Tuesday February 06, 2007 వజ్రోత్సవాలు వజ్రోత్సవాల పేరిట జరిగిన 75 ఏళ్ల తెలుగు సినిమా పండుగలో చోటు చేసుకున్న అపశ్రుతులు, ఆవేశాలు మన చలనచిత్ర పరిశ్రమలో ఉన్న వైరుధ్యాలను బట్టబయలు చేశాయి. పెద్దలే పిల్లల్లా కొట్లాడుకున్నారు. వీళ్లను చూసిన నేటి సినిమా తరం రేపు ఇంకెలా తయారవుతుందో ఊహించుకుంటేనే భయమేస్తోంది. Posted by gsrinivasakumar ( Feb 06 2007, 03:56:15 PM RET ) Permalink
దోమలతో పోరాటం ఓ పక్క గున్యా... మరోపక్క డెంగ్యూ.. ఇంకో పక్క మలేరియా. చూస్తుంటే అంతా దోమల రాజ్యంలా ఉంది. ఇంకా వర్షాకాలం ఊపందుకోక ముందే పరిస్థితి ఇలా ఉంటే ముందు ముందు ఇంకేమవుతుందో. ఢిల్లీలో సాక్షాత్తూ ఒక వైద్యుడే డెంగ్యూ ధాటికి హరీమన్నారట. మరోపక్క మన దేశ ప్రధానిగారి మనవళ్లు సైతం ఆసుపత్రి పాలయ్యారు. ఇక సామాన్యుల పరిస్థితి చెప్పనక్కర్లేదు. ఇదండీ... మన దేశం ఇప్పుడున్న స్థితి. Posted by gsrinivasakumar ( Oct 06 2006, 06:39:52 PM RET ) Permalink
హలంత అక్షరాల సమస్యలకు పరిష్కారం తెలుగు యునికోడ్ ఫాంట్ ఉపయోగించి క్ చ్ ట్ త్ ప్ గ్ జ్ డ్ ద్ బ్ వంటి హలంతాక్షరాలను టైప్ చేసేప్పుడు ఇక్కడ తెలిపిన ఇబ్బందులు ఎదురవుతాయి. ఉదాహరణకు... కంప్యూటర్‌కు... హార్డ్వేర్లో... మానిటర్తో... మెషీన్‌పై... అని మీరు టైప్ చెయ్యాలనుకుంటే... హలంతాక్షరాలు, వాటి పక్కనే టైప్ చేసిన అక్షరాలు కలిసిపోయి కంప్యూటర్కు... హార్డ్వేర్లో... మానిటర్తో... మెషీన్పై ఇలా వస్తాయి. దీంతో ఏం చెయ్యాలో అర్థంకాక చాలా మంది కంప్యూటర్ కు... హార్డ్ వేర్ లో... మానిటర్ తో... మెషీన్ పై... ఇలా హలంతాక్షరానికి, దాని పక్కనే టైప్ చెయ్యాల్సిన అక్షరానికి మధ్య ఒక ఖాళీ ఉంచి టైప్ చేస్తున్నారు. దీనికి ఓ పరిష్కారం ఉంది. వర్డ్ లేదా నోట్‌ప్యాడ్‌లో మీరు ఇలా చేసుకోవచ్చు. హలంతాక్షరం టైప్ చెయ్యగానే దాని పక్కనే కర్సర్ ఉంచి Ctrl+Shift+2 కీలు కలిపి నొక్కండి. ఆ తర్వాత మీకు కావలసిన అక్షరాలను పక్కనే టైప్ చేసుకున్నప్పటికీ అవి హలంతాక్షరాలతో పైన చూపిన విధంగా కలిసిపోవు. Ctrl+Shift+2 కీల ద్వారా హలంతాక్షరం పక్కనే నాన్-జాయినర్ (ఇది కనిపించదు) చేర్చబడి, ఈ సమస్యను నివారిస్తుంది. ఇదే సమస్యకు మౌస్ ఉపయోగించి, నోట్‌ప్యాడ్‌లో కూడా పరిష్కారం పొందవచ్చు. హలంతాక్షరం పక్కనే మీ కర్సర్ ఉంచి, మౌస్ రైట్ క్లిక్ చెయ్యండి. అక్కడ కనిపించే మెనూలోంచి "INSERT UNICODE CONTROL CHARACTER" పైన మౌస్‌ను పాయింట్ చేస్తే... ఉప మెనూ తెరుచుకుంటుంది. ఇందులో "ZWNJ - Zero Width non-joiner" పైన క్లిక్ చెయ్యండి. దీంతో హలంతాక్షరం పక్కన నాన్-జాయినర్ (కనిపించదు) చేర్చబడి, ఈ సమస్యను నివారిస్తుంది. తర్వాత ఈ టెక్ట్స్‌ను వర్డ్, ఎక్సెల్ లేదా మీకు కావలసిన దానిలోకి కాపీ చేసుకోవచ్చు. ఇదే పరిష్కారం కన్నడ భాషకూ వర్తిస్తుంది. Posted by gsrinivasakumar ( Aug 10 2006, 05:00:45 PM RET ) Permalink
