త్వరలోనే 500-1000 అడుగుల వరకూ భూమిలోకి
బోర్లువేసే పరిస్థితి వస్తుంది.
ప్రస్తుతం మా అమ్మ బోరు వేయించే పని మీద నూజివీడులో ఉన్నారు. బోరువేసి, మోటరు పెట్టి, overhead tank
కట్టించడానికి ప్రస్తుతం ఖర్చు, సుమారు రూ.30,000 అని తేల్చారు.
Posted by Murali
( Sep 08 2005, 10:26:41 AM EDT )
Permalink
Comments [1]
కుక్కల కోసం యోగా! అర్ధరాత్రి ఒంటిగంటకు, టీవీలో "Access Hollywood" కార్యక్రమం చూస్తున్నా. ఎప్పటి
ఎపిసోడో తెలియదుమరి. "Access Holly-woof" అని పేరు మార్పుతో ప్రత్యేక ఎపిసోడ్
వస్తోంది. హాలీవుడ్లో కుక్కలతో ఎలా నటింపచేస్తారో వివరిస్తున్నారు. ఎవరు training ఇస్తారు,
పత్రికలపై ముఖచిత్రాల కోసం నటీనటులను ఎలా ఫొటోలు తీస్తారు వంటివి చూపించారు.
మరి, పాపం, ఆ శునకరాజులు,రాణులు ఇంతింత పనులు చేసి అలసిపోతాయి. లేదా చాలా మంది
నటీనటులు షూటింగులతో అలసిసొలసి, తమతమ పెంపుడు కుక్కలతో ఎక్కువ సమయం
కేటాయించ లేకపోవచ్చు. అలాంటి వారి కోసమేనట "కుక్కల కోసం యోగా(yoga for dogs)"
మొదలయింది.
ఎంచక్కా మన పెంపుడు కుక్కలతో వెళ్ళి యోగా చేసుకోవచ్చు. వాటితో "quality time"
గడిపినట్టుంటుంది, వాటికి అలసట కూడా తీరి, ఉత్సాహంగా ఉంటాయి అంటూ చూపించిన
యోగా టీచరు, "ఓం..ఓం..ఓం.." అంటూ కుక్క చెవిలో అనసాగింది. నాకయితే నవ్వాగలేదు.
"Lost in translation" సినిమా, మొదటిసారి బోర్ కొట్టినా, మళ్లీ చూడాలి అనిపిస్తోంది.
అలా యోగా చేయించినందుకు, గంటకు $100 డాలర్లు రుసుము. లాభసాటి వ్యాపారమే!
వెర్రి వేయి విధాలు అని ఊరికినే అనలేదు కదా. మనుష్యులు చేస్తే యోగా, కుక్కలు చేస్తే "డోగా".
యోగా చేసేవాళ్లు యోగులు, మరి యోగా చేసే కుక్కలు డోగీలు. అబ్బో ఇలాటి పదాలు చాలా
ఉన్నాయి! నమ్మకం లేకపోతే చూడండి:
http://www.google.com/search?q=yoga+for+dogs
Posted by Murali
( Aug 07 2005, 12:47:50 AM EDT )
Permalink
Comments [2]
పెరుగు : నోటి దుర్వాసనకు విరుగుడు! ప్రతినెలా మా అపార్ట్మెంట్ కాంప్లెక్స్ వాళ్లు ఒక newsletter పంపిస్తారు. గత సంచికలో
"పెరుగు తింటే నోటి దుర్వాసన పోతుంది!" అని చిన్న బాక్సులో "మీకు తెలుసా?" శీర్షిక
వ్రాసారు.
అది నిజమాకాదా అని ఇంటర్నెట్లో వెదికాను. ఇది చూడండి:
Yogurt: An Antidote to Bad Breath?
