Saturday April 22, 2006 ఆమెకు నిప్పంటించాడు... అతనూ బలయ్యాడు అనంతపురం జిల్లా యాడికి గ్రామంలో జరిగిందిది. ఇక్కడి నారాయణ స్వామి కాలనీలో కాపురముంటున్న భాస్కర్ (40), చంద్రకళ (35) దంపతులకు ఇద్దరమ్మాయిలు, ఒకబ్బాయి. వ్యాపారంలో నష్టాలు రావడంతో మద్యానికి బానిసైన భాస్కర్ భార్యతో గురువారం గొడవపడ్డాడు. పిల్లలు పాఠశాలకు వెళిపోగా వీళ్ల గొడవ ఎవరికీ వినబడకుండా టీవీ శబ్దం పెంచి అరుచుకున్నారు. ఒక దశలో చంపుతానని భాస్కర్ తన భార్య చంద్రకళను బెదిరించగా... చంపు చూద్దామని భార్య కూడా అనడంతో రెచ్చిపోయిన భాస్కర్ ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. మంటలు ఎగసిపడగా కాలిపోతున్న చంద్రకళ తనపై కిరోసిన పోసిన భర్త భాస్కర్‌ను గట్టిగా కౌగలించుకుంది. ఫలితంగా రెండు నిండు ప్రాణాలు బలైపోయాయి. పిల్లలు నడిరోడ్డున పడ్డారు. సంయమనం లేని కారణంగా ఓ నిండు కుటుంబం అంతమైపోయింది. అందుకే.... కోపావేశాలను పెకలించి, నిగ్రహానికి చోటివ్వండి. Posted by gsrinivasakumar ( Apr 22 2006, 12:02:03 PM RET ) Permalink
అక్రమ వ్యభిచారమట... గ్రహచారం కాకపోతే... ఈ అక్రమ వ్యభిచారం ఏంటో ఆ వార్త చదవకముందు నా చిట్టి మట్టి బుర్రకు అంత త్వరగా అర్థం కాలేదు. సెక్స్ వర్కర్లకు లైసెన్సులు ఇచ్చి, వ్యభిచారాన్ని చట్టబద్ధం (సక్రమ వ్యభిచారం) చేసి, ఈ వర్గాన్ని కార్మికులుగా గుర్తించకపోతే బెంగాల్ శాసనసభ ఎన్నికలను బహిష్కరిస్తామంటూ కోల్‌కతలోని (అదే కలకత్తా) సెక్స్ వర్కర్లు కొన్నాళ్ల కిందట ఆందోళన చేపట్టారు(ఈ కోరిక నెరవేరిందో లేదో ఇంకా తెలీదు). ఓ పక్క ఎయిడ్స్ భూతాన్ని పెంచిపోషిస్తున్న వ్యభిచారమనేది ఘోరమైన సాంఘిక దురాచారం రా బాబూ అని గగ్గోలు పెడుతోంటే దీన్ని చట్టబద్ధం చేయాలని కోరడమేంటో, దానికొక లైసెన్స్ ఏమిటో, మనం ఎటుపోతున్నామో, ఓరి దేముడో నాకర్థంగావడంలేదు. ఈ సెక్స్ వర్కర్లు వ్యభిచార వృత్తిని వదలిపెట్టి సామాజికంగా గౌరవప్రదమైన మరో వృత్తిని చేపట్టి ముందంజ వేసేలా సహకరించేందుకు అందరూ ముందుకు రావాలనేది నా అభిలాష, ఆకాంక్ష. Posted by gsrinivasakumar ( Apr 17 2006, 05:29:35 PM RET ) Permalink
