Tuesday May 25, 2010 వేటూరి మరణం ప్రముఖ సినీగేయ రచయిత వేటూరి సుందరరామమూర్తి పరమపదించారు. ఆరేడు ఏళ్ల క్రితం మిషిగన్లో ఆయనను కలిసే అదృష్టం కలిగింది. క్రిందటేడు, ఒక తెలుగుటీవీ చానెల్లో, పిల్లల పాటల పోటీలలో న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ ఒక చిన్న పిల్ల పాడిన పాటకు కంట తడిపెడుతూ కొన్ని పాటలు మనసును కదిలిస్తాయి, ఏవో జ్ఞాపకం తెస్తాయి అన్నారు. ఆయన రాసిన పాటలు ప్రతిఒక్కరికీ అటువంటి అనుభూతులనే కలిగిస్తాయి. Posted by Murali ( May 25 2010, 02:02:24 AM EDT ) Permalink Comments [26]
తెలుగు నిఘంటువులు ఇంటర్నెట్టులో క్రొత్తగా తెలుగునిఘాంటువులు http://www.andhrabharati.com/dictionary/వచ్చాయి. తప్పక చూడవలసినది. చాలా చక్కగా, అనాయాసంగా తెలుగు పదాలు, అర్ధాలు, పదార్ధాలు చక్కగా వెతుక్కోవచ్చు. 2మ్మచ్చ్! Posted by Murali ( Apr 27 2010, 10:59:06 PM EDT ) Permalink Comments [0]
నువ్వు ఇడియట్ మిత్రుడు శ్రీ, పోస్టు చూసిన తరువాత ఎందుకో సుమతీ శతక పద్యం స్ఫురించింది.
కనకపు సింహాసనమున, శునకమును గూర్చుండబెట్టి శుభ లగ్నమునన్
వొనరుగ పట్టము గట్టిన, వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ
తెలుగు చానెళ్లను తీసుకోకుండా ఎంత ఫన్ మిస్సవుగతున్నానో కదా. చూడాలి TV9 అమెరికాలో దొరుకుతుందేమో. సినిమా చానెళ్లెవడికి కావాలి మన రాజకీయ నాయకులు ప్రత్యక్షప్రసారం ఉండగా.
Posted by Murali
( Oct 01 2008, 01:21:12 PM EDT )
Permalink
గ్రంధ చౌర్యం పదిరోజుల క్రితం డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ పదవ వార్షికోత్సవ సంబరాల (
1,
2,
3,
4)
సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చిన చంద్రలత e-చౌర్యం గురించి అనుమానాలు వెలిబుచ్చారు. ఇంటర్నెట్‌లో (అందునా యూనీకోడ్‌లో) వ్రాయడం మూలాన ఈ చౌర్యం ఎక్కువ/తేలిక అవుతోందని లేదా అందుకు దోహద పడుతున్నాయని ఆవిడ అభిప్రాయం.
నా ఉద్దేశంలో e-చౌర్యానికి భయపడి ఇంటర్నెట్/యూనీకోడ్ వాడకం తగ్గించడం కూడదు. అసలు చెప్పాలంటే ఎలాక్ట్రానిక్ రూపంలో ఉంటే e-చౌర్యాన్ని తేలికగా పట్టుకోవచ్చు. ఈవాళే బీబీసీలో వచ్చిన ఈ కథనం చూడండి. బ్రిటీషుఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఉపన్యాసాన్ని కెనడా ప్రధానమంత్రి యధాతథంగా చౌర్యం అని వార్త. ఈ ఉపన్యాసాలు ఎలక్ట్రానిక్ రూపంలో లేకపోతే ఎప్పటికి తెలిసేది కాదేమో.
