Murali's Telugu Blog

All | General | Status | Java | Music | Politics
20050301 Tuesday March 01, 2005

telugutoolbar సిద్ధం!

మొత్తానికి telugutoolbar సాఫ్ట్వేర్ సిద్ధమయింది.

అడిగిన వెంటనే mozdev వారు website template సిద్ధంచేసారు. వారికి కృతఙ్ఞతలు. అలాగే తొలుత వెర్షను చూసి అభిప్రాయాలు పంపినవారికి కూడా ధన్యవాదాలు.

WYSIWIG (what you see is what you get) విధంగా వ్రాయటానికి అలవాటు పడ్డాక RTS ఆంగ్ల అక్షరాలు చూడాలంటే చూడాలంటే కొంచం కష్టమే. RTSలో టైపు చేయగానే తెలుగులో కనపడుతుంటే ఒక విధమైన ఆనందం, తృప్తి కలుగుతాయి. :)

కానీ యూనికోడ్ కనపడని browsersలో కోసం త్వరలో ఈ సైటులో ఇంకొక వీలు కల్పించాలి. అదీ నా తరువాతి ప్రాజెక్టు.

Posted by Murali ( Mar 01 2005, 10:31:45 AM EST ) Permalink

20050225 Friday February 25, 2005

తెలుగు యూనీకోడ్ బ్లాగు *This message is in unicode and may not be readable on Windows9x systems. **

సాహితీ.ఆర్గ్ బ్లాగుల క్రొత్త వెర్షనులో యూనికోడ్లో కూడా వ్రాయవచ్చు.

ముందుగా RTSలో వ్రాసి దాన్ని తెలుగులోకి మార్చుకోనే పని లేదు. మనం టైపు చేస్తుంటే చక్కగా తెలుగులో కనపడుతుంది!

కానీ ఒక తిరకాసు ఉంది. మనకు వ్రాయటానికి తేలికగా ఉన్నా చదివేవారికి చిక్కు. పాఠకులకు WindowsXP లేక Linux ఉండాలి.

పైగా మనం తెలుగులో టైపు చేసేందుకు ఏదైనా సాఫ్ట్వేర్ కొనుక్కోవాలి. డబ్బుతో సాఫ్ట్వేర్ కొనుక్కోవటం చాలా మందికి కుదరదు పైగా తెలుగుకు సంబంధించిన సాఫ్టవేర్ కొరకు అసలు డబ్బు పెట్టం. ఏదైనా ఉచితంగా దొరుకుతుందేమోనని చూస్తున్న సమయంలో IndicIME సాఫ్ట్వేర్ కనపడింది.

ఈ సాఫ్ట్వేర్ FireFoxలోనే పనిచేస్తుంది. కానీ IndicIMEలో RTS(Rice Transliteration Standard)లో వ్రయటానికి కుదరదు. అందుకని నేను ఆ సాఫ్ట్వేర్ను స్పూర్తిగా తీసుకొని telugutoolbar for FireFox అనే సాఫ్ట్వేర్ వ్రాసాను. ఇది పూర్తిగా ఉచితం! త్వరలో mozdev.org వెబ్సైటు నుంచీ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

అప్పటివరకూ ఆగలేనివారు న్న్ను ఈమెయిలు ద్వారా సంప్రదిస్తే నేను ఈమెయిలు ద్వారా పంపిస్తాను. నా ఈమెలు nmukri at gmail.

ఈ బ్లాగులు నేను వ్రాసిన సాఫ్ట్వేర్ ద్వారా తెలుగులో టైపు చేస్తున్నాను.

Posted by Murali ( Feb 25 2005, 10:00:00 AM EST ) Permalink

20050216 Wednesday February 16, 2005

బ్లాగుల క్రొత్త వెర్షను గత మూడు నాలుగు రోజులనుంచీ ఆపివేసిన బ్లాగులు మళ్ళీ ఇప్పుడు online వచ్చాయి. గమనించే ఉంటారు.

తెర వెనుక ఇదీ జరిగిన కథ:

గత వారం మధ్యలో ఒక 'శ్రీనివాస్' నుంచి ఈమెయిలు వచ్చింది. సాహితీ.ఆర్గ్‌లో నిఘంటువు సరిగ్గా పని చేయటంలేదు అంటూ. "బ్రౌజర్ వెర్షన్ చూసుకో, గురూ" అంటూ తిరిగి మెయిలు చేసా. "బాసూ ఇదివరకూ బాగానే కనిపించేది, గత రెండు మూడు రోజులనుంచీ అక్షరాలకు బదులు '?' కనిపిస్తున్నాయి" అని తిరిగి ఈమెయిలు చేసాడు. అదే సమయంలో వేమూరిగారి దగ్గరి నుంచీ కూడా మెయిలు వచ్చింది, నిఘంటువులో ఏదో మార్పులు చేద్దామనుకున్నాను కాని పనిచేయటంలేదు అంటూ.

ముందుగా సైటులో నిఘంటువు పని చేయటంలేదని నిర్ధారించుకొని డేటాబేస్ చూసాను. అర్థాలు ఉండాల్సిన columnలో '?'తో నిండి ఉన్నది. వెబ్సైటు హోస్టింగు కంపెనీ వాళ్లు ఏదో upgrade చేసినట్టునారు. నేనేమో అర్థాలన్నీ ISCII ఫార్మాట్లో ఉంచుతాను. upgrade పుణ్యమా అని latin అక్షరాలు కానివన్నిటిని '?'గా మార్చి వేసింది. కాని అదృష్టంకొద్దీ email పంపగానే, వాళ్లు back-up నుంచి సరిచేసారు.

సమస్య తీరిందికదా అనుకొంటుంటే, బ్లాగులు పని చేయటం మాని వేసాయయి గ్రహించాను. కనీసం బ్లాగుల మొదటి పేజీ కూడా పనిచేయలేదు. చూస్తే డేటాబేసు బాగానే ఉన్నది. సరే, ఎలాగూ పనిచేయటంలేదు కాదా బ్లాగులను కూడా upgrade చేద్దామని నిర్ణయించుకున్నాను. సైటులో వాడుతున్నది version 0.98. క్రొత్తగా Roller version 1.0 విడుదల చేసారు. Roller1.0లో యూనికోడ్ కూడా వాడవచ్చు. అంటే RTS(phonetic)లో వ్రాసే కష్టమక్కరలేదు. తిన్నగా తెలుగులోనే వ్రాసుకోవచ్చు. కానీ WindowsXP లేక linux(Fedora Core3) + FireFoxయో కావాలి. భవిష్యత్తులో చక్కగా RTSలో టైపు చేయగానే తెలుగులో కనపడుతుంది.