మా ఇంట్లో పిల్లలకు తరచూ నోటిపూత వస్తుంటే, రాత్రి తోడిపెట్టిన పాలలో అన్నం వేసి, ప్రొద్దునే
ఆ సద్ది పెరుగన్నం తినమనే వాళ్లు. ఏదో సద్దెన్నాన్ని ఖర్చు చేయటానికి ఇదొక చిట్కా అనుకునేవాణ్ణి. కానీ
ఇంత మర్మం ఉంటుందని ఊహించలేం. అలాగే, "మిసమ్మ" సినిమాలో అనుకుంటా, "లేదు మాస్టారూ, ఇప్పుడేగా సద్దెన్నంలో
పెరుగేసుకొని తినొచ్చా.", అని జమున పాత్ర అంటుంది.
"పెద్దవాళ్ల మాట సద్దెన్నం మూట" అనే నానుడిని "పెద్దవాళ్ల మాట పెరుగేసిన సద్దెన్నం మూట" మార్చాలని తెలుగు
భాషాసంఘానికి ఇదే నా సవినయ విఙ్ఞప్తి. :)
Posted by Murali
( Aug 06 2005, 09:36:53 PM EDT )
Permalink
స్పామర్లతో యుద్ధం గత వారంలో నా ISP నుంచి ఈమెయిలు వచ్చింది. దాని సారాంశం "నీ వెబ్సైటు bandwidth మించిపోయింది.
కావున, మరొక $1 ఛార్జి చేస్తున్నాము". stats చూస్తిని కదా, దాని నిండా "referer spam". ఉదాహరణకి,
వేరొక వెబ్సైటులో ఉన్న సాహితి.ఆర్గ్ లింకు ద్వారా వచ్చారనుకోండి, ఫలానా లింకు నుంచి ఈ నెలలో ఇంత మంది వాచ్చారని
ఉంటుంది. ఈ "refere spam" మూలాన, అదేదో allaboutall.com నుంచి రోజుకు వేయి మంది
వచ్చారని ఉంటుంది. ఆ వెబ్సైటుకు వెళ్లి చూస్తే, సాహితీ.ఆర్గ్ లింకు ఉండదు.
అందుకని, గత నాలుగేళ్లుగా లేనిది, కొన్ని IP అడ్రస్సులు, hostsలకు ప్రవేశం నిరాకరించాలని నిర్ణయించుకున్నాను.
వాడెవడో వ్యాపారనిమిత్తం స్పాము పంపిస్తే, మనకు డబ్బు క్షవరం.
ఇలా కొన్ని హోస్టులను నిరాకరించడం/నిషేధించడం తేలికే. మీ వెబ్సైటు హోంపేజీ ఉన్న ఫోల్డరులో .htaccess
అనే పేరుతో ఒక ఫైలు ఉంచండి. దానిలో ఈ క్రింది విధంగా వ్రాస్తే, ఆయా IP అడ్రస్సులకు, హోస్టులకు ప్రవేశం
ఉండదు.
<limit GET POST> order allow,deny allow from all deny from xx.xx.xx.xx deny from xxx.xx.xx. deny from xxx.yyy.com </limit>Posted by Murali ( Aug 03 2005, 02:02:31 PM EDT ) Permalink
ట్రాఫిక్ లో సింప్యూటర్
http://news.bbc.co.uk/2/hi/south_asia/4725639.stm
ప్రస్తుతం సింప్యూటరును బెంగుళూరులో ట్రాఫిక్ పోలీసులు వాడుతున్నారట. గతంలో ట్రాఫిక్ ఉల్లంఘించిన
వాటికి విధించిన జరిమానాలకు ఎగనామం పెట్టినవారు దొరికితే, పోలీసులు వాటిని సింప్యూటరు ద్వారా
రాబట్టి మళ్లీ జరిమానా విధిస్తున్నారు. కనీసం ఆ భయంతో అయినా ఇష్టంవచ్చినట్టు బళ్లు నడిపేవారు
కాస్త జాగర్తగా నడిపితే నగారాలలో రోడ్డుప్రమాదాలు చాలా వరకు తగ్గుతాయి.
ఇదిగో-అదిగో అంటూ గత నాలుగేళ్లగా ఊరిస్తున్న సింప్యూటర్ ఉపయోగకరంగా, విజయవంతం కావటం
నిజంగా హర్షదాయకం.