ఈ e-చౌర్యం ఎలక్ట్రానిక్ రూపం నుంచి మన వార్తాపత్రికలు యధాతథంగా ఎత్తేసి వేరే పేర్లతో ప్రచురించుకొని డబ్బుచేసుకోవడం మరో ఎత్తు. ఈ తరహా చౌర్యం తనను అమితంగా కలవరపెడుతున్నదని చంద్రలత అన్నారు. నిజానికి ఇది కేవలం తెలుగు వాళ్లకే కాక మిగతా భారతీయ జనాభాకి కూడా వర్తిస్తుంది. ఇవి చూడండి:
తెలుగు ప్రొఫెసరు,
టైమ్స్ ఆఫ్ ఇండియా,
1,
2,
3
Posted by Murali
( Oct 01 2008, 08:49:42 AM EDT )
Permalink
Comments [1]
సహాన నిన్న సాయంత్రం CCMA వారు నిర్వహించిన మైథిలి ప్రకాష్ భరతనాట్య ప్రదర్శనకు వెళ్లాం. నచ్చింది. "వల్లభా నాయకస్య"(హంసధ్వని) అంటూ గణపతి వందనం చేసి, ఆదిత్య హృదయం తో కార్యక్రమం మొదలైంది. "మాతే మలయాధ్వజ" (ఖమాస్) తరువాత 10ని. ల విరామం. పిదప "తాయే యశోద"(తోడి) అంటూ గోపిక పితూరీలు, "మొగుడొచ్చి"(సహాన), ధనశ్రీ థిల్లాన, "వైష్ణవజనతో", మంగళం తో ప్రదర్శన ముగిసింది. సీడీలతో కాకుండా ఎదురుగా నట్టువాంగం, గాత్రం తో నృత్యం చక్కగా ఉంది. ప్రదర్శనను ఉక్కిరిబిక్కిరి చేయకుండా రక్తి కట్టించిన lighting effects చెప్పుకోవాలి.
అన్ని అంశాలలోను నన్ను బాగా ఆకట్టుకొన్న అంశం, "మొగుడొచ్చి పిలిచేడు". సహానా రాగంలోనున్న ఈ జావళి(?)లో చిన్నతనంలోనే పెళ్లి చేసుకొని, యుక్త వయసొచ్చిన పిమ్మట అత్తగారింటికి వెడుతూ, కృష్ణుని విడచి పోవటానికి మనసురాని ఒక యువతి వేదన.
"సహాన" ఒక రక్తి రాగం. హాయిగా ఉంటుంది. రీతిగౌళ, దేవగాంధారి రాగాల లాగా నడక పట్టుకోవటం తేలిక. కర్ణాటక సంగీతం ఆస్వాదించాలనుకొనే వారు ముందుగా వినదగిన రాగాలలో ఒకటి. సహాన గురించి మరిన్ని వివరాలు.
Posted by Murali
( Aug 23 2008, 12:24:44 PM EDT )
Permalink
సాంప్రదాయ సాహిత్యం తెలుగులో గొప్ప కావ్యాల గురించి చెప్పేవారు ఉదహరించే వాటిల్లో రుక్మిణీ కల్యాణం (పోతన), గజేంద్ర మోక్షం(పోతన), మనుచరిత్ర(పెద్దన) ముందుంటాయి. వాటి గురించి తెలియని వారికి పరిచయం చేయాలని ఈ సరదా ప్రయత్నం.
DTLC పుణ్యమా అని పుస్తకాలు ఇంట్లోకి చేరాయికాని బుర్రలోకి ఏమీ ఎక్కలేదు. రుక్మిణీ కల్యాణం, గజేంద్ర మోక్షం, మనుచరిత్ర పుస్తకాలు ఎవరినోట విన్నా ఆహా, ఓహో అంటారు. తెరిచి చూద్దును కదా, కందలూ, గీతాలూ ఆకర్షించినా శార్దూలాల అరుపులు, మత్తేభాల ఘీంకారాలు భయపెట్టాయి. మూడు పుస్తకాలు ఒకేలాగా అనిపించాయి. కాలక్షేపానికి కనువిందు చేసే సినిమాలుండగా ఈ కష్టమైన కావ్యాలు కావాలా అనిపించేది. చదవగా చదవగా అక్కడో పద్యం ఇక్కడో పద్యం ఆకర్షించాయి. ప్రస్తుతం మూడింటి మీదా పట్టు ఫర్వాలేదు. ఒంటబడుతున్నాయి. శార్దూలాల పరుగులు, మత్తేభాల వయ్యారాలు, చంపకోత్పలమాలల సుగంధాలు తెలుస్తున్నాయి.