సరే, Roller1.0 ముందు ఇంట్లో ఉన్న కంప్యూటరులో install చేసి చూసాను. మొదటి పేజీ బాగానే ఉన్నట్లనిపించింది. గబగబా క్రొత్త Roller1.0 సైటులోకి upload చేసాను. కానీ వెబ్సైటులో ఇంకా అదే error కనిపించింది. హతవిధీ అనుకుంటూ hosting వాళ్లకి ఈమెయిలు పంపించాను. కానీ, అప్పటికే వారాంతం. వాళ్ల నుంచి జవాబు రావాలంటే సోమవారం దాకా ఆగాల్సిందే. ఇంటర్నెట్లో వెతికా. ఉన్న database schemaని తీసేసి, క్రొత్తగా unicode support ఉండేట్లుగా మళ్ళీ create చేసుకోవాలని ఉంది.

సరేలెమ్మని అనుకొంటూ డేటాబేస్ లోకి login అయ్యాను. ఆశ్చర్యం, మా Hosting వాళ్లు ఇది ఊహించే అనుకుంటా సమాంతరంగా unicode supportతో ఇంకో schema ఉంచారు. ముందు ఉన్న పాత డేటాని క్రొత్త schemaలోకి ఎక్కించాను. నా వెబ్సైటును reboot చేసా. కాని ఇంకా అదే error చూపిస్తోంది.

మళ్లీ google తెరచి ఇంకో గంట సేపు వెతికితే, Database driver సరి చూసుకోండి అని ఉంది. అదీ కథ! డేటాబేస్ upgradeతో బాటు మనవాళ్లు driver కూడా upgrade చేసారన్నమాట. క్రొత్త driverలో ఎదొ bug ఉన్నదట. అందుకని క్రొత్త Driver పక్కన పెట్టి, పాత driverను classpathలో పెట్ట. మళ్లీ వెబ్సైటును reboot చేసా.

మొదటి పేజీ బాగానే కనపడింది. హుర్రే! అనుకున్నా. కాని బ్లాగుల లోపలికి వెడితే అంతా RTSలోనే కనపడుతోంది. ఎంట్రా అబ్బ అనుకున్న. కూర్చోని Roller1.0 source డౌన్లోడ్ చేసాను. RTS నుంచి తెలుగులోకి మార్చటానికి వీలుగా Filter వాడతాను. Roller1.0లో ఆ ఫిల్టర్ interface మారింది. getDescription(), getName() అంటూ రెండు క్రొత్త methods జత చేసారు. ముందుగా సరిచూసుకోనందుకు తిట్టుకోని నా సాఫ్ట్వేర్‌నంతా compile చేసా. ఈ సారి మటుకు ముందు ఇంట్లో పని చేస్తోందో లేదో నని సరిచూసుకున్నాను.

సరే నా సాఫ్ట్‌వేర్ upload చేసి, server reboot చేసాను. ఇప్పుడు తెలుగు బాగానే కనపడింది. బ్లాగులలోకి లాగిన్ అవుదామని చూసాను కానీ కాలేకపోయాను. పాస్వార్డ్ మర్చిపోయానేమోనని నేను తర్చూ వాడె వన్నీ ప్రయత్నించి చూసాను. ఏంచేసినా కుదరలేదు. Databaseలో passwordsఅన్నీ encryptచేసి ఉంఅటాయి. కాబట్టి Databaseలో చూసినా ఉపయోగంలేదు.

మళ్లీ గూగుల్‌ను ఆశ్రయించా. Roller1.0తో బాటుగా, ఏవో రెండు utilities వచ్చాయి. ఆ రెండిటినీ run చేయాలని ఉంది. అదికూడా చేసే సరికి లాగిన్ అవగలిగాను.. మొత్తనికి Roller1.0 సాఫ్ట్వేర్ తో క్రొత్త బ్లాగులు సిద్ధం!

వెబ్సైటు గురించి అభిప్రాయాలు వ్రాసినవారికీ, Roller వారికీ, గూగుల్ వారికీ :) ధన్యవాదాలు!

ఈ ప్రహసనం అంతటికీ ఒక వారం పట్టింది. ఇంతా చేస్తూ శనివారంనాడు ఉమాకాతంగారు శ్రీనాథుడు వ్రాసిన "పల్నాటి వీరచరిత్ర" పుస్తకరూపంలో వచ్చినప్పుడు వ్రాసిన పీఠిక ఒక 30 పేజీలు చదివాను. చాలా సరదాగా ఉంది. కేవలం పీఠికే 100 పేజీల పుస్తకంగా వేసారు! ఆ పుస్తకం విశేషాలు ఎప్పుడైనా.

*గ: ఈ పోస్టు RTS నుండి యూనీకోడుకు మార్చబడినది* Posted by Murali ( Feb 16 2005, 03:10:21 PM EST ) Permalink Comments [1]

20050203 Thursday February 03, 2005

7 - గోవర్ధన గిరీశం ముత్తుస్వామి దీక్షితులవారి మరొక కృతి పరిచయం చేస్తాను.

గోవర్ధన గిరీశం అంటూ పల్లవించే ఈ కృతి హిందోళ రాగం, సంస్కృతం భాషలో ఉన్నది.
-------------------------------------
గోవర్ధన గిరీశం స్మరామి అనిశం
గోపికాది మనోహరం గర్విత కంసాదిహరం

గోవింద నామ సారం గజేంద్ర రక్షణ ధీరం
కవిజన హృన్ మందారం కనకజిత సుశరీరం
రవి శశి నయన విలాసం రమణీయ ముఖాభాసం
శివగాణాది విశ్వాసం శ్రీ గురుగుహ మనోల్లాసం

చిత్త స్వరాలు:
గా గమగమ మగసనిసా నిదనిసా మగమ
గమద మదని దనిస మాగసని సానిదమ మాగసని
-------------------------------------

కృష్ణుని స్తుతితో నిండి ఉన్న ఈ కృతిలో దీక్షితులవారి ధోరణి కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది.