Posted by Murali
( Aug 01 2005, 09:13:57 AM EDT )
Permalink
Comments [1]
పూలమ్మమ్మ "పూలమ్మమ్మ" అంటే బజారులో పూలు అమ్మే ఎవరో అమ్మమ్మ అనుకునేరు. కాదు కాదు. మా సొంత మామ్మ.
అదే ఉరఫ్ బామ్మ, నాయనమ్మ, పితామహి, grandma!. నూజివీడులోనే ఉండే మా బంధువుల పిల్లలు మా మామ్మని
"పూలమ్మమ్మ" అని పిలిచేవారు. జులై 27 మామ్మ పుట్టినరోజు.
ఇప్పుడు మా మామ్మ పోయి రెండేళ్లు కావస్తోంది. కొన్ని ఙ్ఞాపకాలయితే, మన ఊహ మరికొంత జతయ్యి,
మరింత తియ్యగా ఉంటాయి.
నేను రెండో తరగతిలో ఉన్నప్పుడు సొంత ఇల్లు కట్టుకున్నాం. అక్కడ ఉన్న తోటలను కొట్టేసి ప్లాట్లగా మార్చి
అక్కడక్కడా ఇళ్లు పడుతున్నాయి. భూమి చాలా సారవంతంగా ఉండేది. మా మామ్మకు మొక్కలంటే చాలా
ప్రీతి. మొదటి రెండు సంవత్సరాలు బంతులు(ముద్ద, బంగాళా, ఒంట రెక్క, కారపు) విరగ పూసేవి. మళ్లకు
మళ్లు పచ్చపచ్చగా, ఎర్రఎర్రగా, రంగురంగులతో చూడ ముచ్చటగా ఉండేవి. వాటిని కోసి దండలు కట్టి గుమ్మాలకు
తోరణాలుగా కట్టేవాళ్లు. బంతులు,చేమంతులు వగైరా ఏ ఏటికాఏడు క్రొత్త మొక్కలు వేసుకోవాల్సిందే కాబట్టి ఈ తోరణాలు
మరలా సంవత్సరానికి విత్తనాలుగా పనికొచ్చేవి.
క్రమంగా జామ, కొబ్బరి, ములగ, దానిమ్మ, నారింజ పళ్ల చెట్లు పెరగి పెద్దవటం మూలాన మళ్లకు మళ్లు పూలచెట్లు ఉండేవి కావు.
కాని చెట్ల మధ్యలో నడిచే దోవకు ఇరుపక్కలా చిలకముక్కుపూలు, కనకాంబరాలు, ప్రహరీ గోడ వారగా మందారం, కాగితం పూలు,
చంద్రకాంతం చెట్లు, బావి వారగా నందివర్ధనం, డాబా మీదకు పాకే సన్నజాజి, రాధామనోహరం తీగలు, గుమ్మం ముందుగా చిన్న గులాబీ మొక్క,
కొంచెం పక్కగా మల్లె పొదలు ఉండేవి.
ఇవీ మా ఇంట్లో పూలచెట్లు:
మరోసారి పద్మ! (వె. 0.3.4) డిజిటల్ తెలుగులో అడిగినదే తడవున
వెన్న నాగార్జున తన పద్మవె. 0.3.4, సాఫ్ట్వేర్లో క్రొత్త ఫీచర్ జతచేసారు.
ఇప్పుడు ఎంచక్కా ఆంధ్రప్రభ, జ్యోతి, ఈనాడు వగైరా సైట్లు ఆటోమేటిగ్గా యూనీకోడ్లో మార్చబడతాయి.
లినక్స్ వాడేవారికి ఇది వరం లాటిది. Firefox బ్రౌజర్ + పద్మ సాఫ్ట్వేర్ ఉంటే చాలు తెలుగు దినపత్రికలు చదువుకోవచ్చు.