మనం ఆనందించే వాటిని నలుగితో పంచుకోవాలనే చాపల్యం మామూలు కదా. అందుకే ఈ ప్రయత్నం. మొదట ఒకేలాగా అనిపించినా మూడు కావ్యాలలో ఉన్న సరుకు వేరు.
మొదట రుక్మిణీ కల్యాణం. ఒక హీరోయిన్, హీరో, విలన్. టిపికల్ ప్రేమకథ. ఇప్పటికీ మనవాళ్లు అటుతిప్పి ఇటుతిప్పి ఈ కథతో మన బుర్రలు వాయగొడుతున్నారు. మొదటి సీన్లో రుక్మిణీ, కృష్ణులు ఒకరికోసం ఒకరు పుడతారు. విలన్ రుక్మి (రుక్మిణి అన్న) చెల్లెలిని శిశుపాలునికి ఇచ్చి పెళ్లి నిర్ణయిస్తాడు. హీరోయిన్ హీరోకి వర్తమానం పంపిస్తుంది. హీరో ఆఘమేఘాలమీద వస్తాడు. ఈలోగా ఆతృతతో హీరోయిన్ మాంచి sad song వేసుకునే చాన్స్. గుడికి వెళ్లిన హీరోయిన్ని లేవదీసుకొని వస్తాడు. వెంబడించిన విలన్తో, మాంచి ఫైటు. ఓడిస్తాడు. కథ సుఖాంతం.
తరువాత గజేంద్ర మోక్షం. ఇది 90వ దశకం మునుపు వచ్చిన పదకొండు గంటల సినిమాల టైపు. గొప్ప భక్తి రస చిత్రం. తేడా అల్లా, ఇక్కడ హీరో ఒక ఏనుగు, కష్టాలు-కన్నీళ్లు మొసలి రూపంలో వస్తాయి. First halfలో మన హీరో లెక్క లేకుండా అల్లరి చిల్లరిగా తిరుగుతుంటాడు. ఇంటర్వల్ టైంకి నీళల్లో మొసలి పట్టుకుంటుంది. Struggles start. Second halfలో సీనుసీనుకి భక్తి రసం పెరిగి క్లైమాక్స్‌లో భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. గజేంద్రుడికి మోక్షం ప్రసాదిస్తాడు.
ఇక మనుచరిత్ర. ఇది కత్తి-కాంతారావు లాంటి జానపద చిత్రం. మాయలు, మంత్రాలు, మారువేషాలు, చిత్రవిచిత్రమైన మలుపులున్న కథ. టూకీగా కథ ఇది. ప్రవరుడు అనే బ్రాహ్మణుడు మాయా లేపనం రాసుకొని హిమాలయాలకు వెళ్తాడు. తప్పిపోయి తిరుగుతున్న ఇతన్ని అక్కడ వరూధిని అనే గంధర్వ కన్య ప్రేమిస్తుంది. ఇతను తిరస్కరించి అగ్నిదేవుడిని స్మరించి తపోశక్తితో ఇంటికి రాగలుగుతాడు. ఒక గంధర్వుడు ప్రవరుని రూపంలో వచ్చి విరహంతోనున్న వరూధినిని నమ్మించి వంచిస్తాడు. అక్కడకు ఇంటర్వెల్. మిగిలినది కథ కావాలంటే మనుచరిత్ర చదవాల్సిందే.
ఇలా సాంప్రదాయ కవిత్వం ముసుగులో ఉన్న "గొప్ప" కావ్యాలను మన దర్శకులు ఎంచక్కా పాటలూ, ఫైటులున్న ఫిల్ముల్లో ఎక్కించేసారని మనవి.