నేను మొదటిసారి ఈ కృతిని సెమ్మంగూడి శ్రీనివాస అయ్యర్ పాడిన రికార్డింగు విన్నాను. విన్న వెంటనే ఒక రకమైన గగుర్పాటు కలిగింది. తరువాత ఎక్కడో మాండొలిన్ శ్రినివాస్ రికార్డింగు విన్నట్టు గుర్తు. సెమ్మంగూడివారిది ఇక్కడ వినవచ్చు:
http://sai.aros.net/music/karnatak/

సాధారణంగా కృతి పాడినతరువాత గాయకుల సామర్ధ్యాన్నిబట్టీ కల్పనా స్వరాలు పాడతారు(మనోధర్మం). కొన్ని కృతులలో రచయిత "చిత్త స్వరాలు" వ్రాస్తారు. అప్పుడు కృతి అయిపోయిన తరువాత ఈ చిత్త స్వరాలను పాడటం తప్పనిసరి. ఈ కృతిలో చిత్తస్వరాలను గమనించండి.

చిత్తస్వరాలలో స,రి,గ,మ,ప,ద,ని సప్త స్వరాలలోని "రి,ప" లేవే అనుకొంటుంటే, ఇంతకు ముందు వ్రాసిన బ్లాగులోని హిందోళ రాగ పరిచయం నీరజాక్షి కామాక్షి చూడండి.

ఒకే రాగంలో ఉన్న ఈ రెండు కృతుల నడకలో చాలా తేడా ఉంటుంది. గోవర్ధన గిరీశం హడావుడిగా, నీరజాక్షీ కృతి నింపాదిగా ఉంటాయి. కానీ రెండిటిలోనూ హిందోళ రాగంలో ఉండే సాంతం, గాంభీర్యం చక్కగా స్పష్టమవుతాయి.

గమనిక: రెండు బ్లాగుల క్రితం కన్యాశుల్కంలోని "గిరీశం" పాత్ర గురించి జే.వీ.రమణమూర్తిగారు ఉపన్యసించడం ఉన్నది, ఇవేళ "గోవర్ధన గిరీశం" కృతి పరిచయం చేయటం, కేవలం యాదృచ్ఛికం.

*గ: ఈ పోస్టు RTS నుండి యూనీకోడుకు మార్చబడినది* Posted by Murali ( Feb 03 2005, 02:56:41 PM EST ) Permalink

20050201 Tuesday February 01, 2005

నా ఆటోగ్రాఫ్ ఈ వారంతంలో మా ఫ్రెండ్స్‌తో కలిసి "నా ఆటోగ్రాఫ్" అనే సినిమా చూసాను.

వెకిలి చేష్టలు శృతిమించకుండా, అతివేషాలు లేకుండా ఉన్నది. మూడు ప్రేమ కథలతో నడిచే సినిమా అక్కడక్కడ కాస్త సాగదీసినట్టు అనిపించింది. చివరకు, నూటికి తొంభై శాతం సినిమాలకు అనిపించినట్టుగా, సమయం వృధా చేసుకున్నానని మాత్రం అనిపించలేదు.

రవితేజా కూడ తన మిగతా సినిమాలలోలాగా కాకుండా హుందాగా ఉన్నాడు. అది పాత్ర చిత్రీకరణ ప్రభావం కూడ కావచ్చు.

ఇంతా చేస్తే తమిళంలో హిట్ అయిన "ఆటోగ్రాఫ్" దీని మాతృక అని తరువాత తెలిసింది. :)

*గ: ఈ పోస్టు RTS నుండి యూనీకోడుకు మార్చబడినది* Posted by Murali ( Feb 01 2005, 10:11:20 AM EST ) Permalink Comments [1]

కన్యాశుల్కం తాంబూలాలిచ్చేసా తన్నుకు చావండి, పొగాకు త్రాగనివాడు దున్నపోతై పుట్టున్, డామిట్ కథ అడ్డం తిరిగింది అనే ప్రయోగాలు మనకు సుపరిచితమైనవే. ఇవన్నీ గురజాడా అప్పారావు గారు రచించిన కన్యాశుల్కం(1897?) నాటకంలోనివని అందరికీ తెలుసు. ఈ ప్రయోగాలు నేటికీ, విన్నప్పుడల్లా, గిలిగింతలు పెట్టినట్టుగా ఉంటుంది.

అటువంటి కన్యాశుల్కం నాటాకాన్ని సుమారు వేయిసార్లు ప్రదర్శించి, గిరీశం పాత్రను భేషుగా పోషించిన శ్రి జే.వీ. రమణమూర్తి గారు డిట్రాయిట్ వచ్చారు. నిన్న శనివారం (జనవరి 29 2005) ఆయన మా తెలుగు బుక్ క్లబ్ వారి ఆహ్వానాన్ని మన్నించి రెండున్నర గంటల సేపు వారి అనుభవాలను మాతో పంచుకున్నారు.

అసలు 2.5గం. సేపు ఆయన మాట్లాడుతుంటే సమయమే తెలియలేదు. గంటన్నర సేపు "ఉపన్యాసం", తరువాత యథావిధిగా మా పుస్తక చర్చ అనుకున్నాం. కాని ఒక గంటన్నర తరువాత, అందరూ మూకుమ్మడిగా చర్చ రద్దుచేసి రమణమూర్తిగారి ఉపన్యాసం కొనసాగించాల్సిందిగా కోరాం. ఆయన సహృదయంతో మా కోరిక మన్నించి ఉపన్యాసం కొనసాగించారు.