నర్సింగ్ హోమ్‌లతో పాటు హోమ్ నర్సింగ్ కూడా... దీర్ఘకాలిక రోగాలు, ప్రమాదాలు లేదా వృద్ధాప్యం కారణంగా రోజు ఆసుపత్రుల చుట్టూ తిరగలేని వారికి వైద్య సేవలందించేందుకు ఇటీవల కాలంలో హోమ్ హెల్త్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. వైద్య రంగంలో నిపుణులైన వైద్యులు, నర్సులు ఒక బృందంగా ఏర్పడి అన్ని వయసుల వారికీ 24 గంటలూ ఇళ్లలోనే వైద్య సేవలందించేలా సంస్థలను నడుపుతున్నారు. ఇప్పటికే మన దేశంలోని పలు నగరాల్లో ప్రారంభమైన ఈ సంస్థల సేవలు మధ్య తరగతి వారికీ అందుబాటులో ఉంటున్నాయట. తగినన్ని మందులు, సామగ్రితో ఎప్పుడూ సిద్ధంగా ఉండి రోగులకు వైద్యపరంగా ఏ సమయంలో ఏ అవసరం వచ్చినా చేయూతనిచ్చేందుకు ఈ సంస్థల సిబ్బంది ఎల్లప్పూడూ సన్నద్ధంగా ఉంటార్ట. మొత్తం మీద వైద్య రంగంలోని నిరుద్యోగులకు ఇదో ఉద్యోగావకాశం, రోగులు సావకాశంగా మేలైన సేవలు పొందే సదవకాశం. Posted by gsrinivasakumar ( Apr 17 2006, 02:29:52 PM RET ) Permalink
కారుణ్యకు ఓటేయండి తెలుగు తేజాన్ని గెలిపించండి సోనీ టీవీ నిర్వహిస్తున్న ఇండియన్ ఐడల్ పోటీల్లో తుది దశకు చేరుకున్న మన తెలుగు తేజం కారుణ్యకు ఎస్ఎమ్ఎస్ పంపడం ద్వారా ఓటేసి గెలిపించండి ప్లీజ్. మీరు చేయాల్సిందల్లా karunya అని టైప్ చేసి 2525 నంబరుకు ఎస్ఎమ్ఎస్ పంపడమే లేదా 1904424252502 నంబరుకు ల్యాండ్ లైన్ ద్వారా మీ నిర్ణయం తెలియపరచవచ్చట. ఈ పోటీల్లో మనవాడు గెలవాలంటే దేశవ్యాప్తంగా (ప్రపంచవ్యాప్తంగా అయితే మరీ మంచిది) వీలైనన్ని ఎక్కువ ఎస్ఎమ్ఎస్ లేదా ల్యాండ్ లైన్ ఓట్లు రావాలి. ఇక ఆ పని మీదే ఉంటారుగా... Posted by gsrinivasakumar ( Apr 15 2006, 03:57:27 PM RET ) Permalink
తెలుగు వీర లేవరా..దీక్షబూని సాగరా... దుబాయిలో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ప్రపంచంలోని తెలుగు వారందరికీ ఇవే నా శుభాకాంక్షలు. తెలుగు భాషాసంస్కృతులు మరింతగా శోభిల్లి, తెలుగునేల ప్రపంచానికే ఆదర్శనీయం, అనుసరణీయం, ఆచరణీయం కావాలని మనసారా మరొక్కసారి అకాంక్షిస్తున్నాను. మీరెన్ని భాషలైనా నేర్చుకొని అన్ని విధాలా ప్రయోజనాలను పొందండి. కాని మన అమ్మ పలుకు అయిన తెలుగు చదవండి, మాట్లాడండి, తెలుగులో ఆలోచించండి. తెలుగు ఇంకా నేర్వండి, మన పిల్లలకు నేర్పండి. మా తెలుగు తల్లికి మల్లెపూదండే కాదు మిగిలిన పూలదండలూ వేద్దాం.... Posted by gsrinivasakumar ( Apr 15 2006, 10:47:05 AM RET ) Permalink
