Wednesday May 04, 2005
మంగళంపల్లి కు ఫ్రెంచి అవార్డు! ప్రముఖ శాస్త్రీయ విద్వాంసులు శ్రీ మంగళంపల్లి బాలమురళికృష్ణ గారికి ఫ్రెంచి ప్రభుత్వం అత్యున్నత
కళాసేవ అవార్డు ప్రకటించింది. వివరాలు: http://www.hindu.com/thehindu/holnus/009200505021963.htm
ఈ సందర్భంగా ఆయని చిన్ననాటి ఫొటో. మృదంగంపైన శ్రీ ఉమలయాపురం శివరామన్.
(బొమ్మమీద క్లిక్ చేస్తే సరిగా కనబడుతుంది.)
Posted by Murali
( May 04 2005, 03:49:51 PM EDT )
Permalink
Comments [5]
త్యాగరాజ ఆరాధన - 2005 రెండువారాల తరువాత మళ్లీ బ్లాగు వ్రాయటానికి వీలు చిక్కింది. గత రెండు
వారాంతాలు క్లీవ్లాండ్ వెళ్లాను. అక్కడ జరిగే వార్షిక త్యాగరాజ ఆరాధనకు
వెళ్లాను.
గత నాలుగేళ్లగా ఇది నా వార్షిక కార్యక్రమాలలో ఒకటి అయింది. ఈ సంవత్సరం కొంచం బాగా ఆనందించాననిపించింది.
ఈసారి ఒక్కడినే వెళ్లటం మూలాన కూడా వచ్చే గ్యాంగుతో కబుర్లు చెప్పకుండా మనసుపెట్టి పాడిన దానిని
గమనించడం ఒక కారణమైతే, రెండవ కారణం పది-పదిహేను రాగాల వరకూ కాస్తోకూస్తో నడక పట్టుబడటం.
నేను విన్న కచ్చేరీలు:
9 - హరిహరపుత్రం పురాణాలలో "స్థల పురాణాల"ని ఉంటాయి. వాటిలో పుణ్యక్షేత్రాల గురించి, వివిధ
ప్రదేశాల వైశిష్ట్యం గురించి ఉంటాయి.
ముత్తుస్వామి దీక్షితులు వారు వ్రాసిన కృతులు కూడా ఒక రకంగా స్థలపురాణాలని
చెప్పవచ్చు. ఆయన చాలా సంవత్సరాలు చదువు విషయమై కాశీలో గడిపారు.
తరువాత విస్తృతంగా దేశాటన చేసారట. దీని వలన ఆయనకు వివిధ ప్రదేశాల
గురించి క్షుణ్ణమైన అవగానన ఉన్నది. ఆయా పుణ్య క్షేత్రాలలో ఉన్న దైవాలను
ఆయన స్తుతిస్తూ కృతులు వ్రాసారు.
అటువంటి కృతి మరొక దాన్ని ఇప్పుడు పరిచయం చేస్తాను. సంస్కృతంలోనున
ఈ కృతి కేరళలోని అయ్యప్పను గురించి ఉన్నది. రాగం: వసంత.
----------------
పల్లవి: హరిహరపుత్రం శాస్తారం, సదా భజేహం, మాయాకార్యం త్యజేహం
అనుపల్లవి: మురహరాది మోహిత, శౌరి గిరివిహారం, మురళీభేరీ వాద్యాది ప్రియకరం
ప్రార్థిత పుత్రప్రదం, వసంతనట బృందం, దీర్ఘాయుష్ప్రద, దీనజనసుఖప్రదం
చరణం: ఫాల్గుణమాస పౌర్ణిమావతారం, పాండ్య కేరళత్రం దేశ ప్రభాకరం,
పుష్ప శరేక్షు కార్ముక ధరం, ఫుల్ల కల్హార దండ ధరకరం,
కలియుగప్రత్యక్షం గర్విత దక్ష శిక్షం, వర గురుగుహాంతరంగం, రథగజతురంగం
----------------
ఈ కృతి మొదటసారి శ్రీమతి ఎం.ఎస్.సుబ్బలక్ష్మి పాడినది ఒక క్యాసెట్లో విన్నాను.
భక్తి భావం నిండి ఉన్న కృతి. కానీ ఏ దేవత గురించి వ్రాసారో తెలియలేదు.
"హరిహరపుత్రం శాస్తారం" అన్ని మొదలయ్యే కృతి హరి(విష్ణువు), హర(శివుడు) వీరిద్దరకూ
పుట్టినది ఎవరబ్బా అనుకున్నాను. ఇంటర్నెట్లో వెతికితే గుర్తొచ్చింది. విష్ణువు మోహినీ
రూపం ధరించి ఉండగా, శివుడు+మోహినీ రూపాలకు కలిగిన సంతానం "అయ్యప్ప".
"శాస్తారం" అంటే అయ్యప్ప అని అర్థమట. అందుకే చరణంలో "కేరళత్రం దేశ ప్రభాకరం"
అని ఉన్నది.
కృతి ఎవరి గురించో తెలిస్తే మిగతాది అర్ధంచేసుకోవటం తేలికే. మొత్తం స్తుతి ప్రధానమైనది.