తిరిగివస్తూ నేనూ, ఇంకో ముగ్గురూ, మూర్తిగారు ముచ్చట్లు చెప్పారా, ఉపన్యసించారా గురజాడవారి మనోగతం వివరించారా అని ప్రశ్నించుకున్నాం. నిజానికి ఆ రెండున్నర గంటలలో ఎన్ని విషయాలు చెప్పారో అనిపించింది. కన్యాశుల్కం వ్రాయటనికి ప్రేరణ ఏమిటి, వ్రాసిన కాలంనాటి జీవన పరిస్థితులు, పాత్రల ఔచిత్యం వివరిస్తూ మధ్యమధ్యలో కథ చెప్తూ విభిన్నపాత్రాభినయం చేస్తూ ఆయన ఉపన్యసించిన తీరు అమోఘం.

నేను పదోతరగతిలోనో ఇంటర్మీడియట్లోనో చదివిన కన్యాశుల్కంలోని పాత్రలను సజీవంగా కళ్ల ముందు నిలబెట్టారు. రమణమూర్తి గారు 19 ఎపిసోడ్ల టీవీ సీరియల్ DVDను తప్పకుండా అందరికీ అందుబాటులోకి తీసుకొస్తానని మాటయిచ్చి సెలవు తీసుకున్నారు.

దురదృష్టమేమిటంటే ఇంతటి చక్కని ముచ్చట్లు వినటానికి కేవలం 20-30మంది మాత్రమే వచ్చారు. 150మంది వరకూ పట్టే గది ఖాళీగా కనిపించింది. కానీ రమణమూర్తిగారు ఎటువంటి నిరుత్సాహం లేకుండా, ఉత్సహంగా వారి అనుభవాలు పంచుకోవటం వారి సహృదయతకు, పెద్దమనసుకు నిదర్శనం.

వచ్చిన 20-30మందిలోనూ నాలాంటి వాళ్లు నింపాదిగా వేళకు రాకపోవడంతో సభ అరగంట ఆలస్యంగా మొదలయింది. ఆ ఆలస్యం కాకుండా ఉంటే మరొక అరగంటసేపు జే.వీ.రా.గారి ఉపన్యాసం ఉండేదికదా అనిపించింది.

*గ: ఈ పోస్టు RTS నుండి యూనీకోడుకు మార్చబడినది * Posted by Murali ( Feb 01 2005, 12:48:49 AM EST ) Permalink

20050128 Friday January 28, 2005

2005 - క్లీవ్లాండ్ త్యాగరాజ ఆరాధన క్లీవ్లాండ్, ఒహాయోలో జరిగే వార్షిక త్యాగరాజ ఆరాధనోత్సవాలు ఈ ఏడాది మార్చి 26 నుండి ఏప్రిల్ 3 వరకూ జరగనున్నాయి.

వివరాలకు ఈ వెబ్సైటు చూడండి: http://www.aradhana.org

ఈ అరాధన పురస్కరించుకొని పది రోజుల పాటు సుమారు 25 కచ్చేరీలు నిర్వహిస్తారు. రోజూ పగటిపూట లెక్చర్ డిమాన్స్ట్రేషన్లు, అమెరికాలో ఉన్న ఎదుగుతున్న కళాకారుల కచ్చేరీలు (1 నుంచి 2 గం. నిడివి) సాయంత్రం పేరున్న కళాకారుల కచ్చేరి ఉంటాయి(3గం. నిడివి). శనిఆది వారాలలో మాత్రం ప్రొద్దున 8గం. నుంచి రాత్రి 10గం. వరకూ పేరున్న కళాకారుల కచ్చేరీలు ఉంటాయి.

గత మూడు సంవత్సరాలుగా నేను ఈ ఆరాధనోత్సవాలకు హాజరవుతున్నాను. వీలయితే 10రోజుల పాటు క్లీవ్లాండ్ లోనే తిష్ట వేయాలని ఉంటుంది కాని వీలుకాదు కాబట్టి వారాంతంలో మటుకు వెళ్లి ఆనందిస్తుంటాను.

అమెరికా, కెనడా నలుమూలలనుంచి రసికులు వస్తుంటారు. క్లీవ్లాండ్ చుట్టు ప్రక్కల ఉండే వారు తప్పకుండా హాజరు కావలసిన ఉత్సవం.

ఈ సంవత్సరం వచ్చే కళాకారుల గురించి నాలుగు మాటలు.
1) మార్చి 26 శనివారం , సా. 7.00గం. - శ్రీమతి. అరుణా శాయిరాం
2004లో ఈవిడ కచ్చేరి మొదటిసారి ప్రత్యక్షంగా చూసాను. మాంచి హుషారుగా పాడతారు. గొంతెత్తి పాడడం అంటే ఏమిటో ఈవిడని చూస్తే అర్థం అవుతుంది :) క్రితంసారి కచ్చేరి సుమారు రాత్రి 10.30-11.00గం వరకు నడిచింది. చివరిలో త్యాగరాజ విరచిత "జో జో రామ" అనే కృతి(రీతిగౌళ రాగం) పాడితే బాగుంటుంది అని మనసులో అనుకొన్నా. నేను అనుకొన్నదే తడవుగా ఆవిడ ఆ పాట అందుకొన్నారు. అదొక వింత అనుభవం.

2) మార్చి 27 ఆదివారం, ప. 9.00గం. - శ్రీమతి. సుధా రఘునాథన్
గత మూడేళ్లు గా ఉత్సవంలో మొదటి ఆదివారం పగటిపూట మొదటి కచ్చేరి ఈవిడే! ఈవిడ కచ్చేరికి ఎక్కడ లేని జనం వస్తారు. ఆడిటోరియంలో కుర్చీలు సరిపోక జనాభ స్టాజి పైన కూడా ఎక్కి కూర్చుంటారు.

3) ఏప్రిల్ 2 శనివారం, ప. 9.00గం. - శ్రీ. R.K. శ్రీకంఠన్
వీరి కచ్చేరి ప్రత్యక్షంగా విని తీరవలసిందే. వీరి వయసు 80 పైమాటే. కాని ప్రతి సంవత్సరం ఓపికగా ఇండియా నుంచి వస్తారు. ముఖ్యంగా వీరి పురందరదాస కీర్తనలు 2మ్మచ్‌గా పాడతారు. గాత్రంలోని భావం అధ్భుతం!