Posted by Murali
( Aug 06 2008, 02:12:12 PM EDT )
Permalink
మల్లికార్జున్ నిన్న, కొలంబస్(ఒహాయో)లో మణిశర్మ సంగీత విభావరి చూడటానికి వెళ్లాం. అరగంట ఆలస్యంగా మొదలైన కార్యక్రమం, మధ్యలో డజను స్పాన్సర్లను వేదిక మీదకు పిలవటం, హీరో బాలకృష్ణ పుట్టినరోజు అసందర్భంగా కేక్ కోత వలన 1గంట వృధా.
ట్రూప్లో, నాకు నచ్చిన గాయకులలో మల్లికార్జున్ ఒకళ్లు. అతని చక్కటి తెలుగు ఉచ్ఛారణ, గాత్రంలో భావప్రకటన ఇట్టే ఆకర్షిస్తాయి. ఇక్కడ వినొచ్చు. http://www.raaga.com/channels/telugu/artist/Mallikarjun.html
Posted by Murali
( Jun 11 2008, 10:53:15 AM EDT )
Permalink
నాలుగు రోజుల క్రితం 2007 క్రికెట్ వరల్డ్ కప్ మొదలయింది.
భారత్ మొదటి రౌండు ఆటలు:
మార్చి 17 : బంగ్లాదేశ్, ట్రినిడాడ్
మార్చి 19 : బెర్ముడా, ట్రినిడాడ్
మార్చి 23 : శ్రీలంకా, ట్రినిడాడ్
అనుభవము, ఆత్మవిశ్వాసము, ఉత్సాహమూ సమపాళ్లలో ఉన్న భారత్ కప్పు గెలిచే అవకాశాలు ఉన్నాయని నా భావన. గెలవాలని నా ఆశ ! :)
వరల్డ్ కప్ సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన క్రికెట్ వీడియోలు.
1)గవాస్కర్ తాను ఔటయ్యి, తన తోటి ఆటగాడిని కూడా వెనక్కు వచ్చేయమనటం. (1981)
http://www.youtube.com/watch?v=jrp53wKHgb0
2)న్యూజిలాండు గెలవకుండా నిలువరించడానికి ఆఖరు బంతిని నేలబారుగా వేసిన అప్పటి ఆస్ట్రేలియా!
http://www.youtube.com/watch?v=K65_spUU05s
3)కొన్ని రన్నౌట్లు:
చంద్రపాల్ : http://www.youtube.com/watch?v=36SLpqAymTE
మురళీధరన్ : http://www.youtube.com/watch?v=6zgvjC9WUCs
సెహ్వాగ్ : http://www.youtube.com/watch?v=he9p5ynLdwU
ఊతప్ప : http://www.youtube.com/watch?v=rntUtH8Dt8U
ఇంజమామ్ : http://www.youtube.com/watch?v=tMHpZpwvPdM
4)సరదా సరదా!
శ్రీశాంత్ : http://www.youtube.com/watch?v=FNW0WTWlKSA&NR
ఇంటర్మీడియట్లో తెలుగా? సంస్క్రతమా?
వారాంతంలో అమ్మతో ఫోన్లో మాటాడుతుంటే, ఇంటర్మీడియట్ చదువుతున్న మా బాబాయి కూతురు ప్రస్తావన వచ్చింది. తరువాత తనకి ఫోను చేసి, "మొదటి పరీక్ష ఏమిటని?" అడిగాను. "సంస్కృతం" అని జవాబు.
దాంతో, ఇప్పటికే ఎన్నోసార్లు, ఎందరో మేధావులు చితక్కొట్టి, ఉతికి ఆరేసిన ఆలోచన మెదిలింది. అదే, "ఇంటర్మీడియట్లో తెలుగు తీసుకోవాలా, సంస్కృతం తీసుకోవాలా" అని. నేను నూజివీడులో ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో సంస్క్రతం చెప్పే మేష్టారు లేకపోవటం చేత, ఏది తీసుకోవాలి అనే సందిగ్ధం లేకపోయింది. కానీ, హిందీ తీసుకుంటే ఇంకో నాలుగు మార్కులు ఎక్కువ వచ్చే అవకాశం ఉందని, ఇంట్లో "హిందీ తీసుకుంటా" అని ప్రస్తావన పెట్టాను. "ఠాఠ్! హిందీ కోర్సు ఈ సంవత్సరమే పెట్టారు. ఆ చెప్పే మేష్టారు ఎలా చెప్తారో తెలియదు. తెలుగు తీసుకో!" అని నాన్న హుకుంతో ఆ సందిగ్ధం కూడా లేకపోయింది.