పైన కామాలు(commas) ఉన్నచోట విడివిడిగా చదువుకుంటే అర్ధమవుతుంది.
అనుపల్లవి రెండవ లైనులో "వసంతనట" అన్న వాడుకలో రాగంపేరు చక్కగా ఇమిడింది.
అలాగే చరణం ఆఖరు లైనులో "గురుగుహాంతరంగం" లో దీక్షితులవారి ముద్ర "గురుగుహ"
ఇమిడిపోయింది.
Posted by Murali
( Mar 22 2005, 01:08:25 PM EST )
Permalink
Comments [1]
అమ్మాయి బాగుంది క్రిందటి శనివారం ఒక స్నేహితుడు వస్తే, నేనూ నా రూమ్మేటు + అతను కలసి
"జానే భీ దో యారో" అనే పాత హిందీ సినిమా, "అమ్మాయి బాగుంది" అనే
క్రొత్త తెలుగు సినిమా తెచ్చాము.
ముందుగా "జానే భీ దో యారో" చూసాం. హాస్యం, వ్యంగ్యం ప్రధానమైన సినిమా.
ఇంతకు ముందు చూసినదే కాబట్టి, హాస్యానికన్నా వ్యంగ్యం ఎక్కువగా నచ్చినది. కొన్ని
హాస్యాలు మొదటిసారి మాత్రమే బావుంటాయి. సినిమా కధనం చాలా పకడ్బందీగా నడుస్తుంది.
ప్రతి సంభాషణలోనూ ఒక పదునుంటుంది.
తరువాత "అమ్మాయి బాగుంది" సినిమా మొదలుపెట్టాం. నేనూ నా రూమ్మేటు క్రొత్త తెలుగు సినిమాలు
తరచూ చూస్తాం కాబట్టి అప్పుడప్పుడూ టీవీ వంక చూస్తూ మమూలుగా వేరే మాట్లాడుకుంటున్నాం.
మా స్నేహితుడు అమెరికా వచ్చి పది-పదిహేను ఏళ్ళయింది. ఈ మధ్యన వచ్చే తెలుగు సినిమాలు
చూడటం తక్కువ. ఏమిటీ హీరో పాన్ షాపు దగ్గర కూర్చొని సిగరెట్టు, కాఫీ తాగుతూ కూర్చున్నాడు,
కథ నడవదే అంటూ గొడవ.
మనకు తెలిసిన విషయమే. హీరో జులాయి వెధవ, పక్కనున్న తోటి వారు పనికిరాని వారు కాని
స్నేహంకోసం ఏమైనా చేస్తారు అని నిరూపించటానికి ఒక గంట పడుతుంది.
ఆ విషయాలన్నీ పక్కన పెడితే, హీరోయిన్ పాత్రకు శాస్త్రీయ సంగీతం అంటే ఇష్టం. ఇంకేముంది
"సామజవరగమన సాదుహృత్.." అంటూ ఎత్తుకుంటుంది ఒక చోట. మన హీరో మోడ్రన్ కాబట్టి
"ఏముందీ సంగీతంలో?" అంటూ విసుక్కుంటాడు. "అరే! అదేమిట్రా పాడుతున్నది తెలుగు పాటే కదా!"
అంటూ పెదనాన్న పాత్ర అందుకుంటాడు. అక్కడే వచ్చింది నాకు చిక్కు.
నిజానికి "సామజవరగమన.."(హిందోళ రాగం) సంస్కృతంలో ఉన్న పాట. త్యాగరాజు వ్రాసిన తెలుగు పాటలు
చాలా ఉండగా, సంస్కృతంలో వ్రాసినది ఎంచుకొని "తెలుగు పాటే కదా" అనటం కాస్త ఎబ్బెట్టుగా ఉంది.
బహుశా తరువాత వచ్చే పాట కూర్చటం(అదే రాగంలో) తేలిక కాబోలు. ఏ "మరుగేలరా ఓ రాఘవా.."
పాటో అందుకుంటే జయంతశ్రీ రాగంలో పాట కట్టటం కష్టమేమో.
మా స్నేహితుడు బాధ చూడలేక సినిమా మధ్యలో ఆపేసి అతను వెళ్ళిపోయిన తరువాత, మిగతాది పూర్తి చేసాం.
Posted by Murali
( Mar 18 2005, 10:37:09 AM EST )
Permalink
Comments [1]
శంషాబాద్ విమానాశ్రయం రభస హైదరాబాదులో కడుతున్న క్రొత్త విమానాశ్రయానికి ఏమి పేరు పెట్టాలి అని రాష్ట్ర సభలనుండి,
కేంద్ర పార్లమెంటు వరకూ రభస జరుగుతోంది.
కాంగ్రెసువారు "రాజీవ్ గాంధీ" పేరు, తెలుగుదేశం వారు "ఎన్టీరామారావు" పేరు సూచిస్తున్నారు.
రెండు పార్టీలవాళ్లూ చిన్నపిల్లలలాగా మాటకు మాట అనుకుంటూ విలువైన శాసనసభ సమయాన్ని
పాడుచేయటం విచారకరం.