వీళ్లుకాక సంజయ్ సుబ్రహ్మన్యం, T.M.కృష్ణ, రవికిరణ్, లాల్‌గూడి వారసులు, వేదవల్లి, సంతానగోపాలన్, ఉన్నికృష్ణన్ మొదలైనవారి కచ్చేరీలు కూడా ఉన్నయి. కానీ చాలవరకూ వరాంతంలో లేకపోవడం మన దురదృష్టం. క్లీవ్లాండ్‌లో ఉన్నవారయితే చక్కగా అన్నీ చూడొచ్చు.

*గ: ఈ పోస్టు యూనీకోడుకు మార్చబడినది.* Posted by Murali ( Jan 28 2005, 11:08:53 AM EST ) Permalink

20050127 Thursday January 27, 2005

6 - అన్నపూర్ణే విశాలాక్షీ ఇప్పుడు ముత్తుస్వామి దీక్షితులవారి మరొక కృతి చూద్దాం.

అన్నపూర్ణే విశాలాక్షీ అంటూ ప్రారంభమయ్యే ఈ కృతి, "సామ" రాగంలో కూర్చబడినది.

------------------------------
అన్నపూర్ణే విశాలాక్షీ అఖిలభువనసాక్షీ కటాక్షీ

ఉన్నతగర్త తీర విహారిణీ ఓంకారిణీ దురితాదినివారిణీ
పన్నగాభరణ రా़జ్ఞీ పురాణీ పరమేశ్వరీ విష్వేశ్వర భాశ్వరీ

పాయసాన్నపూరిత మాణిక్య పాత్ర హేమదర్వీ విధృతకరే
కాయజాది రక్షణ నిపుణతరే కాంచనమయ భూషణాంబరధరే
తోయజాసనాది సేవితపరే తుంబురు నారదాది నుతవరే
త్రయాతీత మోక్షప్రద చతురే త్రిపదశోభిత గురుగుహసాదరే

------------------------------
ఈ కృతికి ప్రతిపదార్దము కోసం ఈ సైటు చూడండి: http://www.ecse.rpi.edu/Homepages/ shivkuma/personal/music/annapurne.htm ఒక్క వివరణ: కృతిలో "ఉన్నత గర్త తీర విహారిణి" అని ఉన్నది కదా, అది నాకు మొదట అర్థం కాలేదు. దీక్షితులువారు కుళిక్కరాయి(kuzhikkarai) అనే ఊళ్లో ఈ కృతి వ్రాసారట, ఆ ఊరి గుడిలోని అమ్మవారిని సంబోధన అని ఇంటర్నెట్లో వెతికితే తెలిసింది.

నేదునూరి కృష్ణమూర్తిగారు పాడినది ఈ సైటులో వినవచ్చు:
http://sai.aros.net/music/karnatak/contrib దీక్షితులవారి కృతుల లక్షణాలన్ని దీంట్లో స్పష్టంగా కనిపిస్తాయి. ఇంతకుముందు పరిచయం చేసిన వాటి వలెనే ఈ కృతికూడా ఒక స్తోత్రంలాగా ఉన్నదని గమనించి ఉంటారు.

"సామ" రాగంలో ఉన్న విశిష్టత మూలాన కృతి వినటనికి చాల హృంద్యంగా ఉంటుంది. శంకరాభరణం సినిమాలోని "మానస సంచరరే, బ్రహ్మణి మానస సంచరరే" అనే పాట గుర్తుందా? ఆ కృతి కూడా సామ రాగంలో ఉన్నదే. ఆ కృతి రచించినది సదాశివ బ్రహ్మేంద్రం. అందుకే "బ్రహ్మణి" అంటూ రచయిత ముద్ర ఉన్నది.

సినిమాలలో సామ రాగంలో కూర్చిన పాటల వివరాలు కోసం ఈ లింకు చూడండి: http://members.tripod.com/~RKSanka/music/rslist.html

మనకున్న నాలుగువేదాలలో (ఋగ్, యజుర్, సామ, అధర్వణ) సంగీతం గురించి సామవేదంలో చెప్పబడినది. అందుకునే కవులు రచయితలు సంగీతాన్ని "సామవేదసారము" అనికూడా అంటూంటారు. సామ వేదంపేరు ఈ రాగానికి ఉండటం గమనించగలరు. 2004లో డెట్రాయిట్లో సామగాన హెరిటేజ్ ఫౌండేషన్ అని ఒక సంస్థ స్థాపించారు కూడాను.

* ఈ పోస్టు యూనీకోడుకు మార్చబడినది.* Posted by Murali ( Jan 27 2005, 02:50:33 PM EST ) Permalink

20050121 Friday January 21, 2005

ఆవకాయ సీసాల్లో దొరికే పచ్చళ్లు తిని అసలు పచ్చళ్ల మీద కోరికే చచ్చిపోయింది. సీసాల్లో దొరికేవి కనీసం రెండు మూడు ఏళ్ల క్రిందట పెట్టిన పచ్చళ్లు అని నా అభిప్రాయం.

పచ్చళ్లు పెట్టే కళలో తెలుగువారు తక్కిన రాష్ట్రాలవారితో పోలిస్తే ఒక మెట్టు పైనే ఉంటారని నాకనిపిస్తుంది.

అసలు ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే, మా రూమ్మేటు ఇండియా నుంచీ వస్తూ స్వీట్లతో పాటు వాళ్ల అమ్మగారు పెట్టిన ఆవకాయ, గోంగూర కూడా పట్టుకొచ్చాడు. సీసాల్లో దొరికే దానికీ ఈ ఆవకాయకూ నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అదేదో టీ అడ్వర్టైజ్మెంట్లో అన్నట్టు మనవాడు తెచ్చిన ఆవకాయకు రంగు, రుచి, ఘాటు అన్నీ ఉన్నాయి :)

నా ఉద్దేశంలో పచ్చళ్ల రాజ్యంలో ఆవకాయ తిరుగులేని మహారాజు. కాదు గోంగూరే అని వాదించేవాళ్ల కోసం గోంగూరని మహరాణిని చేయొచ్చు :)

ప్రతి సంవత్సరం ఆవకాయ సీజనులో ఇళ్లలో ఉండే హడావుడి చూడాలి. మా నూజివీడులో అయితే చెప్పనే అక్కరలేదు. ఇప్పుడయితే ఊరు వదలి దేశాల మీద పడ్డాం అనుకోండి. చిన్నప్పటి విషయాలు గుర్తుతెచ్చుకొని సరదా పడటం ఒక సరదా.