ఏంటో ఈ రాజకీయాలు ఒకాయనకు ఒక వ్యక్తి చేసే పనులు నచ్చక ఆయన్ని శత్రువుగా భావిస్తున్నాడు. అయితే ఆ వ్యక్తే తనకు మిత్రుడని ఇంకోచోట జతకట్టాడు. ఇలా ఉంది నేటి రాజకీయ పార్టీల ధోరణి. మిత్రపక్షాలుగా ఉన్న రెండు పార్టీలు స్థానిక ఎన్నికలు జరిగే రెండు జిల్లాల్లో మాత్రం మనిద్దరం శత్రుపక్షాలమని, మిగిలిన చోట్ల మిత్రులమేనని పేర్కొంటూ అభిప్రాయబేధాలకు ఆజ్యం పోశాయి. సాధారణంగా ఏ ఇద్దరైనా, ఎక్కడైనా అయితే శత్రువులుగా లేదా మిత్రులుగా లేదా మామూలుగా వ్యవహరించడం జరుగుతుంది. ఒక చోట నువ్వే నా మిత్రుడివని, మరో చోట నువ్వే నా శత్రువ్వని చెప్పుకోవడం ఏది మంచి ఏది చెడు అనేది తేల్చుకోని వారి అపరిపక్వ స్థితిని తెలియజేస్తోంది. ఇలాంటి నేతలు ప్రజలకు ఏం సేవలు చేస్తారో ఏమిటో.... Posted by gsrinivasakumar ( Jun 12 2006, 06:12:26 PM RET ) Permalink
నిర్లక్షానికి పరాకాష్ఠ పంజాగుట్ట అనే ఆ ప్రాంతం మన రాష్ట్ర రాజధాని హైదరాబాదులో నడిబొడ్డున ఉంటుంది. సమీపంలోనే ముఖ్యమంత్రి ఇల్లు. నిరంతరం పోలీసు పెట్రోలింగ్. రాత్రి సమయాల్లోనూ జనసంచారం ఉంటుంది. ఇవేమీ పట్టించుకేకుండా అక్కడే ఉన్న అలూకాస్ జువెలరీ దుకాణంలో చొరబడిన దొంగలు 9 కోట్ల విలువైన బంగారు నగలు, వజ్రాలు ఎత్తుకుపోయారు. దుకాణం కాపలాకు ముగ్గురు సాయుధ గార్డులున్నా... దొంగల పని సాఫీగా సాగిపోయింది. నేటి పత్రికల్లోని ఈ ప్రధాన వార్త రాజధనిలో భద్రతారాహిత్యానికి నిజమైన ప్రతీక. Posted by gsrinivasakumar ( May 17 2006, 09:54:55 PM RET ) Permalink
బధిర యజమానిని రక్షించుకున్న చిలుక కృతజ్ఞత కుక్కలకే కాదు, చిలకలకూ ఉంటుందని రుజువైన ఘటన బ్రిటన్‌లో జరిగింది. ఇక్కడి య్కార్‌షైర్ కౌంటీ మిర్‌ఫీల్డ్ ప్రాంతానికి చెందిన బధిరుడు పీటర్ టేలర్, ఆఫ్రికా జాతికి చెందిన చిలుకను పెంచుకుంట్నునాడు. ఆ మధ్య ఈయన చెవులకు పెట్టుకొనే మిషన్ తీసివేసి నిద్రపోతున్నప్పుడు ఇంటికి నిప్పంటుకుందిట. పరిస్థితిని గమనించిన ఆ చిలుక ఫైరింజన్ తరహాలో శబ్దం చేస్తూ యజమాని కాళ్ల మీద పైకి, కిందకు పాకుతూ లేపి ఆయన్ను రక్షించుకుంది. పరిణామ క్రమంలో చిలుకలు కూడా కుక్కల తరహాలో విశ్వాసానికి మారుపేరుగా నిలవడం ఆశ్చర్యకరమైన, ఆనందదాయకమైన పరిణామం కదూ. ఓ పత్రికలో వచ్చిన ఈ సంఘటన గురించి మీ అందరితో పంచుకోవాలనిపించింది. Posted by gsrinivasakumar ( May 13 2006, 12:18:58 PM RET ) Permalink