నిజానికి నాకుమటుకూ నాకు రెండు పేర్లూ ఇష్టం లేవు :) ఇద్దరూ వారివారి హయాంలో
దేశానికి సేవచేసారు. కాదనను. "రాజీవ్" పేరు పెడితే తెలుగుప్రజలు నొచ్చుకుంటారని
తె.దే.పా. వాదన(నాకు దాంట్లో సదుద్దేశం కన్నా మాట నెగ్గించుకోవాలనే తాపత్రయమే ఎక్కువ
కనపడుతోంది.) కాదుకాదు "రాజీవ్" పేరయితే దేశ ప్రధాని కాబట్టి, దేశంకోసం
అశువులు బాసారు కనుక అదే ఉచితమని కాంగెస్ ప్రతివాదన. (దీంట్లో కూడా కేంద్రంలోనున్న
వారిని తృప్తి పరచటానికి మాత్రమే జరుగుతోందని నా ఊహ).
అందుకని నాదొక ఉచిత సలహా! తెలుగువాళ్ల మనసు నొప్పించ కూడదు అనే సదుద్దేశం,
మాజీ దేశ ప్రధాని పేరూ రెండూ కలసి వచ్చేట్టుగా పీ.వీ.నరసింహారావు పేరు ఖాయం చేయాలి!
దెబ్బకు రెండు పిట్టలు..రెండు పార్టీలు!
సరే పీవీ కాంగ్రెస్ పార్టీవారు మాకు ఇష్టంలేదు అంటే, అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని
నా రెండవ సూచన :) కాదు కూడదు అల్లూరికి హింసాయుతమైన చరిత్ర ఉన్నదనుకుంటే
ఇంకో సలహా!
మచ్చటగా "హైదరాబాద్ విమానాశ్రయం" అని నామకరణం చేసి, భవిష్యత్తులో ఇంకెవరూ
పేరు మార్చటానికి వీలులేకుండా ఒక ఆర్డినెన్సు జారీ చేస్తే ఉత్తమం.
అబ్బెబ్బే అలాగ కుదరదు అంటే, "సరే, కొట్టుకు చావండి" అని చేతులు దులుపుకోవడమే!
Posted by Murali
( Mar 16 2005, 11:09:02 AM EST )
Permalink
Pain in the neck.. contd.. మార్చి 3వ తారీఖున మొదలైన మెడనొప్పి మొత్తనికి పదిరోజులకు తగ్గుముఖం పట్టింది.
నొప్పి చాలావరకు తగ్గినట్టే.
కాని ఈ మెడ పట్టేసిన పుణ్యమా అని ఒక వారంరోజుల పాటు సరైన నిద్రలేదు. రాత్రి
పూట ఒక పక్కకు ఒత్తిగిల్లలేము. నిద్రలో పొరపాటున ఒత్తిగిల్లామా మెళకువ వచ్చేస్తుంది.
మళ్లీ కాస్త కునుకు పట్టాలంటే మరో పావుగంట. నిద్ర పట్టినట్టే పట్టి ఇంకో అరగంటకు మళ్లీ
మెళకువ. ఇలా ఉంటుంది కలత నిద్ర.
ఇప్పుడు నిద్రలేమి వల్ల వచ్చే చికాకులు తోడయ్యాయి. గత రెండురోజులుగా కుడి కన్ను
విపరీతంగా అదరటం మొదలయింది. ఇంగ్లీషులో "Eye twitching" అంటారు.
వారాంతమంతా శుభ్రంగా పడుకున్నా, ఇవేళ సోమవారం ఇంకా కాస్త అదురు ఉంది.
బహుశా ఇంకో రెండు రోజులు దీంతోకూడా కుస్తీపడితే మళ్లీ 100% ఆరోగ్యంగా
ఉండవచ్చని అనిపిస్తోంది.
పసిపిల్లలున్నవారు ఆఫీసుకొచ్చి "రాత్రి నిద్రలేదు గురూ!" అంటూ మూలిగేవాళ్ల మీద కాస్త జాలి
పెరిగింది :)
Posted by Murali
( Mar 14 2005, 10:22:53 AM EST )
Permalink
Comments [1]
రొయ్యల చెరువులు మాది నూజివీడు(కృష్ణాజిల్లా). నూజివీడు కాస్త మెట్టప్రాంతం. వరిలాంటి పంటలు తక్కువ, కేవలం తోటలు ఎక్కువ.
నేను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నాలుగేళ్లు చదువుకున్నాను. గోదావరి చుట్టుపక్కల వరిపొలాలతో చాలా
అందంగా ఉంటుంది. గత పదిహేను ఇరవై ఏళ్లలో అనుకుంటా పొలాలకు బదులు చేప, రొయ్య "పంటలు" పండించడం
ఎక్కువయింది. ఇది చాలా లాభసాటి వ్యాపారం.
ఈ చేప, రొయ్య పంటల కొరకు నీటిలో ఉప్పు కలపాల్సి వస్తుంది. అవి మంచినీటి "పంటలు" కాదు కదా, ఉప్పు
సముద్రం పంటలాయె. ఈ ఉప్పు కలపటం మూలాన క్రమంగా భూసారం తగ్గిపోతుంది. మామూలు మంచినీటి
పంటలు(వరి, గోధుమ, పప్పులు వగైరా) పండవు.