మహా అయితే ఒక యూనీకోడ్ ఫాంటు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతే. ప్రతి సైటుకు వెళ్లి ఆయా ఫాంట్లు
డౌన్లోడు చేసుకోనక్కర లేదు.
keywords: eenadu, andhraprabha, andhrajyothy, fonts, firefox, install, telugu, unicode
Posted by Murali
( Jul 19 2005, 10:10:26 AM EDT )
Permalink
తానా 2005 - ఆదివారం ప్రహసనం శనివారం రాత్రి సినీ విదూషకులు(కమీడియన్లు) స్టేజిపై హాస్యం పుట్టించడానికి కష్టపడుతుంటే, మధ్యలోనే
సుమారు 12.00గం. అర్ధరాత్రికి బయటకు వచ్చేసాను. తానా సభలు(సంబరాలు?) జరిగిన కోబో సెంటరు
నుండి నేనుండే ఆన్ ఆర్బరు 40ని. దూరం. ఇంటికి వచ్చి మా రూమ్మేటుతో విశేషాలు చెప్పి పడుకునేసరికి
రాత్రి 3గం. అయింది. మరలా ప్రొద్దునే 9గం. కల్లా సభలు ప్రారంభం. నేను వెళ్లాలనుకున్న లిటరరీ సెషను
9:30గం.లకు మొదలు.
ప్రొద్దున నిద్రలేచేసరికి 8:35గం! గబగబా తయారయి, 9:00గం. బయలుదేరి, యమాస్పీడు మీద కోబో హాలు
పార్కింగ్ చేరే సరికి 9:25! ఇంకేముంది, సమయానికన్నా ముందే వచ్చానని చాలా సంబరపడిపోయాను. కారు
తలుపేసి రెండడుగులు వేసానోలేదో, తెలిసొచ్చింది, కారుతాళాలు లోపలే ఉండిపోయాయి! ఇంక చూడాలి నా అవస్థ.
ముందు అక్కడ ఉన్న ఆడ సెక్యూరిటీ గార్డును సాయం అడిగా. తలుపు సందులలో నుంచి దూర్చి తాళం తీయగల కొక్కెం
లాంటి సాధనమేదైనా ఉందేమోనని. ఆవిడ లోపలనున్న మేనేజరు "bud"ను అడిగింది. అతనేమో కాస్త సమయస్ఫూర్తి
ఉపయోగించి, బట్టలు తగిలించే హేంగరు ఒకటి పీకిచ్చాడు. అదేమో అష్టవంకర్లు తిరిగి ఉంది. దాన్ని పట్టుకెళ్లి ఒక
అయిదు నిమిషాలసేపు కుస్తీపట్టాను. చెమటతో చొక్కా తడిసిందే తప్పించి ఉపయోగం లేకపోయింది. సమయం 9:45గం.
మళ్లీ మేనేజరు దగ్గరకు వెళ్లి, దగ్గరలో towing కంపెనీలు ఏమైనా ఉన్నాయా అని విచారించాను. అతను వెంటనే
ఇంటర్నెట్లో చూసి, దగ్గర్లో ఉన్న కంపెనీ ఫోను నంబరు చెప్పి, కావాలంటే తన ఫోను వాడుకోమన్నాడు. ఆ కంపెనీ
వాడు "$55 డాలర్లు అవుతుంది. పర్లేదా?" అన్నాడు. "సరే! కానీ! త్వరగా లేచి, నింపాదిగారాక, కంగారులో
చేస్తే ఇలాగే అవుతుందని నన్ను నేను నాలుగు తిట్లు తిట్టుకొను. చేసిన వెధవపనికి మంచి శిక్ష" అనుకున్నా.
ఫోను తీసుకొని, bud ఆ కంపెనీ వాడికి అడ్రసు చెప్పాడు. ఆ కంపెనీ వాడు కేవలం డబ్బుతీసుకుంటానని, క్రెడిట్ కార్డు
చెల్లదని చెప్పడట. ATM మెషీను ఎక్కడుందో అడిగి, "బాబూ, bud. కాస్త ఆ towing కంపెనీ వాడొస్తే తాళంచెవులు
తీయించి ఉంచు. ఫలానాది నా కారు." అని చెప్పి వెళ్లా. సమయం 9:55గం.
కొద్దిదూరంలోనే ఒక ATM ఉంది. గబగబా కార్డుపెట్టి డబ్బులు తీయాలని చూసా. రెండు నిమిషాల తరువాత "sorry.