ఆవకాయ పెట్టేందుకు ఏ మామిడి కాయ పడితే అది పనికిరాదు. బంగినపల్లి, చిన్న రసాలు, పెద్ద రసాలు, యనమదల తీపి మామిది, కలక్టర్ కాయ, జలాలు, నాటు కాయ వగైరాలలో కేవలం చిన్న రసాలు లేదా నాటు కాయ వాడతారు. దోరగా ఉన్నప్పుదు వీటిలో పులుపు ఉంటుంది కాని "జలాల" కాయలలాగా వాసన ఉండవు.

ఆవకాయ పెట్టాలంటే ఆవపిండి, కారం, నువ్వులనూనె, ఉప్పు అవసరం. ఎంచుకునేటప్పుడుకూడా జాగ్రత్తగా ఉండాలి. దేంట్లో నలుపు ఉన్నా పచ్చడి త్వరగా నల్లబడి పోతుంది. మా ఇంట్లో ఎర్రటి మిరపకాయలు కొని ఎండబెట్టే వారు. వాటిని మిల్లులో కారం పట్టించుకొని వచ్చే పని, అలాగే గానుగలలో క్రొత్త నువ్వులనూనె వచ్చిందేమోనని రెండు రోజులకొకసారి కనుక్కోవటం, వస్తే నువ్వులనూనె తెచ్చే పని పిల్లకాయలది. పచ్చడి పెట్టే ఒక వారం ముందు ఇవన్నీ సిద్ధం చేసుకొనేవారు.

పెరట్లో పచ్చడి కాయల చెట్టు ఉంటే కాయల్ని కోయటం భలే సరదాగా ఉంటుంది. నాటు కాయల చెట్లు సాధారణంగా పొడుగ్గా పెరుగుతాయి. కాయల్ని కోయటానికి ఒక గెడకర్ర, దాని చివర ఒక కొక్కెం మరియు చిన్న చిక్కం(సంచీ) కావాలి. కాయ తొడిమను కొక్కేనికి పట్టించి మెలితిప్పి సంచీలో పడేలాగా కోయాలి. అలాగ కాకుండా నేల మీద పడితే కాయ దెబ్బ తిని పచ్చడికి పనికిరాదు. పక్కింటి వాళ్లకు పప్పో, రోటి పచ్చడో చేసుకోమని ఇచ్చేయటమే :)

పచ్చడి పెట్టే ముందురోజు కాయల్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని తడిలేకుండా తుడుచుకోవాలి లేకపోటే పచ్చడి బూజు పట్టేస్తుంది. మర్నాడు అటకమీదనుండి దింపిన "ముక్కలు కొట్టే కత్తి పీట"తో ముక్కలు చేయాలి. ఈ ముక్కలుచేసే ప్రహసనం కూడ తమాషాగా ఉంటుంది. కాయ చితకకుండా సరీగ్గా మధ్యకు టెంక సగంఅయ్యేట్టుగా ఒక్క వేటులో తెగాలి.

ముక్కలు కొట్టటం అయ్యాక ఆవపిండి, కారం, ఉప్పు, నువ్వులనూనె కలిపితే ఆవకాయ తయారు! :) పచ్చడిని తుడిచి ఆరబెట్టిన పింగాణీ జాడీలలో జాగ్రత్త చేసుకోవడమే.

మనం ఆవకాయ రుచి చూసేప్పుడు ముందు రంగు చూడాలి. అది ఎర్రగా నిగనిగలాడుతూ ఉండాలి. ముక్క మరీ మెత్తగా ఉండకూడదు. కొంచెం దోరగా ఉండాలి అలా అని వగరుగా ఉండకూడదు. తినాగానే కాస్త ఆవ రుచి తెలియాలి, కాని చేదుగా ఉండకూడదు. రెండు ముద్దలు తిన్న తరువాత మంచినీళ్లు ఉంటే బాగుణ్ణు అనిపించాలి కాని అదేపనిగా నీళ్లు తాగించేట్టు ఉండకూడదు. ఆలాంటి ఆవకాయలో కాస్త వెన్న వేసుకొని తింటే 2మ్మచ్!!

ఇక్కడో మార్పు అక్కడో మార్పు చేసి ఇతర రకాల పచ్చళ్లు తయారు చేసుకోవచ్చు. ఆవకాయాలో మామిడి బదులు దోసకాయవేస్తే దోసావకాయ అవుతుంది. అలాగే కాస్త పెసర పిండో, మెంతి పిండో వేస్తే పెసరావకాయ, మెంతావకాయ రెడీ!

క్రొత్త ఆవకాయ వస్తే పాత ఆవకాయ ముఖం చూసేవాళ్లం కాదు. అందుకని పాత ఆవకాయలో వెల్లుల్లి వంటివి వేసి "వెల్లుల్లావకాయ"గా మార్చేవారు. అదొక వ్యాపార సూత్రం (marketing technique).

ఆవకాయ మహారాజయితే "మాగాయ" యువరాజు! దాని గురించి మరెప్పుడైనా...

*గ: ఈ పోస్టూ యూనీకోడుకు మార్చబడినది* Posted by Murali ( Jan 21 2005, 09:26:10 AM EST ) Permalink

20050112 Wednesday January 12, 2005

కాల్ సెంటర్ వాళ్ల కష్టాలు అమెరికన్ కంపెనీలు భారత దేశంలో కాల్సెంటర్లు తెరచి వారి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవటం ఈనాడు జరుగుతున్న విషయమే.

ఆ మధ్యన అమెరికాలో అర్ధరాత్రి సమయంలో టీవీలోవచ్చే Conan O'Brien షోలో ఈ కాల్సెంటర్ల పైన ఒక సరదా కార్యక్రమం వచ్చింది. చక్కటి హాస్యం నిండి ఉన్న దాన్ని నేను కూడా ఆనందించాను.