ఆ విషయానికి వస్తే ఉప్పు ఎక్కువవటం మూలాన దేనికైనా అనర్ధమే. మన శరీరంలో ఎక్కువైతే రక్తపోటు వస్తుంది.
పాలలో ఒక ఉప్పురాయి వేస్తే దెబ్బకు విరిగి కూర్చుంటుంది. అలాటిది కేవలం వ్యాపార లాభం కోసం మంచినీటిలో
బండ్లకొద్దీ ఉప్పు కలపటం మంచిదికాదు.
భూమిలో పెరిగిన salinity వలన చుట్టుపక్కల ఎకరాలకొద్దీ మంచినీటి పంటలకు హాని కలుగుతుంది. అదీకాక
ప్రతి సంవత్సరం ఈ చేప/రొయ్య పంటలకొరకు నీటిని మార్చాల్సివస్తుంది. అప్పుడు ఉన్న ఉప్పు నీటిని తోడేస్తారు లేదా
భూమిలోకి ఇంకిపోనిస్తారు.
ఈ మధ్యన ఒక తెలుగు దినపత్రికలో చదివాను. మనవాళ్లు బుద్ధి వక్రించి, చేపలు/రొయ్యలు బాగా పెరగటానికి
ఉప్పు కలపకుండా ఏకంగా సముద్రం నుంచీ ట్యాంకులతో నీటిని తెచ్చుకొని ఈ చేపలు/రొయ్యలు పెంచే కృత్రిమ
చెరువులు నింపుతున్నారట. నా ఉద్దేశ్యంలో ఇది తినే అన్నంలో విషం కలపటం లాంటిది.
ఒక్కొక్క ట్యాంకు సముద్రపు నీరు ఖరీదు రూ.200(?). దానిలో ప్రభుత్వానికి పన్నురూపంలో వాటా(?!)
ఈ పన్ను తప్పించుకోవటానికి దొంగవ్యాపారం. ఇలా నడుస్తోందట భాగోతం.
చివరకు చేఫలు/రొయ్యలు వ్యాపారం చేసుకొనే వాళ్లు బాగానేఉంటారు. ఒక వేళ భూమి సారంపోయి బీడుగా మారితే
చుట్టుపక్కల ఉన్న సన్నకారు రైతులకు తీరని నష్టం. ఇప్పుడు తెలంగాణా, రాయలసీమ ప్రాంతంలో జరుగుతున్న
ఆత్మహత్యల పరంపర కోస్తాలో కూడా మొదలవుతుంది. సారం పోయిన భూమి తిరిగి సాగుకు పనికి రావాలంటే
కొన్ని వందల ఏళ్లు పట్టినా ఆశ్చర్యపడనక్కరలేదు.
ఇంతా చేసి ఈ చేపలు వగైరా జపాను, అమెరికా వంటి దేశాలకు ఎగుమతి చేస్తారు. మనకు వరిగేదల్లా
చివరకు పనికి రాని భూమి, ఆత్మహత్యలు!
ఎంత ముందు చూపుతో సర్. ఆర్థర్ కాటన్ గోదావరి ప్రాంతాన్ని సస్యస్యామలం చేస్తే, మనం చేతులారా
నాశనం చేసుకుంటున్నామో కదా!
Posted by Murali
( Mar 09 2005, 03:59:54 PM EST )
Permalink
telugu unicode on Windows 2000 నాకు ఇవేళ Windows2000 పై తెలుగు యూనీకోడ్ చూడడానికి సాథ్యపడింది. నేను
అనుకున్నంత కష్టపడకుండానే తేలికగానే వీలయింది.
1. ముందుగా Start > Control Panel > Regional Options కి వెళ్లాను.
2. Language Settings అని ఉన్నచోట "Indic"ను కూడా ఎంచుకున్నాను.
3. కంప్యూటరును రీ-బూట్ చేసాను.
సమస్యలు:
కానీ అంతా తిన్నగా జరిగితే అది కంప్యూటరు ఎందుకవుతుంది :) ఇదివరకూ యూనీకోడ్
అక్షరాలు పొడిపొడిగా విడివిడిగా అన్నా కనిపించేవి. ఇప్పుడు అవికూడా కనిపించడం మానివేసాయి.
పొడి అక్షరాలకు బదులు సన్నని బాక్సులు కనిపించాయి.
బహుశా "ArialUnicodeMS" ఫాంటు మారిఉంటుందని ఊహించి "Internet Explorer"లో
Tools > Options > General > Fonts..కు వెళ్లాను. అక్కడ "Language Script"
అన్న చోట Telugu ఎంచుకొని "Web page font" క్రింద Pothana2000 ఎంచుకొన్నాను.
ఇప్పుడు అంతా బాగానే కనిపించాయి కాని తెలుగు అక్షరాలు ఇంగ్లీషు అక్షరాలతో పోల్చితే చిన్నవిగా
ఉన్నాయి. ఇది Pothana2000 ఫాంటులో ఉన్న సమస్య.