నేలకొరిగిన మన సంస్కృతి ఆనవాళ్లు ఓరుగల్లులో సుమారు 850 ఏళ్ల కిందట పునాదులు లేకుండా భూమిపై సమాంతరంగా నిర్మించిన కాకతీయుల కళావైభవ చిహ్నమైన 300 స్తంభాల కళ్యాణమంటపాన్ని పురాతత్వ శాఖ నేలమట్టం చేసిన తీరును ఈ రోజు ఈనాడు ప్రచురించింది. శిధిలావస్థలో ఉన్న దీనిని బాగుచెద్దామనుకొని, మండపంలోని స్తంభాలను విడదీసే ప్రయత్నంలో ఆ శాఖ సిబ్బంది 24 స్తంభాలను విరగ్గొట్టిన పుణ్యాన్ని కూడా మూటగట్టుకోగా, కొన్ని స్తంభాలు కనిపించడం లేదట. చివరకు ఏం చెయ్యాలో అర్థంకాక దీనిని యథాస్థితికి తెచ్చే పనిని జాతీయ సాంకేతిక సంస్థ (నిట్) అప్పచెప్పారట. ఇదీ మన సంస్కృతిని మనవాళ్లు కాపాడుతున్న తీరు. Posted by gsrinivasakumar ( Apr 12 2006, 02:01:44 PM RET ) Permalink
వీరాభిమానం...పిచ్చ అభిమానం... తమిళనాడు ఎన్నికల పర్వం చూస్తే వీర, పిచ్చ అభిమానాలకు సరైన నిర్వచనాలు దొరుకుతాయి. ఎన్నికల బరిలో ఉన్న కరుణానిధి, ఆయన కొడుకు స్టాలిన్, మరోవైపు జయలలిత, కొత్తగా పార్టీ పెట్టిన నటుడు విజయకాంత్ బొమ్మల డయళ్లతో ఉన్న వాచీలు వారి వారి అభిమానుల కోసం తమిళనాడు మార్కెట్లలో దిగాయి. అలాగే ఆయా పార్టీల గుర్తులు ముద్రించిన జేబు రుమాళ్లు, జెండాల పోలి ఉన్న లుంగీలూ, తువ్వాళ్లు వచ్చేశాయి. ఇంతేనా కూతంత డబ్బులెక్కువున్న అభిమానులు, పార్టీ నాయకులు బంగారంతో పెద్ద పెద్ద ఉంగరాలు చేయించుకుని వాటిపై తమ అభిమాన నేతల ఫొటోలు వేయించుకుంటున్నారు(తర్వాతెప్పుడైనా పార్టీ టికెట్, కనీసం చిన్న పదవి, అంతో ఇంతో ముట్టకపోతుందా అన్న ఆశతో). కొందరైతే తమ పార్టీలు గెలవాలని పాద యాత్రలూ మొదలు పెట్టారు. చెప్పాలి గానీ ఇలాంటివి ఇంకా బోలెడున్నాయి. తర్వాత ఇంకా చెబుతా... Posted by gsrinivasakumar ( Apr 11 2006, 06:48:57 PM RET ) Permalink
పాపం... ఆమె ఆవేదనలో అర్థం ఉంది కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్‌లో మన రాష్ట్రం (దేశం) తరపున పాల్గొని పతకాలు సాధించి తిరిగి వచ్చిన తమకు హైదరాబాదు విమానాశ్రయంలో ఒక్క అభిమాని కూడా ఎదురుపడకపోవడం బాధగా ఉందంటూ మీడియాలో వాపోయిన శృతి కురియన్ ఆవేదనలో అర్థం ఉంది. మన క్రీడాభిమానులకు ప్రస్తుతం క్రికెట్ మాత్రమే క్రీడలా కనిపిస్తోంది. టెన్నిస్ క్రీడాకారిణి సానియాకూ అభిమానులున్నారుగా అంటారేమో.... అది సానియాపై అభిమానమే తప్ప టెన్నిస్ పైన కాదు. కాకపోతే ఇదే టెన్నిస్ క్రీడలో విజయాలు సాధిస్తున్న శిఖ, నేహలను ఎంతమంది పట్టించుకుంటున్నారు ? ఫుట్ బాల్, హాకీ క్రీడాకారులకూ ఇదే పరిస్థితి. ఈ మధ్య కాలంలో మన చదరంగ క్రీడాకారిణి హంపిని తలుచుకునేవారూ కరవయ్యారు. ప్రభుత్వాలు, మీడియా వర్గాలు అందరికీ సమానంగా గుర్తింపునిస్తే బాగుంటుంది. Posted by gsrinivasakumar ( Apr 11 2006, 10:11:33 AM RET ) Permalink