నిన్న పరిగెత్తాడు... ఇప్పుడు పరిగెత్తిస్తున్నాడు నియమ నిబంధనలు తెలుసుకోకుండా అతిగా స్పందించడంలో అగ్రగణ్యులు మనవాళ్లేననడంలో సందేహం లేదని ఒరిస్సా వండర్‌కిడ్ బుధియా విషయంలో మరోమారు రుజువైంది. నాలుగేళ్ల ఈ బుడతడు 65 కిలోమీటర్ల దూరాన్ని ఆగకుండా 7 గంటల 2 నిముషాల్లో చేరుకొని ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించడం ఎలా ఉన్నా... ఈ విషయంపై మానవహక్కుల సంఘం ఇచ్చిన తాఖీదులు ఇప్పుడు అందరినీ పరుగెత్తిస్తున్నాయి. ఈ చిన్నారి ఆరోగ్యంపై ఈ సుదీర్ఘ పరుగు ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్న అంశాన్నిగాని, పరుగులో అనుభవజ్ఞులైన పెద్దలకే కష్టసాధ్యమైన ఇలాంటి కార్యక్రమానికి ఓ చిన్న పిల్లాణ్ణి ప్రోత్సహించే ముందు కనీసం గమనించాల్సిన విషయాలనుగాని పరిశీలించకుండా స్థానిక సిఆర్‌పిఎఫ్ ఈ పరుగుకు ప్రోత్సాహమివ్వడం, దీనిని రికార్డుగా నమోదు చేసేందుకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ సహా మీడియా కూడా అత్యుత్సాహం చూపడాన్ని ఇప్పుడు అంతర్జాతీయ మానవహక్కుల తప్పుపట్టింది. ఈ బాలుడు గతంలోనూ ఇలాంటి సుదీర్ఘ పరుగులు (ఇంత దూరం కాకున్నా...) తీసినవాడే అయినా అవన్నీ అనధికారికంగా వ్యక్తిగతంగా చేసినవి. కాగా బుధియా తాజా పరుగుకు నియమ నిబంధనలను పట్టించుకోకుండా, తగిన అనుమతులు లేకుండా ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలు ప్రోత్సాహమివ్వడం చూస్తే అతి ముందు పుట్టి తర్వాతే మనవాళ్లు పుట్టారనిపిస్తోంది. ఇక్కడ మరో విషయాన్ని గుర్తు చేయదలిచాను. మన భారతీయుల్లో చాలామంది అతి పిన్న వయసులోనే అత్యంత ప్రజ్ఞను కనబరచి వైద్యులు, శాస్త్రవేత్తలైన వాళ్లున్నారు. అయితే వారికి వయసుపరంగా తగిన అర్హత లేకున్నప్పటికీ, వివిధ స్థాయిల్లో ప్రభుత్వ అనుమతులు పొందిన తర్వాతే సంబంధింత పరీక్షలలో ఉత్తీర్ణులై పిన్న వయసుకే ఘనతర ప్రతిభను ప్రదర్శించిన ఖ్యాతి గడించారు. కాగా ఇక్కడ బుధియా విషయంలో ఈ సుదీర్ఘ పరుగుకు ముందు అలాంటి అనుమతులేవీ లేవు, ఆరోగ్య పరీక్షలు కూడా జరగలేదు. కోటానుకోట్ల ప్రజలను పాలించేందుకు మనం తయారు చేసుకున్న మన రాజకీయ నాయకుల విషయమే తీసుకోండి. లాభదాయక పదవుల నిర్వహణకు సంబంధించిన నియమ నిబంధనలు తెలుసుకోకుండా చట్టసభల్లో ప్రవేశించి తుదకు రాజీనామాలు సమర్పించి అబాసుపాలు కావాల్సి వచ్చింది. సంఘటనలు వేరైనా... మన దేశంలో దాదాపు ప్రతిచోటా ఇదే తంతు. Posted by gsrinivasakumar ( May 06 2006, 05:35:24 PM RET ) Permalink