నా కంప్యూటరులో "ArialUnicodeMS", "Pothana2000" ఫాంట్లు మాత్రమే తెలుగు యూనికోడ్
అక్షరాలు సరిగా చూపించగలవు. "Gautami" ఫాంటు కూడా తెలుగు యూనికోడ్ చూపగలదని తెలుసు.
కానీ నా దగ్గర లేదు. ఇలాటి చినచిన్న సమస్యలకు Google ఆయుధం ప్రయోగిస్తూంటాను. ఈసారి
కూడా విజయమే :) http://fonts.goldenweb.it/index_file/l/en/d2/True_Type_Fonts/c/g/default.html సైటు
నుండీ ఉచితంగా డౌన్లోడ్ చేసుకున్నాను. ఇప్పుడు Internet Explorerలో Gautami ఫాంటును ఎంచుకున్నాను.
చూడడానికి అంత అందమైన ఫాంటుకాదు. కాని ఫర్వాలేదు. ఇప్పుడు బాగానే కనపడింది తెలుగు యూనీకోడ్.
తరువాత Firefox బ్రౌజర్లో తెలుగు సరిగా కనపడలేదు. Firefoxలో Tools > General > Fonts & Colors కు
వెళ్లి "Fonts for: <Unicode>"లో Gautami ఫాంటును ఎంచుకునాను. హుర్రే! ఇప్పుడు తెలుగు యూనీకోడ్
బాగానే కనపడుతోంది.
http://telugutoolbar.mozdev.org ను ఉపయోగించి
Firefox బ్రౌజర్ ద్వారా ఈ బ్లాగు వ్రాస్తున్నాను. నిన్ననే క్రొత్త వెర్షను 1.1 విడుదల చేసాను. దాన్లో తెలుగు అంకెలు కూడా
వ్రాయవచ్చు. ~1,~2,~3...~0.. ఇలా టైపుచేస్తే ౧,౨,౩,..౦ అని తెలుగు అంకెలు కనపడతాయి.
Posted by Murali
( Mar 08 2005, 11:24:14 AM EST )
Permalink
Comments [6]
8 - వల్లభా నాయకస్య ముత్తుస్వామి దీక్షిత విరచిత, బేగడ రాగంలో నున్న మరొక
సంస్కృత కృతిని పరిచయం చేస్తాను.
========================================
పల్లవి: వల్లభానాయకస్య భక్తో భవామి
వాంఛితార్థ దాయకస్య వరమూషిక వాహనస్య
చరణం: పల్లవ పద మృదుతరస్య పాశాంకుశాది ధారస్య
మల్లికాజాది చంపక హారస్య మణిమాలస్య
వల్లీవివాయకారణస్య గురుగుహ పూజితస్య
కాళీ కలమాలినీ కమలాక్షీ సన్నుతస్య
========================================
ఈ కృతి కూడా దీక్షితులువారి ఇతర కృతుల వలే ఇది కూడా
స్తుతి ప్రధానమైనది. దీనిలోనిది వినాయకుని స్తుతి.
Pain in the neck అమెరికాలో Pain in the neck అనే వాడుక వింటూంటాము. ఇదివరకు ఏదో వింటుంటే సరదాగా అనిపించేది.
గత రెండు రోజులుగా నా మెడ పట్టేసి అక్షరాలా pain-in-the-neckగా తయ్యారయింది.
ఒకరోజు ఆఫీసునుంచీ సెలవుకూడా తీసుకున్నాను. ఎడవైపుచూస్తే కుడివైపు చూడలేము, పైకి
చూడగలిగితే క్రిందకు చూడలేము.. ఒక చావుకాదు.
ఇవేళ కొంత ఉపశమనంగా ఉంటే ఆఫీసుకొచ్చాను. మా తోటి ఉద్యోగస్తుడు మైక్ కొన్ని
వ్యాయామాలు చెప్పాడు.
ఒక్కొక్క వ్యాయామం ఐదుతడవలు, తడవకు ఐదు సెకన్ల సేపు చేయాలి.
ఈక్రిందివి చేసేప్పుడు, పళ్లు "ఈఈఈ..." అంటూ బిగపెట్టాలి(మొక్కజొన్న పొత్తులో
చెరకుగడో తింటున్నట్లుగానన్న మాట!) :
మొత్తానికి telugutoolbar సాఫ్ట్వేర్ సిద్ధమయింది.
అడిగిన వెంటనే mozdev వారు website template సిద్ధంచేసారు. వారికి కృతఙ్ఞతలు. అలాగే తొలుత వెర్షను చూసి అభిప్రాయాలు పంపినవారికి కూడా ధన్యవాదాలు.
WYSIWIG (what you see is what you get) విధంగా వ్రాయటానికి అలవాటు పడ్డాక RTS ఆంగ్ల అక్షరాలు చూడాలంటే చూడాలంటే కొంచం కష్టమే. RTSలో టైపు చేయగానే తెలుగులో కనపడుతుంటే ఒక విధమైన ఆనందం, తృప్తి కలుగుతాయి. :)
కానీ యూనికోడ్ కనపడని browsersలో కోసం త్వరలో ఈ సైటులో ఇంకొక వీలు కల్పించాలి. అదీ నా తరువాతి ప్రాజెక్టు.