నూటికి 90% పైన మార్కులు రావాలంటే సంస్క్రతం తీసుకోవడం తప్పనిసరి మరి. నేను సంస్కృతం, హిందీ, తెలుగు - వీటిలో దేనికీ వ్యతిరేకిని కాను. ఈ మూడూ కాకుండా ఫ్రెంచి లాంటివి తీసుకున్నవాళ్లు కూడా నాకు తెలుసు. కానీ మార్కుల విషయంలో సమతుల్యత ఉండాలన్నది నా వాదన. అప్పుడు మార్కుల బట్టీ భాషను ఎన్నుకునే సందిగ్ధం ఉండదు.
అందుకని, first-language మటుకూ percentage కాకుండా percentile గా మార్చాలని నా ప్రతిపాదన. అప్పుడు తెలుగులో నూటికి 85 మార్కులు వచ్చిన వ్యక్తి 99 percentile కావొచ్చు. సంస్కృతంలో 98 మార్కులు వచ్చిన వ్యక్తి ఆ భాషలో 99 percentile కావొచ్చు. హిందీలో 90 మర్కులకే 99 percentile ఉండొచ్చు. ఈ percentileనే percentage గా లెక్క వేస్తే పెద్ద నష్టం ఉండదని నా అభిప్రాయం.
ఇలాంటి ప్రతిపాదన ఇంతకు ముందే ఎవరైనా చేసారేమో, నాకు తెలియదు.
Posted by Murali ( Mar 05 2007, 03:16:13 PM EST ) Permalink Comments [3]ఉత్తమ తెలుగుబ్లాగర్ల ఎన్నిక - 2006 - ఫలితాలు
indibloggies వారు నిర్వహించిన బ్లాగర్ల పోటీల ఫలితాలు ప్రకటించారు .
విస్మయపరచిన తెలుగుబ్లాగరు ఎన్నిక-2005 కంటే ఈ ఏడాది ఎన్నిక బావుంది. ముందుగా తెలుగు విభాగంలో, మొదటి మూడు స్థానాల్లో వచ్చిన శోధన(29 ఓట్లు), హృదయం(28 ఓట్లు), కృష్ణదేవరాయలు(26 ఓట్లు), లకు అభినందనలు.
క్రిందటేడాది ఫలితాలతో చూస్తే, గత సంవత్సరం 9, 8, 7 ఓట్లకే మొదటి మూడు స్థానాలు లభించగా, ఈ ఏడాది 29, 28, 26 ఓట్లు వచ్చాయి. ఇది శుభసూచికం. ఉత్సాహంగా బ్లాగులు వ్రాసేవారితో పాటు చదివేవారు పెరిగారని, తద్వారా యూనికోడు వాడకం పెరుగుతోందనీ అర్థమవుతోంది.
కానీ హిందీ బ్లాగులలో మొదటి స్థానాలలో వచ్చిన వారికి 128, 40, 37 ఓట్లు వచ్చాయి. అలాగే ఇంగ్లీషులో వ్రాసేవారికి 381, 223, 91 వచ్చాయి. దీని బట్టీ మన తెలుగువారిలో బ్లాగులపై మరింత చైతన్యవంతులను చేయవలసిన అవసరం ఉన్నదని తెలుస్తోంది.
వేరువేరు సైట్లకు వెళ్లి బ్లాగులు చదవనక్కరలేకుండా అన్నింటినీ ఒకే చోట కూడగట్టే మంచి ప్రయత్నం కూడలి, తేనెగూడు సైట్లు చేస్తున్నాయి.