ఉర్దూ రాష్ట్రమా ? ఇంకెన్ని ముక్కలు చేస్తారు ? భాషా ప్రయుక్త రాష్ట్రాలున్న మన దేశంలో ఉర్దూ మాట్లాడే వారికి ఒక రాష్ట్రం ఏర్పడాలని మజ్లిస్ పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ పాపం ఆవేదన చెందుతున్నారు. స్వతంత్రోద్యమ సమయంలో భారతదేశంలోని ముస్లింలకు అన్యాయం జరిగిపోతోందన్న జిన్నాగారి డిమాండ్ ఫలితంగానే కదా ఉర్దూ జాతీయ భాషగా కలిగిన పాకిస్తాన్ ఆవిర్భవించింది ? మళ్లీ భారతదేశంలో ఇంకో ఉర్దూ రాష్ట్రం అనడంలో అసదుద్దీన్ ఓవైసీ ఉద్దేశం ఏమిటో అర్ధం కావడంలేదు. కావాలనుకుంటే వారి కోసమే ఏర్పాటైన పాకిస్తాన్ వెళ్లిపోవచ్చు కదా. అసలు చెప్పాలంటే మన దేశంలో కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ ఉన్న పాతికకు పైగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న కోట్లాది ముస్లింలు అందరూ ఆయా ప్రాంతీయ భాషలతో పాటు ఉర్దూ మాట్లాడతారు. ఈ కోటాను కోట్లమంది ముస్లింలందరూ ఆయా రాష్ట్రాలను విడిచి పెట్టి అసదుద్దీన్ గారి కోరిక ప్రకారం హైదరాబాద్, సైబరాబాద్‌లతో ఏర్పడాలంటున్న ఉర్దూ రాష్ట్రానికి వచ్చేయాలా ? మన దేశంలో ఇప్పటికే కాశ్మీరు రాష్ట్రం దాదాపు పూర్తిగా ముస్లిం జనాభా ప్రాబల్యంతో, ఉర్దూ భాష ప్రధానంగా ఉన్నందున అసదుద్దీన్ గారు, ఆయన అనుచరగణం అక్కడికి వెళ్లవచ్చు. ఓ పక్క తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ నిరశన జ్వాలలు రగులుతుండగా, మరో పక్క ఆంధ్ర, రాయలసీమలనూ ప్రత్యేక రాష్ట్రాలుగా చెయ్యాలంటూ రంకెలేస్తున్న నేతల గళాలు విభజన గరళాన్ని చిమ్మే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ రాష్ట్రాన్ని ఇంకెన్ని ముక్కలు చేస్తారు ? ఈ నేతలకు పరమత సహనం లేదా ? కుల మత భాషా భేదాలను విడిచిపెట్టరా ? ఐక్యతకు అర్థం తెలీదా ? Posted by gsrinivasakumar ( Apr 28 2006, 11:05:02 AM RET ) Permalink
ఇంత కర్కశత్వమా.... ఆ ప్రాంతాల్లో గర్భిణి స్త్రీ ఎవరైనా మరణిస్తే సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చెయ్యరట. గర్భిణి స్త్రీగా మరణించడాన్ని పాపంగా భావించి ఆ మృత దేహాన్ని అనాథ శవంలా ఎక్కడో పడేసి గాలికొదిలేస్తారట. అనంతపురం జిల్లా పుట్లూరు మండల వాసి అయిన 26 ఏళ్ల రమాదేవి అనే మహిళ పచ్చ కామెర్లతో మరణించగా, ఆమెకు పట్టిన ఈ గతి ప్రసారమాధ్యమాల దృష్టికి రావడంతో ఈ దురాచారం వెలుగులోకి వచ్చింది. మొత్తం మీద ఈ వ్యవహారం పోలీసులకు తెలిసి వారు అక్కడి ప్రజలను కలుసుకొని ఈ అనాగరిక చర్యను ప్రశ్నించడంతో ఆ శవాన్ని ఖననం చేసారు. కడప జిల్లాలోని ఆరెస్ కొండాపురం మండలంలోనూ ఇలాంటి దురాచారం కొనసాగుతోందట. ఆధునిక సమాజంలో నూతన విజ్ఞాన విను వీధిలో విహరిస్తున్నామని చెప్పుకునే మన సంఘం ఇలాంటి పరిణామాలకు వేదిక కావడం దురదృష్టకరం. ప్రజలను ఇలాంటి పరిస్థితుల నుంచి మేలుకొలిపే దిశగా మేథావులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలూ పూనుకోవాలి. Posted by gsrinivasakumar ( Apr 27 2006, 05:58:54 PM RET ) Permalink