Posted by Murali ( Mar 01 2005, 10:31:45 AM EST ) Permalink
తెలుగు యూనీకోడ్ బ్లాగు *This message is in unicode and may not be readable
on Windows9x systems. **
సాహితీ.ఆర్గ్ బ్లాగుల క్రొత్త వెర్షనులో యూనికోడ్లో
కూడా వ్రాయవచ్చు.
ముందుగా RTSలో వ్రాసి దాన్ని తెలుగులోకి మార్చుకోనే పని
లేదు. మనం టైపు చేస్తుంటే చక్కగా తెలుగులో కనపడుతుంది!
కానీ ఒక తిరకాసు ఉంది. మనకు వ్రాయటానికి తేలికగా ఉన్నా
చదివేవారికి చిక్కు. పాఠకులకు WindowsXP లేక Linux ఉండాలి.
పైగా మనం తెలుగులో టైపు చేసేందుకు ఏదైనా సాఫ్ట్వేర్
కొనుక్కోవాలి. డబ్బుతో సాఫ్ట్వేర్ కొనుక్కోవటం చాలా
మందికి కుదరదు పైగా తెలుగుకు సంబంధించిన సాఫ్టవేర్ కొరకు
అసలు డబ్బు పెట్టం. ఏదైనా ఉచితంగా దొరుకుతుందేమోనని
చూస్తున్న సమయంలో IndicIME సాఫ్ట్వేర్ కనపడింది.
ఈ సాఫ్ట్వేర్ FireFoxలోనే పనిచేస్తుంది. కానీ IndicIMEలో
RTS(Rice Transliteration Standard)లో వ్రయటానికి కుదరదు.
అందుకని నేను ఆ సాఫ్ట్వేర్ను స్పూర్తిగా తీసుకొని
telugutoolbar for FireFox అనే సాఫ్ట్వేర్
వ్రాసాను. ఇది పూర్తిగా ఉచితం! త్వరలో mozdev.org వెబ్సైటు
నుంచీ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
అప్పటివరకూ ఆగలేనివారు న్న్ను ఈమెయిలు ద్వారా సంప్రదిస్తే
నేను ఈమెయిలు ద్వారా పంపిస్తాను. నా ఈమెలు nmukri at gmail.
ఈ బ్లాగులు నేను వ్రాసిన సాఫ్ట్వేర్ ద్వారా తెలుగులో టైపు
చేస్తున్నాను.
Posted by Murali
( Feb 25 2005, 10:00:00 AM EST )
Permalink
బ్లాగుల క్రొత్త వెర్షను గత మూడు నాలుగు రోజులనుంచీ ఆపివేసిన బ్లాగులు మళ్ళీ ఇప్పుడు
online వచ్చాయి. గమనించే ఉంటారు.
తెర వెనుక ఇదీ జరిగిన కథ:
గత వారం మధ్యలో ఒక 'శ్రీనివాస్' నుంచి ఈమెయిలు
వచ్చింది. సాహితీ.ఆర్గ్‌లో నిఘంటువు సరిగ్గా పని చేయటంలేదు అంటూ.
"బ్రౌజర్ వెర్షన్ చూసుకో, గురూ" అంటూ తిరిగి మెయిలు చేసా.
"బాసూ ఇదివరకూ బాగానే కనిపించేది, గత రెండు మూడు రోజులనుంచీ
అక్షరాలకు బదులు '?' కనిపిస్తున్నాయి" అని తిరిగి ఈమెయిలు
చేసాడు. అదే సమయంలో వేమూరిగారి దగ్గరి నుంచీ కూడా మెయిలు
వచ్చింది, నిఘంటువులో ఏదో మార్పులు చేద్దామనుకున్నాను కాని
పనిచేయటంలేదు అంటూ.
ముందుగా సైటులో నిఘంటువు పని చేయటంలేదని నిర్ధారించుకొని
డేటాబేస్ చూసాను. అర్థాలు ఉండాల్సిన columnలో '?'తో నిండి
ఉన్నది. వెబ్సైటు హోస్టింగు కంపెనీ వాళ్లు ఏదో upgrade చేసినట్టునారు.
నేనేమో అర్థాలన్నీ ISCII ఫార్మాట్లో ఉంచుతాను. upgrade పుణ్యమా అని
latin అక్షరాలు కానివన్నిటిని '?'గా మార్చి వేసింది. కాని
అదృష్టంకొద్దీ email పంపగానే, వాళ్లు back-up నుంచి సరిచేసారు.
సమస్య తీరిందికదా అనుకొంటుంటే, బ్లాగులు పని చేయటం మాని
వేసాయయి గ్రహించాను. కనీసం బ్లాగుల మొదటి పేజీ కూడా పనిచేయలేదు.