కానీ ఆలాంటి హాస్యం అపహాస్యమయి విపరీత ధోరణులు తొక్కితే ఎలాఉంటుందో చూడండి.
http://timesofindia.indiatimes.com/articleshow/988029.cms

ఒక రేడియో షోవారు ఒక పూసలమ్మే కాల్సెంటరుకు ఫోనుచేసి అసభ్యపదాలతో మాట్లాడటం హేయమైన విషయం. ఇదంతా హాస్యం పండించే ఉద్దేశంతో చేసామని చెప్తారనుకోండి.

ఆ సంభాషణ ఇక్కడ వినవచ్చు:
http://www.edrants.com/_mp3/Power99_Call_to_India.mp3
ఈ విషయాన్ని నిరసిస్తూ ఒక బ్లాగ్:
http://www.edrants.com/reluctant/001697.html

మీ నిరసన వ్యక్తం చేయండి! రేడియో స్టేషను వివరాలు:

Philadelphia, WUSL

Business line: 215.483.8900
Studio hotline (toll-free): 800.669.99FM
Studio hotline (local): 215.263.6699

Attention: Richard Lewis & Thea Mitchem
Power99 WUSL-FM
440 Domino Lane
Philadelphia, PA 19128

Director of Urban Programming/Program Director: Thea Mitchem
Music Director: Coka Lani
News & Public Affairs Director: Loraine Ballard Morrill
Posted by Murali ( Jan 12 2005, 05:46:45 PM EST ) Permalink

20050111 Tuesday January 11, 2005

బ్లాగు వ్రాయటమెలా? ఇప్పుడిప్పుడే ఔత్సాహికులు తెలుగులో బ్లాగులు వ్రాస్తున్నారు. మొదట్లో కొంచెం జాగ్రత్తగా వ్రాయాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే తెలుగు లిపిలోకి మార్చినప్పుడు నవ్వు తెప్పించే విధంగా ఉంటాయి.

ఈ క్రింది చిట్కాలు జాగ్రత్తగా నేర్చుకుంటే సాధారణంగా చేసే తప్పులు సరిదిద్దుకోవచ్చు.

1) ఇంగ్లీషులో దీర్ఘాలు వ్రాయాలంటే ఒక కాపిటల్ అక్షరం లేదా రెండు చిన్న అక్షరాలు వ్రాయాలి:
ఉదా: amma = అమ్మ, illu = ఇల్లు, eTu = ఎటు
aaku, Aku => ఆకు, Iga, eega= ఈగ, EruvAka =ఏరువాక
2) ద, ధ, డ, ఢ
కాపిటల్ "D" వ్రాస్తే తెలుగు అక్షరం "డ" వ్రాసినట్టూ.
చిన్న "d" వ్రాస్తే తెలుగు అక్షరం "ద" వ్రాసినట్టూను.
ఉదా: way = daari = దారి
desert = eDaari = ఎడారి
dArinapOyE dAnayya = దారినపోయే దానయ్య
DuMDuM DigADigA = డుండుం డిగాడిగా
boom boom = DhAM DhAM = ఢాం ఢాం

3) త, థ, ట, ఠ
కాపిటల్ "T" వ్రాస్తే తెలుగులో "ట" వ్రాసినట్టు, అదే చిన్న "t" వ్రాస్తే తెలుగులో "త" వ్రాసినట్టు. వత్తులు వ్రాయాటనికి "h" చేరిస్తే సరిపోతుంది.
ఉదా: grandfather = tAtayya = తాతయ్య
Tata Birla = TATA birlA = టాటా బిర్లా
story = katha = కథ
fool = oTTisuMTha = ఒట్టిసుంఠ
4) స, శ, ష
s = సాధారణ స, S = మెలికల శ, sh = ష
ఉదా: interest = aasakti = ఆసక్తి
strength = Sakti = శక్తి
strength(as spoken in movies nowadays) = shakti= షక్తి :)
roam = shikAru = షికారు
5) ఋ, ఙ, ఞ
"ఋ"కారము. సంస్కృతం పదంలోని ఋకారము వ్రాయటానికి కాపిటల్ "R" వ్రాస్తే సరిపోతుంది.
ఉదా: sankskrit = saMskRtaM = సంస్కృతం
culture = saMskRti = సంస్కృతి
knowledge = vi~j~nAnamu = విజ్ఞానము

6) సున్నా
పదంలో సున్నా వ్రాయాలంటే కాపిటల్ "M" వ్రాయాలి
ఉదా: red pepper = kAraM = కారం
happy = AnaMdamu, saMtOshaM = ఆనందము, సంతోషం

కాబట్టి అన్ని అక్షరాలు english capital letters or small lettersలో వ్రాసేవారికి తెలుగులోకి మార్చిన తరువాత అంతా గజిబిజి గందరగోళంగా ఉంటుంది.
ఉద: (wrong) IDI AMTAA MODATI BADILO UNNADI = ఈడీ ఆంటాఆ ంఓడాటీ భాడీళో ఊణ్ణాడీ

(wrong) idi amtaa remdava badilo unnadi= ఇది అంతా రెందవ బదిలొ ఉన్నది

(right) idi aMtA sarigaa vrAyabaDinadi = ఇది అంతా సరిగా వ్రాయబడినది

I kriMdi udAharaNalu chUDaMDi: ఈ క్రింది ఉదాహరణలు చూడండి:

eMtA vEDinAgAnI suMtainA dayaa rAdu = ఎంతా వేడినాగానీ సుంతైనా దయా రాదు
paMtAmu chEya nEneMtATi vADanu taMDrI = పంతాము చేయ నేనెంతాటి వాడను తండ్రీ
E dESamEginA eMdukAliDinA pogaDarA = ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా
nI talli bhUmi bhAratini = నీ తల్లి భూమి భారతిని
niluparaa nee jaati niMDu gauravamu = నిలుపరా నీ జాతి నిండు గౌరవము

మొదట్లో కొంచం కష్టమనిపించినా రెండు మూడు రోజులలో అలవాటయిపోతుంది.
Posted by Murali ( Jan 11 2005, 02:46:47 PM EST ) Permalink Comments [2]