Posted by Murali ( Feb 23 2007, 01:40:32 PM EST ) Permalinkనేటి సినిమా పేర్లు చూస్తుంటే నవ్వాలో, ఏడవాలో తెలియని పరిస్థితి.
కాస్తోకూస్తో "చెడు" లక్షణాలు సినిమా పేర్లలో కనిపించటం ఎప్పటి నుంచో ఉంది. ఉదాహరణకి దొంగరాముడు, కిలాడి, మోసగాళ్లకు మోసగాడు, గూండా, రౌడీ వగైరా. ఎక్కడో చదివిన గుర్తు. "మంచి" అనేది తెలుపు రంగులాంటిది. నిర్మలంగా ఉంటుంది. కాని "చెడు" అనేది రకరకాల రంగులలో ఉంటుంది. అందుకే, మనం చెడ్డవాటికి ఆకర్షితులైనంతగా మంచి వాటికి కాలేము. మనవాళ్లు ఈ సూత్రాని ఎప్పుడో పట్టేసారు. ఒక్క "దొంగ" అనే విషయం తీసుకొని దొంగరాముడు, దొంగ, అడవిదొంగ, కొండవీటి దొంగ, టక్కరి దొంగ, అమ్మ దొంగ, దొంగాదొంగ, దొంగా దొంగది, దొంగ రాముడు అండ్ పార్టీ వగైరా వగైరా సినిమాలు తీసారంటే అర్థం చేసుకోవచ్చు. ఒక మూల పదం తీసుకొని దాన్ని అట్నుంచి ఇట్నుంచి చితక్కొట్టి కొత్త పేర్లు సృష్టించడం మన ఆనవాయితీ!
ఈ మధ్య "చెడు" కాకుండా "అసహ్యం" వేసే పదాలను సినిమా పేర్లగా పెట్టటం పరిపాటి అయ్యింది. పోకిరి, దేశముదురు వగైరా. ఈ సినిమాలు సూపర్ హిట్టని వేరే చెప్పక్కరలేదు కదా. ఎంత అసహ్యమైన పేరు పెడితే అంత హిట్టవుతుంది అనే భావన కనిపిస్తోంది. భవిష్యత్తులో ముదురు పోకిరి, ముదుర్లకు ముదురు వంటివి వచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదు.
నేనుకూడా కొన్ని సూపర్ హిట్టు సినిమా పేర్లు ఆలోచించాను. నా మూల పదం బేవార్స్. ఈ క్రింది పేరు పెట్టి ఏ సినిమా తీసినా సూపరు డూపరు హిట్టే!
1) బేవార్స్ (టాగ్ లైన్ - ఎంత బేవార్సో వీడికే తెలీదు)
2) నువ్వు బేవార్స్ - నేను బేవార్స్
3) బేవార్సులకి బేవార్స్
4) నేనే బేవార్స్
5) మా ఆవిడ మీదొట్టు మీ ఆవిడ బేవార్స్ (గొప్ప మహిళా చిత్రం)
6) ఒకే బేవార్స్ (అనువాద చిత్రం)
7) బేవార్సులౌదాం రా! (ప్రేమ కథా చిత్రం)
8) బేవార్స్ రాముడు (టాగ్ లైన్ - గొప్ప బేవార్సని వీడి ఫీలింగ్)
శెలవ్, ఇట్లు మీ బేవార్స్
Posted by Murali ( Feb 14 2007, 01:22:05 PM EST ) Permalink Comments [2]క్రిందటి నెలలో అనుకుంటా, దినపత్రికలలో ఒక వార్త వచ్చింది. ఈ మధ్యకాలంలో అమెరికా యూనివర్సిటీలలో దక్షిణ ఆసియా భాషలపై మక్కువ పెరిగిందని, చాలా మంది నేర్చేసుకుంటున్నారనీను. నిజానికి భారతీయభాషలలో కేవలం హిందీ, ఉర్దూ, కొండకచో బెంగాలీ,తమిళం నేర్పబడతాయి.