Unknown communications problem" అంటూ వెక్కిరించింది. భీముడు చెట్టును పెకిలించినట్టు అటూఇటూ
ఊపి ఆ ATMను పెకిలించి విసిరేద్దామనుకున్నా. మళ్లీ పోలీసులు వస్తే కష్టం, సమయంలేదని ఊరుకున్నా. అదృష్టం కొద్దీ
పక్కనే కొద్ది దూరంలో మరో ATM ఉన్నది. కొంచెం భయంభయంగా ప్రత్నించా. "హుర్రే!" 10:00గం.
ఆ towing కంపెనీ వాడు ఇంకా రాలేదు. ఇప్పటికే అరగంట ఆలశ్యం. లిటరరీ సెషనులో ఉపన్యాసాలని రికార్డు చేస్తానని
మాటిచ్చాను. మళ్లీ సెక్యూరిటీగార్డును సాయం అడిగా, "ఆ $55 డాలర్లు నీకిస్తాను. తాళంచెవులు తీయించి నీ దగ్గరుంచుతావా?
మళ్లీ వచ్చి తీసుకెళ్తాను". "అబ్బెబ్బే, నేను ఆ పని చేయకూడదు. కావలంటే bud చేయొచ్చు" అన్నది. సరేలెమ్మని
budకి డబ్బు ఇచ్చి, పరుగులాంటి నడకతోనో, పరుగుతోనో పార్కింగు నుంచి లిటరరీ సెషనుకొచ్చాను. వచ్చే ఒలింపిక్సు,
100మీ. dashలో భారాతీయులెవరన్నా ఉంటే అది నేనే! :) సమయం 10:10గం.
మరో గంట తరువాత సెషను మధ్యలో లేచి వెళ్లి తాళంచెవులు తెచ్చుకున్నా.
**
సాయంత్రం సుమారు 5:00-5:30గం. సమయం. లిటరరీ సెషను అయిపోవచ్చింది. మరో అర-ముప్పావుగంట ఉన్నది.
ప్రొద్దుట నేను, పార్కింగులో కారుతో కుస్తీ పడుతుంటే పట్టిన చెమట, బంకగా, తుమ్మజిగురుగా, crazyglueగా మారిందని
గుర్తించలేదు. ఏదో ఆలోచిస్తూ పెట్టుకున్న కళ్లజోడును ఒకసారి లాగాను. ఒంటికి అతుక్కుపోయిన కళ్లజోడు ఫ్రేము విరిగి కూర్చుంది.
"సరేలే, ఇలాగ గడిపేద్దాం!" అని జోడుని జేబులో పెట్టుకొని కూర్చున్నా.
సెషను అయిపోయిన తరువాత వెళ్లి, కారులో రెండేళ్ల క్రితంనాటి పాత కళ్లజోడు ఉంటే తెచ్చుకున్నా. అది పెట్టుకొని సెంటర్ స్టేజి
ఉన్నా హాలులోకి వెళ్లాను. "సినీతార లయ వచ్చి తానా ఆటలపోటీలలో నెగ్గినవారికి బహుమతులు అందజేస్తారంటూ" అనౌన్సు
చేసారు. వాలీబాల్, త్రోబాల్..వగైరా నడుస్తున్నాయి. నాకు నెమ్మదిగా తలనొప్పి ప్రారంభమయింది. ఆ పాత కళ్లజోడు
నాకు సరిపోదని గ్రహించా.
ఇంక చూడు, ముందు అక్కడ పక్కనే ఉన్న సౌండువాళ్లను, "super-glue లాంటిదేమైనా ఉందా గురూ?" అని అడిగాను.
"సారీ" అని సమాధానం. బయటకు వస్తూ తలుపు దగ్గర కూర్చున్న సెక్యూరిటీ ఆవిడను అడిగా. "What? I dont have
any." అంటూ చిరాగ్గా చూసింది. "డామిట్! కళ్లజోడు పెట్టుకునే వాళ్లంటే ప్రతి వాడికీ లోకువే", అని నెమ్మదిగా మొదటి
ఫ్లోర్ కొచ్చాను. అక్కడ రకరకాల వ్యాపారాల స్టాల్స్ ఉన్నాయి. ఒకటి రెండు నగల షాపులలో అడిగి చూసాను. లాభంలేదు.