20050110 Monday January 10, 2005

బూరెల బుట్ట "తంతే బూరెల బుట్టలో పడ్డాడు" అనే నానుడి వినేవుంటారు కదా. ప్రస్తుతం నా పరిస్తితి తన్నకుండానే బూరెల బుట్టలో పడ్డట్టుగా ఉంది. :)

నా రూమ్మేటు క్రితం వారం ఇండియా నుంచీ వచ్చాడు. రాజమండ్రీ, హైదరాబాదు తిరిగొచ్చాడు. వస్తూ రాజమండ్రిలో "గంగరాజు పలకోవా" చాలా బవుంటుది అంటూ ఒక పాకెట్ పట్టుకొచ్చాడు. వాళ్ల అమ్మగారి స్నేహితులెవరో ఒక పాకెట్ పూతరేకులు ఇచ్చారట. అలాగే అమ్మమ్మగారేమో ఆప్యాయంగా ఒక పాకెట్ తొక్కుడు లడ్డూలు ఇచ్చారు :)

ఇవికాక మరో పాకెట్ కాజూ బర్ఫీ కూడా కొని తెచ్చాడు. ఆఫీసులో తోటి వారికని చెప్పి, హైదరాబాదు నుంచీ రెండు పాకెట్ల "పుల్లా రెడ్డి" స్వీట్స్ కూడా పట్టుకొచ్చాడు. వాటిలో ఒకటి నేను పక్కన పెట్టించాననుకోండి :)

వాళ్ల చుట్టాల, స్నేహితుల దయవల్ల నా పంట పండింది.

చెప్పొద్దూ, పాలకోవా చప్పరించి, పూతరేకులు అస్వాదిస్తూ తొక్కుడు లడ్డూ తింటే ఉంటుందీ.. నా సామిరంగా.. 2మ్మచ్!! ఈ మూడూ అచ్చమైన తెలుగు పిండివంటలని నా అభిప్రాయం. దేనికదే సాటి. ఏది చేయాలన్నా చాలా శ్రమ అవసరం. పాలకోవాకయితే, మరిగే పాలను కూర్చుని తిప్పుతూ ఉండాలి. పాకం తక్కువయితే సాగుతుంది..ఎక్కువయితే బిరుసవుతుంది. పూతరేకుల విషయానికొస్తే, అవి చుట్టేటప్పుడు చాలా సున్నితంగా ఉండాలి లేకపోతే చిరిగిపోతాయి. తొక్కుడులడ్డూలయితే చెప్పనే అక్కరలేదు, జంతికలు చేసి, తొక్కి, పంచదార కలిపి, ఉండలు చేయటం 3-4 గంటల పని.

ఇప్పుడయితే స్వగ్రుహా ఫూడ్స్ అంటూ పేటకొక స్వీట్ షాపు వచ్చింది. కాని, మా బామ్మ, అమ్మ గార్లు అన్ని ఒపికగా చేసేవాళ్లు.

Posted by Murali ( Jan 10 2005, 10:30:01 AM EST ) Permalink

20050106 Thursday January 06, 2005

మంచుమయం గత రెండ్రోజుల నుంచీ కురుస్తున్న మంచు పుణ్యమా అని రోడ్ల మీద 5 నుంచీ 6 అంగుళాల మేర పేరుకుంది.

అసలు రోజూ సుమారు సున్నా డిగ్రీ సెం. ఉష్ణోగ్రతలో లేచి బయటుకు రావటమే ఒకరకమైన చిరాకు వ్యవహారం. చక్కగా ముసుగుతన్ని పడుకోవాలని అనిపిస్తుంది.

బయటకు వచ్చాక కారు మీద పొడిగా ఉన్న దాన్ని ఊడ్చి, తడిగా ఉన్నదాన్ని తుడిచి, గడ్డకట్టి ఐసుగా మారిన దాన్ని గీక్కోవటం మరింత తలనొప్పి.

Posted by Murali ( Jan 06 2005, 03:33:37 PM EST ) Permalink

20050105 Wednesday January 05, 2005

సునామీ 2004 పది రోజుల శలవుల తరువాత ఇవేళ బ్లాగు వ్రాయటానికి వీలు చిక్కింది.

గత పదిరోజులలో షికాగో, న్యూ జెర్సీ, న్యూ యార్క్ తిరిగి వచ్చాను. చుట్టాలు, స్నేహితులతో లాంటి దగ్గరి వారితో కలసి గడపటం కంటే కావలసినది ఏముంది?

ఈ శలవులలో భారత ఉపఖండాన్ని తాకిన సునామి వలన జరిగిన అపార ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అత్యంత ఘోరం.

సమాచార విప్లవం పుణ్యమా అని, జరిగిన ఘోరం అమెరికాలో ఉన్నా వాళ్లకు కూడా, అక్షరాల కళ్లకు కట్టినట్టు టీవీలలో చూపిస్తున్నారు.

2005లో సునామి బాధితులకు త్వరిత గతిన పునరావాసం లభిస్తున్నదని ఆశిద్దాం.

మీకు ధన సహాయం చేసే ఉద్దేశం ఉంటే AID(Association for India's Development) వారి వెబ్సైటు చూడండి.

Posted by Murali ( Jan 05 2005, 03:03:46 PM EST ) Permalink

20041224 Friday December 24, 2004

నరసింహం అస్తమయం భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అస్తమించారు.

ఆయన తెలుగువారవటం మనందరికీ గర్వకారణం.

రౌడీలు, గూండాలు నాయకులుగా చలామణీ అవుతున్న ఈ రోజులలో వారిలాంటి విద్యావేత్త, మార్గదర్శకులు నాయకులుగా ఎదగటం చాలా అరుదు.

భారతదేశాన్ని ముందుకు నడిపించటంలో వారి ముందుచూపుకు అందరూ అపర చాణిక్యుడని కొనియాడడం తెలిసిందే.

అలోచిస్తే వారు నిజంగా సార్ధక నామధేయులే, నర సింహులే.

Posted by Murali ( Dec 24 2004, 10:20:20 AM EST ) Permalink

Calendar

RSS Feeds

Search

Links

Navigation

Referers