మరి తెలుగు ఎందుకు చెప్పరు?
ఒక అమెరికా యూనివర్సిటీలో విదేశీభాష నేర్పేందుకు ఏర్పాటు చేయాలంటే ఆ భాష మీద గవర్నమెంటుకు దయ ఉండాలి. అప్పుడే ఉపాధ్యాయులకు వేతనం, కోర్సుకు తగిన ఆర్ధిక సహాయం అందుతాయి.
అలా వీలుకాని పక్షంలో ఔత్సాహికులు పూనుకొని ఆర్ధిక వనరులు సమకూరుస్తారు. ఈ వనరులు తక్కువ మొత్తమేమీ కాదు. సుమారు 1 మిలియన్(10 లక్షలు) డాలర్లు యూనివర్సిటీకి ముందుగా అందజేయాలి.
సాహితీ.ఆర్గ్ పై లభ్యమయ్యే ఆంగ్ల-తెలుగు నిఘంటువులలో ఒకటి వ్రాసిన శ్రీ. వేమూరి వేంకటేశ్వరరావు గారు మరికొందరి సహాయంతో, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బెర్కిలీ లో ఈ బృహత్కార్యానికి నడుంకట్టారు. మొదటి విడతలో భాగంగా 2006 చివరికల్లా $200,000 డాలర్లు (2 లక్షలు) సమకూర్చాలని నిర్ణయించుకొన్నారు. ప్రస్తుతానికి $120,000 డాలర్లు జమ చేయగలిగారు. ఇంకా $80,000 కావలసి ఉంది.
తలా కొంచెం బరువు మోస్తే ఇది పెద్ద మొత్తమేమీ కాదు. మీరు తోటి బ్లాగరైతే తప్పక ఈ విషయాని మీ బ్లాగులో ప్రచురించి నలుగురికి ఈ అవసరం గురించి తెలియజేయగలరు. తృణమో పణమో ఈ సత్కార్యానికి తోచిన సాయం చేయగలరు. దీనిని సాయం అనకూడదేమోను. అలా పాలుపంచుకోవటం ప్రతిఒక్కరి ధర్మం.
Posted by Murali ( Dec 05 2006, 01:07:11 PM EST ) Permalink Comments [1]Windows XP + MS Office 2003 లో తెలుగు ఎలా?
ఇంటర్నెట్లో చాలా చోట్ల కంప్యూటర్లలో తెలుగు ఎలా వాడాలి అని ఉన్నా కూడా, ఇది కేవలం Windows XP జతలో ఎలా వాడాలి అని తెలియజెప్పే ప్రయత్నం.
నిన్న మా తెలుగు book-club సమావేశంలో మిత్రులు కోరికపై వ్రాయప్రయత్నం. ఈ సూచనలు అందరికీ వర్తించక పోవచ్చును.
చదవటం:
1) Control Panel > Regional and Language Options > Languages (tab) నకు వెళ్లాలి.
2) "Install files for Complex script and right-to-left languages (including Thai)" అనే option ఎంచుకోవాలి. OK చేయాలి.
3) కంప్యూటరు re-boot చేయాలి. ఇంతవరకూ చేస్తే తెలుగు చదవడానికి మీ కంప్యూటరు సిద్ధం.
వ్రాయటం:
4) మరలా Control Panel > Regional and Language Options > Languages (tab) నకు వెళ్లాలి.
5) "Text services and input languages" అన్న విభాగంలో "Details" ను క్లిక్ చేయాలి.
6) "Settings(tab)" > "Installed Services" విభాగంలో "Add.." ను క్లిక్ చేసి, "Add Input Language"లో "Telugu" ను ఎంచుకోండి. OK చేయాలి.
7) "Advanced(tab)" > "Compatibility Configuration" విభాగంలో "Extend support of advanced text services to all programs" ను ఎంచుకోవాలి. OK చేయాలి.
8) ఇంక వీలైనన్ని సార్లు OK చేసేయాలి. మరో సారి కంప్యూటరు re-boot చేయవలసి రావచ్చు.