తెలుగునాడి పత్రిక వాళ్లను అడిగి చూసాను. లాభంలేదు. ఏవో ఫ్రేములు అవి అమ్ముతున్నారు. వాళ్లను అడిగా. అబ్బే లాభంలేదు.
సమయం సా. 7:00గం అవుతోంది. అందరూ భోజనాలకు బయల్దేరుతున్నారు. వ్యాపారాలవాళ్లు సరంజామా అదీ సర్దేస్తున్నారు.
తలనొప్పి కాస్త ఎక్కువవుతున్నట్టు అనిపిస్తోంది. ఆఖరి ప్రయత్నంగా మరో రెండు జ్యూలరీ షాపులలో ప్రత్నించా. "హుర్రే!"
Hi-glow Jwelers వాళ్ల దగ్గర క్రేజీ-గ్లూ ఉన్నదని ఇచ్చారు. సంతోషంతో, గజేంద్ర మోక్షంలో అదేదో పద్యం
అందుకొనే వాడినే, కానీ రాదని తెలిసి ఊరుకున్నా. ఒక అయిదు నిమిషాలు కష్టపడి, పది-పదిహేను సార్లు థాంక్స్
చేప్పి వాచ్చేసా.
భోజనాల దగ్గర మిత్రులు పా.ల.న.గారు, "అరే! నా దగ్గర ఎప్పుడూ కళ్లజోడు రిపేర్ కిట్ ఉంటుంది. నన్నడగవలసింది."
అన్నారు. చంకలో పిల్లను పెట్టుకొని ఊరంతా వెతికిందట ఎవరో!
**
Posted by Murali
( Jul 07 2005, 09:28:39 AM EDT )
Permalink
తెలుగు శోధిని ఇంకేముంది సాఫ్ట్వేర్ రంగంలో ఇండియా 2మ్మచ్, తెలుగువాళ్లు ఇంకా 2మ్మచ్ అంటు రొమ్ములు విరగదీసుకుంటాం.
మీసాలు మెలేస్తాం. తొడలు చరుస్తాం. రకరకాల తీర్మానాలు చేస్తాం. కొండకచో రక్తం కళ్ల చూస్తాం. ఇంకా ఎవేవో చేసేస్తాం.
కానీ, నిజం చెప్పాలంటే, కంప్యూటర్లలో భారతీయభాషల వాడుక చాలా తక్కువ. తమిళం, హిందీ కాస్తోకూస్తో ఫర్వాలేదు. తెలుగు మరీ అధ్వానం. ఎటువంటి datasharing సత్తాలేని 3-4 వార్తాపత్రికలు, ఇంగ్లీషులో ఉండే 5-6 సినిమా పోర్టళ్లు, సాహిత్యం అంటూ పేరుపెట్టుకునే అనామక సైట్లు. ఇదీ నిర్వాకం.
సరే,సరే పరిస్థితి మరీ అంత ఘోరం కాదు. యూనీకోడ్ పుణ్యామా అని, ఇప్పుడు తిన్నగా తెలుగులో వ్రాసేవీలుంది.
ఇంకేముంది ఇదొక నిశ్శబ్ద విప్లవం అంటూ మిత్రులు వ్రాసేస్తున్నారు. విప్లవం సంగతి దేవుడెరుగు, నిశ్శబ్దంగా నెమ్మదిగా కుంటుతూ
ఉండకుండా ఉంటే అదే పదివేలు.
బ్లాగుల వలన తెలుగు ఇప్పుడు కొద్దికొద్దిగా ఇంటర్నెట్లో సామాన్య జనం వాడుతున్నారు.
ఉదాహరణకు ఇప్పుడు ఎంచక్కా ఇంటర్నెట్లో తెలుగుపదాలు శోధించుకోవచ్చు. ఉదాహరణకు ఇవిచూడండి.