చూస్తే డేటాబేసు బాగానే ఉన్నది. సరే, ఎలాగూ పనిచేయటంలేదు కాదా
బ్లాగులను కూడా upgrade చేద్దామని నిర్ణయించుకున్నాను. సైటులో
వాడుతున్నది version 0.98. క్రొత్తగా Roller version 1.0 విడుదల
చేసారు. Roller1.0లో యూనికోడ్ కూడా వాడవచ్చు. అంటే RTS(phonetic)లో
వ్రాసే కష్టమక్కరలేదు. తిన్నగా తెలుగులోనే వ్రాసుకోవచ్చు. కానీ
WindowsXP లేక linux(Fedora Core3) + FireFoxయో కావాలి. భవిష్యత్తులో
చక్కగా RTSలో టైపు చేయగానే తెలుగులో కనపడుతుంది.
సరే, Roller1.0 ముందు ఇంట్లో ఉన్న కంప్యూటరులో install చేసి చూసాను.
మొదటి పేజీ బాగానే ఉన్నట్లనిపించింది. గబగబా క్రొత్త Roller1.0 సైటులోకి
upload చేసాను. కానీ వెబ్సైటులో ఇంకా అదే error కనిపించింది.
హతవిధీ అనుకుంటూ hosting వాళ్లకి ఈమెయిలు పంపించాను. కానీ,
అప్పటికే వారాంతం. వాళ్ల నుంచి జవాబు రావాలంటే సోమవారం దాకా
ఆగాల్సిందే. ఇంటర్నెట్లో వెతికా. ఉన్న database schemaని తీసేసి,
క్రొత్తగా unicode support ఉండేట్లుగా మళ్ళీ create చేసుకోవాలని ఉంది.
సరేలెమ్మని అనుకొంటూ డేటాబేస్ లోకి login అయ్యాను. ఆశ్చర్యం, మా
Hosting వాళ్లు ఇది ఊహించే అనుకుంటా సమాంతరంగా unicode supportతో
ఇంకో schema ఉంచారు. ముందు ఉన్న పాత డేటాని క్రొత్త schemaలోకి
ఎక్కించాను. నా వెబ్సైటును reboot చేసా. కాని ఇంకా అదే error
చూపిస్తోంది.
మళ్లీ google తెరచి ఇంకో గంట సేపు వెతికితే, Database driver సరి
చూసుకోండి అని ఉంది. అదీ కథ! డేటాబేస్ upgradeతో బాటు మనవాళ్లు
driver కూడా upgrade చేసారన్నమాట. క్రొత్త driverలో ఎదొ bug
ఉన్నదట. అందుకని క్రొత్త Driver పక్కన పెట్టి, పాత driverను
classpathలో పెట్ట. మళ్లీ వెబ్సైటును reboot చేసా.
మొదటి పేజీ బాగానే కనపడింది. హుర్రే! అనుకున్నా. కాని బ్లాగుల లోపలికి
వెడితే అంతా RTSలోనే కనపడుతోంది. ఎంట్రా అబ్బ అనుకున్న. కూర్చోని
Roller1.0 source డౌన్లోడ్ చేసాను. RTS నుంచి తెలుగులోకి
మార్చటానికి వీలుగా Filter వాడతాను. Roller1.0లో ఆ ఫిల్టర్
interface మారింది. getDescription(), getName() అంటూ రెండు క్రొత్త
methods జత చేసారు. ముందుగా సరిచూసుకోనందుకు తిట్టుకోని
నా సాఫ్ట్వేర్‌నంతా compile చేసా. ఈ సారి మటుకు ముందు ఇంట్లో
పని చేస్తోందో లేదో నని సరిచూసుకున్నాను.
సరే నా సాఫ్ట్‌వేర్ upload చేసి, server reboot చేసాను. ఇప్పుడు
తెలుగు బాగానే కనపడింది. బ్లాగులలోకి లాగిన్ అవుదామని చూసాను
కానీ కాలేకపోయాను. పాస్వార్డ్ మర్చిపోయానేమోనని నేను తర్చూ
వాడె వన్నీ ప్రయత్నించి చూసాను. ఏంచేసినా కుదరలేదు. Databaseలో
passwordsఅన్నీ encryptచేసి ఉంఅటాయి. కాబట్టి Databaseలో చూసినా
ఉపయోగంలేదు.
మళ్లీ గూగుల్‌ను ఆశ్రయించా. Roller1.0తో బాటుగా, ఏవో రెండు utilities
వచ్చాయి. ఆ రెండిటినీ run చేయాలని ఉంది. అదికూడా చేసే సరికి
లాగిన్ అవగలిగాను.. మొత్తనికి Roller1.0 సాఫ్ట్వేర్ తో క్రొత్త బ్లాగులు
సిద్ధం!
వెబ్సైటు గురించి అభిప్రాయాలు వ్రాసినవారికీ, Roller వారికీ,
గూగుల్ వారికీ :) ధన్యవాదాలు!
ఈ ప్రహసనం అంతటికీ ఒక వారం పట్టింది. ఇంతా చేస్తూ శనివారంనాడు
ఉమాకాతంగారు శ్రీనాథుడు వ్రాసిన "పల్నాటి వీరచరిత్ర" పుస్తకరూపంలో
వచ్చినప్పుడు వ్రాసిన పీఠిక ఒక 30 పేజీలు చదివాను. చాలా సరదాగా ఉంది.