కారుణ్య ఓడిపోలేదు... సోనీ టీవీ నిర్వహించిన ఇండియన్ ఐడల్ తుది పోటీలో తెలుగు తేజం కారుణ్య ఓడిపోలేదు. వాస్తవానికి ఈ పోటీలో ఎవరికి ఎస్ఎమ్ఎస్ ఓట్లు ఎక్కువగా వస్తే అతనే విజేత అని నిర్ణయించారు. ముందుగా మన దేశంలో సెల్ ఫోన్లు ఉన్నవారి సంఖ్య ఇప్పటికీ తక్కువే. కేవలం 4 దక్షిణాది రాష్ట్రాల ఓట్లు ఎక్కడ, 25కు పైగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాల ఓట్లు ఎక్కడ. దీని ప్రాతిపదికగా విజేతను నిర్ణయించడం సబబు కాదనిపిస్తోంది. ప్రాంతీయాభిమానం ఇందులో ముఖ్య పాత్ర పోషించిందనడంలో అతిశయోక్తి లేదనుకుంటా. అదీగాక ఎస్ఎమ్ఎస్ ఓట్లు పరిగణలోకి తీసుకోకుంటే... ప్రతిభ విషయంలో కారుణ్యదే పైచేయి అని ప్రముఖులంతా వెల్లడించారు. Posted by gsrinivasakumar ( Apr 26 2006, 05:29:16 PM RET ) Permalink
ఆమెకు నిప్పంటించాడు... అతనూ బలయ్యాడు అనంతపురం జిల్లా యాడికి గ్రామంలో జరిగిందిది. ఇక్కడి నారాయణ స్వామి కాలనీలో కాపురముంటున్న భాస్కర్ (40), చంద్రకళ (35) దంపతులకు ఇద్దరమ్మాయిలు, ఒకబ్బాయి. వ్యాపారంలో నష్టాలు రావడంతో మద్యానికి బానిసైన భాస్కర్ భార్యతో గురువారం గొడవపడ్డాడు. పిల్లలు పాఠశాలకు వెళిపోగా వీళ్ల గొడవ ఎవరికీ వినబడకుండా టీవీ శబ్దం పెంచి అరుచుకున్నారు. ఒక దశలో చంపుతానని భాస్కర్ తన భార్య చంద్రకళను బెదిరించగా... చంపు చూద్దామని భార్య కూడా అనడంతో రెచ్చిపోయిన భాస్కర్ ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. మంటలు ఎగసిపడగా కాలిపోతున్న చంద్రకళ తనపై కిరోసిన పోసిన భర్త భాస్కర్‌ను గట్టిగా కౌగలించుకుంది. ఫలితంగా రెండు నిండు ప్రాణాలు బలైపోయాయి. పిల్లలు నడిరోడ్డున పడ్డారు. సంయమనం లేని కారణంగా ఓ నిండు కుటుంబం అంతమైపోయింది. అందుకే.... కోపావేశాలను పెకలించి, నిగ్రహానికి చోటివ్వండి. Posted by gsrinivasakumar ( Apr 22 2006, 12:02:03 PM RET ) Permalink
అక్రమ వ్యభిచారమట... గ్రహచారం కాకపోతే... ఈ అక్రమ వ్యభిచారం ఏంటో ఆ వార్త చదవకముందు నా చిట్టి మట్టి బుర్రకు అంత త్వరగా అర్థం కాలేదు. సెక్స్ వర్కర్లకు లైసెన్సులు ఇచ్చి, వ్యభిచారాన్ని చట్టబద్ధం (సక్రమ వ్యభిచారం) చేసి, ఈ వర్గాన్ని కార్మికులుగా గుర్తించకపోతే బెంగాల్ శాసనసభ ఎన్నికలను బహిష్కరిస్తామంటూ కోల్‌కతలోని (అదే కలకత్తా) సెక్స్ వర్కర్లు కొన్నాళ్ల కిందట ఆందోళన చేపట్టారు(ఈ కోరిక నెరవేరిందో లేదో ఇంకా తెలీదు). ఓ పక్క ఎయిడ్స్ భూతాన్ని పెంచిపోషిస్తున్న వ్యభిచారమనేది ఘోరమైన సాంఘిక దురాచారం రా బాబూ అని గగ్గోలు పెడుతోంటే దీన్ని చట్టబద్ధం చేయాలని కోరడమేంటో, దానికొక లైసెన్స్ ఏమిటో, మనం ఎటుపోతున్నామో, ఓరి దేముడో నాకర్థంగావడంలేదు. ఈ సెక్స్ వర్కర్లు వ్యభిచార వృత్తిని వదలిపెట్టి సామాజికంగా గౌరవప్రదమైన మరో వృత్తిని చేపట్టి ముందంజ వేసేలా సహకరించేందుకు అందరూ ముందుకు రావాలనేది నా అభిలాష, ఆకాంక్ష. Posted by gsrinivasakumar ( Apr 17 2006, 05:29:35 PM RET ) Permalink