చిత్రం భళారే విచిత్రం ఈ రోజు ఈనాడు పత్రికలో రెండు చిత్రాలు ప్రచురించారు. ఒక ఫొటోలో గిట్టుబాటు ధర లభించక రైతులు గుట్టలుగా (ఇంచుమించు కొండల్లా..) పారబోసిన కూరగాయలు, మరో ఫొటోలో బర్డ్ ఫ్లూ భయంతో ఉచితంగా కోళ్ల పంపకం (జ్యోతిలోనూ చూశాను). మన దేశంలో పేదరికం, కరువు కోరల్లో చిక్కుకొని, ఒకపూట తిండి కోసం అలమటిస్తున్న జనం లక్షలు, కోట్ల సంఖ్యలో నేటికీ ఉన్నారు. మరో పక్క చమటోడ్చి పండించిన పంటకు గిట్టుబాటు ధరల్లేక రైతులు కూరగాయల్ని నేలపాలు, నీటిపాలు చేస్తున్న వైనం. ఇక ఆహారశాఖ గిడ్డంగులలో సరైన రీతిలో సమయానికి పంపిణీ జరుగక టన్నుల కొద్దీ బియ్యం, ఇతర ఆహారోత్పత్తులు ముక్కిపోయి వృధా అవుతున్నాయి. ఈ పరిస్థితి మన దేశంలో దశాబ్దాల కాలంగా నెలకొని ఉంది. ఈ పరిస్థితిని సమన్వయ పరచి చక్కదిద్దే నైపుణ్యం మన నేతలకు, నిపుణులకు, మేథావులకూ లేదా ? వనరులు ఉండీ జనం తిండి కోసం మలమలలాడే పరిస్థితులు ఇంకెన్నాళ్లు ? ఇక రెండో ఫొటో విషయానికొస్తే.... బర్డ్ ఫ్లూ భయంతో కోళ్ల ఫారం యజమానులు ఫారం కోళ్లను జనానికి ఉచితంగా ఇచ్చేస్తున్నారు. ఇన్నాళ్లూ ఈ వ్యాధి భయంతోనే చికెన్ జోలికి పోని జనం, ఇప్పుడు ఉచితంగా పంపిణీ అనగానే పరిగెత్తుకొచ్చి వాటిని పట్టుకుపోతున్నారు. ఇది అజ్ఞానమా ? లేదా మరొకటా ? ఈ కోళ్లను తిన్న వాళ్లకు వ్యాధి వస్తే దానికెవరు బాధ్యులు ? (ఈ బాధ లేకుండా హాయిగా అందరూ శాకాహారులైపోతే బాగుంటుంది). Posted by gsrinivasakumar ( Apr 05 2006, 11:55:11 AM RET ) Permalink
భాషాఇండియా బ్లాగుల పోటీ భారతీయ భాషలలో గణకీకరణ (కంప్యూటింగ్)ను ప్రోత్సహించే దిశగా మైక్రోసాఫ్ట్ సంస్థ నెలకొల్పిన భాషాఇండియా భారతీయ భాషల బ్లాగుల పోటీని నిర్వహిస్తోంది. బ్లాగరులైన మన మిత్రులందరూ ఈ పోటీలో పాల్గొని బహుమతులు పొందగలరని ఆకాంక్షిస్తున్నాను. Posted by gsrinivasakumar ( Apr 04 2006, 03:50:25 PM RET ) Permalink