తానా - 2005 రెండేళ్లకొకసారి జరిగే తానా మహాసభలు, ఈ సంవత్సరం జులై 1-3 తారీఖులలో మిచిగన్ రాష్ట్రంలోని డిట్రాయిట్ నగరంలో జరగనున్నాయి.
ప్రవేశ రుసుం $160. ఆలస్యంగా నమోదు చేస్తే రుసుము $200కు పెరుగుతుంది! నేను తక్కువలొనే(?) రిజిస్ట్రేషను చేసేను. ఇప్పటివరకు ఆటా/తానా సభలకు వెళ్లలేదు. వీటిలో ఉండే సందడి/గోల గురించి వినటమే కాని ప్రత్యక్షంగా చూసి ఎరుగను.
క్రిందటి వారాంతంలో తానా సభల సందర్భంగా డిట్రాయట్ తెలుగు సంఘం వారు నిర్వహించిన వాలీబాల్ పోటీలకు కూడా వెళ్లాను. వచ్చిన పది టీములను రెండు గ్రూపులుగా విభజించారు. మా టీం ఆడిన ఐదు మ్యాచులలో ఒకటే ఒక్క మ్యాచ్ గెలిచింది :). గెలుపుకాదు పాల్గొనటం ముఖ్యం అనుకుంటూ వెనుదిరిగాం.
మా లిటరరీ క్లబ్ వాళ్లు సాహిత్యనికి సంబంధించిన కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారు. పిల్లలకు "పదఙ్ఞాన పోటీలు", పెద్దవారికి "ఒక్క నిమిషంలో" (JAM - Just A Minute) వగైరా నిర్వహిస్తున్నరు. భారతదేశం నుంది వచ్చిన ప్రముఖ సాహితీవేత్తల ప్రసంగాలు ఉండనే ఉంటాయి.
సమావేశానికి వచ్చిన వారికి తెలుగు యూనీకోడ్ గురించి తెలియజేయాలని DigitalTelugu గ్రూపువారు ప్రయత్నిస్తున్నారు.
"ఏదో నేర్చుకుందాం, సాదిధ్దాం అనుకుంటూ వెళ్లకు. రెండ్రోజులూ ఉన్నవి చూసి,విని వచ్చేయి. అంతే" అంటూ ఒక స్నేహితుడు హెచ్చరక. మరొక స్నేహితుడు, "డిట్రాయిట్ నదీ వ్యాహ్యాళికి(river cruise) వెళ్తున్నావా? లయ వస్తోందట!" అంటూ ఫోను. మరొకళ్లు "ఇటువంటి వన్నీ శుద్ధ వేస్ట్. నేను రావట్లేదు. ఖర్చు దండగ" అంటూ చప్పరింపులు.
చూడాలి, తానా - 2005 ఎలా జరుగుతుందో?
Posted by Murali
( Jun 21 2005, 11:31:24 AM EDT )
Permalink
"స్వామినారాయణ" మందిరం, చికాగో ఆ మధ్యన గుజరాత్ రాష్ట్రంలో "అక్షరధాం" గుడిలోనకు చొరబడి, విధ్వంసం చేయ ప్రయత్నించిన
ఇద్దరిని NSG కమాండోలు హతమార్చిన సంగతి విదితమే.
అప్పటి వరకు "అక్షరధాం" గుళ్ల గురించి నేను వినలేదు. అప్పటి వార్తలలో ఆ గుడి "స్వామినారయణ్"
చెందినది అని చదివి శ్రీమన్నారాయణ/సత్యన్నారాయణ వగైరాలాగా "విష్ణుమూర్తి" పేరే అనుకున్నాను.
"స్వామినారయణ్" గురించ అంతకు మించి నేను పెద్దగా ఆలోచించలేదు.
ఈ వారాంతంలో మరో ఇద్దరు స్నేహితులతో కలసి, మరో స్నేహితుణ్ణి కలవడానికి చికాగో వెళ్ల్లాను.