నర్సింగ్ హోమ్‌లతో పాటు హోమ్ నర్సింగ్ కూడా... దీర్ఘకాలిక రోగాలు, ప్రమాదాలు లేదా వృద్ధాప్యం కారణంగా రోజు ఆసుపత్రుల చుట్టూ తిరగలేని వారికి వైద్య సేవలందించేందుకు ఇటీవల కాలంలో హోమ్ హెల్త్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. వైద్య రంగంలో నిపుణులైన వైద్యులు, నర్సులు ఒక బృందంగా ఏర్పడి అన్ని వయసుల వారికీ 24 గంటలూ ఇళ్లలోనే వైద్య సేవలందించేలా సంస్థలను నడుపుతున్నారు. ఇప్పటికే మన దేశంలోని పలు నగరాల్లో ప్రారంభమైన ఈ సంస్థల సేవలు మధ్య తరగతి వారికీ అందుబాటులో ఉంటున్నాయట. తగినన్ని మందులు, సామగ్రితో ఎప్పుడూ సిద్ధంగా ఉండి రోగులకు వైద్యపరంగా ఏ సమయంలో ఏ అవసరం వచ్చినా చేయూతనిచ్చేందుకు ఈ సంస్థల సిబ్బంది ఎల్లప్పూడూ సన్నద్ధంగా ఉంటార్ట. మొత్తం మీద వైద్య రంగంలోని నిరుద్యోగులకు ఇదో ఉద్యోగావకాశం, రోగులు సావకాశంగా మేలైన సేవలు పొందే సదవకాశం. Posted by gsrinivasakumar ( Apr 17 2006, 02:29:52 PM RET ) Permalink
కారుణ్యకు ఓటేయండి తెలుగు తేజాన్ని గెలిపించండి సోనీ టీవీ నిర్వహిస్తున్న ఇండియన్ ఐడల్ పోటీల్లో తుది దశకు చేరుకున్న మన తెలుగు తేజం కారుణ్యకు ఎస్ఎమ్ఎస్ పంపడం ద్వారా ఓటేసి గెలిపించండి ప్లీజ్. మీరు చేయాల్సిందల్లా karunya అని టైప్ చేసి 2525 నంబరుకు ఎస్ఎమ్ఎస్ పంపడమే లేదా 1904424252502 నంబరుకు ల్యాండ్ లైన్ ద్వారా మీ నిర్ణయం తెలియపరచవచ్చట. ఈ పోటీల్లో మనవాడు గెలవాలంటే దేశవ్యాప్తంగా (ప్రపంచవ్యాప్తంగా అయితే మరీ మంచిది) వీలైనన్ని ఎక్కువ ఎస్ఎమ్ఎస్ లేదా ల్యాండ్ లైన్ ఓట్లు రావాలి. ఇక ఆ పని మీదే ఉంటారుగా... Posted by gsrinivasakumar ( Apr 15 2006, 03:57:27 PM RET ) Permalink
తెలుగు వీర లేవరా..దీక్షబూని సాగరా... దుబాయిలో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ప్రపంచంలోని తెలుగు వారందరికీ ఇవే నా శుభాకాంక్షలు. తెలుగు భాషాసంస్కృతులు మరింతగా శోభిల్లి, తెలుగునేల ప్రపంచానికే ఆదర్శనీయం, అనుసరణీయం, ఆచరణీయం కావాలని మనసారా మరొక్కసారి అకాంక్షిస్తున్నాను. మీరెన్ని భాషలైనా నేర్చుకొని అన్ని విధాలా ప్రయోజనాలను పొందండి. కాని మన అమ్మ పలుకు అయిన తెలుగు చదవండి, మాట్లాడండి, తెలుగులో ఆలోచించండి. తెలుగు ఇంకా నేర్వండి, మన పిల్లలకు నేర్పండి. మా తెలుగు తల్లికి మల్లెపూదండే కాదు మిగిలిన పూలదండలూ వేద్దాం.... Posted by gsrinivasakumar ( Apr 15 2006, 10:47:05 AM RET ) Permalink