9) కంప్యూటరు తెరచి taskbar దగ్గర, క్రొత్త icon, language-bar కనిపిస్తుంది. దానిలో "EN" ఎంచుకుంటే ఇంగ్లీషు, "TE" ఎంచుకుంటే తెలుగులోనూ టైపు చేయొచ్చు. ఇంతవరకూ చేస్తే తెలుగు వ్రాయడానికి మీ కంప్యూటరు సిద్ధం.
కంప్యూటరు సిద్ధమయింది సరే, ఎలా టైపు చేయాలి అనేది ఇంకెప్పుడైనా...
Posted by Murali ( Dec 04 2006, 11:57:19 AM EST ) Permalink Comments [1]
నూజివీడులో ఇరవైమంది దుర్మరణం "మాది నూజివీడు..విజయవాడ దగ్గర..50కి.మీ. దూరం" అంటూ ఎవరికైనా పరిచయం చేసుకోగానే,
"ఆఁ..విన్న పేరే..నూజివీడు రసాలు..మామిడికాయలకు ప్రసిద్ధి కదూ!" అంటూంటారు.
ఏ వార్తాపత్రిక చూసినా ఏమున్నాయి వార్తలు? దుర్మరణాలు, ప్రకృతి వైపరిత్యాలు, ఫ్యాక్షన్లు, హత్యలు,
మోసాలు వగైరా. సాథ్యమైనంత వరకూ నా బ్లాగులో ఆ విషయాలు ప్రస్తుతించకూడదనుకున్నాను. కానీ,
సొంత ఊళ్లో జరిగిన విషయం కదా, పంచుకోకుండా ఉండలేక పోయాను:
http://news.bbc.co.uk/1/hi/world/south_asia/4963172.stm
వేసవికాలం వచ్చిందంటే చాలు ఊరంతా సందడి సందడిగా ఉంటుంది. పెద్దపెద్ద గుట్టలు పోసి కాయలెక్క పెడుతూ
కమీషను కొట్లు, బుట్టలకొద్దీ మామిడి పళ్లు, వ్యాపారం/రవాణా హడావిడి, ఎంతో బాగుటుంది. అట్లాంటి సమయంలో
కాయతీసుకెళ్తున్న లారీకి ప్రమాదం జరిగి ఇరవైమంది వరకూ చనిపోవటం నిజంగా బాధాకరం.
Posted by Murali
( May 01 2006, 02:51:38 PM EDT )
Permalink
త్యాగరాజ ఆరాధన - 2006 నిన్ననో మొన్ననో 2005లో జరిగిన త్యాగరాజ ఆరాధన ఉత్సవాల గురించి వ్రాసినట్టుగా ఉంది. అప్పుడే గుడ్-ఫ్రైడే వారాంతం వచ్చేసింది. మళ్లీ వార్షిక క్లీవ్లాండ్ ఆరాధనోత్సవాలకు ప్రయాణానికి సన్నధం ఆయ్యాను.
సుభాన్ ఖాసిం బృందం నాదస్వర కచ్చేరి ఇంతకు ముందు ఎప్పుడూ చూసి ఎరుగను. మరొకటి ఎం.ఎస్.షీలా గాత్రకచ్చేరీ కూడా ఎప్పుడూ ప్రత్యక్ష్యంగా వినలేదు. ఈ రెండూ నాకు ఈ సంవత్సరం ప్రత్యేకం. సుధారఘునాథన్, రంజని-గాయత్రి, TM కృష్ణ, సంతానగోపాలన్ కచ్చేరీలు ఇంతకు ముందు ఒకటి రెండుసార్లు ప్రత్యక్ష్యంగా విన్నా, మళ్లా వినొచ్చు.
వీలయితే ఉత్సవాలు పూర్తయిన పిమ్మట వివరాలు, అభిప్రాయాలు వ్రాస్తాను.
Posted by Murali
( Apr 11 2006, 03:27:06 PM EDT )
Permalink
Comments [1]