అక్కడ ఒక రామాలయం (lemont temple), ఒక వేంకటేశ్వరాలయం (aurora temple/balaji temple)
చాలా ప్రసిద్ధి. వేంకటేశ్వరాలయానికి వెళ్లి వస్తుండగా, "ఈ మధ్యన స్వామినారాయణ్ గుడి కట్టారు. చాలా బావుంటుంది.
చూద్దాం. దార్లోనే!" అని చికాగో స్నేహితుడు చెప్పగ సరేనని నలుగురం అక్కడ ఆగాము.
అక్కడకు వెళ్లిన తరువాత గానీ నాకు తెలియలేదు. "స్వామినారాయణ్" అంటే 1781లో నేటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో
పుట్టిన ఒక ప్రవక్త. ఆయన్నే విష్ణుమూర్తి అవతారంగా కొలుస్తారు. అంటే దక్షిణభారతంలో షిరిడీ సాయిబాబా,
సత్యసాయిబాబా, గణపతి సచ్చిదానందస్వామి, మాతా అమృతానందమయి మొదలయిన వారికి మల్లే.
ఇక గుడి వివరాలకు వస్తే, ఉత్తరభారతంలో ఉన గుళ్లను పోలిన గోపురాలు, పాలరాతి విగ్రహాలు, పాలరాతి
స్తంభాలు/గోడలు/మండపాలు, గుడి ప్రక్కనే పెద్ద కల్యాణ/భోజన శాల ఉన్నాయి. గుడి కోసం వాడిన పాలరాతిని ఇటలీ నుంచి భారతదేశానికి
తరలించి, స్తంభాలు, గోడలపైన నగిషీలు చెక్కించి, తిరిగి అమెరికాకు తెప్పించారట. "అబ్బ! తాజమహల్ అంత
అధ్భుతంగా ఉందిరా.." అంటూ మా స్నేహితుడు వ్యాఖ్యానించాడు. అలాగే పక్కనే ఉన శాలలో ఉన్న చెక్క నగిషీలు కూడా
భారతదేశంలో తయారయినవేనట. శాలనుంచి, గుడికి వెళ్లే హాలులో "సనాతన ధర్మం" గురుంచి, భారతీయుల గొప్పదనం గురించి పోస్టర్లు
ఉన్నాయి.
సామినారాయణ్ ఆలయాలను "అక్షరధామా"లని వ్యవహరిస్తారు. "అక్షరధామం = అ + క్షర + ధామం = నశింపు లేనిది"
అని అర్ధం.
నిజానికి, మొదటిసారి కావటం మూలాన భవన్నామ స్మరణకంటే కట్టడంలోని అందాన్ని చూస్తూ గడిపాను. ప్రస్తుతం ఇంకా
ఆలయం/శాల పనులు నడుస్తునే ఉన్నాయి. అవన్నీ పూర్తయితే మరింత సుందరంగా ఉంటుంది. అక్కడున్నవారు
ఉత్సుకతతో చూడటానికి వచ్చిన అమెకన్లకు గైడ్లగా వ్యవహరించటం గమనించాను. ఆయుర్వేదం, సీడీలు, పుస్తకాలు
వగైరా అమ్మకానికి లోపల ఒక స్టోరు ఉన్నది. వీరి సామాజిక సేవల గురించి వివరించే కొన్ని ఫొటోలు శాలలో
ఉన్నాయి.
ఈ "స్వామినారాయణ్" ఆలయాల గురించి కాని, వారి ఆధ్యాత్మిక చింతన గురించి తెలుసుకోవాలనుకున్నవారు http://www.swaminarayan.org చూడండి.
ప్రపంచవ్యాప్తంగా "స్వామినారయణ్" ఆలాయలు, ఇతర సామాజిక సేవల BAPS
(Bochasanwasi Shri Akshar
Purushottam Swaminarayan Sanstha) ఆధ్వర్యంలో నిర్వహింపబడతాయి.
Dislaimer: పైన వ్రాసిన వివరాలన్నీ కేవలం నాకు తెలిసినంత, అర్ధమయినంత వరకు మత్రమే :)
Keywords: swami narayan, swaminarayan, chicago, hindu, temple
Posted by Murali
( Jun 13 2005, 01:56:15 PM EDT )
Permalink