నిమ్స్‌కు వీణ...వాణి గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఇన్నాళ్లూ డాక్టర్ నాయుడమ్మగారి పర్యవేక్షణలో ఉంటూవచ్చిన సయామీ (తలలు అతుక్కుని పుట్టిన) కవలలు వాణి, వీణలను హైదరాబాదులోని నిమ్స్‌కు తరలించే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ చిన్నారులకు ప్రత్యేక శ్రద్ధతో వైద్య నిర్వహణ, శస్త్రచికిత్సలు చేసేలా చర్యలు తీసుకుంటామని ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఐ వి సుబ్బారావు తెలిపారు. ఆయన పర్యవేక్షణలో వీణ, వాణి దిగ్విజయంగా శస్త్రచికిత్స ముగించుకొని బంగారు భవితను పొందగలరని ఆశిద్దాం. Posted by gsrinivasakumar ( Apr 04 2006, 03:43:59 PM RET ) Permalink
నీటితో కాటికి.... భారతదేశంలోని అధిక శాతం ప్రాంతాల్లో ఏ మాత్రం శుభ్రతలేని తాగునీటితో వచ్చే జబ్బులు జనాన్ని కాటికి పంపేస్తున్నాయని ఓ ప్రముఖ పత్రిక ఈ మధ్య పరిశోధనాత్మకమైన నివేదికను అందించింది. అధికంగా అమ్ముడవుతున్న మినరల్ వాటర్ సీసాలు, వాటర్ ప్యాకెట్లలోని నీరు కూడా కలుషితంగానే ఉంటోందని కొన్ని టీవీ ఛానెళ్లు కథనాలను ప్రసారం చేసాయి. ఓ పక్క ఆర్థికంగా నానాటికీ బలపడుతున్నప్పటికీ ప్రజారోగ్యం విషయంలో మనం ఎంత బలహీనంగా ఉన్నామో అనిపించింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే దశాబ్దాల కాలంగా ఫ్లోరైడ్ కలిసిన నీటినే సేవిస్తూ బతికుండగానే నరకం అనుభవిస్తున్న పల్లెలున్నాయి. ప్రధానమంత్రి స్థాయి నేతల దృష్టికి సైతం ఈ విషయాలు వెళ్లినా పెద్దగా పురోగతి కనిపించకపోవడం బాధగా ఉంది. Posted by gsrinivasakumar ( Apr 03 2006, 01:52:02 PM RET ) Permalink
మమ్మల్ని కాపాడరూ ?..... వీణ వాణి తలలు అతుక్కుని పుట్టి, ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఉన్న వీణ, వాణిలు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు ఈ రోజు ఈనాడు పత్రికలో చూసాను. వీరిని వేరు చేయడానికి చాలా ఖర్చవుతుందట. అందుకని వీరితో తమకు సంబంధం లేదని తల్లిదండ్రులే ఓ పత్రం రాసిచ్చేసారట. ఈ పిల్లలు ఇప్పటివరకూ డాక్టర్ నాయుడమ్మ సంరక్షణలో ఉండేవారు. వైద్యపరంగా ఇలాంటి క్లిష్టమైన కేసులనెన్నింటినో పరిష్కరించిన నాయుడమ్మ పదవీ విరమణ చేయడంతో ఈ పిల్లల్ని నిమ్స్‌కు లేదా అనాథ సంరక్షణ కేంద్రమైన శిశువిహార్‌కు తరలించే ప్రయత్నం జరుగుతున్నట్లు ఆ వార్త తెలిపింది. వైద్యపరంగా ఎంతో ప్రత్యేకమైన సంరక్షణ అవసరమైన వీణ, వాణిల జీవితాన్ని బాగు చేయడానికి ప్రభుత్వమే ప్రత్యక్షంగా చొరవ తీసుకోవాలి. వ్యాపార, పారిశ్రామిక వేత్తలు ముందుకొచ్చి ఈ చిన్నారులను కాపాడాల్సిన అవసరముంది. ఉత్తర భారతదేశంలో ఇలాగే పుట్టిన ఓ కవలల జంటను ఆపరేషన్ ద్వారా వేరు చేయడానికి సౌదీ రాజు సాయం చేస్తున్నట్లు తెలిసింది. అలా సాయపడగల ఎన్నారైలు, దాతలెందరో ఉన్నారు. వీరికి చేయూతనివ్వండి. Posted by gsrinivasakumar ( Mar 29 2006, 11:57:26 AM RET ) Permalink