కేవలం పీఠికే 100 పేజీల పుస్తకంగా వేసారు! ఆ పుస్తకం విశేషాలు
ఎప్పుడైనా.
*గ: ఈ పోస్టు RTS నుండి యూనీకోడుకు మార్చబడినది*
Posted by Murali
( Feb 16 2005, 03:10:21 PM EST )
Permalink
Comments [1]
7 - గోవర్ధన గిరీశం ముత్తుస్వామి దీక్షితులవారి మరొక కృతి పరిచయం చేస్తాను.
గోవర్ధన గిరీశం అంటూ పల్లవించే ఈ కృతి హిందోళ
రాగం, సంస్కృతం భాషలో ఉన్నది.
-------------------------------------
గోవర్ధన గిరీశం స్మరామి అనిశం
గోపికాది మనోహరం గర్విత కంసాదిహరం
గోవింద నామ సారం గజేంద్ర రక్షణ ధీరం
కవిజన హృన్ మందారం కనకజిత సుశరీరం
రవి శశి నయన విలాసం రమణీయ ముఖాభాసం
శివగాణాది విశ్వాసం శ్రీ గురుగుహ మనోల్లాసం
చిత్త స్వరాలు:
గా గమగమ మగసనిసా నిదనిసా మగమ
గమద మదని దనిస మాగసని సానిదమ మాగసని
-------------------------------------
కృష్ణుని స్తుతితో నిండి ఉన్న ఈ కృతిలో దీక్షితులవారి
ధోరణి కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది.
నేను మొదటిసారి ఈ కృతిని సెమ్మంగూడి శ్రీనివాస అయ్యర్
పాడిన రికార్డింగు విన్నాను. విన్న వెంటనే ఒక రకమైన
గగుర్పాటు కలిగింది. తరువాత ఎక్కడో మాండొలిన్ శ్రినివాస్
రికార్డింగు విన్నట్టు గుర్తు. సెమ్మంగూడివారిది ఇక్కడ వినవచ్చు:
http://sai.aros.net/music/karnatak/
సాధారణంగా కృతి పాడినతరువాత గాయకుల సామర్ధ్యాన్నిబట్టీ
కల్పనా స్వరాలు పాడతారు(మనోధర్మం). కొన్ని కృతులలో రచయిత
"చిత్త స్వరాలు" వ్రాస్తారు. అప్పుడు కృతి అయిపోయిన తరువాత ఈ చిత్త
స్వరాలను పాడటం తప్పనిసరి. ఈ కృతిలో చిత్తస్వరాలను గమనించండి.
చిత్తస్వరాలలో స,రి,గ,మ,ప,ద,ని సప్త స్వరాలలోని "రి,ప" లేవే
అనుకొంటుంటే, ఇంతకు ముందు వ్రాసిన బ్లాగులోని హిందోళ రాగ పరిచయం
నీరజాక్షి కామాక్షి చూడండి.
ఒకే రాగంలో ఉన్న ఈ రెండు కృతుల నడకలో చాలా తేడా ఉంటుంది.
గోవర్ధన గిరీశం హడావుడిగా, నీరజాక్షీ కృతి నింపాదిగా ఉంటాయి.
కానీ రెండిటిలోనూ హిందోళ రాగంలో ఉండే సాంతం, గాంభీర్యం చక్కగా
స్పష్టమవుతాయి.
గమనిక: రెండు బ్లాగుల క్రితం కన్యాశుల్కంలోని "గిరీశం" పాత్ర గురించి జే.వీ.రమణమూర్తిగారు ఉపన్యసించడం ఉన్నది, ఇవేళ "గోవర్ధన గిరీశం" కృతి పరిచయం చేయటం, కేవలం యాదృచ్ఛికం.
*గ: ఈ పోస్టు RTS నుండి యూనీకోడుకు మార్చబడినది*
Posted by Murali
( Feb 03 2005, 02:56:41 PM EST )
Permalink
నా ఆటోగ్రాఫ్ ఈ వారంతంలో మా ఫ్రెండ్స్‌తో కలిసి "నా ఆటోగ్రాఫ్" అనే సినిమా
చూసాను.
వెకిలి చేష్టలు శృతిమించకుండా, అతివేషాలు లేకుండా ఉన్నది.
మూడు ప్రేమ కథలతో నడిచే సినిమా అక్కడక్కడ కాస్త
సాగదీసినట్టు అనిపించింది. చివరకు, నూటికి తొంభై శాతం
సినిమాలకు అనిపించినట్టుగా, సమయం వృధా చేసుకున్నానని
మాత్రం అనిపించలేదు.
రవితేజా కూడ తన మిగతా సినిమాలలోలాగా కాకుండా హుందాగా
ఉన్నాడు. అది పాత్ర చిత్రీకరణ ప్రభావం కూడ కావచ్చు.
ఇంతా చేస్తే తమిళంలో హిట్ అయిన "ఆటోగ్రాఫ్" దీని మాతృక అని
తరువాత తెలిసింది. :)
*గ: ఈ పోస్టు RTS నుండి యూనీకోడుకు మార్చబడినది*
Posted by Murali
( Feb 01 2005, 10:11:20 AM EST )
Permalink
Comments [1]