మనిషంటే హీనం... దేవుడంటే ప్రాణం మనం రోజూ వార్తలు వింటుంటాం లేదా చూస్తుంటాం... ఫలానా పారిశ్రామిక వేత్త లేదా రాజకీయనాయకుడు ఫలానా దేవుడికి ఇన్ని లక్షలు లేదా ఇన్ని కోట్ల ఖర్చుతో ఫలానా కానుకనిచ్చారని. అలాగే అజ్ఞాత భక్తులెవరో హుండీలో ఇన్ని డబ్బులేసి వెళ్లారని. ఇలాంటి వార్తలు విన్న ఓ పేద బాలిక ఆ మధ్య పత్రికల ద్వారా ఓ విజ్ఞప్తి చేసింది. మానవ సేవే మాధవ సేవ అని ఎందరో పెద్దలు చెప్పినప్పుడు తమలాంటి పేదలను ఎందుకు కనికరించరని ఈ దాతలను ప్రశ్నించింది. ఓ పక్క రోగాలతో, పెరిగిన ధరలతో, రావలసిన సాయమందక జనం తపించిపోతుండగా ఆ లక్షలాది, కోట్లాది రూపాయలను సమాజం కోసం ఎందుకు ఖర్చు చేయరంటూ ఆక్రోశించింది. ఈ ప్రశ్నకు ఓ జవాబు దొరికితే బాగుంటుంది కదూ. Posted by gsrinivasakumar ( Mar 28 2006, 04:25:22 PM RET ) Permalink
ఇవేం పెళ్లిళ్లు నాయనోయ్... నిన్న (26 మార్చి 2006) ఆదివారం రోజున కరీంనగర్ జిల్లా వెల్గటూరు మండలంలోని కిషన్‌రావు పేట లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో స్వప్న, చంద్రలీల అనే ఇద్దరాడవాళ్లు ఒకరినోకరు ఇష్టపడి వివాహం చేసుకున్న సంఘటన జరిగింది. చంద్రలీల కరీంనగర్ జైలులో హోంగార్డ్ కాగా, స్వప్న అదే జైలుకు ఖైదీగా వచ్చి విడుదలైంది. ఇద్దరూ మగవాళ్లపై ద్వేషంతో ఇలా పెళ్లి చేసుకున్నట్లు చెబుతూ తాము స్వతంత్రంగా బతగ్గలమని తెగేసి చెప్పారు. ఆ మధ్య కూడా మన దేశంలోనే మరో ఇద్దరాడవాళ్లు ఇలాంటి ఉదంతంతోనే తెరపైకి వచ్చారు. ఇప్పటికే విదేశాల్లో ప్రకృతి విరుద్ధంగా సాగుతున్న స్వలింగ సంపర్కాలు, గే మేరేజెస్ పలు రకాల సమస్యలను కొని తెస్తున్నాయి. ఇదెంత వరకూ వచ్చిందంటే వీటిని చట్టబద్ధం చేయాలని పోరాటాలు, వాటిని వ్యతిరేకిస్తూ ఉద్యమాలు... ఇలా సాగుతోందీ వ్యవహారం. మరోవైపు ఇలాంటి ఇతివృత్తాలు కథాంశాలుగా సినిమాలూ వస్తున్నాయి. తాజాగా మన దేశంలోకీ ఇలాంటి సంస్కృతి రావడం మున్ముందు తరాల్లో ఇంకెలాంటి విపత్కర పరిస్థితులకు దారితీస్తుందో.... Posted by gsrinivasakumar ( Mar 27 2006, 02:04:21 PM RET ) Permalink